అమెరికా.. కొన్ని నెమలీకలు!-4

7
11

[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]

ఘనమైన గురుతు గ్రాండ్ కెన్యన్!

[dropcap]క్రి[/dropcap]స్మస్ సెలవుల్లో లాస్ వేగస్ వెళ్లినప్పుడు గ్రాండ్ కెన్యన్ సందర్శించడానికి మా అమ్మాయి.. దీప ముందరే ప్లాన్ చేసింది. లాస్ వేగస్‌లో దీపకు ఒకప్పటి కొలీగ్, ల్యాన్స్ అనే ఆయన ఉన్నారు. ఆయన లాస్ వేగస్ వచ్చి, తమ ఇంట ఉండి, అక్కడి సమీప పర్యాటక ప్రాంతాలను దర్శించమని మా అమ్మాయిని ఆహ్వానించారట. నాకు గ్రాండ్ కెన్యన్ చూపించాలనుకున్నప్పుడు అది గుర్తొచ్చి, మాకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని, ఆయనకు మేము వస్తున్నట్లు తెలియజేసింది దీప. ఆయన, తప్పక రమ్మని చెప్పారు. ఆ విధంగా మేం క్రిస్మస్ సెలవులలో నేవడా స్టేట్‌లో నెలకొన్న లాస్ వేగస్‌కి ఓ శుభోదయాన బయల్దేరాం. అక్కడ.. ముఖ్యంగా గ్రాండ్ కెన్యన్‌లో చలి విపరీతంగా ఉండవచ్చని, అందుకు తగిన కోట్లు, క్యాప్‌లు, షూస్ తప్పనిసరి అని మా ఇంటి యజమానురాలు, ఆత్మీయురాలు అయిన మార్సెల్లా ముందే హెచ్చరించింది. అందువల్ల మేం అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నాం. ఇన్‌స్టంట్ ఫుడ్, స్నాక్స్ వగైరా కూడా కొనుక్కుని వెళ్లాం. మధ్యలో ఒక చోట ఆగి, తెచ్చుకున్నవి కారు లోనే తిన్నాం.

లాస్ వేగస్‌ను మామూలుగా ‘వేగస్’ అనే వ్యవహరిస్తుంటారు. మొహావే ఎడారిలో కొంత భాగం వేగస్‌లో కూడా విస్తరించి ఉంది. ఎడారి ప్రాంతాన్ని అవలోకిస్తూ ఆలోచనల్లోకి జారిపోయాను. అంతలో వేగస్ రానే వచ్చింది. చుట్టూ కొండలున్న నగరం వేగస్. వాళ్లింటికి సాయంత్రం నాలుగు లోపలే చేరుకున్నాం.. వారు సాదర ఆహ్వానం పలికారు. చాలా పెద్ద ఇల్లు. హాల్లో నుంచి మేడ పైకి మెట్లు. మెట్ల పక్కని సపోర్ట్ గ్రిల్‌కు అన్నీ క్రిస్మస్ అలంకరణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మాకు కింద రెండు పడక గదులు, పైన ఒక పడక గది చూపించి ఏది కావాలంటే అందులో ఉండవచ్చన్నారు. మేం కిందనే ముందు భాగంలో ఉన్న పడక గది మాకు చాలన్నాం. ఓ పెద్ద మంచం, మెత్తటి పరుపు. రిమోట్ తో పరుపు ఎత్తును పెంచడం, తగ్గించడం నాకు కొత్తగా అనిపించింది. ల్యాన్స్ భార్య ఓ హాస్పిటల్‌లో రేడియాలజిస్ట్‌గా పని చేస్తోంది. నైట్ డ్యూటీ.. ఆయన ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇద్దరూ ఎంతో సహృదయులు. వారికి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి వివాహం అయి వేరే స్టేట్‌లో ఉంది. మరో అమ్మాయిని (నల్ల జాతి అమ్మాయిని) పెంచుకున్నారు. ఈ ప్రస్తావనలో నేను చెప్పదలచుకున్నది వారి విశాల దృష్టి, సమదృష్టి. దత్తత తీసుకున్న అమ్మాయి ఇప్పుడు చక్కగా ఉన్నత చదువులు చదువుతోంది. ఆ అమ్మాయికి, వారికి మధ్య వ్యక్తమయ్యే అపేక్ష, ఆత్మీయతానురాగాలు చూస్తుంటే ‘పెంచుకున్నారు’ అనే మాట వాడడం తప్పు అనిపిస్తుంది. అమెరికాలో తెల్ల, నల్ల వివక్ష ఉందన్న మాట నిజమే అయినా, ఇలాంటి సహృదయులు కూడా ఉన్నారన్నది గుర్తించదగ్గ అంశం.

మేం వెళ్లిన మర్నాడు రాత్రి, వాళ్లు, తమ పెద్ద కుమార్తె దగ్గరకు వేరే స్టేట్ వెళ్లిపోయారు. అయితే మేం వారి ఇంటిని మేం ఉన్నన్ని రోజులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని చెప్పారు. అర్ధరాత్రి, వారి ఫ్లైట్. అయితే మేం మేలుకుని, వీడ్కోలు చెప్పే అవసరం లేకపోయింది. రాత్రి పడుకునే ముందే మేం వారికి వీడ్కోలు చెప్పాం. వారు కూడా హాయిగా అన్నీ సందర్శించి వెళ్ళండని మాకు చెప్పారు. ఇంటిని, అతిథులకు అప్పగించి వెళ్ళడమంటే వారిది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. తాళం వేయడం, తాళం చేతుల బాధ్యత అనే బాధ లేకుండా గరాజ్ నుంచి బయటకు వెళ్లే వీలుంది వారింటికి. గరాజ్ లోకి ప్రవేశించే తలుపు దగ్గర ఉన్న కీ ప్యాడ్ పై పాస్‌వర్డ్ నొక్కితే గరాజ్ తలుపు తెరుచుకుంటుంది. గరాజ్ బయటకు వెళ్ళాక షట్టర్ బయట ఉన్న కీ ప్యాడ్ పై పాస్‌వర్డ్ నొక్కితే చాలు గరాజ్ షట్టర్ మూసుకుంటుంది. ల్యాన్స్, మా అమ్మాయికి ఆ పాస్‌వర్డ్ చెప్పి వెళ్లారు. నేను ఆ విధానం చూడడం తొలిసారి. దాంతో అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.

స్వీట్ టూర్స్ బస్ ఎక్కబోతూ

ఆ ఉదయమే మా గ్రాండ్ కెన్యన్ ప్రయాణం. మా అమ్మాయి ‘స్వీట్ టూర్స్’ బస్‌లో టికెట్స్ బుక్ చేసింది. పొద్దునే లేచి చకచకా తయారై కారులో ఆరింటికల్లా సౌత్ పాయింట్ దగ్గరకు చేరాం.. అదే పికప్ పాయింట్. చలి గజగజా వణికిస్తోంది. దీప, కారును పార్కింగ్ లాట్‌లో పెట్టేసింది. మాలాగే ఇతర ప్రయాణికులు కూడా ఒక్కొక్కరే అక్కడకు చేరుకుంటున్నారు. స్వీట్ టూర్స్ బస్ కచ్చితమైన సమయానికి వచ్చింది. మహిళా డ్రైవర్.. కండక్టర్ విధులు కూడా ఆమెవే. ఎక్కే వారి టికెట్ చెక్ చేసి, తన దగ్గర ఉన్న ప్రయాణికుల జాబితాలో చూసుకుని, లోపలికి అనుమతిస్తోంది. వేర్వేరు హోటల్స్ వద్ద పికప్ పాయింట్లు ఉండడం వల్ల అన్ని చోట్లలో ప్రయాణికులను ఎక్కించుకోవడం జరిగింది.

ఆ తర్వాత మహిళా డ్రైవర్ మైక్‌లో ప్రయాణికులకు సాదర ఆహ్వానం పలికి, టూర్ గురించిన వివరాలు చెప్పింది. మనిషి లావుగా ఉంది, బహుశా అన్నేసి గంటలు డ్రైవింగ్‌లో ఉండడం కూడా అందుకు కారణమేమో.. కానీ ఆమె గళం ఎంత బాగుందో! రేడియోలో పని చేస్తే ఎంతైనా రాణిస్తుందనిపించింది. బ్రేక్‌ఫాస్ట్ టూర్ వారే అందిస్తారు. ప్రతి ప్రయాణికుడికి అరటి పండు, వాటర్ బాటిల్ లేదా జ్యూస్ బాటిల్.. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.

ఆమె ఎంతో నేర్పుగా బస్ నడుపుతోంది. మార్గ మధ్యంలో చారిత్రాత్మకమైన రూట్ 66 వచ్చింది. చికాగో నుంచి లాస్ ఆన్జిలిస్‌కు 1926లో ఏర్పాటు చేసిన మార్గమిది. 20వ శతాబ్దపు తొలినాళ్లలోని అక్కడి జీవన శైలికి ఆనవాలుగా మిగిలింది ఈ మార్గం.

రూట్ 66 వద్ద రచయిత్రి, వారి కుమార్తె దీప

అప్పటి హోటళ్లు, కార్లు, జీపులు వంటి వాహనాలను అక్కడ చూడవచ్చు. ఇప్పటికీ ఆ పాత కాలం పద్ధతుల్లోనే అక్కడ కొన్ని హోటళ్లను నడుపుతున్నారని బస్ డ్రైవర్ చెప్పింది. అక్కడ ఓ పది నిముషాలు బస్ ఆపారు. చాలా మంది అక్కడ రోడ్డు పక్కగా ప్రదర్శన కోసం ఉంచిన ఆ పాత కాలపు వాహనాల ముందు నిలుచుని ఫోటోలు తీసుకున్నారు. మేం కూడా తీసుకున్నాం.

మార్గమధ్య దృశ్యం

మళ్లీ బస్ ఎక్కాం. మధ్యలో మరో మహిళా డ్రైవర్ వచ్చి ఎక్కింది. అంటే సగం సగం దూరం ఒక్కొక్కరు నడుపుతారన్నమాట. పద్ధతి బాగుంది అనుకున్నాను. ఆతర్వాత పన్నెండు అవగానే ప్రయాణికులు ముందే తెలియజేసిన ప్రకారం అందరికీ వెజ్, నాన్‌వెజ్ లంచ్ ప్యాక్‌లు అందించింది. బస్ నడుస్తుండగానే లంచ్ చేసేశాం. ఆ తర్వాత ఖాళీ ప్యాక్‌ను కవర్లో దాచి ఉంచి, దిగిన చోట ట్రాష్ బిన్ లలో వేయాలి అని చెప్పారు. మన దగ్గర అయితే బస్ లోనే సీట్ కిందకు నెట్టేయడం.. లేదంటే కిటికీ లోంచి బయటకు యథేచ్చగా విసిరేయడం చేస్తుంటారు.

ఒంటిగంటకు గ్రాండ్ కెన్యన్ సమీపానికి చేరాం. కానీ ఎంట్రన్స్ దగ్గరే చేంతాడంత ట్రాఫిక్ జామ్. మేం బస్ లోనే బందీలం. బస్ దిగాక మూడు గంటలు సమయం ఇస్తామని, ప్రయాణికులు కెన్యన్ అంతా చూసి ఠంచనుగా బస్ ఆగే చోటికి చేరుకోవాలని, ఆలస్యం చేస్తే బస్ వెళ్ళిపోతుందని హెచ్చరించింది డ్రైవర్. కానీ ముందే ఈ ట్రాఫిక్ జామ్.. పక్కకు చూస్తుంటే కుడివైపు అంతా అరణ్యం. రకరకాల పెద్ద చెట్లు. నేల మీద మధ్య మధ్యలో క్రితం రాత్రి పడ్డ తెల్లని మంచు వింత అందం ఒలకబోస్తోంది. చెట్ల దగ్గర ఎల్క్, చెట్ల. ఆకులు అందుకుని మేస్తూ ఉంది.

గ్రాండ్ కెన్యన్ వద్ద పక్కన అడవిలో కింద మంచు.. చెట్టు ఆకులందుకునే ఎల్క్
నేలను పరుచుకున్న మంచు

ఎట్టకేలకు ఒకటిన్నరకు వాహనాలు ముందుకు కదలడం మొదలుపెట్టాయి. లోపలికి ప్రవేశించాక, బస్సును నిర్దేశిత స్థానంలో నిలిపి, డ్రైవర్ అందరినీ ఉద్దేశించి, ‘ఇప్పుడు టైం ఒకటిన్నర అయింది కాబట్టి మీరంతా నాలుగున్నరకు బస్ దగ్గరకు వచ్చేయాలి’ అంటూ గ్రాండ్ కెన్యన్‌ను చూసి ఆనందించమని విష్ చేసింది. అంతా బస్ దిగి నడవడం మొదలు పెట్టాం. మేం గ్రాండ్ కెన్యన్‌ను దక్షిణ అంచు (రిమ్) నుంచి దర్శించాము.

చూస్తూ ఉంటే ఏదో అద్భుత ప్రపంచంలో ఉన్న అనుభూతి. అతి పెద్ద రాళ్ల సముదాయం అంచెలంచెలుగా పేరుకుపోయి మహోన్నత కుడ్యాలుగా.. చిత్ర విచిత్ర రూపులలో.. సూర్యరశ్మి ప్రభావంతో ఒక్కో చోట ఒక్కో రంగులో కనిపిస్తూ.. కిందకు చూస్తే అతి పెద్ద లోయ.. దూరంగా మధ్యలో కొలరాడో నది.. చాలా దూరంలో ఉండటాన సన్నని ప్రవాహంగా కనిపిస్తోంది.

అసలు గ్రాండ్ కెన్యన్ అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవాలి. అరిజోనాలోని కొలరాడో నదీ ప్రవాహం సుదీర్ఘ కాల పరిధిలో అక్కడి భూమిని కోస్తూ ఏర్పరచిన అతి లోతైన లోయనే గ్రాండ్ కెన్యన్ అంటున్నారు. దీని పొడవు 446 కిలో మీటర్లు, వెడల్పు 29 కిలోమీటర్లు. ఇక లోతు 6,093 అడుగులు. దాదాపు రెండు బిలియన్ల సంవత్సరాల కాల పరిధిలో కొలరాడో, దాని ఉపనదుల బలమైన ప్రవాహ తాకిడితో భౌగోళిక మార్పులెన్నో జరిగి, అక్కడి రాళ్ళు పొరలు పొరలుగా ఏర్పడి, కొలరాడో పీఠభూమిని పైకి నెట్టాయి. అయితే భూగోళ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కొలరాడో నది, 5 లేదా 6 మిలియన్ల సంవత్సరాల కిందటి నుంచి ప్రవహిస్తూ, అప్పటినుంచి పీఠభూమి వెడల్పును, లోతును పెంచుతూ అంచులను క్రమంగా శిఖరాలుగా రూపొందించింది. వాయువ్య అరిజోనా, యుటాహ్, నేవడాలకు గ్రాండ్ కెన్యన్ సరిహద్దుగా ఉంది.

గ్రాండ్ కెన్యన్

మేం అలా నడుస్తూ అక్కడున్న బోర్డులను చదువుతూ, కెన్యన్‌ను తిలకిస్తూ వెళ్లాం. ఎన్నో ఫోటోలు తీసుకున్నాం. తెల్లవారు ఝామున బయలు దేరిన మేం ప్రయాణంతో అలసి, వాడిన ముఖాలతో ఉన్నాం. మా ముఖాలెలా ఉన్నా కావలసింది కెన్యన్ గురుతులు కదా. మరో వైపు చలి. కాళ్ల కింద అక్కడక్కడా కరుగుతున్న మంచువల్ల పడకుండా నడిచే ప్రయత్నం. తొలిసారిగా 1869లో మేజర్ జాన్ వెస్లే పవెల్ ఈ లోయను ‘గ్రాండ్ కెన్యన్’ అని పిలిచారు. అప్పటినుండి అదే పేరు ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో పాలియో ఇండియన్, నేటివ్ అమెరికన్ జాతుల వారు వేలాది సంవత్సరాలు జీవనం సాగించినట్లు పురాతత్వ పరిశోధనలలో వెల్లడయింది. 1903లో ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్ ఇక్కడ పర్యటించి ఈ ప్రాంతాన్ని సంరక్షించాలనుకున్నారు. ఫలితంగా తర్వాత దీన్ని నేషనల్ మాన్యుమెంట్‌గా ప్రకటించారు. 1919లో ‘గ్రాండ్ కెన్యన్ నేషనల్ పార్క్’ గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ నేషనల్ పార్క్ సర్వీస్ ప్రారంభించారు. ఇక్కడున్న అటవీ ప్రాంతంలో 1,750 వృక్ష జాతులు పెరుగుతున్నాయి. 91 జాతుల క్షీరదాలు, 447 జాతుల పక్షులు, 58 జాతుల పాకే ప్రాణులకు ఈ అటవీ ప్రాంతం ఆవాసంగా ఉంది జలాలలో 18 జాతుల చేపలు ఉన్నాయి.

గ్రాండ్ కెన్యన్

ఇక గ్రాండ్ కెన్యన్ రాళ్లు 1.8 బిలియన్ సంవత్సరాల నాటివి. 8 రాతి పొరలతో కూడిన శిఖరాలు చూస్తుంటే కలిగే ఆశ్చర్యానందానుభూతి మాటలకందనిది. దక్షిణ అంచు కంటే ఉత్తర అంచు 1,300 అడుగులు ఎక్కువ ఎత్తుగా ఉంది. అటువైపు, అభిలాష ఉన్న వారు హైకింగ్ చేయవచ్చు కూడా. 11 కొండజాతుల ప్రజలకు ఈ గ్రాండ్ కెన్యన్‌తో అనుబంధం ఉంది. వారిలో హౌలాపాయ్, హవా సుపాయ్, హోపీ, నవాహో తెగల వారు ఉన్నారు. 19వ శతాబ్దం చివరలో అమెరికన్ – యురోపియన్ సెటిలర్లు మైనింగ్ కోసం ఈ ప్రాంతం పట్ల ఆకర్షితులయ్యారు. క్రమంగా పర్యాటకం కూడా వృద్ధి చెందింది. గ్రాండ్ కెన్యన్‌లో కొన్ని రోజుల పాటు ఉండి, మళ్లీ మళ్లీ సమగ్రంగా వీక్షించాలనుకునే వారికి హోటళ్లు, లాడ్జింగ్ వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి.

గ్రాండ్ కెన్యన్ వద్ద రచయిత్రి, వారి కుమార్తె దీప

అయితే ‘గ్రాండ్ కెన్యన్’ ప్రపంచంలోనే పెద్ద లోయ కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద లోయగా ప్రథమ స్థానంలో నిలిచింది, టిబెట్ లోని యార్లంగ్ సంగ్ పో.

గ్రాండ్ కెన్యన్‌కు 1979 లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా లభించింది. గ్రాండ్ కెన్యన్‌లో 1000 కి పైగా గుహలు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు గుర్తించినవి మాత్రం 335 గుహలు. అందులో కేవలం ఒక గుహను మాత్రమే ప్రజల సందర్శనకు తెరిచారు. దాని పేరు ‘కేవ్ ఆఫ్ ద డోమ్స్ ఆన్ హార్స్ షూ మెసా’.

గ్రాండ్ కెన్యన్.. రచయిత్రి

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గ్రాండ్ కెన్యన్ రకరకాల రంగుల్లో కాలానుగుణంగా.. వేసవి, చలి కాలాల్లో, వివిధ సమయాల్లో, వివిధ వర్ణాలతో ఆవిష్కృతమవుతూ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ అందించే ఫొటోలు, గ్రాండ్ కెన్యన్ గురించి పాఠకులకు ఇంకొంత విశదం చేస్తాయని నా భావన. అక్కడ దొరికిన కొన్ని ప్రాచీన రాళ్ళను ప్రదర్శనకు ఉంచారు. వాటికి పెట్టిన పేర్లు రామ, విష్ణు, బ్రహ్మ.. చూడగానే ఆశ్చర్యం, ఆనందం.

రామా స్చిస్ట్ – విష్ణు స్చిస్ట్ – బ్రహ్మ స్చిస్ట్

అంతలోనే మాకు ఇచ్చిన మూడు గంటల వ్యవధి పూర్తి అవుతుండడంతో తిరుగుముఖం పట్టాం. కొద్ది నిముషాల ముందుగానే మా బస్ స్టాప్ చేరుకుని బసెక్కాం. ప్రయాణికులు అందరూ రాగానే బస్ కదిలింది. గ్రాండ్ కెన్యన్ రూపును నెమరువేసుకుంటూ, మదిలో పదిలపరుచుకుంటూ.. ఎవరి ఆలోచనల్లో వారు. దారిలో దూరంగా జిగేల్ మంటూ రాత్రివేళ వినూత్న అందాలతో దర్శనమిస్తున్న హూవర్ డ్యామ్‌ను చూడమని, డ్రైవర్ బస్ వేగం తగ్గించి మరీ చెప్పడంతో అందరి చూపులూ అటే. మా సందర్శన స్థలాల జాబితాలో హూవర్ డ్యామ్ కూడా ఉంది.

దూరంగా దీప కాంతులలో హూవర్ డ్యామ్

ఆ విషయం మేం గుర్తు చేసుకున్నాం. డ్రైవరుకు, ప్రయాణికులు వారి ఇష్టపూర్వకంగా ఎంతో కొంత ఇవ్వవచ్చని చెప్పడంతో మా అమ్మాయి కూడా సంతోషంగా పది డాలర్లు ఇచ్చింది. కొద్ది సేపటికి వేగస్ రానే వచ్చింది. డ్రైవర్ వారి వారి స్టాపులలో బస్ ఆపి ఆత్మీయంగా వీడ్కోలు చెపుతోంది. మేం సౌత్ పాయింట్ దగ్గర దిగి, మా కారులో ఇల్లు చేరాం. మేం గ్రాండ్ కెన్యన్‌లో ఉన్నది కొద్ది గంటలే అయినా, నా జ్ఞాపకాల కడలిలో ఎగసిపడే అలలలో గ్రాండ్ కెన్యన్ ఓ అద్భుత కెరటం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here