అమెరికా.. కొన్ని నెమలీకలు!-6

7
10

[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]

చారిత్రాత్మక హూవర్ డ్యామ్!

[dropcap]మా[/dropcap] ప్రోగ్రామ్ ప్రకారం ఆ రోజు, నేషనల్ హిస్టారిక్ లాండ్‌మార్క్ గాను, నేషనల్ సివిల్ ఇంజినీరింగ్ లాండ్‌మార్క్ గాను నమోదైన హూవర్ డ్యామ్‌ను సందర్శించాలి. వాతావరణం చూస్తే బాగా చల్లని గాలులు ఉంటాయని తెలిసింది. హూవర్ డ్యామ్ చూడడానికి సందర్శకులను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతిస్తారు. మేం భోజనం చేసి బయల్దేరాం. దిగగానే చల్లని గాలి.. మా అమ్మాయి నా తలకు ఓ టోపీ కూడా తగిలించింది. అలవాటు లేని వ్యవహారం కావడంతో నేను పదే పదే సర్దుకుంటూ.. మా అమ్మాయి కౌంటర్ దగ్గరకు వెళ్లి ముందుగానే రిజర్వ్ చేసిన టికెట్ల వివరాన్ని తన మొబైల్‌లో చూపించింది. ఆ తర్వాత క్యూలో నిలుచున్నాం. వివిధ దేశాలకు చెందిన అసంఖ్యాక జనం ఉన్నారు. అమెరికా అంటేనే వివిధ జాతుల వారికి నెలవైన దేశం. ఇక దర్శనీయ స్థలాలలో వివిధ దేశాల, సంస్కృతుల వారు, వైవిధ్యభరిత దుస్తుల్లో ..ఆసక్తిగా గమనిస్తున్నాను. ఎక్కడకు వెళ్ళినా భారతీయులు కనిపిస్తే వెంటనే మనవాళ్లు అని అనుకోకుండా ఉండలేం. ఇక తెలుగువారు కనిపించినా, తెలుగు మాట వినిపించినా ఆ భావన స్థాయి కొండంతగా పెరుగుతుంది. లైన్‌లో నిలుచున్న వారిలో కొద్ది దూరంలో తెలుగువారు ఉన్నారు. పిల్లలు ఆడుతూ విదేశీ పిల్లలతో ఇట్టే కలిసిపోవడం చూస్తే ముచ్చటగా అనిపించింది. క్యూ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. క్యూలో నిలుచున్న వారిని బ్యాచ్‌ల వారీగా లోపలకు పంపిస్తున్నారు. ఒక హాల్లో వేదికపై ఒకాయన నిల్చుని హూవర్ డ్యామ్ గురించి చక్కగా వివరించారు. ఆ తర్వాత థియేటర్‌లో హూవర్ డ్యామ్ గురించి డాక్యుమెంటరీ చూపించారు. ఆ తర్వాత డ్యామ్ వీక్షణం. ఎటు చూసినా డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన పెద్ద పెద్ద ఫోటోలు, వివరాలు, పనిచేసిన శ్రామికుల నమూనాలు. ఒక హాల్లో పెద్ద టీవీ.. హూవర్ డ్యామ్ గురించి నిరంతరాయంగా మళ్లీ మళ్లీ చూపుతూనే ఉంటుంది.. వినిపిస్తూనే ఉంటుంది. ఇక హూవర్ డ్యామ్‌ను చూస్తుంటే అంత గొప్ప నిర్మాణానికి నేతల దార్శనికత, ప్రణాళిక రచన చేసిన ఇంజినీర్ల మేధా సంపత్తి ఎంత గొప్పది? ఎంతమంది శ్రామికుల స్వేద ఫలితమో కదా అనిపించింది. దీని నిర్మాణానికి అమెరికాలోని వివిధ స్టేట్‌ల నుంచి శ్రామికులు వచ్చి పనిచేశారు. ఆ వివరాలన్నీ నమోదు చేసి చక్కగా డిస్‌ప్లే చేస్తున్నారు. పెద్ద సంఖ్య అయినా, చిన్న అంకె అయినా వారి భాగస్వామ్యానికి శాశ్వత గుర్తింపునివ్వడం గొప్ప విషయం.

కొలరాడో నది

హూవర్ డ్యామ్ గురించి చెప్పాలంటే.. అరిజోనా – నేవడా సరిహద్దు ప్రాంతంలోని, బ్లాక్ కెన్యన్‌లో కొలరాడో నదిపై నిర్మితమైన డ్యామ్. గతంలో కొలరాడో నదికి తరచు వరదలు వచ్చి దక్షిణ కాలిఫోర్నియా, అరిజోనా తీవ్రంగా నష్టపోతుండేవి. వరదలను అదుపు చేసి, ఆ నష్టాన్ని నివారించడానికి, సాగు భూములకు, గృహావసరాలకు నీరు అందించడానికి, జల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక పెద్ద డ్యామ్ కట్టాలని యోచించారు.. ప్రణాళిక రచించారు. అలా 1930-36 మధ్య యుఎస్ లోనే అతి పెద్ద కాంక్రీట్ ఆర్చ్ గ్రావిటీ డ్యామ్.. అదే హూవర్ డ్యామ్ నిర్మాణం జరిగింది.

హూవర్ డ్యామ్ బయట..

హూవర్ డ్యామ్, ప్రపంచంలోని కృత్రిమ సరస్సులలో ఒకటైన ‘లేక్ మీడ్’ ను ఏర్పరిచింది. ఇది ఇక్కడ 185 కి.మీ. వరకు ప్రవహిస్తుంది నీటి సామర్థ్యం దృష్ట్యా లేక్ మీడ్ యుఎస్ లోనే అతి పెద్ద రిజర్వాయర్. 1935లో హూవర్ డ్యామ్ ప్రపంచం లోనే ఎత్తయిన డ్యామ్‌గా ఉండేది. హూవర్ డ్యామ్ ఎత్తు 726 అడుగులు (221.4 మీ.), పొడవు 1,244 అడుగులు (180 కి. మీ.) వచ్చే వరద నీటితో డ్యామ్‌కు ఏ మాత్రం నష్టం వాటిల్ల కుండా ప్రతి స్పిల్‌వే ను పకడ్బందీగా నిర్మించారు. దీని నిర్మాణానికి 21,000 మంది శ్రామికులు పనిచేశారు.

హూవర్ డ్యామ్ నిర్మాణంలో ఉండగానే సందర్శకుల రద్దీ పెరగడంతో వారి కోసం బ్లాక్ కెన్యన్‌లో ఒక అబ్జర్వేషన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. నిర్మాణ కాలం నాటికి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులలో నిర్మాణం సాగించడం నిజంగా కత్తి మీద సామే. దీని నిర్మాణానికి పనిచేసిన శ్రామికుల కోసం నేవడాలో ‘బౌల్డర్ సిటీ’ నిర్మించి, అందులో 5,000 గృహాలను కట్టారు. బౌల్డర్ కెన్యన్ పేరు మీదుగా దీనికి బౌల్డర్ సిటీ అనే పేరు వచ్చింది. నేవడాలో జూదం చట్ట విరుద్ధంగా ప్రకటించిన రెండు సిటీలలో బౌల్డర్ సిటీ ఒకటి. మరొకటి పెనక సిటీ.

హూవర్ డ్యామ్ నిర్మాణ సమయంలో వందమంది శ్రామికులు ప్రాణాలు కోల్పోయారు. హూవర్ డ్యామ్ నిర్మాణానికి 1931లో అయిన వ్యయం 49 మిలియన్ డాలర్లు. హూవర్ డ్యామ్ ఆర్కిటెక్చర్ శైలిని ‘ఆర్ట్ డెకో’ అంటారు.

హూవర్ డ్యామ్ వద్ద.. రచయిత్రి

1936 మార్చి 1వ తేదీన హూవర్ డ్యామ్ ప్రారంభం జరిగింది. 1931లో డ్యామ్ పేరును హూవర్ అని చట్టబద్ధంగా ప్రకటించినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రూజ్‌వెల్ట్, హారీ ఎస్ ట్రూమన్‌ల కాలంలో అధికారులు దీన్ని ‘బౌల్డర్ డ్యామ్’ గానే పేర్కొన్నారు. ఏమైనా 1929 – 33 కాలంలో యుఎస్ ప్రెసిడెంట్‌గా పని చేసిన హెర్బర్ట్ హూవర్ గౌరవార్థం పెట్టిన ‘హూవర్ డ్యామ్’ పేరే చివరకు స్థిరపడింది.

1939లో.. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశించక ముందు నాజీలు హూవర్ డ్యామ్‌ను కూల్చి వేయడానికి కుట్రపన్నారు. కానీ విఫలమైంది. అయితే 1941లో పెరల్ హార్బర్‌పై దాడి జరిగింది, అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగింది. ఆ సమయంలో హూవర్ డ్యామ్‌కు సందర్శకులను నిలిపి వేశారు. సెప్టెంబర్ 11, 2001 దాడుల అనంతరం అమలుచేసిన భద్రతా పరిమితుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రం కావడంతో హూవర్ డ్యామ్ బైపాస్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అంతేకాక 1,060 అడుగుల విస్తీర్ణంతో ఒక కాంక్రీట్ ఆర్చ్ వంతెన నిర్మించారు.

కాంక్రీట్ ఆర్చ్ వంతెన

హూవర్ డ్యామ్ నిర్మాణంతో లక్ష్యాలు చాలావరకు నెరవేరాయి. హూవర్ డ్యామ్ నుండి విడుదలయ్యే నీరు అనేక కాలువలకు చేరుతుంది. లేక్ మీడ్ నుండి అరిజోనా, నెవాడా, కాలిఫోర్నియా లోని 18 మిలియన్ల మంది ప్రజలకు నీటి సదుపాయం కల్పిస్తోంది. 1,000,000 ఎకరాల భూమికి నీటి పారుదలను అందిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో దాదాపు సగం లాస్ ఆన్జిలిస్, దక్షిణ కాలిఫోర్నియాలోని మరికొన్ని ప్రాంతాలకు అందుతోంది. మిగిలింది నేవడా, అరిజోనాలకు అందిస్తున్నారు. హూవర్ డ్యామ్‌ను, ఇక్కడి పవర్ ప్లాంట్, రిజర్వాయర్ లను యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద ఇంటీరియర్స్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ నిర్వహిస్తుంది.

హూవర్ డ్యామ్ వద్ద రచయిత్రి, వారి అమ్మాయి

హూవర్ డ్యామ్‌ను ప్రతి సంవత్సరం 7 మిలియన్ల మంది సందర్శిస్తున్నారంటే దాని నిర్మాణ ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. బయట బ్రిడ్జి మీద అలా నడుస్తూ ఉంటే ఒక గడియారం కనిపించింది. అది ఒక వైపు నేవడా కాలాన్ని, మరో వైపు అరిజోనా కాలాన్ని సూచించడం తమాషాగా అనిపించింది.

రెండువైపుల వేర్వేరు సమయాలను చూపే గడియారం

ఎటు చూసినా ఫోటోల సందడి. మేమూ కొన్ని ఫోటోలు తీసుకుని, హూవర్ డ్యామ్‌కు వీడ్కోలు పలికి కారెక్కాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here