కొత్త దృక్కోణం నుంచి అమెరికా కబుర్లు – ‘అమెరికా ముచ్చట్లు’

0
10

(ఈ పుస్తకం ది. 06 మే 2023 నాడు ఆన్‍లైన్ ద్వారా ఆవిష్కరించబడింది. త్వరలో పాఠకులకు అందుబాటులోకి రానున్నది)

[dropcap]అ[/dropcap]మెరికా.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల రుచిని ప్రపంచానికి చవిచూపించిన దేశం! చాలామందికి అమెరికా ఒక సుందర స్వప్నం. అక్కడ చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, వీలైతే పౌరసత్వం పొంది స్థిరపడాలనుకునే వారు ఎందరో. ఆ ఉద్దేశం లేకపోయినా.. అమెరికాలోని పర్యాటక స్థలాలని సందర్శించి, యాత్రానుభవాలను మూటకట్టుకుని ఆ అనుభూతులను గుండెల్లో నింపుకోవాలని కొందరు భావిస్తారు. వీలు చేసుకుని అమెరికా వెళ్ళి అక్కడి దర్శనీయ స్థలాలని చూసి ఆనందించి, ఆ విశేషాలను తమ వారితో పంచుకుంటారు.

అలా పర్యటించిన కొందరు ఆ యాత్ర విశేషాలను ట్రావెలాగ్ రూపంలో వెలువరిస్తుంటారు. ఆ కోవలోదే శ్రీ శ్రీధర్‌రావు దేశ్‍పాండే గారు రచించిన ‘అమెరికా ముచ్చట్లు’ పుస్తకం. ఈ పుస్తకంలోని 25 వ్యాసాలను సంచిక వెబ్ పత్రికలో ప్రచురించినందుకు శ్రీధర్‍రావు గారికి ధన్యవాదాలు.

అయితే పర్యాటకుల దృష్టి కోణాన్ని బట్టి యాత్రలో వారేం చూస్తారో, ఏం గమనిస్తారో, దేన్ని మనసులో ఇంకించుకుంటారో అనేవి ఉంటాయి. సాధారణ పర్యాటకుల్లా ప్రకృతి సౌందర్యం, ప్రసిద్ధ కట్టడాలు, బీచ్‍లు, వంతెనలు, నదులు వంటి వాటిని చూసినా – ఏదైనా రంగంలో నిపుణులైన పర్యాటకులు – తమ రంగంలో ఆ దేశం ఎంత ప్రగతిని సాధించిందో పరిశీలించడం అసాధారణమేమీ కాదు. ఇందుకు రచయిత మినహాయింపు కాదు. నీటి పారుదల రంగంలో నిపుణులైన రచయిత – అమెరికాలోని పలు డామ్‍లు, నీటి పారుదల వ్యవస్థ, జల్ విద్యుత్ ప్లాంటు మొదలైన వాటిని దర్శించడానికి ఆసక్తి చూపారు. ఉత్సుకత కలిగేలా వాటిని పాఠకులకు పరిచయం చేశారు.

అమెరికాలోని సామాన్యుల పరిస్థితులు, వారికి ఉపకరించే రైతు బజార్లు, డాలర్ ట్రీ షాపుల గురించి చెప్పడం రచయిత దృష్ణికోణాన్ని వ్యక్తం చేస్తుంది.

***

అమెరికా వెళ్ళాక అక్కడ తిరగటం సరదాగానే ఉంటుంది కానీ, విమాన ప్రయాణం కాస్త కష్టంగానే ఉంటుందంటారు రచయిత. నిరంతర ప్రయాణం ఎంతో దుర్భరంగా ఉంటుంది. విమానం ప్రయాణిస్తూనే ఉంటుంది. గంటలు గడచిపోతూ ఉంటాయి. కానీ గమ్యం దరి చేరదు. మెడలు, నడుము, మోకాళ్ళు నొప్పి పెడతాయి. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి కాళ్ళు చాపుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణికులు ఎటూ మెసలకుండా కూర్చోవాలి. సీటు కొద్దిగా మాత్రమే వెనక్కి వాలుతుంది. మెడ చుట్టూ మెత్తటి ఫోం పిల్లో చుట్ట పెట్టుకోవడం తప్పనిసరి అవసరమని అంటారు.

అమెరికా చేరాకా, కొన్ని రోజుల జెట్ లాగ్ అనంతరం అక్కడి పద్ధతులకు అలవాటు పడే క్రమంలో మన దేశానికి, అక్కడికి పద్ధతులలో ఉన్న తేడాని నిశితంగా గమనించి పాఠకులకు వివరిస్తారు రచయిత. స్విచ్‍లు, ప్లగ్‍లు, ఉష్ణోగ్రతని కొలిచే పద్ధతులు, నీటి కొలత లెక్కలలో – మౌలికమైన భేదాలను వెల్లడిస్తారు.

అమెరికాలో ఎండాకాలంలో సూర్తాస్తమయం ఎందుకు ఆలస్యం అవుతుందో శాస్త్రీయంగా వివరిస్తారు రచయిత. అక్కడ ఎండాకాలం పగలు సుదీర్ఘంగా ఉంటుంది కనుక ఉదయం పని వేళలను ఒక గంట ముందుకు జరుపుతారట. దీన్ని వారు Day Light Saving Time (DST) అంటారని చెబుతూ – ఇదంతా మనకు గమ్మత్తు వ్యవహారంగా అనిపిస్తుందని అంటారు.

తమ కుమార్తె అంజలి చదివిన టెక్సాస్ ఎ & ఎం యూనివర్సిటీ సందర్శించి అక్కడి విశేషాలను వివరిస్తారు రచయిత. ఈ క్రమంలో అక్కడున్న ఒక శిలాఫలకం గురించి చెబుతూ సందర్భానుసారంగా స్థానిక ఇండియన్ల చరిత్రను, యూరప్ వలసవాదులు అమెరికాని కనుగొని, క్రమంగా ఆక్రమించుకున్న విధానాన్ని పాఠకులకు గుర్తు చేస్తారు. అయితే అమెరికాలో గొప్ప యూనివర్శిటీలలో ఒకటిగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయంలో – ఉస్మానియా కాంపస్‌కు ఉన్న రాజసం, సహజత్వం కనిపించలేదని వ్యాఖ్యానిస్తారు.

ఆరిజోనా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్ కాన్యాన్ లోయని సందర్శించి, కొలరాడో నదీ ప్రవాహం గురించి వివరిస్తారు. స్థానికులైన వాలాపై జాతి గురించి ఆసక్తికరంగా చెప్తారు రచయిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుని గట్టిగా కోరుకోవడంలో – స్థానిక సంస్కృతి, చరిత్ర – అమెరికా లోని రెడ్ ఇండియన్ల దుస్థితి వలె కాకుడదన్నది ప్రొ. జయశంకర్ గారి ఆలోచనని వివరిస్తారు.

డాలస్ డౌన్‌టౌన్‌లో విన్సెంట్ వాంగో చిత్ర ప్రదర్శనని తిలకిస్తారు రచయిత. నిజానికి ఇది విన్సెంట్ వాంగో పెయింటింగ్‌ల ప్రదర్శన కాదని, వాంగో చిత్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిన అద్భుతమైన యానిమేషన్ వీడియో ప్రదర్శన అనుకోవాలని చెప్తారు. తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఫిట్జీరాల్డ్ కెన్నెడీ స్మారక కేంద్రానికి వెళ్తారు. మన కళ్ళు, మనస్సు ఎట్లా బ్రాంతులకు లోనవుతుందో చూపే వస్తువులు ప్రదర్శనకు ఉన్న Dallas Museum of Illusions చూశారు.

అమెరికాలోని రైతులకు ఉపకరించేలా మన రైతు బజార్ల మాదిరే ఇర్వింగ్, మెకని, డెంటన్, ఫ్రిస్కో, ప్రిస్టన్.. తదితర డల్లాస్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతీ శనివారం రైతు బజార్లు ఏర్పాటు అవుతాయని వివరించారు. అంతా కార్పోరేట్ మయమైన అమెరికాలో ఈ రైతు బజార్లు సుడిగాలిలో దీపాల లాంటివని వ్యాఖ్యానిస్తారు.

కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ డ్యాంని సందర్శించి, ఆ డ్యాం నిర్మాణం గురించి, డ్యాం నిర్మాణంలో చేసిన ఇంజనీరింగ్ ప్రయోగాల గురించి వివరించారు. అమెరికా వ్యవసాభివృద్దికి దోహదం చేసిన ఈ డ్యాం నిర్మాణానికి ముందు కొలరాడో నదికొచ్చిన వరదల వల్ల సంభవించిన నష్టాన్ని తెలిపి – డ్యాం నిర్మాణ అవసరాన్ని పాలకులు ఎలా గుర్తించారో వివరించారు. డ్యాం పూర్తయ్యాకా, అది అందిచిన ఫలితాలను వెల్లడించారు.

కొలంబియా నదిపై నిర్మించిన గ్రాండ్ కూలి డ్యాంని తన మిత్రులు, సాగునీటి శాఖలో తనకు సీనియర్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ అయిన కొండపల్లి వేణుగోపాల రావు గారితో, కొండపల్లి నీహారిణి గారితోనూ కలిసి సందర్శించడం ఆనందం కలిగించిదని అంటారు. ఈ డ్యాం కట్టడానికి ముందరి నేపథ్యాన్ని వివరించి, అప్పట్లో అమెరికాలో నెలకొని ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వేలాది మందికి డ్యాం నిర్మాణంలో ఉపాధి లభించిందని తెలిపారు. అమెరికా వాయవ్య ప్రాంతాల అభివృద్దికి గ్రాండ్ కూలీ డ్యాం ఒక ప్రగతి రథంగా మారిన వైనాన్ని వివరించారు.

హూవర్ డ్యాం, గ్రాండ్ కూలి డ్యాం రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఎల్వుడ్ మీడ్ గురించి ప్రత్యేకంగా వివరించారు. ఈ వ్యాసంలో అమెరికా తొలి తరం డ్యాంల వివరాలు పట్టిక రూపంలో అందించడం విశేషం. పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు రెడీ రిఫరెన్స్‌లా ఉపకరించవచ్చు.

డాలస్ మెకనిలో డాలర్ ట్రీ అనే షాపుకి వెళ్ళి – అమెరికాలో, కెనడాలో ఈ గొలుసు దుకాణాలు పదిహేనువేలకి పైగా ఉన్నాయనీ, ఏ వస్తువు అయినా ఒక డాలర్‌కే దొరికే ఈ కొట్లు పేదవారికి ఉపయుక్తమని చెప్తారు రచయిత. ఈ సందర్భంగా మన దగ్గర కూడా ఒకప్పుడు ఉన్న ‘హర్ ఏక్ మాల్ దో రుపియా’ షాపులను ప్రస్తావిస్తారు. రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న ఈ కాలంలో 80వ దశకంలో మన వద్ద ఉండిన ‘హర్ ఏక్ మాల్ దో రుపియా’ దుకాణాలను ఇక ఎన్నటికీ ఊహించలేమని వ్యాఖ్యానిస్తారు.

ప్రజాస్వామ్య విలువలకి ప్రాధాన్యం ఇచ్చే అమెరికాలో అధ్యక్ష వ్యవస్థ గురించి, అమెరికా చరిత్ర గురించి, కొందరు అధ్యక్షుల నేపథ్యం గురించి వెల్లడించారు. మరో వ్యాసంలో అమెరికా లోని రాష్ట్రాల విశేషాలు వివరించి అమెరికా ఈ రోజు 50 సంయుక్త రాష్ట్రాలుగా మారిన పరిణామక్రమాన్ని తెలిపారు. ఈ క్రమంలో ఆ యా రాష్ట్రాల లోని కొన్ని ప్రసిద్ధ ప్రాంతాల గురించి తెలిపారు.

అమెరికా వెళ్ళే పర్యాటకులు తప్పనిసరిగా చూడాలనుకునేది నయాగారా జలపాతం. ప్రపంచ జలపాతాల్లో రారాజు వంటిది నయాగారా అని చెబుతూ ఈ జలపాతం విశేషాలను వివరిస్తారు. నీటి పారుదల రంగ నిపుణులు కాబట్టి ఇక్కడ కూడా జలపాతాల ఎత్తు, వెడల్పు, కిందకి జారే నీటి పరిమాణం, జల విద్యుత్ ఉత్పత్తి వివరాలు గణాంకాలతో వివరిస్తారు. అంకెలతో సరిపెట్టకుండా, భావుకుడిలా – నీరు కిందకు దూకిన తర్వాత వెలువడే నీటి తుంపరల మేఘం గురించి, ఈ మేఘాల వెనుక ఏర్పడే అద్భుతమైన ఇంద్ర ధనుస్సు గురించి వివరిస్తారు. ఇక్కడ నీళ్ళలో రాగి నాణాలు గమనించి, నదిలో నాణాలు వేసే సాంప్రదాయం ఏడు సముద్రాల ఆవల కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించిందని చెప్తారు.

నయగారా జలపాతం తర్వాత ప్రపంచ పర్యాటకులకు న్యూయార్క్ రాష్ట్రంలో మరొక తప్పనిసరి దర్శనీయ స్థలం ‘స్టాచ్యు ఆఫ్ లిబర్టీ’. ఈ విగ్రహం చరిత్రని, ఏర్పాటును సంక్షిప్తంగా వివరించారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎత్తైన ఇతర విగ్రహాల గురించి సందర్భోచితంగా వివరిస్తారు.

కొలరాడో లోని ప్రకృతి సంపద గురించి చెబుతూ – ప్రాచీన మానవ నాగరికతలు నిర్మించిన మహా కట్టడాలు, నిర్మాణాలు అమెరికాలో లేకపోయినా ప్రకృతి అందించిన సందను అక్కడి ప్రభుత్వాలు, ప్రజలు అపురూపంగా కాపాడుకుంటున్నారని వివరిస్తారు. కొలరాడో రాష్ట్రంలో ఉన్న గార్డెన్ ఆఫ్ గాడ్స్, గ్రేట్ శాండ్ డ్యూన్స్ గురించి తెలియజేస్తారు. వీటిని అక్కడి ప్రభుత్వాలు కాపాడుతున్న రీతిలోనే, తెలంగాణలోని రాక్ ఫార్మేషన్స్‌ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని భావించారు రచయిత.

అమెరికా ఆధునిక సాంకేతికతకి నిలయం. గమ్మత్తయిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్‌ని వినియోగిస్తున్న అమెజాన్ అలెక్సా అనే పరికరం గురించి తెలిపారు. ఈ క్రమంలో ఆపిల్ వారి SIRI గురించి, గూగుల్ కంపనీ వారి Google Assistant గురించి, మైక్రోసాఫ్ట్ వారి మరొక ఆప్ గురించి ప్రస్తావిస్తారు రచయిత. అలెక్సా, సిరి లాంటి ఆప్‌లు మనకు ఉపయోగపడుతున్నా మానవ శ్రమను తగ్గించే ఒక విపరిణామం కూడా తలెత్తవచ్చని అంటారు.

వాషింగ్టన్ రాష్ట్రం లోని సియాటిల్ నగరం సందర్శించారు రచయిత. ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా ఉందీ నగరం అంటారు. స్నోక్వాల్మి జలపాతాన్ని దర్శించినప్పుడు అక్కడి జల విద్యుత్ కేంద్రాల పనితీరుని వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ వివరాలని అందించారు. చిట్టెన్డెన్ లాక్స్ గురించి చెబుతూ ఇండియాలో ఎక్కడా చూడలేని పూల మొక్కలను ఇక్కడ చూడటం ఒక గొప్ప అనుభవమని అంటారు. బెయిన్ బ్రిడ్జ్ గురించి చెప్తారు. సియాటిల్ నగరంలో ప్రధాన ఆకర్షణ అయిన భూగర్భ నగర సందర్శనం చక్కని అనుభూతి కలిగిస్తుందని చెప్తారు. ఇక్కడి చూయింగ్ గం వాల్ గురించి వివరిస్తూ – దాని వెనుక ఉన్న సెంటిమెంటు గురించి తెలియజేస్తారు. స్థానిక స్పేస్ నీడిల్ టవర్ ఎక్కి సియాటిల్ నగర అందాలను వీక్షించి తృప్తి చెందారు రచయిత.

టెక్సాస్ లోని ఆస్టిన్‌లో ఉన్న స్టేట్ క్యాపిటల్ భవనం, అమెరికా 36వ అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ స్మారక గ్రంథాలయం చూసి వాటి వివరాలు అందించారు. లిండన్ బి జాన్సన్ స్మారక గ్రంథాలయం లోని పుస్తకాల గురించి, అక్కడున్న ఓవల్ ఆఫీసు నమూనా గురించి తెలియజేస్తారు. ట్రెవిస్ సరస్సు ఒడ్డున కొండపై ఉన్న ఒయాసిస్ రెస్టారెంట్‌కు వెళ్ళి సూర్యాస్తమయాన్ని చూడడం చక్కని అనుభూతి అంటారు.

అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి లోని వాషింగ్టన్ మాన్యుమెంట్, రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల స్మారకం, లింకన్ మెమోరియల్, ఫెడరల్ క్యాపిటల్ భవనం, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లను సందర్శించి వాటి వివరాలను పాఠకులకు అందించారు రచయిత. ఈ క్రమంలో వాషింగ్టన్ డి సి చరిత్ర, పూర్వపరాలను వెల్లడించారు. వాషింగ్టన్ డి సి కి వెళ్ళే భారతీయ పర్యాటకులకు – రుచికరమైన స్వదేశీ భోజనం కోసం ‘బాంబే క్లబ్’ రెస్టారెంట్‌కు వెళ్ళమని సిఫార్సు చేస్తారు. వైట్ హౌజ్‌ వద్ద నిరసన తెల్పుతున్న వారి గురించి వివరిస్తారు. వివిధ సమస్యలని ప్రస్తావిస్తూ, తమ ఉద్యమాల గురించి ఎక్కువందికి చేరేలా చేస్తున్నారా నిరసనకారులు అని అంటారు.

బాల్టిమోర్ నగరం నల్లజాతి ప్రజల స్వేచ్ఛాధామమని చెబుతారు. ఈ సందర్భంగా అమెరికా నల్లజాతి పౌర హక్కుల నాయకుడు ఫ్రెడ్రెరిక్ డగ్లస్ గురించి వివరిస్తారు. బాల్టిమోర్ చరిత్రని, అక్కని నేషనల్ అక్వేరియం గురించి తెలియజేస్తారు. ఇక్కడి అలలు కనబడని బీచ్‌ను దర్శించారు. బాల్టిమోర్ నగరానికి ఆనుకొని అల్పదాయ వర్గాల ఇండ్లు, కాలనీలు కనిపించాయని చెబుతూ, ఇవి మన దేశంలో కనిపించే మురికివాడల లాంటివే అయినా, మన దగ్గర మురికివాడలకు వీటికి చాలా తేడా ఉందని వ్యాఖ్యానిస్తారు.

డాలస్ ఫ్రిస్కొ లో ఉన్న కార్యసిద్ది హనుమాన్ గుడికి వెళ్ళిన సందర్భంగా, అమెరికాలోని హిందూ దేవాలయల గురించి, వాటి నిర్మాణం గురించి విశ్లేషణాత్మకంగా తెలియజేశారు. అయితే అమెరికాలోని భారతీయులు గుడులు, చిన్న ప్రీ స్కూళ్ళు, మాంటిస్సోరిలు, డాన్స్ స్కూళ్ళు, మ్యూజిక్ స్కూళ్ళని నిర్వహిస్తున్నారనీ, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్నారనీ, డాక్టర్లు క్లినిక్‍లు, న్యాయవాదులు లా ఫర్మ్ నడుపుతున్నారనీ – కానీ పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్, యూనివర్సిటీలు, కాలేజీలు నడుపుతున్నారా అనేది పరిశోధించ వలసిన విషయమని అంటారు.

నల్లుల దేశం అంటూ అమెరికా నల్లుల వ్యాప్తిని వివరిస్తారు.

ఓ వ్యాసంలో అమెరికాలో తాను గమనించిన సామాజిక జీవితం గురించి చెప్తూ అమెరికాలో జీవితాలు ఎవరికి వారే యమునా తీరే అని అంటారు. అమెరికాలో భారతీయ తల్లిదండ్రులు బేబీ సిట్టర్స్ అవుతుండడం ఒకింత బాధ కలిగిస్తోందని అంటారు. అయితే తాను చూసిన, తన అనుభవంలోకి వచ్చిన అంశాలు ఇవని; ఇంతకు మించి తాను చూడని జీవితం కూడా ఉండవచ్చని; ఇదే అమెరికాలో భారతీయుల జీవితం అని తాను ప్రకటించలేదని స్పష్టం చేస్తారు.

చివరగా అమెరికా ప్రజల నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలను ప్రస్తావించి, తృణీకరించ వలసిన అంశాలను సైతం వివరిస్తారు. ఈ సందర్భంగా మన దృక్పథంలో మార్పు రావల్సిన అవసరాన్ని వివరిస్తారు.

***

మామూలుగా యాత్రలు చేసి యాత్రాకథనాలు రాసే వారి రచనల  వలె కాకుండా, ఇంజనీర్ అయిన ఈ రచయిత అందించిన యాత్రా కథనాలు విభిన్నమైనవి, విశిష్టమైనవి. అత్యంత సరళమైన రీతిలో, చదువరులను తన వెంట తిప్పినట్లుగా సాగిందీ పుస్తక రచన.

ఈ పర్యటన అంతా శ్రీధర్ గారి వెంట వారి సతీమణి, ప్రముఖ రచయిత్రి గీతాంజలి గారు, పిల్లలు అంజలి, వెన్నెల ఉన్నారు. వ్యాసాల్లో అక్కడక్కడా పిల్లల చదువులు, ఉద్యోగాల గురించి ప్రస్తావన వస్తుంది. ఈ క్రమంలో పాఠకులు కూడా అక్కడున్న తమ వారిని తలచుకోకుండా ఉండలేరు. ట్రావెలాగ్ అయినప్పటికీ, పర్సనల్ టచ్ కూడా ఉందీ పుస్తకంలో.

చక్కని లే-అవుట్‍తో, అందమైన ఫోటోలతో రూపొందిన ఈ పుస్తకం పాఠకులని ఆకట్టుకుంటుంది.

***

అమెరికా ముచ్చట్లు (అమెరికా పర్యటనానుభవాలు)

రచన: శ్రీధర్‍రావు దేశ్‍పాండే (+91 94910 60585)

ప్రచురణ: వెన్నెల – గీత ప్రచురణలు

పేజీలు: 168

వెల: ₹ 250/-

ప్రతులకు:

అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు (త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here