అమెరికా ముచ్చట్లు-17

0
9

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెజాన్ అలెక్సా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్

[dropcap]రెం[/dropcap]డవసారి అమెరికా వెళ్ళినప్పుడు జూన్, 2022లో వాషింగ్టన్ రాష్ట్రంలో కొలంబియా నదిపై నిర్మించిన గ్రాండ్ కూలి డ్యాంను మా సీనియర్ ఇంజనీర్ మిత్రుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ కొండపల్లి వేణుగోపాలరావు గారితో కలిసి సందర్శించాను. ఆ విశేషాలన్నీ అమెరికా ముచ్చట్లు 9వ భాగంలో వివరంగా రాసి ఉన్నాను. మూడు రోజులు సియాటిల్ నగరంలో వారి అబ్బాయి భార్గవ ఇంట్లోనే ఉన్నాము. వారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక గమ్మత్తయిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్‌ని వినియోగిస్తున్న పరికరాన్ని చూశాను. అది మన మాటల ద్వారా ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా మన పనులు చేసి పెడుతుంది. భార్గవ పిల్లలకు RRR చిత్రంలో “కొమ్మా ఉయ్యాల” పాట చాలా ఇష్టం. ఏదైనా మంచి బీట్ ఉన్న పాత మీద డాన్స్ కూడా చేస్తారు. ఏ పాట కావాలన్నా మనం మాట ద్వారా ఆదేశాలు ఇస్తే చాలు. ఆ పాటను వినిపిస్తుంది. ఆ ఆప్‌ను ఆక్టివేట్ చేయడానికి పేరుతో పిలవాలి. ఆ తర్వాత మనకేం కావాలో ఆదేశించాలి. వాళ్ళు ఇంగ్లీష్ లోనే ఆదేశాలు ఇస్తున్నారు. “Alexa play komma uyyala song from RRR Telugu Movie” అనగానే వెంటనే అది ఆ పాటను వినిపించడం మొదలు పెట్టింది. అదొక చిన్న పరికరం. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. “Alexa play Ghantasala Bhagawatgita” అనగానే ఘంటసాల పాడిన భగవద్గీత శ్లోకాలు వినిపించడం మొదలు పెట్టింది. ఇట్లా ఏది కోరితే అది వినిపించింది. గ్రాండ్ కూలి డ్యాం వెళ్ళే ముందు అక్కడ వాతావరణం ఎట్లా ఉందో కూడా తెలుసున్నాము. “Alexa can you tell what is weather forecast at grand Coulee Dam Today” అని ప్రశ్న వెయ్యగానే వెంటనే “It is Sunny Day Today” అని చెప్పింది. మేము డ్యాం వద్దకు వెళ్ళినప్పుడు నిజంగానే అక్కడ అలెక్సా చెప్పినట్టు ఎండ కాస్తూ ఉన్నది. ఇదేమి ఆప్ అని వేణుగోపాలరావు అబ్బాయి భార్గవని అడిగి తెలుసుకున్నాను. ఆ అప్లికేషన్ పేరు అలెక్సా నట. దీన్ని అమెజాన్ కంపని వారు 2014లో ప్రవేశపెట్టినారని చెప్పాడు.

అమెజాన్ అలెక్సా ఆప్ పరికరం

మనం ప్రశ్న ఆడగ్గానే మన గొంతును పసిగట్టి ఆ శబ్ద తరంగాలను అక్షరాలుగా మార్చి అమెజాన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. అక్కడ మన ప్రశ్నకు సమాధానాన్ని వెతికి మళ్ళీ వినియోగదారు వద్ద ఉన్న పరికరానికి చేరవేస్తుంది. ఆ పరికరం వాటిని మళ్ళీ శబ్ద తరంగాలుగా మార్చి మాటల రూపంలో మనకు వినిపిస్తుంది. ఇదంతా కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది. ఇది AVA (Amazon Voice Service) అప్లికేషన్ అంటారట. అమెజాన్‌లో 10 వేలకు పైగా ఉద్యోగులు అలెక్సాను అభివృద్ధి చేయడానికి పని చేస్తున్నారట. ఇటువంటిదే ఆపిల్ కంపనీ వారు SIRI అనే పేరుతో ఒక ఆప్‌ను, Google Assistant పేరుతో ఒక ఆప్ గూగుల్ కంపనీ వారు, మైక్రోసాఫ్ట్ వారు మరొక ఆప్ తయారు చేసినారని చెప్పాడు. అన్నింటిలో అత్యధికంగా వినియోగదారులు ఎంచుకున్నది అమెజాన్ వారి అలెక్సానే నట. 2021 వరకు 3 కోట్ల అమెజాన్ అలెక్సా పరికరాలు అమ్ముడుపోయినాయట. అలెక్సా ఆప్ ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2022 అయిపోయేనాటికి ఆ సంఖ్య 6 కోట్లకు పెరగ వచ్చునని అమెజాన్ కంపనీ వారు అంచనా వేస్తున్నారట. ఇది అలెక్సా గురించి ఆయన చెప్పిన ప్రాథమిక సంక్షిప్త సమాచారం.

అమెజాన్ అలెక్సా ఆప్ లోగో

సియాటిల్‌లో కార్లో తిరుగుతున్నప్పుడు వేణుగోపాలరావు గారు గూగుల్ మ్యాప్ పెట్టుకునే వాడు. అమెరికాలో ఇది అత్యవసరమైన ఆప్. ఎక్కడికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకొని దారి తెలియక పోయినా హాయిగా వెళ్ళి వస్తారు. దానికి వాయిస్ ద్వారా మార్గనిర్దేశనం చేసే ఆప్ అనుసంధానమై ఉంటుంది. ఎన్ని మీటర్ల దూరంలో ఎటు తిరగాలి ఇవన్నీ గూగుల్ వాయిస్ ఆప్ మనకు చెపుతుంది. ఇక్కడ ఇండియాలో కూడా కూడా ఆ వాయిస్ ఆప్ విస్తృతంగా వాడకంలో ఉన్నది. అయితే అమెరికన్ accent లో ఇంగ్లీష్ మాటలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక వేణు తెలుగులో వాయిస్ ఆప్ ను పెట్టుకున్నాడు. ఇది గూగుల్ అసిస్టెంట్ వారి ఆప్ అన్నమాట.100 మీటర్ల దూరంలో కుడి, ఎడమ, వాయవ్య, ఆగ్నేయ.. ఇట్లా తిరగమని చెపుతుంది. కుడి ఎడమ, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వీటితో  ఇబ్బంది లేదు. కానీ వాయవ్య, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య అంటే వెంటనే అర్థం కాక ఇబ్బంది పడేవాడు. ఇంకా కొన్ని గమ్మత్తు పదాలు వినిపించేది. 10వ నిష్క్రమణ (Exit) వద్ద రహదారి నుంచి తప్పుకోండి, చీలిక వద్ద కుడి వైపుకు తిరగండి.. ఇట్లా ఉండేది తెలుగు గూగుల్ వాయిస్. కారు ప్రయాణంలో ఈ వాయిస్ పై అనేక జోకులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము.

ఆ తర్వాత కొద్ది రోజులకు మా దగ్గరి బంధువు, చెల్లె వరుస అయిన వినయను కలువడానికి టెక్సాస్ రాష్ట్ర రాజధాని నగరం ఆస్టిన్‌కు వెళ్ళాము. అక్కడ మూడు రోజులు వినయ వాళ్ళింట్లోనే ఉన్నాము. వారి ఇంట్లో కూడా అలెక్సా ఉండడం గమనించాను. హాల్లో ఉన్నప్పుడు వినయ భర్త శేఖర్ “Alexa put on the lights” అని ఆదేశాలు ఇవ్వగానే ఓకే అంటూ లైట్లను ఆన్ చేసింది. ఈ ఆప్ వారికి చాలా పనులు చేసి పెడుతుందట. లైట్లు వేయడం, ఆర్పడం, ఫ్యాన్ వేయడం, బంద్ చేయడం, టీవి ఆయన చేయడం, మనకు కావలసిన చానల్‌ను పెట్టడం, ఓవెన్ ఆన్ చేయడం, మళ్ళీ బంద్ చేయడం, వాతావరణ సమాచారం, ట్రాఫిక్ సమాచారం, ఇంటికి వద్దకు ఎవరైనా వచ్చినా అలర్ట్ చేయడం, ఫుడ్ ఆర్డర్స్ పెట్టడం, 15 రకాల స్పోర్ట్స్ సమాచారం ఇవ్వడం (ఇందులో మన IPL క్రికెట్ మ్యాచ్‌ల సమాచారం కూడా దొరుకుతుందట), వార్తల విశేషాలు చెప్పడం, అలారం సెట్ చేయడం,.. ఇట్లా ఎన్నో పనులు చేసి పెడుతుందట. డబ్బు చెల్లించడం కూడా ఈ అలెక్సా అప్ ద్వారా చేసుకోవచ్చట. ఇదెక్కడి విచిత్రంరో అనుకున్నాను. ఇండియా వచ్చిన తర్వాత అమెరికా ముచ్చట్లు రాసే పని పెట్టుకున్నప్పుడు అలెక్సా గురించి కూడా రాయాలని అనుకున్నాను. అందులో భాగంగా అలెక్సాఆప్ గురించి మరికొంత సమాచారం సేకరించాను.

సిలిండర్ ఆకారంలో ఉన్న అలెక్సా ఆప్ పరికరం

అమెజాన్ కంపనీ వారు మొదటగా ఈ AVS ఆప్‌ను నవంబర్ 2014లో అమెరికాలో ప్రవేశ పెట్టారు. ఇంగ్లీష్‌లో ప్రారంభం అయిన ఈ ఆప్ తర్వాత కాలంలో ఫ్రెంచ్, జర్మన్, జపాని, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్, హిందీ, అరబిక్ బాషలలో అందుబాటులోకి తెచ్చారు. ఇండియాలో 2017లో విడుదల చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్ గొంతును కూడా అలెక్సా ఆప్‌లో వాడుకుంటున్నారట. ఇండియాలో నాకు ఇటువంటి ఆప్‌లు ఎక్కడా కనపడలేదు. ఇండియా సహా అలెక్సా ఆప్ ఇప్పుడు 43 దేశాలలో అందుబాటులోకి వచ్చిందట. అలెక్సా ఆప్ ద్వారా  90 వేల రకాల పనులు (Functions) చేసుకునే వెసులుబాటు ఉందట. అలెక్సా ద్వారా Dominos, Grubhub, Pizza Hut, Star Bucks, Wings Top, McDonald తదితర ఫేమస్ ఫుడ్ బ్రాండ్స్ నుండి తిండి పదార్థాలు ఆర్డర్ పెట్టవచ్చునట. ఊబర్, ఓలా క్యాబ్ లను బుక్ చేసుకోవచ్చునట, ఏ బాషలో నైనా సంగీతం వినవచ్చునట, ఆడియో బుక్స్ చదివించు కోవచ్చునట, ఇంట్లో అనేకమైన స్మార్ట్ పరికరాలను ఈ ఆప్‌తో అనుసంధానం చేసుకొని వాటిని ఆటోమేషన్ చేసుకోవచ్చునట, పిల్లలు, పెద్దలు, ముసలి వారు, వివిధ accents లో మాట్లాడే భాషలను ఈ ఆప్ అర్థం చేసుకొని ఆదేశాలను అమలు పరుస్తుందట. అమెజాన్, ఆపిల్, గూగుల్ వేరు వేరుగా వాయిస్ మీద ఆధారపడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్ లను తయారు చేసుకున్నా ఒకరి సహకారం మరొకరు పొందడానికి, సమాచారాన్ని వినియోగించుకోవడానికి  వీలుగా వారి మధ్య ఒక సహకార ఒప్పందం కూడా కుదిరిందట. అలెక్సా ద్వారా వాయిస్ మెసేజ్‌లు, రాత పూర్వక మెసేజ్‌లు పంపడానికి వీలవుతుంది. కానీ ఫోటోలు, వీడియోలు పంపడానికి మాత్రం వీలు కాదు. ఎందుకంటే ఇది ప్రాథమికంగా వాయిస్ గుర్తించే ఆప్ మాత్రమే.

ఇటువంటిదే 2019లో మా బిడ్డ కార్లో SIRI అనే ఆప్‌ను వాడగా చూశాను. అప్పుడు దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేదు. సిరి అంటే ఆ వాయిస్ వినిపించే అమ్మాయి పేరు అనుకున్నాను. వాళ్ళు రక రకాల ప్రశ్నలు వేసేవారు. అన్నిటికీ ఓపికగా జవాబులు ఇచ్చేది. కొంటె పొరలు సిరితో “Siri will you come for dinner with me” అనో, “Siri will you marry me “ అని అడిగితే చాలా ఓపికగా “no Sorry” అని చెప్పేది. అయితే అలెక్సా ఆప్‌ను అధ్యయనం చేసేటప్పుడు సిరి గురించి కూడా కొంత తెలుసుకున్నాను. ఆపిల్ కంపనీ వారు తయారు చేసిన వాయిస్ రికగ్నిషన్ ఆప్ అన్నికంపనీల కంటే ముందే 2011లో విడుదల అయ్యింది. SIRI అంటే “Speech Interpretation and Recognition Interface”. దాన్నే చిన్నగా సిరి అని పిలుస్తున్నారు. సిరి తర్వాత 2014లో అమెజాన్ వారు అలెక్సాను, 2016లో గూగుల్ వారు Google Assistant ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ Voice Recognition Applications యొక్క వ్యాపారం 2023 నాటికి 18 బిలియన్ డాలర్లు ఉండబోతున్నదట. ఏటా 23 శాతం వృద్ది రేటు నమోదు అవుతున్నదట.

అలెక్సాతో మాట్లాడుతున్న తల్లీ బిడ్డలు

మన మాట ద్వారా ఇచ్చే ఆదేశాలకే ఇన్ని పనులు జరిగిపోతుంటే ఇక మానవ శ్రమకు అవకాశం ఎక్కడ! రాబోయే కాలంలో మానవులు చేసే ప్రతీ పనిని ఇక ఈ ఆప్‌లు, రోబోట్లు చేసి పెడతాయట. మరి భూమి మీద జనాభా అంతా అప్పుడు ఏ పని చేస్తారు? అన్నది ఇప్పుడు జవాబు లేని ప్రశ్న. డాలస్‌లో మా బిడ్డ స్నేహితురాలి ఇంట్లో ఒక మెషీన్‌ని చూశాను. వాళ్ళు ఇల్లు ఊడవడానికి చీపురు వాడడం లేదు. మూలన ఇల్లు ఊడ్చే ఒక మెషీన్ ఉంది. దానికి గదుల సైజును ఒకసారి రికార్డు చేసే పెడితే అదే తాను ఉన్న జాగా నుంచి బయలుదేరి ఇల్లంతా ఊడ్చి తిరిగి తన జాగాలో వెళ్ళి కూర్చుంటుంది. “నేల నాకి మూల కూర్చుంటుంది ఏమిటది?” అన్న పొడుపు కథను అమెరికాలో ఈ తరం పిల్లలను అడిగితే “స్వీపింగ్ మెషీన్” అని చెపుతారు తప్ప చీపురు అని చెప్పరు. అదీ ఆమెరికాలో పరిస్థితి. అమెరికాలో శారీరక శ్రమ చాలా మట్టుకు తగ్గిపోయింది. అందుకే అక్కడ ఊబకాయులు పెరిగిపోతున్నారు. అలెక్సా, సిరి లాంటి ఆప్‌లు మనకు ఉపయోగపడుతున్నామానవ శ్రమను తగ్గించే ఒక విపరిణామం కూడా తలెత్తనున్నదని అనిపించింది. అమెరికాలో చాలా ఇళ్ళలో అలెక్సా లేదా సిరి ఆప్‌లు వినియోగంలో ఉన్నాయి.

అలెక్సా ఆప్ వినియోగాన్ని చూసి ముచ్చట పడిన నాకు అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మా పెద్ద బిడ్డ స్నేహితుడు, వాళ్ళందరికీ పెద్దన్న లాంటి వాడు రామన్న అలెక్సా పరికరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు.

రామన్న బహుకరించిన అలెక్సా పరికరం

అలెక్సా ఇండియా అయితే వచ్చింది కానీ దాన్ని వినియోగించాలంటే పిల్లలు రావాలి. అప్పటిదాకా అలెక్సా నిద్రాణ స్థితిలో ఉండక తప్పదు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here