అమెరికా ముచ్చట్లు-22

1
14

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

నల్లజాతి ప్రజల స్వేచ్ఛా ధామం బాల్టిమోర్:

వాషింగ్టన్ డి సి లో రెండవ రోజు చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ నేను బాల్టిమోర్ లోనే పర్యటించాలని నిర్ణయించాను. దానికి కారణం.. బాల్టిమోర్ నగరం అమెరికా నల్ల జాతి పౌర హక్కుల నాయకుడు, అబ్రాహామ్ లింకన్ సమకాలికుడు అయిన ఫ్రెడ్రెరిక్ డగ్లస్ జీవితంతో ముడిపడి ఉన్నది. అమెరికాకు వచ్చే ముందు ముక్తవరం పార్థసారథి గారు అనువాదం చేసిన ఫ్రెడ్రెరిక్ డగ్లస్ ఆత్మకథ ‘Narratives of the life of Frederick Douglass’ చదివి ఉన్నాను.

అందులో డగ్లస్ బాల్టిమోర్‌లో గడిపిన జీవితాన్ని బాగా వర్ణించాడు. అక్కడ బానిసత్వం రద్దు కాకపోయినా మేరీల్యాండ్ రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రాల్లో తాను అంతకు ముందు గడిపిన బానిస జీవితానికి బాల్టిమోర్‌లో గడిపిన బానిస జీవితానికి ఉన్న తేడాను ఇష్టంగా వర్ణించినాడు. బానిస గానే కొద్దిపాటి స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించిన డగ్లస్ రాయగలిగేంత చదువు నేర్చుకున్నది బాల్టిమోర్ నగరంలోనే. తన జీవిత భాగస్వామిని కలుసుకున్నది కూడా ఇక్కడే. ఆమె సహాయంతో స్వేచ్ఛాయుత ప్రపంచానికి పారిపోయింది ఇక్కడి నుంచే. అతను నల్లజాతి ప్రజల హక్కుల నాయకుడిగా ఎదగడానికి దోహదం చేసింది ఆయన బాల్టిమోర్‌లో గడిపిన జీవితమే. అందుకే డగ్లస్ తిరిగిన బాల్టిమోర్ వీధుల్లో తిరుగాడాలని అనిపించింది. డగ్లస్‌కు స్వేచ్ఛను ప్రసాదించిన బాల్టిమోర్ వాటర్ ఫ్రంట్ హార్బర్‌ను సందర్శించాలని అనిపించింది.

బాల్టిమోర్ చరిత్ర:

బాల్టిమోర్ అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన 30 నగరాల్లో ఒకటి. మేరీల్యాండ్ రాష్ట్రంలో అత్యంత పెద్ద నగరం. పాత నగరం కూడా. 2020 జనాభా లెక్కల ప్రకారం బాల్టిమోర్ నగర జనాభా 5 లక్షల 85 వేలు. 1851లో అమెరికా దేశ రాజ్యాంగం బాల్టిమోర్ నగరాన్ని స్వతంత్ర నగరంగా గుర్తించింది. మేరీల్యాండ్ రాష్ట్రానికి బాల్టిమోర్ రాజధాని అని చాలా మంది పొరబడుతారు. కానీ మేరీల్యాండ్ రాజధాని మరో చారిత్రిక నగరం అన్నాపోలీస్. బాల్టిమోర్ నగరం అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి కి 65 కిమీ దూరంలో ఉంటుంది. యూరోపియన్ వలసవాదుల రాకకు మునుపు బాల్టిమోర్ ప్రాంతాన్ని ఇక్కడి స్థానిక జాతి ప్రజలు వేట కోసం ఉపయోగించుకునేవారు. మేరీల్యాండ్ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసుకున్న వలసవాదులు 1706లో తొలుత బాల్టిమోర్‌లో ఒక హార్బర్‌ను నిర్మించారు, దాన్నే పోర్ట్ ఆఫ్ బాల్టిమోర్ అని పిలుచుకునే వారు.

బాల్టిమోర్ ఇన్నర్ హార్బర్

ఆ తరవాత 1729 నాటికి హార్బర్‌ను ఆనుకొని బాల్టిమోర్ పట్టణాన్ని నిర్మించినారు. ఐరిష్ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యుడైన, మేరీల్యాండ్ ప్రావిన్స్ ఏర్పాటుకు నిధులు అందజేసిన బారన్ బాల్టిమోర్ సేసిల్ కాల్వర్ట్ పేరు మీద ఈ నగరానికి బాల్టిమోర్ అని నామకరణం చేసినారట. స్థానిక జాతి ప్రజలకు యూరప్ వలసవాదులకు నిరంతరం యుద్ధాలు జరిగినాయి. వలసవాదుల విస్తరణను స్థానిక జాతి ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించినారు. కానీ సాంప్రదాయిక ఆయుధాలు యూరోపియన్ల తుపాకుల ముందు నిలువలేకపోయినాయి. స్థానిక జాతి ప్రజల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. పైగా యూరప్ నుంచి అమెరికా ఖండానికి వలస వచ్చిన మశూచి లాంటి అంటూ వ్యాధులు కూడా వారి జనాభాను తగ్గించి వేశాయి. వలసవాదుల విస్తరణ నిరాఘాటంగా కొనసాగింది. బాల్టిమోర్ పట్టణం యూరప్‌తో వ్యాపార కేంద్రంగా మారింది. మేరీల్యాండ్ వ్యవసాయ క్షేత్రాలలో పండిన పొగాకు, ధాన్యం, చెరుకు బాల్టిమోర్ హార్బర్ నుంచి యూరప్‌కు ఎగుమతి అయ్యేవి.

బాల్టిమోర్ సిటీ హాల్

వ్యాపారస్థులపై బ్రిటన్ ప్రభుత్వం వేస్తున్న అధిక పన్నుల భారాన్ని మేరీల్యాండ్ వ్యాపారస్థులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉండేవారు. అందుకే అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో మేరీల్యాండ్ ప్రావిన్స్ పెద్దలు కీలక పాత్ర పోషించినారు. జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో సాగిన అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో మేరీల్యాండ్ ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటం విజయవంతం అయిన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలలో చేరిన తొలి 13 రాష్ట్రాలలో మేరీల్యాండ్ కూడా ఒకటి. స్వాతంత్య్ర పోరాట విజయానికి సూచికగా వాషింగ్టన్ మెమోరియల్ కూడా బాల్టిమోర్‌లో నిర్మించినారు.

బాల్టిమోర్ లో వాషింగ్టన్ మాన్యుమెంట్

ఆ తర్వాత 1814 లో బ్రిటిష్ దాడిని ఎదుర్కోవడంలో మేరీల్యాండ్ రాష్ట్రం కీలకంగా మారింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల సైన్యాలు బ్రిటిష్ దాడిని తిప్పికొట్టిన అనంతరం బాల్టిమోర్‌లో యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించారు.

బాల్టిమోర్ యుద్ధ స్మారకం

ఈ స్మారకమే బాల్టిమోర్ నగర అధికార ముద్రగా స్థిరపడింది. 1872లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ బాల్టిమోర్‌ను సందర్శించినప్పుడు మేరీల్యాండ్ ప్రజల పోరాట స్పూర్తిని కొనియాడారు. బాల్టిమోర్ నగరాన్ని మాన్యుమెంటల్ సిటీగా అభివర్ణించారు.

బాల్టిమోర్ అధికారిక ముద్ర
బాల్టిమోర్ జెండా

తర్వాతి కాలంలో బాల్టిమోర్ నౌకా నిర్మాణ రంగంలో, టెక్సటైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ది అయ్యింది. 1970వ దశకం నుంచి బాల్టిమోర్‌లో అనేక కీలక నిర్మాణాలు వెలిసినాయి. వాటిల్లో చెప్పుకోదగ్గవి మేరీల్యాండ్ సైన్స్ సెంటర్, బాల్టిమోర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్, హార్బర్ ప్లేస్, నేషనల్ అక్వేరియం, బాల్టిమోర్ మ్యూజియం ఆఫ్ ఇండస్ట్రీస్, అమెరికన్ విజినరీ ఆర్ట్ మ్యూజియం. వీటి నిర్మాణాలు తర్వాత మేరీల్యాండ్ రాష్ట్రంలో బాల్టిమోర్ నగరం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా మారడానికి దోహదం చేసినాయి.

నల్ల జాతి ప్రజల స్వేచ్చా ధామం బాల్టిమోర్:

బాల్టిమోర్‌లో అత్యధిక జనాభా నల్లజాతి ఆఫ్రో ఆమెరికన్ లదే. 2020 జనాభా లెక్కల ప్రకారం ఆఫ్రో ఆమెరికన్ల జనాభా 62.4 %, తెల్ల జాతి ప్రజలు 31.9 %, స్పానిషేతర తెల్ల జాతి ప్రజలు 27.6 %, లాటిన్ అమెరికా జాతి ప్రజలు 6%, ఆసియన్లు 2.8 %. వాషింగ్టన్ డి సి కి దగ్గరలో ఉన్న ప్రాంతం కనుక బానిసత్వ రద్దు చట్టం వచ్చిన తర్వాత నల్ల జాతి ప్రజలు వాషింగ్టన్ డి సి కి, పక్కనే ఉన్న మేరీల్యాండ్ రాష్ట్రానికి దక్షిణ రాష్ట్రాల నుంచి నల్ల జాతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్థిరపడినారు. అందుకే ఇక్కడ ఆఫ్రో అమెరికన్ నల్ల జాతి ప్రజల జనాభా అధికంగా ఉందని అనిపించింది.

ఇన్నర్ హార్బర్ పక్కన పురాతన విద్యుత్ ప్లాంట్

మేము మొదట బాల్టిమోర్ హార్బర్‌కు వెళ్ళాము. హార్బర్‌లో కలియదిరిగిన తర్వాత హార్బర్ పక్కనే ఉన్న నేషనల్ ఆక్వేరియంకు వెళ్ళాము.

నేషనల్ అక్వేరియం:

బాల్టిమోర్ నగరాన్ని సందర్శించే పర్యాటకులు ఈ నేషనల్ అక్వేరియంను తప్పనిసరిగా చూస్తారు. ఇది 5 అంతస్తుల భవనం. 1981లో ఈ ఆక్వేరియంను జాతికి అంకితం చేశారు. ఏటా 15 లక్షల మంది దేశ విదేశీ పర్యాటకులు ఈ నేషనల్ అక్వేరియంను సందర్శించి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఈ నేషనల్ అక్వేరియం ఎంత పెద్దది అంటే.. 750 రకాల చేపల జాతులను, ఇతర నీటి ప్రాణులను, వాటికి సంబందించిన 17 వేల స్పెసిమన్స్ ను ఈ ఆక్వేరియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ గ్యాలరీల్లో 22 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారట. ప్రపంచంలో కనబడే దాదాపు అన్నిరకాల చేపల జాతులను, నీటి ప్రాణులను ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలో కనబడే అన్నీ రకాల చేపల జాతులను రక్షించాలని, తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ప్రపంచ ప్రజలను చైతన్యపర్చాలన్నది ఆక్వేరియం నిర్వాహకుల లక్ష్యం అని వారి కరపత్రంలో రాసుకున్నారు. వీటి సహజ నివాస స్థలాలను కాపాడమని సందర్శకులకు బోధిస్తున్న అనేక పోస్టర్లు అన్ని అంతస్తుల్లో ప్రదర్శనకు పెట్టారు. ఈ చైతన్య కార్యక్రమంలో అనేక మంది టీనేజ్ పిల్లలు సందర్శకులతో మాట్లాడుతూ కనిపించారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పిల్లలు కూడా కనిపించారు. వీరంతా యూనివర్సిటీలో చదువుకుంటూ ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు.

ఇన్నర్ హార్బర్ పక్కన నేషనల్ అక్వేరియం

అక్వేరియం లోకి వెళ్ళగానే సందర్శకులు మొదట చూసేది 4 D Immersion Theatre. మేము రెండు షోలు చూసాము. 4 D ఎఫ్ఫెక్ట్ మనలను ఆశ్చర్యానికి లోను చేస్తుంది. మన పక్కనే పెద్ద పెద్ద సొర చేపలు తిరుగుతూ ఉంటాయి. వాటి అరుపులు మన పక్కనే వినిపిస్తాయి. అవి విరజిమ్మే నీటి తుంపరలు కూడా మన మీద పడతాయి. అవన్నీ 4 D ఎఫెక్ట్ వల్ల మన అనుభూతిలోకి వస్తాయి. రెండు షోలో ఒకటి సొర చేపల ప్రదర్శన, రెండోది డాల్ఫిన్ల ప్రదర్శన. ఒక్కొక్కటి అరగంట. గంట సేపు వాటి లోకంలో గడిపి బయటకు వచ్చి అన్ని అంతస్తుల్లో గ్యాలరీల్లో ప్రదర్శనకు ఉంచిన రకరకాల చేపలు, నీటి ప్రాణులను చూస్తూ ఫోటోలు తీస్తూ పోయాము. ఆ తర్వాత డాల్ఫిన్ల ప్రత్యేక ప్రదర్శన చూసాము. వాటి ట్రైనర్స్ ఎట్లా చెపితే అట్లా విన్యాసాలు చేయడం విస్మయం కలిగించింది.

నేషనల్ అక్వేరియం ముందు బోర్డు

మనుషుల తర్వాత అత్యంత తెలివైన ప్రాణులు డాల్ఫిన్స్ అని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. ఇక్కడ 5,6 డాల్ఫిన్లు కనిపించాయి. వాటి ప్రదర్శన కూచొని చూడటానికి ఒక మంచి పెవేలియన్ కూడా ఏర్పాటు చేశారు. ఎంతసేపైనా కూచొని వాటి విన్యాసాలను ఆనందించవచ్చు. దినమంతా ఈ ప్రదర్శన సాగుతూనే ఉంటుంది. పోయే వారు పోతుంటారు. వచ్చేవారు వస్తూ ఉంటారు.

జెల్లీ చేపల ప్రపంచం:

లంచ్ కూడా అక్వేరియంలో ఉన్న రెస్టారెంట్ లోనే కానిచ్చి జెల్లీ చేపల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీకి వెళ్ళాము. ఎన్ని రకాల జెల్లీ చేపలో!!. లోకంలో ఇన్ని రకాల జెల్లీ చేపలు ఉంటాయని మనం ఊహించలేము కూడా. ఇవి ఎందుకు పుడతాయో, ఏమి తిని బతుకుతాయో అనిపించింది. భూమి మీద ప్రతీ ప్రాణికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ పని నెరవేర్చడానికి అవి పుడతాయి. గిడతాయి.

జెల్లీ ఫిష్

ఈ జెల్లీ చేపలకు కూడా ఏదో ప్రయోజనం ఉండి ఉంటుంది. లేకపోతే అవి పుట్టవు కదా. ఒక గంట సేపు మైమరచి వాటిని చూస్తూ, ఫోటోలు, వీడియోలు తీస్తూ గడిపేసాము. అద్భుతమైన జెల్లీ చేపల ప్రపంచం నుంచి బయటపడటం కష్టం అయ్యింది.

జెల్లీ ఫిష్

అప్పటికే సాయంత్రం 5 కావస్తున్నది. అక్కడి నుంచి బాల్టిమోర్‌కు 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియామి బీచ్‌కు వెళ్లాలని అనుకున్నాము. సాయంత్రం 5 గంటలకు నేషనల్ అక్వేరియం నుంచి బయటపడి బీచ్‌కు బయలు దేరాము.

అలలు లేని బీచ్:

బీచ్ గొప్పగా, అందంగా ఏమీ లేదు. అట్లాంటిక్ సముద్రం కోతకు గురి అయిన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర తీరం అది. అందుకే ఈ బీచ్‌లో అలలు కనబడవు. అలలు కనబడని బీచ్‌ను చూడటం ఇదే మొదటిసారి. ఒక అరగంట మాత్రమే ఉన్నాము. బీచ్లో కొన్ని రాళ్ళు ఏరుకొని ఇండియాకు జ్ఞాపకాలుగా తెచ్చుకున్నాను. అయితే కారులో వచ్చేటప్పుడు పోయేటప్పుడు మేరీల్యాండ్ గ్రామీణ ప్రాంతాలను చూసే అవకాశం దొరికింది. మైక్రో ఇరిగేషన్ కింద సాగు చేస్తున్నవిశాలమైన వ్యవసాయ క్షేత్రాలు ఇరు వైపులా కనిపించాయి. బాల్టిమోర్ నగరానికి ఆనుకొని అల్పదాయ వర్గాల ఇండ్లు, కాలనీలు కనిపించాయి. వీధులు ఇరుకుగా ఉన్నా శుభ్రంగానే ఉన్నాయి. మన దేశంలో కనిపించే మురికివాడల లాంటివే ఇవి. అయినా మన దేశంలో కనబడే మురికివాడలకు వీటికి చాలా తేడా ఉంది. ఈ కాలనీల్లో నివసించేది నల్లజాతి ప్రజలు, మెక్సికో నుంచి సక్రమంగా, అక్రమంగా వలస వచ్చిన స్పానిష్ ప్రజలే అని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.

దారిలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ కనబడితే బయటి నుంచే కార్లో ఉండే ఆర్డర్ పెట్టవచ్చు. కొద్ది నిమిషాల్లో మన ఆర్డర్ మన చేతికి అందజేస్తారు. మనం లోపలికి పోవలసిన అవసరం ఉండదు. వీటిని డ్రైవ్ ఇన్ రెస్టారెంట్స్ అంటారు. కార్లోనే డిన్నర్ కానిచ్చుకొని బాల్టిమోర్ హోటల్‌కు బయలుదేరాము. మమ్ములను దింపేసి పిల్లలు ఇద్దరు రెంటల కారు వాపస్ చేసి క్యాబ్‌లో హోటల్‌కి వచ్చేశారు. తెల్లవారి 6 గంటలకు డాలస్ పోవడానికి విమానం బుక్ అయి ఉన్నది. కాబట్టి రాత్రి సామాను అంతా సర్దుకొని పడుకున్నాము. ఉదయం హోటల్ వాళ్ళు నిద్ర లేపారు. హోటల్ నుంచి ఎయిర్ పోర్టుకి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. 5 గంటలకు హోటల్‌కు బస్సు వచ్చింది. 20 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాము. అర గంటలో చెక్ ఇన్ అయి బోర్డింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎయిర్‌పోర్ట్‌లో సుందరమైన సూర్యోదయాన్ని చూసాము. అమెరికాలో చూసిన సూర్యోదయం ఇదే.

వాషింగ్టన్ బాల్టిమోర్ విమానాశ్రయంలో సూర్యోదయ దృశ్యాలు

అంతకు ముందు సూర్యాస్తమయాలు చూశాను కానీ అమెరికాలో సూర్యోదయం చూడటం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇదే ఆఖరుసారి కూడా. డాలస్‌లో విమానం దిగేటప్పటికి ఉదయం 11 అయ్యింది. ఇంటికి పోగానే పిల్లలు లాప్టాప్‌లు ముందర వేసుకొని పనిలో పడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. మేము విశ్రాంతికి ఉపక్రమించాము.

మూడు రోజుల వాషింగ్టన్, బాల్టిమోర్ పర్యటన గొప్ప సంతృప్తిని, మంచి అనుభవాలను మిగిల్చింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here