అమెరికా ముచ్చట్లు-20

0
10

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి చరిత్ర పూర్వ పరాలు:

[dropcap]అ[/dropcap]మెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి (Washington DC). వాషింగ్టన్ డి సి పర్యటనకు జూలై 16 న సాయంత్రం డాలస్ నుంచి విమానంలో బయలుదేరాము. డాలస్ నుంచి వాషింగ్టన్ డి సి సుమారు నాలుగు గంటల ప్రయాణం. సాయంత్రం 4 గంటలకు విమానం ఎక్కితే వాషింగ్టన్ బాల్టిమోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (WBI) రాత్రి 8 గంటలకు దిగాము. విమానాశ్రయంలో ఎయిర్పోర్టు వారు ఏర్పాటు చేసిన బస్సులో కార్లు అద్దెకు ఇచ్చే టర్మినస్‌కు ఉచితంగా తీసుకు వెళ్లారు. అక్కడ కారు మూడు రోజుల కోసం అద్దెకు తీసుకొని బాల్టిమోర్‌లో మేము ముందుగా బుక్ చేసుకున్నహోటల్‌కి బయలు దేరాము.15 నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్నాము. డాలస్ నుంచి తెచ్చుకున్న రొట్టెలు, పళ్ళు తినేసి నిద్రకు ఉపక్రమించాము. రెండు రోజుల పర్యటనలో ఏమి చూడాలి అన్నది మొదటే అనుకొని ఉన్నాము.

గతంలో ఒకసారి మా పెద్దమ్మాయి అంజలి అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి కి వచ్చి ఉన్న కారణంగా ఆమెకు ఇక్కడ పర్యాటక స్థలాల గురించి బాగానే తెలుసు. వాషింగ్టన్ డి సి ప్రాంతంలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా డౌన్టౌన్‌లో నేషనల్ మాల్ పరిసరాల్లో ఉన్న వాటిని ఎంచుకున్నాము. వాషింగ్టన్ మాన్యుమెంట్, రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల స్మారకం, లింకన్ మెమోరియల్, ఫెడరల్ క్యాపిటల్ భవనం, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఎంపిక చేసుకున్నాము. ఆ తర్వాత సమయం ఉంటే మరికొన్ని చూడాలని అనుకున్నాము. పర్యాటక విశేషాల గురించి రాసే ముందు వాషింగ్టన్ డి సి చరిత్ర, పూర్వపరాలను కొంత వివరించాలని ఉంది.

వాషింగ్టన్ మాన్యుమెంట్

వాషింగ్టన్ డి సి:

ఈ నగరాన్ని అమెరికా ప్రథమ అధ్యక్షుడు, అమెరికా స్వాతంత్ర్య సమరయోధుడు జార్జ్ వాషింగ్టన్ పేరు మీద ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ నగరం, ఆ చుట్టూ పక్కల ప్రాంతాలను కలిపి డి సి అంటారు. అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. రోమన్ న్యాయ దేవత పేరే కొలంబియా. అమెరికా ప్రజానీకానికి న్యాయబద్దమైన, చట్టబద్దమైన పాలన అందిస్తాము అన్నదానికి సంకేతంగా ఈ రాజధాని ప్రాంతాన్నిడిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని నామకరణం చేశారు. వాషింగ్టన్ డి సి విస్తీర్ణం 177 చదరపు కిలోమీటర్లు. 2020 గణన ప్రకారం వాషింగ్టన్ డి సి జనాభా సుమారు 7 లక్షలు. ఇందులో తెల్లవారు 39.60%, ఆఫ్రో అమెరికన్ నల్లజాతి వారు 41.40%, లాటిన్ అమెరికా జాతీయులు 11.30%, లాటిన్ అమెరికాకు చెందని తెల్ల వారు 38%, ఆసియన్లు 4.80% ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాషింగ్టన్ డి సి ప్రాంతం మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల మధ్య పోటోమ్యాక్ నది తీరాన అమెరికా తూర్పు ప్రాంతంలో ఉంటుంది. వాషింగ్టన్ డి సి అమెరికాలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే నగరాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఏటా దాదాపు 2 కోట్ల మంది ఈ నగరాన్ని సందర్శిస్తారని ఒక అంచనా. అయితే వాషింగ్టన్ డి సి ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగం కాని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. వాషింగ్టన్ డి సి పై సంపూర్ణ అజమాయిషీ, అధికారం అమెరికా చట్ట సభ కాంగ్రెస్‌కే ఉంటుంది.

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్

వాషింగ్టన్ నగరం ఏర్పాటు:

వాషింగ్టన్ నగరానికి 1791లో పునాది పడింది. అమెరికా కాంగ్రెస్ మొదటి సమావేశాలు 1800 సంవత్సరంలో వాషింగ్టన్ నగరంలో జరిగినాయి. దీనికి ముందు పోటోమ్యాక్ నది ఒడ్డున జాతీయ రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయడం కోసం 1790 లో రెసిడెన్స్ ఆక్ట్ పేరుతో అమెరికా కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాత 1801 లో మరో చట్టం ద్వారా మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల నుంచి కొన్ని భూభాగాలను సేకరించి నగర విస్తీర్ణాన్ని పెంచి దానికి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాగా నామకరణం చేశారు. 1814 లో బ్రిటిష్ వారు వాషింగ్టన్ నగరం పై దాడికి పాల్పడి అమెరికా క్యాపిటల్, అమెరికా ట్రెజరీ భవనాలను, అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లను తగుల బెట్టారట. క్యాపిటల్ భవనం ఇంకా నిర్మాణంలోనే ఉన్నది. వైట్ హౌజ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. బ్రిటిష్ వారి దాడితో ఈ భవనాలు చాలా భాగం తగులబడిపోయినాయి. మొత్తం మీద బ్రిటిష్ దాడి రాజధాని నగరానికి కొంత నష్టం కలుగ జేసినప్పటికి అమెరికా ఫెడరల్ వ్యవస్థను నాశనం చేయలేకపోయింది. 1846లో వాషింగ్టన్ నగరాన్ని అధికారికంగా అమెరికా ఫెడరల్ రాజధానిగా ప్రకటించినారు.

వార్ మెమోరియల్

వాషింగ్టన్ పేరు మీద అమెరికా ఉత్తర పశ్చిమ ప్రాంతంలో ఒక రాష్ట్రం ఉన్నది కాబట్టి ఫెడరల్ రాజధాని అని అర్థం కావడానికి తప్పనిసరిగా డి సి అనే పదాన్ని చేర్చుతారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి సంబందించి ప్రధాన అంగాలైన చట్ట సభ కాంగ్రెస్, కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రతినిధి అయిన అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోనే ఉన్నాయి. ఇవి గాక వాషింగ్టన్ డిసిలో అనేక జాతీయ మాన్యుమెంట్స్, మ్యూజియంలు, కీలక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.

177 దేశాల రాయబార కార్యాలయాలు, అనేక అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ, అమెరికా రెడ్ క్రాస్ తదితర సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 1973 లో అమెరికా కాంగ్రెస్ హోమ్ రూల్ చట్టాన్ని ఆమోదించి వాషింగ్టన్ డి సి కి ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎన్నుకోబడిన ఒక మేయర్, 13 మంది కౌన్సిల్ సభ్యులు వాషింగ్టన్ డి సి రోజువారీ పౌర పరిపాలనా వ్యవహారాలు చూస్తారు. అయితే ఈ ప్రాంతంపై సంపూర్ణ అధికారం మాత్రం అమెరికా కాంగ్రెస్‌దే. కౌన్సిల్ చేసిన చట్టాలను మార్పు చేసే లేదా రద్దు చేసే అధికారం కాంగ్రెస్‌కు ఉంటుంది. అయితే డి సి వారు అమెరికా కాంగ్రెస్ కు సభ్యుడిని ఎన్నుకోలేరు. కానీ ప్రతినిధుల సభకు మాత్రం డి సి నుంచి ఒక సభ్యుడిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించారు. 1961లో అమెరికా రాజ్యాంగానికి సవరణ చేసి అధ్యక్షుడిని ఎన్నుకునే సభ్యులు (Presidential Electors) ముగ్గురిని డి సి నుంచి ఎలెక్టోరల్ కాలేజీకి ఎన్నుకోవడానికి అవకాశం కల్పించారు.

క్యాపిటల్ బిల్డింగ్

అబ్రాహం లింకన్ అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలు విడిపోయి కొత్త ఫెడరేషన్‌ను స్థాపించుకున్నాయి. 1861 అమెరికా అంతర్యుద్ధం బద్దలైనప్పుడు ఉత్తరాది సైన్యాలకు దక్షిణాది సైన్యాలకు భీకర యుద్ధం జరిగినది. చివరికి లింకన్ సమర్థ నాయకత్వం ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల సైన్యాలు విజయం సాధించినాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరేషన్ ఐక్యతను లింకన్ నిలబెట్టగలిగినాడు. 1862 లోనే డి సిలో లింకన్ బానిసత్వాన్ని రద్దు చట్టాన్ని అమలు చేసిన ఫలితంగా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నుంచి డి సి కి విముక్తి పొందిన నల్ల జాతి ప్రజల వలసలు పెరిగినాయి. 1868లో డి సి లో ఉన్న ఆఫ్రో అమెరికన్ నల్ల జాతి ప్రజలకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పిస్తూ కాంగ్రెస్ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అమెరికాలో నల్ల జాతి ప్రజలకు లభించిన తొలి ఓటు హక్కు ఇదే కావడం విశేషం.

జెఫర్సన్ మెమోరియల్

1968 ఏప్రిల్ 4న నల్ల జాతి హక్కుల ఉద్యమ నాయకుడు డా. మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) ని తెల్ల జాత్యాహంకారులు హత్య చేసినప్పుడు వాషింగ్టన్ డి సి అట్టుడికి పోయింది. డి సి లో నివసిస్తున్న నల్ల జాతి ప్రజలు నగరంపై విరుచుకు పడ్డారు. అల్లర్లు చెలరేగినాయి. తెల్లజాతి ప్రజల ఇండ్లు, షాపుల లూటీ జరిగింది. మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లను అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 13 వేల మంది సైనికులను దింపవలసి వచ్చింది. ఈ అల్లర్లలో జరిగిన నష్టాన్ని, కాలిపోయిన, కూలిపోయిన భవనాలను పునరుద్దరించడానికి రెండు దశాబ్దాల కాలం పట్టిందంటే అల్లర్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నేషనల్ మాల్:

వాషింగ్టన్ డి సి లో లింకన్ మెమోరియల్, క్యాపిటల్ బిల్డింగ్‌కు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని నేషనల్ మాల్ అంటారు. ఈ ప్రాంతంలో వాషింగ్టన్ మాన్యుమెంట్, రెండవ ప్రపంచ యుద్ధ స్మారకం, లింకన్ మెమోరియల్, ఫెడరల్ క్యాపిటల్, వైట్ హౌజ్, జెఫర్సన్ మెమోరియల్ లాంటి అనేక కీలక పర్యాటక స్థలాలు ఉన్నాయి. జెఫర్సన్ మెమోరియల్ భవనంలోనే ప్రపంచం లోనే రెండవ అతి పెద్ద గ్రంథాలయంగా పేరు గాంచిన అమెరికా కాంగ్రెస్ లైబ్రరీ ఉన్నది. ఈ గ్రంథాలయంలో 16.70 కోట్ల పుస్తకాలు ఉన్నాయట. ఇవన్నీ క్యాటలాగ్ చేయబడిన పుస్తకాలు. కంప్యూటర్‌లో పుస్తకం పేరు కొడితే క్షణాల్లో ఆ పుస్తకం ఎక్కడ ఉన్నదో చెప్పేస్తుందట. లేదా డిజిటల్ రూపంలో పుస్తకాన్ని చదవ వచ్చు. అనుమతి పొంది వాటిలో కొంత భాగాన్ని, లేదా మొత్తం పుస్తకం కాపీని పొందవచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని లిఖిత భాషల్లో ప్రచురితమైన పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయట.

లింకన్ మెమోరియల్

వాషింగ్టన్ డి సి ఆర్థికం:

అమెరికాలో అత్యంత పెద్దదైన ఆర్థిక వ్యవస్థను కలిగిన ఉన్నది. వృద్ది రేటులో కూడా మిగతా రాష్ట్రాలతో, మెట్రోపాలిటన్ నాగరాలతో పోలిస్తే ముందంజలో ఉన్నది. Gross Metropolitan Product (GMP) మిగటా మెట్రో నగరాల కంటే ఎక్కువ. వృద్ధిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నందువలన వాషింగ్టన్ డి సి లో వ్యాపార రంగంలో, సర్వీస్ రంగంలో ఉపాధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు పర్యాటకం, వినోదం, ప్రభుత్వ రంగాలలో కూడా డి సి లో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ. 2009, 2016 మధ్య కాలంలో తలసరి స్థూల జాతీయ ఆదాయంలో అమెరికా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డి సి లోనే అధికం. 2016లో అది 1,60,472 డాలర్లు ఉన్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. ఇది మూసాచుసెట్స్ రాష్ట్రం తలసరి జి డి పి కంటే మూడు రేట్లు ఎక్కువ. ఈ రాష్ట్రం అమెరికాలో అత్యధిక తలసరి జి డి పి కలిగిన రాష్ట్రాలలో రెండవ స్థానంలో ఉన్నది. 2011 నాటికి వాషింగ్టన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో నిరుద్యోగికత 6.2 శాతం ఉండేదట. ఇది అమెరికాలో 49 పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాల కంటే తక్కువ. అదే సమయంలో డి సి ప్రాంతంలో నిరుద్యోగికత 9.8 శాతం ఉందట.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ భవనం

వాషింగ్టన్ డి సి లో పర్యాటక రంగం రెండవ అతి పెద్ద వ్యవస్థ. 2012 లో 18.90 మిలియన్ పర్యాటకులు వచ్చినందు వలన వాషింగ్టన్ డి సి పొందిన ఆదాయం 4.8 బిలియన్ డాలర్లు అని అంచనా వేశారు. 2019 నాటికి వాషింగ్టన్ డి సి ను సందర్శించే పర్యాటకుల సంఖ్య 24.6 మిలియన్లకు పెరిగిందట. ఇందులో 22.80 మిలియన్లు స్వదేశీ పర్యాటకులు. మిగతా వారి విదేశీ పర్యాటకులు. వీరు మొత్తం 8.15 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్టు ఒక అంచనా. పర్యాటకం వాషింగ్టన్ డి సి ఎంత పెద్ద ఆదాయ వనరుగా ఉన్నదో అర్థం అవుతుంది. ఇందుకు కారణం వాషింగ్టన్ డి సి లో అనేక చారిత్రిక మ్యూజియంలు, స్మారక కేంద్రాలు, నేషనల్ మాల్ ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. వాషింగ్టన్ డి సి కి పక్కనే ఉన్న వర్జీనియా రాష్ట్రంలో అర్లింగ్టన్ మిలటరీ శ్మశాన వాటిక కూడా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడే జాన్ ఎఫ్ కెన్నెడీ సమాధి కూడా ఉన్నది.

 

డి సి అధికార ముద్ర
డి సి జెండా

మేము 2022 జూలై 17న వాషింగ్టన్ డి సి నేషనల్ మాల్ ప్రాంతాన్ని, 18న బాల్టిమోర్ నగరాన్ని సందర్శించాము. ఆ సందర్శన వివరాలు వచ్చే వారం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here