అమెరికా ముచ్చట్లు-12

1
6

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికా అధ్యక్షులు : కొన్ని విశేషాలు

[dropcap]గ[/dropcap]త వారం అమెరికాలో డాలర్ ట్రీ గొలుసుకట్టు దుకాణాల గురించి రాసి ఉన్నాను. డాలర్ ట్రీ షాపులోకి వెళ్ళినప్పుడు నన్ను కొన్ని పుస్తకాలు ఆకర్షించాయి. నిజానికి అవి పిల్లలకు ఉద్దేశించిన పుస్తకాలు. అయినా 1.25 డాలర్ ఖరీదు చేసే పుస్తకాలు కనుక కొనేశాను. 1. Presidents of the United States 2. America’s 50 States 3. United Sates Monuments and Parks. ఇంటికి వెళ్ళినాక అదే రోజు మొదటి రెండు పుస్తకాలు ఏకబిగిన చదివేశాను. అమెరికా అధ్యక్షుల విశేషాలు సంక్షిప్తంగా తెలిసినాయి. అమెరికా 50 రాష్ట్రాల దేశంగా మారడానికి 183 ఏళ్లు పట్టిందని తెలిసి ఆశ్చర్యపోయాను. అమెరికా అధ్యక్ష పదవి అంటే ప్రపంచం అంతా ఆసక్తిని ప్రదర్శిస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అన్నీ దేశాల ప్రజలకు తమ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయా అన్నంత ఉత్కంఠ ఉంటుంది. అమెరికా విదేశీ విధానాలలో ఎవరు ఎన్నిక అయినా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు కానీ వలస చట్టాల గురించే అన్ని దేశాల ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే రాబోయే అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమెరికా వలస చట్టాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి? అన్న అంశం విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకంగా ఉంటుంది. 2021 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవాలని, జో బైడెన్ గెలవాలని అమెరికాకు వెళ్ళిన భారతీయులు, అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులు బలంగా కోరుకున్నారు. అమెరికాకు వలస వచ్చే విదేశీయులను కట్టడి చేయడానికి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో కఠిన నియమ నిబంధనలు అమలు చేశాడు. భారత్ లాంటి ఆసియా దేశాలకు వీసాలు తగ్గించాడు.

డొనాల్డ్ ట్రంప్

ఇది ట్రంప్ మీద భారతీయుల వ్యతిరేకతకు కారణమయ్యింది. భారత ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా అటు అమెరికాలో ఇటు భారత్‌లో ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేసినాడు. గతంలో ఏ ప్రధాన మంత్రి కూడా అమెరికా ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఒక అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ‘అబ్ కి బార్ – ట్రంప్‌ కి సర్కార్’ నినాదంతో హూస్టన్‌లో, అహ్మదాబాద్‌లో ప్రచార సభలు జరిగినాయి. అయినా భారతీయ అమెరికన్లు ట్రంప్‌కు ఓటు వేయలేదు. ట్రంప్ ఒడిపోయినాడు. బైడెన్‌కు తోడుగా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారిస్ ఉండడం కూడా భారతీయుల వోటు బైడెన్ దిక్కు మళ్ళడానికి ఒక ముఖ్య కారణంగా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయన అనేక మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులను ప్రభుత్వ కీలక పదవుల్లో నియమించడం విశేషం. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో ట్రంప్ ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను సడలించినాడు. 78 సంవత్సరాల వయసులో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఈయనే అమెరికాకు అతి పెద్ద వయసులో ఎన్నికైన అధ్యక్షుడు.

జో బైడెన్
కమలా హారిస్

ఇక బైడెన్ కంటే ముందు 45 మంది అమెరికా అధ్యక్షులుగా పని చేసినారు. 4 జూలై, 1776 న Declaration of Independence జారీ అయ్యింది. Confederation of Congress వారు 13 సెప్టెంబర్, 1788 న Election Ordinance ను జారీ చేసింది. ఈ ఆర్డినాన్స్ అమెరికా అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ను ఖరారు చేసింది. 7 జనవరి 1789 నాటికి ఎలెక్టోరల్ కాలేజీ ని ఎన్నుకోవాలి. వీరు 4 మార్చ్ 1789 నాటికి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించిన వాషింగ్టన్‌ను 1789 నుంచి 1797 వరకు రెండు సార్లు ఏకగ్రీవంగా అమెరికా అధ్యక్షుడిగా ఎలెక్టోరల్ కాలేజీ ఎన్నుకున్నది. అమెరికా చరిత్రలో రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన అధ్యక్షుడు ఆయన ఒక్కరే. కొత్తగా ఏర్పడిన ఒక స్వతంత్ర్య దేశాన్ని నిలబెట్టడానికి వాషింగ్టన్ చేసిన కృషి చెప్పుకోదగినది.

ఆ తర్వాత అధ్యక్షులుగా ఎన్నికైన ఆయన సహచర విప్లవకారులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ లు ఆయన వారసత్వాన్ని సమున్నతంగా కొనసాగించినారు. ‘Rules of Civility and Decent Behavior in Company and Conversation’ అన్న శీర్షికతో వాషింగ్టన్ రాసిన పుస్తకం అమెరికాలో చాలా ప్రజాదరణ పొందింది. వాషింగ్టన్ డి.సి. పేరుతో అమెరికా ఫెడరల్ రాజధాని నగరం ఏర్పడింది. ఆయన పేరు మీద ఒక రాష్ట్రం కూడా ఉంది. యూనివర్సిటీ ఏర్పడింది. అమెరికా వ్యాప్తంగా వందలాది విగ్రహాలు ఏర్పాటు అయినాయి. సామాన్యుడి చేతుల్లో ఉండే ఒక డాలర్ నోటుపై, పోస్టల్ స్టాంపులపై వాషింగ్టన్ బొమ్మ ఉంటుంది.

జాన్ ఆడమ్స్
జాన్ క్విన్సీ ఆడమ్స్

అమెరికా రెండవ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఈయన వాషింగ్టన్ కాలంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. 1797 నుంచి 1801 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈయన కుమారుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ అమెరికా ఆరవ అధ్యక్షుడిగా (1825 – 29) ఎన్నికయ్యాడు. అమెరికా చరిత్రలో తండ్రి కొడుకులు అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆడమ్స్ అయితే రెండోది జార్జ్ బుష్‌లు.

జార్జ్ బుష్ సీనియర్
జార్జ్ బుష్ జూనియర్

జార్జ్ బుష్ సీనియర్ 1989-93 వరకు 41 వ అధ్యక్షుడిగా, ఆయన కుమారుడు జార్జ్ బుష్ జూనియర్ 2001-2009 వరకు రెండు సార్లు అమెరికా 43 వ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇక జాన్ ఆడమ్స్ అమెరికా అధికార నివాసం వైట్ హౌజ్‌లో నివసించిన మొదటి అధ్యక్షుడు. అప్పటికి వైట్ హౌజ్ నిర్మాణం పూర్తి కాకపోయినా ఆడమ్స్ వైట్ హౌజ్‌లో నివాసం ఉన్నాడు. ఈయన అమెరికా 50వ స్వాతంత్రియ దినం 4 జూలై 1826 న చనిపోయినాడు. ఇదే రోజు అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ కూడా కన్ను మూశాడు. అమెరికా స్వాతంత్ర్య దినం నాడు చనిపోయిన అమెరికా అధ్యక్షులు వీరిద్దరూ కావడం ఒక విశేషం. వీరిద్దరూ స్వాతంత్ర్య సమర యోధులు కూడా.

థామస్ జెఫర్సన్

అమెరికా మూడవ అధ్యక్షుడిగా రెండు సార్లు (1801-1809) ఎన్నికైన స్వాతంత్ర్య సమర యోధుడు థామస్ జెఫర్సన్. ఈయన గొప్ప రచయితగా కూడా ప్రసిద్ధుడు. అమెరికా ప్రజలు ఒక చారిత్రిక సంపత్తిగా భావిస్తున్నDeclaration of Independence రాసింది జెఫర్సనే. ఈయన హయాంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం రెండింతలు పెరిగింది.

జేమ్స్ మాడిసన్

అమెరికా నాల్గవ అధ్యక్షుడిగా జేమ్స్ మాడిసన్ రెండు సార్లు (1809-1817) ఎన్నిక అయినాడు. ఈయన హయాంలో అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే మాడిసన్‌ను అమెరికా రాజ్యాంగ పిత (Father of the Constitution) గా భావిస్తారు. ఈయన హయాంలోనే Bill of Rights కూడా అమల్లోకి వచ్చింది. మాడిసన్ తాను రూపొందించిన రాజ్యాంగంలో ఆయన రాసిన “All men are born equal” అనే మాటలు ప్రసిద్దమైనాయి. అయితే గమ్మత్తు ఏమిటంటే.. ఈ గొప్ప మాటలు రాసిన, బానిసత్వాన్ని వ్యతిరేకించిన మాడిసన్ తాను స్వయంగా బానిసల యజమాని కావడం. ఈయన హయాంలో 1812లో బ్రిటిష్ వారు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి. పై దాడికి దిగినారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌ను తగుల బెట్టినారు. ఈ దాడిలో వైట్ హౌజ్ చాలా మట్టుకు ద్వంసం అయ్యింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ దాడిని తిప్పికొట్టి అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్థిరపరచడంలో మాడిసన్ విజయం సాధించాడు. అమెరికా అధ్యక్షుల్లో కెల్లా పొట్టివాడు (5 అడుగుల 4 ఇంచులు) ఈయనేనట.

జేమ్స్ మన్రో

అమెరికా 5వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో (1817-1825) రెండు సార్లు ఎన్నిక అయినాడు. ఈయన పేరు మీద మన్రో డాక్ట్రిన్ (Monroe Doctrine) ప్రసిద్దమైనది. అమెరికా పై ఏ దేశమైనా, ఏ విదేశీ శక్తులైనా దాడి చేసినా ఈ డాక్ట్రిన్ అ దేశంపై, ఆ శక్తులపై ప్రతీకార చర్య తీసుకోవడానికి అనుమతిస్తుంది. బ్రిటిష్ వారి దాడి అనంతరం దేశాన్ని విదేశీ దాడుల నుంచి రక్షించుకోవడానికి ఈ రకమైన డాక్ట్రిన్‌ను మన్రో ప్రవేశ పెట్టి ఉంటాడు. ఈ మన్రో డాక్ట్రిన్ ఆధారంగా అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల మీద దాడి చేసిందో!

అబ్రాహామ్ లింకన్

అమెరికా అధ్యక్షుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాడు 16వ అధ్యక్షుడిగా(1861-1865) ఎన్నికైన అబ్రాహామ్ లింకన్. మొదటి నాలుగేళ్ళు ఆయన అమెరికా అంతర్యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని అమెరికా సంయుక్త రాష్ట్రాల ఐక్యతను కాపాడడంలో సఫలం అయినాడు. అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేస్తూ ”Emancipation Declaration” పేరుతో చట్టం చేశాడు. బానిసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు దాన్ని రద్దు చేయడానికి చట్టాన్ని తీసుకురావడం అమెరికా చరిత్రలో లింకన్ తీసుకుకున్న విప్లవాత్మకమైన చర్య. “బానిసత్వం తప్పు కాకపోతే మరేది తప్పు కాదు” అని లింకన్ అన్నాడు. ఆయన కంటే ముందు అధ్యక్ష పదవి నిర్వహించిన జేమ్స్ బుచానన్ హయాంలోనే అమెరికా 7 దక్షిణ రాష్ట్రాలు బానిసత్వ రద్దుకు వ్యతిరేకంగా సమాఖ్య నుంచి వేరుపడి కొత్త సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధం ప్రభలింది. లింకన్‌కు ఈ అంతర్యుద్ధం వారసత్వంగా రావడంతో ఆ సంక్షోభాన్ని ధైర్య సాహాసాలతో ఎదుర్కొన్నాడు. దక్షిణ రాష్ట్రాల సమాఖ్య సైన్యాలను ఓడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల ఐక్యతని ఖాయం చేశాడు. ఈ అంతర్యుద్ధం నేపథ్యంగానే మార్గరెట్ మిచిల్ నవల “Gone With the Wind” వచ్చింది. అమెరికా నవలా సాహిత్యంలో ఇప్పటికీ ఈ నవల ఒక క్లాసిక్ గా నిలచిపోయింది. ఆ తర్వాత ఇదే పేరుతో తీసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా హాలీవుడ్‌లో నిలచిపోయింది. 11 ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకున్నది. ఈ నవలను దివంగత రచయిత రమణారెడ్డి “చివరకు మిగిలింది” పేరుతో అనువాదం చేశారు. లింకన్ సమకాలికుడు, బానిసత్వ రద్దు ఉద్యమ నల్ల జాతి నాయకుడు ఫ్రెడెరిక్ డగ్లస్ సలహాలను లింకన్ ఉపేక్షించేవాడు కాదట. ఒక నల్ల జాతి నాయకుడిని వైట్ హౌజ్‌లో భేటీ అయిన మొదటి అధ్యక్షుడు లింకన్. డగ్లస్ సలహా మేరకు అంతర్యుద్ధంలో ఉత్తరాది సైన్యంలో లక్షలాది మంది నల్ల జాతి వారిని సైనికులుగా నియమించాడు. వారికి తెల్ల వారితో సమానంగా జీత భత్యాలు ఇవ్వడానికి నిర్ణయించాడు. ఈ అంతర్ యుద్ధంలో వేలాది మంది నల్ల జాతి సైనికులు వీరోచిత పోరాటం చేసి ప్రాణ త్యాగం చేశారు. ఈ చర్యలు ఉత్తరాది సైన్యాలు విజయం సాధించడానికి దోహదం చేశాయి. లింకన్ 1865 లో రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే తెల్ల జాత్యాహంకారులు ఆయనను ఒక థియేటర్ లో నాటకం చూస్తున్న సమయంలో హత్య చేసినారు. హత్యకు గురి అయిన మొదటి అమెరికా అధ్యక్షుడు లింకనే.

జాన్ ఎఫ్ కెన్నెడీ

ఆ తర్వాత 43 ఏండ్ల అతి పిన్న వయసులో అమెరికా 35వ అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ ఎఫ్ కెన్నెడీ కూడా తన నాలుగేళ్ల పదవీ కాలం మిగియక ముందే 1963లో హత్యకు గురి అయినాడు. అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి.సి. లో అద్భుతమైన లింకన్ స్మారకం నిర్మాణం చేశారు. ఆ విగ్రహం సరిగ్గా అమెరికా కాపిటల్ భవనం ఎదురుగా ఉంటుంది. “మిమ్ములను గమనిస్తున్నాను జాగ్రత్త” అని అమెరికా పాలకులను హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది లింకన్ విగ్రహం.

లింకన్ స్మారకం
లింకన్ విగ్రహం
గ్రోవర్ క్లీవ్ ల్యాండ్

గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ మొదటి సారి 1885-89 కాలానికి అమెరికా 22వ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వైట్ హౌజ్ లో పెళ్లి చేసుకున్న మొదటి అధ్యక్షుడిగా రికార్డుల కెక్కాడు. ఈయనే 1886 లో న్యూయార్క్ సముద్ర తీరంలో ఒక చిన్న ద్వీపంలో ఫ్రాన్స్ ప్రభుత్వం బహుకరించిన Statue of Liberty ని ఆవిష్కరించాడు. మొదటి నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయిన తర్వాత రెండవసారి ఎన్నికకు పోటీ చేసి ఓడిపోయాడు. వైట్ హౌజ్ వదిలి వెళ్లిపోయున్నప్పుడు క్లీవ్ ల్యాండ్ భార్య వైట్ హౌజ్ ఉద్యోగులతో “వైట్ హౌజ్ భవనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మేము మళ్ళీ వైట్ హౌజ్‌కు వస్తాము” అన్నదట. అన్నట్టుగానే 1893లో 24వ అధ్యక్షుడుగా ఎన్నికై తిరిగి వైట్ హౌజ్ లోకి అడుగు పెట్టాడు. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత తిరిగి రెండవ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక అధ్యక్షుడు క్లీవ్ ల్యాండ్. వెయ్యి డాలర్ల నోటుపై క్లీవ్ ల్యాండ్ బొమ్మను ముద్రిస్తున్నది అమెరికా ప్రభుత్వం.

థియోడోర్ రూస్వెల్ట్.

అమెరికా అధ్యక్షుల్లో తొలిసారి నోబెల్ శాంతి బహుమతి పొందిన వాడు థియోడోర్ రూస్వెల్ట్. 1901-1909 మధ్య కాలంలో రెండు సార్లు అమెరికా 26వ అధ్యక్షుడిగా ఎన్నికైన థియోడోర్ 1907 లో జపాన్ రష్యా మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకు నోబెల్ శాంతి బహుమతిని పొందాడు. ఆయన అమెరికా వ్యాప్తంగా సహజ సంపదను పరిరక్షించడానికి నేషనల్ పార్క్స్ సర్వీస్ సంస్థను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా వందలాది నేషనల్ పార్క్స్ ను గుర్తించారు. ఇవి ఇప్పుడు అమెరికాలో ప్రధాన పర్యాటక కేంద్రాలుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇవి దేశానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాక వైవిద్యభరితమైన వృక్ష, జంతు జాతులను, ప్రకృతి వనరులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతే అమెరికా పర్యాటకానికి ఆయువు పట్టు. ఈ అంశాన్ని గుర్తించినవాడు థియోడోర్ రూస్వెల్ట్. ఈయన ఆనంతరం నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వుడ్రో విల్సన్ (1919), జిమ్మీ కార్టర్ (2002), బరాక్ ఒబామా (2009), వీరితో పాటు బిల్ క్లింటన్ హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పని చేసిన ఆల్బర్ట్ గోరే కూడా 2007 లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అయినాడు.

వుడ్రో విల్సన్
జిమ్మీ కార్టర్
బరాక్ ఒబామా

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అధ్యక్షుడిగా వుడ్రో విల్సన్ దేశాన్నియుద్ధానికి బయటే ఉంచాడు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు నోబెల్ పురస్కారానికి ఎంపిక అయినాడు. ఈయన కాలంలోనే 1920 లో అమెరికా మహిళలకు వోటు హక్కు లభించింది. అమెరికాకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత 145 సంవత్సరాలు మహిళలకు వోటు హక్కు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. లింకన్ కాలంలో బానిసత్వం రద్దు అయినా నల్లజాతి ఆమెరికన్లకు వోటు హక్కు 1965 లో మాత్రమే దక్కింది. All men are born Equal అని Declaration of Independence లో రాసుకున్నమాటలు 190 సంవత్సరాలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని భావించాలి.

జాన్ ఎఫ్ కెన్నెడీ పదవీ కాలంలోనే హత్యకు గురి కావడంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న లిండన్ జాన్సన్ ఆమెరికా 36 వ అధ్యక్షుడైనాడు. ఆయన 1964 సివిల్ రైట్స్ ఆక్ట్ ను తీసుకొచ్చిన తర్వాతనే నల్ల జాతి వారికి వోటు హక్కు లభించింది. వియత్నాం యుద్ధం విషయంలో జాన్సన్ ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చు కున్నప్పటికీ సివిల్ రైట్స్ ఆక్ట్ ఆయనకు అమెరికా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఈ కాలం లోనే పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ఉపన్యాసం I Have a Dream అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాన్ని మలుపు తిప్పింది.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

నల్ల జాతి వారికి వోటు హక్కు వచ్చిన 44 సంవత్సరాలకు, అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన 233 సంవత్సరాలకు ఒక నల్ల జాతి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కాగలిగినాడు. ఆయనే బరాక్ ఒబామా. అయితే ఇప్పటికీ ఒక మహిళ మాత్రం అధ్యక్షులు కాలేకపోయింది. కమలా హారిస్ అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు.

ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నది ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. ఈయన తొలిసారి 1933లో అమెరికా 32వ అధ్యక్షుడిగా ఎన్నిక అయి వరుసగా నాలుగు టర్మ్‌లు అంటే 1945 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది. ఈ అవకాశం మరెవరికీ రాదు. అమెరికా తొలి అధ్యక్ష ఎన్నికల నుంచి కూడా ఒక వ్యక్తి వరుసగా రెండు సార్లు మాత్రమే పోటీ చేయాలన్న సాంప్రదాయం ఉండేది. పార్టీలు కూడా మూడో సారి అదే వ్యక్తిని అధ్యక్ష పదవికి నామినేట్ చేసేవి కావు. అయితే రూస్వెల్ట్ కాలం ఆమెరికాకు సంక్షుభిత కాలం. మొదటి రెండు పదవీ కాలంలో అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నది. ఈ ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి రూస్వెల్ట్ తీవ్రంగా శ్రమించాడు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముంచుకు వచ్చింది. అమెరికా ప్రజలు మూడోసారి రూస్వెల్ట్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అమెరికా రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధన లేకపోవడం చేత పార్టీ ఆయనను అధ్యక్ష పదవికి మూడోసారి నామినేట్ చేసింది. అదే వెసులుబాటు ఆధారంగా పార్టీ నాలుగోసారి కూడా నామినేట్ చేయడం, ప్రజలు ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిపోయింది. ఇది ఒక రికార్డు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్ది కాలానికే నాలుగో టర్మ్ పూర్తి కాకుండానే 1945లో రూస్వెల్ట్ చనిపోయారు.

హ్యార్రి ట్రూమన్

ఉపాధ్యక్షుడిగా ఉన్న హ్యార్రి ట్రూమన్ అమెరికా 33 వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. రూస్వెల్ట్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత ఒక వ్యక్తి వరుసగా రెండు సార్లు మాత్రమే ఎన్నిక అయ్యేలాగా రాజ్యాంగ సవరణ చేసినారు. పార్టీలు కూడా ఒక వ్యక్తిని మూడవసారి అధ్యక్ష పదవికి నామినేట్ చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. అట్లా రూస్వెల్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. రూస్వెల్ట్ పోలియో బాదితుడు. వీల్ చైర్ మీదనే కూర్చొని అధ్యక్ష బాద్యతలు 13 సంవత్సరాలు నిర్వహించాడు.

రిచర్డ్ నిక్సన్

రిచర్డ్ నిక్సన్ 1969-74 మధ్యకాలంలో అమెరికా 37 వ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేశాడు. రెండవ సారి పదవిలో ఉండగానే రాజీనామా చేసిన మొదటి అధ్యక్షుడు నిక్సన్. రాజీనామా చేయక పోతే ఆయన ఆవిశ్వాసాన్ని ఎదుర్కొని ఉండేవాడు. అటువంటి అవమానకరమైన పదవీ గండాన్ని ఎదుర్కొనే బదులు రాజీనామాకు సిద్దపడినాడు.

జెరాల్డ్ ఫోర్డ్

నిక్సన్ రాజీనామా తర్వాత ఉపాధ్యక్షుడు గా ఉన్న జెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించాడు. ఈయనది కూడా ఒక విశేషమైన రికార్డ్. ఫోర్డ్ ఉపాధ్యక్ష పదవికి గాని, అధ్యక్ష పదవికి గాని నేరుగా ఎన్నికైన వ్యక్తి కాదు. నిక్సన్ రెండవ అధ్యక్ష కాలంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న స్పైరో అగ్న్యూ చనిపోవడంతో ఫోర్డ్ ఉపాధ్యక్షుడిగా నామినేట్ అయినాడు. నిక్సన్ రాజీనామాతో అధ్యక్షుడైనాడు. ఇటువంటి అదృష్టం మరెవరిని వరించలేదు. ఫోర్డ్ అమెరికా 38 వ అధ్యక్షుడిగా (1974-1977) మూడేళ్లు పదవిలో ఉన్నాడు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 20 జూలై 1969 న చంద్రుని మీద అడుగు పెట్టింది నిక్సన్ హయాం లోనే.

భారత దేశాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షులు 7 గురు. భారతదేశం సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ (1959). ఈయన తర్వాత భారత్ ను సందర్శించిన అమెరికా అధ్యక్షులు: రిచర్డ్ నిక్సన్ (1969), జిమ్మీ కార్టర్ (1978), బిల్ క్లింటన్(2000), జార్జ్ బుష్ జూనియర్ (2006), బరాక్ ఒబామా (2010, 2015), డొనాల్డ్ ట్రంప్ (2021)

ఇవి అమెరికా అధ్యక్షుల విశేషాలు కొన్ని. వచ్చే వారం అమెరికా రాష్ట్రాల విశేషాలు రాస్తాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here