అమెరికా ముచ్చట్లు-1

2
12

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికాకు విమానయానం

[dropcap]మా[/dropcap] పెద్ద బిడ్డ గీతాంజలి పై చదువుల కోసం 2014 ఆగస్టులో అమెరికా వెళ్ళింది. టెక్సాస్ ఎ & ఎం యూనివర్సిటీలో ఎం.ఎస్. (కంప్యూటరు సైన్స్) కోర్సులో సీటు వచ్చింది. అప్పటికే తెలంగాణ ఏర్పాటు అయి రెండు నెలలు గడచింది. నేను సాగునీటి మంత్రి తన్నీరు హరీష్ రావు గారి వద్ద వద్ద ఒ.ఎస్.డి.గా చేరి ఒక నెల గడచింది. 2017లో ఆమె ఎం.ఎస్. పట్టా ప్రదానోత్సవం చూడటానికి అమెరికా వెళ్ళవలసి ఉండే. కానీ ఇక్కడ పని ఒత్తిడి కారణంగా మేము ఆ ఉత్సవానికి వెళ్ళలేకపోయాము. అది ఆమెకు మాకూ వెలితిగా మిగిలిపోయింది. 2019 జనవరిలో కెసిఆర్ నాయకత్వంలో టి.ఆర్.ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. సాగునీటి శాఖను ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్వహించడానికి నిర్ణయించి నన్ను సిఎం పేషీలో ఒ.ఎస్.డి.గా నియమించారు. 2019 మే నెలలో అమెరికా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతించారు. అప్పటికి ఆమె చదువు ముగించుకొని టెక్సాస్ రాష్ట్రంలోనే డల్లాస్ నగరంలో ఉద్యోగంలో స్థిరపడింది. ముఖ్యమంత్రి గారి అనుమతితో రెండు నెలల వ్యక్తిగత సెలవుపై 2019 మే 20 న అమెరికా ప్రయాణమయ్యాను.

నా కంటే నాలుగు నెలల ముందే 2019 జనవరి లోనే నా సతీమణి డా. భారతి(గీతాంజలి) చిన్న బిడ్డ వెన్నెలతో అమెరికా వెళ్లిపోయింది. వెన్నెల కూడా పై చదువుల కోసం 2017 ఆగస్ట్‌లో అమెరికా వెళ్ళింది. కొలరాడో యూనివర్సిటీ డెన్వర్ క్యాంపస్‌లో ఆమెకు ఎం.ఐ.ఎస్ కోర్సులో సీటు వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత సెలవులకు ఇండియా వచ్చి రెండు నెలల తర్వాత అమ్మని తీసుకొని అమెరికా వెళ్ళింది. నాలుగు నెలలు నేనూ మా పెంపుడు కుక్క ఛోటు ఇద్దరం ఎట్లా బతికామో ఆ దేవుడికే ఎరుక. రాత్రి ఛోటు కోసమే ఇంటికి వచ్చేది. అది నా రాక కోసం ఆకలితో ఎదురు చూస్తూ ఉండేది. గుర్రంగూడలో నాకు ఛోటుకు జొన్న రొట్టెలు తెచ్చుకొని ఏదో కూర లేదా పప్పు వండుకొని ఆ రాత్రికి డిన్నర్ కానిచ్చేవాడిని. రాత్రికి చదువు, రాత, సంగీతం, సినిమాలు.. నిద్ర పట్టక అటు దొర్లి ఇటు దొర్లి ఏ రాత్రికో నిద్రపోయేవాడిని.

ఈ నాలుగు నెలల దుర్భరమైన ఒంటరి జీవితానికి వీడ్కోలు చెప్పి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 4 గంటలకు ఎమిరేట్స్ ఎయిర్ వేస్ విమానంలో అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న డల్లాస్ నగరానికి పయనమయ్యాను. అంతకు ముందే ఛోటును ఒక డాగ్ కేర్ సెంటర్‌లో వదిలేశాను. ఉదయం 4 గంటలకు విమానం ఎక్కాలంటే రాత్రి 1 గంటకే.. అంటే మూడు గంటల ముందే విమానాశ్రయం చేరుకొని చెకిన్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవలసి ఉంటుంది.  హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు నేరుగా విమానాలు లేవు. మధ్యలో విమానం మారవలసి ఉంటుంది. ఈ మార్పు దుబాయిలో ఉంటుంది. మన లగేజిని ఎయిర్‌వేస్ వారే మరో విమానంలోకి  చేరవేస్తారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ 4 గంటల ప్రయాణం. దుబాయ్‌లో రెండు గంటల ఛేంజ్ ఓవర్ టైమ్ ఉంటుంది. ఈ ఛేంజ్ ఓవర్ టైమ్‌లో దుబాయి విమానాశ్రయంలో తిరగవచ్చు. కొనుగోళ్లు చేయవచ్చు. దుబాయి విమానాశ్రయం చాలా పెద్దది. దుబాయిలో దిగిన తర్వాత మన టర్మినల్‌కు పోవడానికి విమానాశ్రయం వారు ఏర్పాటు చేసిన రైలులో ప్రయాణం చేయాలి. కొత్తవారికి ఈ ఛేంజ్ ఓవర్ కొంత కష్టమైన పనే. కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రులకు సహాయం కోసం ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులను ఎంగేజ్ చేస్తారు. ఈ పని కోసం విమాశ్రయంలో ప్రత్యేకంగా ఉద్యోగులు పని చేస్తారు. వారే మనలని రిసీవ్ చేసుకొని మనం పోవలసిన టర్మినల్‌కు చేరుస్తారు. నాకు గతంలో విదేశీ ప్రయాణాలు చేసిన అనుభవం ఉంది గనుక   ఈ అవసరం పడలేదు.

హైదరాబాద్ నుంచి డల్లాస్ కు ప్రయాణ మార్గాన్ని చూపే గూగుల్ మ్యాప్

రెండు గంటల తర్వాత దుబాయ్‌లో మళ్ళీ ఎమిరేట్స్ ఎయిర్ వేస్ విమానంలో డల్లాస్ వెళ్ళే విమానం ఎక్కాను. అప్పటికే భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలు అయ్యింది. విమానం గాలిలోకి ఎగిరి తగినంత ఎత్తులో స్థిరపడిన తర్వాత ఇక బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం మొదలయ్యింది. ఇక అప్పటి నుంచి విమానం దిగే వరకు ప్రతీ మూడు గంటలకు ఏదో ఒకటి తినబెడుతూనే ఉంటారు. ఆకాశంలో విమానం గంటకు 800-900 కిమీ వేగంతో ప్రయాణం చేస్తున్నప్పటికీ మనకు విమానం కదులుతున్న అనుభూతి కలుగదు. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం చలనం సాపేక్షం. చలనం మన అనుభూతిలోకి రావాలంటే తప్పనిసరిగా మన పక్కన స్థిరమైన వస్తువు లేదా మరో కదులుతున్న వస్తువో ఉండి తీరాలి. 35 వేల అడుగులో ఎత్తులో విమాన చలనాన్ని మన అనుభవంలోకి తీసుకురావడానికి ఎటువంటి సాపేక్షతకు అవకాశం లేదు. ఆ ఎత్తులో మేఘాలు కూడా ఉండవు. కనుక విమాన చలనం మన అనుభూతిలోకి రాదు. విమానం ఇంజన్ చప్పుడు తప్ప మరేమీ ఉండదు. కిటికీలో నుంచి చూస్తే స్థిరమైన, విశాలమైన నీలాకాశం తప్ప మరేమీ కనబడదు. రాత్రి అయితే ఏమీ కనబడదు. భూమికి 35 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తూ ఉంటుంది. మన సీటుకు ఎదురుగా టివి ఉంటుంది. అందులో అన్నిభాషల సినిమాలు చూడవచ్చు. సంగీతం వినవచ్చు. విమాన గమనాన్ని సూచించే భూగోళం చూడవచ్చు. విమానం ఏ దేశం మీద నుంచి ప్రయాణిస్తున్నది తెలుసుకోవచ్చు. విమానం బయట వాతావరణం ఎట్లా ఉందో తెలుసుకోవచ్చు. విమానం బయలుదేరినప్పటి నుంచి ఎంత దూరం, ఎన్నిగంటలు ప్రయాణించింది తెలుసుకోవచ్చు. ఇది ఒక అనంతమైన నిరంతర ప్రయాణం. పశ్చిమ దిశలో మధ్య ఆసియా దేశాలను, యూరప్ దేశాలను దాటి, దక్షిణానికి మళ్ళి అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది.

అందరూ మనకు హ్యాపీ జర్నీ అని వీడ్కోలు పలుకుతారు. నిజానికి వారు హ్యాపీ జర్నీ అనే కంటే సేఫ్ జర్నీ అని వీడ్కోలు చెపాలి. 18 గంటల నిరంతర ప్రయాణం ఎంతో దుర్భరంగా ఉంటుంది. విమానం ప్రయాణిస్తూనే ఉంటుంది. గంటలు గడచిపోతూ ఉంటాయి. కానీ గమ్యం దరి చేరదు. మెడలు, నడుము, మోకాళ్ళు నొప్పి పెడతాయి. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి కాళ్ళు చాపుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణికులు ఎటూ మెసలకుండా కూర్చోవాలి. సీటు కొద్దిగా మాత్రమే వెనక్కి వాలుతుంది. మెడ చుట్టూ మెత్తటి ఫోం పిల్లో చుట్ట పెట్టుకోవడం తప్పనిసరి అవసరం. నడుము నొప్పి ఉన్నవారు నడుముకు బెల్ట్ పెట్టుకుంటారు. నేను రెండు పెట్టుకున్నాను. లఘు శంక తప్ప రోజువారీ ప్రకృతి పిలుపులు రావు. నిద్ర పట్టదు. సినిమాలు ఎంత సేపు చూస్తాము? ఈ ప్రయాణంలో మొత్తం నాలుగు సినిమాలు చూశాను.

చివరకు అమెరికా టెక్సాస్ సమయం మధ్యాహ్నం 12 గంటలకు డల్లాస్‌లో ఉన్న డి.ఎఫ్.డబ్ల్యూ  అంతర్జాతీయ విమాశ్రయంలో కొద్ది సేపట్లో దిగుతున్నామని విమాన సిబ్బంది ప్రకటించారు. నా భార్యా బిడ్డలను కలుసుకోబోతున్నానన్నఆనందంలో విమాన ప్రయాణంలో అనుభవించిన అన్ని బాధలు మరచిపోయాను. మే 20న తెల్లవారు జామున ఇండియాలో బయలుదేరితే, మే 21 న అమెరికాలో దిగాను. కాలమానంలో అమెరికా మనకంటే 12 గంటలు వెనుక. నేను ఆమెరికాలో దిగిన సమయానికి ఇండియా మే 22 లోకి ప్రవేశించింది.

విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాను. అక్కడ బూట్లు సాక్సులు, బెల్టు, గడియారం, పర్సులు, పెన్నులు, లాప్టాప్ తదితర వస్తువులన్నీ స్కాన్ చేస్తారు. సూట్ కేస్‌లను స్కాన్ చేసినప్పుడు మా పెరడులో చెట్టుకు కాసిన బంగినపల్లి మామిడి పండ్లు వారికి కనిపించాయి. సూట్ కేస్ విప్పమని సెక్యూరిటీ వారు ఆదేశించారు. వాటిని బయటకు తీసి ఎంత బతిమిలాడినా నిర్దయగా చెత్త బుట్టలో పడేసి.. “మీరు మొదటిసారి అమెరికా వస్తున్నారు కాబట్టి క్షమిస్తున్నాము. మరోసారి ఇటువంటి తప్పు చేయకండి” అని మర్యాద పూర్వకంగా హెచ్చరించి నా పాస్‌పోర్ట్‌పై ఇమ్మిగ్రేషన్ స్టాంపు గుద్ది బయటకు పంపినారు. విమానంలో నుంచి సామానులు వచ్చేపెద్ద కలెక్షన్ ఛాంబర్‌లో పదుల సంఖ్యలో కన్వేయర్ బెల్ట్‌లు సామాన్లను మోసుకొస్తూ ఉంటాయి. ఏ నంబరు బెల్ట్‌లో మన సామాన్లు వస్తాయో మనకు అక్కడ టివి తెర మీద కనిపిస్తూ ఉంటాయి. ఆ బెల్ట్ వద్ద నా సామాను వచ్చే దాకా నిలబడి అవి రాగానే వాటిని దించుకొని ట్రాలీ మీద వేసుకొని విమానాశ్రయం నుంచి బయట పడ్డాను. బయటకు రాగానే మా బిడ్డ గీతాంజలి రెడీ గానే ఉన్నది. ఇద్దరం సామాను కార్లో ఎక్కించి ఇంటికి బయలుదేరాము. దారిలో డల్లాస్ నగర విశాలమైన రోడ్లు, లాన్లు ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు.. చూస్తూ ఒక గంటలో ఇర్వింగ్‌లో ఉన్న ఆర్బర్స్ కమ్యూనిటిలో ఉన్నఇంటికి చేరుకున్నాము.

డల్లాస్ నగరం

పిల్లలు పగలు నిద్ర పోవద్దని, ఇక్కడి  గడియారానికి అలవాటు పడాలి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కానీ జెట్ లాగ్ వలన నిద్రలోకి జారిపోక తప్పలేదు. జెట్ లాగ్ నుంచి తేరుకొని అమెరికా గడియారానికి అలవాటు పడటానికి రెండు మూడు రోజులు పట్టింది.

***

2022లో జూన్ 5న రెండవ సారి అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఖతార్ ఎయిర్ వేస్‌ను ఎంచుకున్నాను. హైదరాబాద్ నుంచి దోహాకి ఇండిగో విమానం ఏర్పాటు చేశారు. దోహాకు నాలుగు గంటల ప్రయాణం. అక్కడి నుంచి డల్లాస్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ బోయింగ్ విమానంలో ఎక్కించారు. సుమారు 800 మంది ప్రయాణికులను మోసుకుపోయే పెద్ద విమానం ఇది. 18 గంటల నాన్ స్టాప్ ప్రయాణం. అమెరికా కాలమానం ప్రకారం జూన్ 6 న ఉదయం 10 గంటలకు డి.ఎఫ్.డబ్ల్యూ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది బోయింగ్ విమానం. భారత్‌లో అప్పుడు జూన్ 6  రాత్రి 11.30 అవుతున్నది.  మొదటిసారి అమెరికా ప్రయాణం కష్టతరం అనిపించింది. ఈ ప్రయాణం ఇట్లా ఉండబోతుందని ముందే తెలుసు కాబట్టి మానసికంగా ఈసారి  అందుకు సిద్దపడి విమానం ఎక్కాను. టీవిలో 4 సినిమాలు, నిద్రతో సమయాన్ని, ప్రయాణ భారాన్ని అధిగమించాను. మేడమ్ గారు నా కంటే నెలన్నర ముందు గానే ఏప్రిల్ 11 న అమెరికా వెళ్ళింది. విమానాశ్రయం నుండి బయటకు రాగానే ముగ్గురు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

డల్లాస్ విమానాశ్రయం లో పిల్లలతో రచయిత
డల్లాస్ విమానాశ్రయం లో పిల్లలతో రచయిత

మెకనిలో రాలే కమ్యూనిటి
రాలే కమ్యూనిటిలో చిన్న చెరువు

వెన్నెల నన్ను చూసి ఒకటే ఏడుపు. మూడేళ్ళ తర్వాత పిల్లలను కలవడం. కరోన కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించడంతో రెండు సంవత్సరాలు పిల్లలు భారత్‌కు రాలేక పోయారు. మాకు పోవడానికి వీలు కాలేదు. ఆ ఎడబాటు దుఃఖం ఒక్కసారి వెల్లుబికింది. ఇప్పుడు పిల్లలు ఇర్వింగ్ నుంచి మెకని ప్రాంతానికి మారినారు. ఇక్కడ రాలే కమ్యూనిటిలో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. గతంలో కన్నా సౌకర్యవంతంగా ఉన్నది ఈ అపార్ట్మెంట్.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here