అమెరికా ముచ్చట్లు-3

0
8

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికాలో ఎండాకాలంలో సూర్యాస్తమయం ఎందుకు ఆలస్యం అవుతుంది?

[dropcap]ఉ[/dropcap]త్తర అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో జూన్ నెల అంతా 5.30కు సూర్యోదయం, రాత్రి 8.30కు సూర్యాస్తమయం జరుగుతుంది. అంటే దాదాపు 15 గంటల పాటు పగలు ఉంటుంది. వాషింగ్టన్ లాంటి ఉత్తర రాష్ట్రాలకు వెళితే సూర్యాస్తమయం రాత్రి 9.30, 10 గంటలకు అవుతుంది. పగటి కాలం మరింత పొడుగ్గా ఉంటుంది.

డల్లాస్ లో రాత్రి 7.30 ఉన్న వెలుతురు
రాత్రి 8.30 కు సూర్యాస్తమయం

ఈ ఫోటోలు డల్లాస్ నగరంలో మా పిల్లలు ఉండే మెకెని అనే ప్రాంతంలో వాళ్ళ కాలనీ వీధిలో తీసినవి. ఫోటోలో కనిపిస్తున్న చిన్న చెరువు కూడా అక్కడిదే. డల్లాస్‌లో ఇప్పుడు మన లెక్కనే ఎండాకాలం. ఈ విచిత్రమైన (ఇది మనకు విచిత్రమైనది. వీళ్ళకు మామూలు విషయమే) భౌగోళిక సంఘటనను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత నాకు అర్థమైన భూగోళ శాస్త్ర అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను.

ఉత్తరార్ధ గోళంలో ఉన్న దేశాలకు వేసవి కాలం మార్చి మొదలుకొని సెప్టెంబర్ వరకు ఉంటుంది. శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా దక్షిణార్ధ గోళం ఉంటుంది. ఇప్పుడు అక్కడ చలికాలం ఉంది. డల్లాస్ నగరం దాదాపుగా 32 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన ఉంది, అదే విధంగా భారతదేశం 37-38 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య ఉన్నది కాబట్టి వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. కానీ మనకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, మిగతా మూడు దిక్కుల్లో సముద్రం ఉన్నందు వలన ఉన్నందున ఋతుపవన వ్యవస్థ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అక్కడ లేదు. పగటి కాలం యొక్క నిడివి ఉత్తర అక్షాంశాల వైపు వెళ్ళిన కొద్దీ పెరుగుతుంది. అమెరికా ఖండం పూర్తిగా పశ్చిమ అర్ధగోళంలో ఉంది కాబట్టి దాదాపుగా 12 గంటలు మనకు వారికి తేడా ఉంటుంది.

అమెరికా ఖండం విశాలమైనది. సగం.. అంటే సున్నాడిగ్రీల అక్షాంశము నుండి (భూమధ్య రేఖ) ఉత్తరం వైపు ఉన్న భూభాగమంతా ఉత్తరార్ధ గోళం. ఇందులో మధ్య అమెరికా దేశాలు మెక్సికో, అమెరికా, కెనడా అలాస్కా, గ్రీన్‌ల్యాండ్ మొదలైన దేశాలు ఉంటాయి. మిగతా సగం అంటే దక్షిణ అమెరికా దేశాలు దక్షిణార్ధ గోళంలో ఉంటాయి. కాబట్టి టెక్సాస్ రాష్ట్రం ఉత్తర అమెరికాలో ఉన్న కారణంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్నట్టు లెక్క. జూన్ 21 రోజున సూర్య కిరణాలు కర్కటరేఖ(Tropic of Cancer) మీద లంబంగా పడతాయి. కాబట్టి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. లండన్లో, స్వీడన్లో, నార్వేలో పగటి కాలం డల్లాస్, మన దేశం కంటే ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ భౌగోళిక సంఘటనకు ప్రధాన కారణం భూగోళం యొక్క అక్షం (Axis) ఈ కింద బొమ్మలో చూపినట్టు 23.44 డిగ్రీలు తూర్పు వైపు వంగి ఉంటుంది. ఈ భూఅక్షానికి ఉన్న వంపు (Tilt) ఈ భౌగోళిక సంఘటనలకు కారణంగా ఉన్నదని శాస్త్రవేత్తలు దీనికి వివరణ ఇస్తూ రాసినారు.

భూమి అక్షం 23.44 డిగ్రీల వంపును చూపుతున్న పటం

ఒకవేళ భూఅక్షం ఇట్లా వంపు లేకుండా లంబ కోణంలో నిలువునా ఉండి ఉంటే అన్ని ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం ఒకే విధంగా ఉండేది. అయితే భూఅక్షానికి ఉన్న 23.44 డిగ్రీల వంపు కారణంగా సూర్యునికి భూమికి ఉండే దూరం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సూర్యుడు సంక్రాంతి తర్వాత ఉత్తరాయనంలో ప్రవేశిస్తాడని మనందరికీ తెలిసిందే. అంటే ఉత్తరార్ధ గోళంలోకి ప్రవేశిస్తాడు. 0 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖకు ఎన్ని డిగ్రీలు పైకి జరిగితే ఆ ప్రాంతంలో సూర్యాస్తమయం ఆలస్యం అవుతూ ఉంటుంది. పగటి కాలం పెరుగుతుంది. అప్పుడు ఉత్తరార్ధ గోళంలో ఎండాకాలం, దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది.

ఎండాకాలం మధ్యలో భూఅక్షంలో ఉన్న వంపు కారణంగా ఉత్తరార్ధ గోళం సూర్యునికి దగ్గరగా జరుగుతుంది. చలికాలంలో దూరంగా జరుగుతుంది. ఉత్తర దృవం వద్ద ఎండాకాలంలో సూర్యాస్తమయం ఉండనే ఉండదు. నెలల తరబడి పగలు ఉంటుంది. చలికాలంలో రోజుల తరబడి చీకటి ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద ఉన్న ప్రాంతాలకు పగలు రాత్రి దాదాపు సమానంగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం యొక్క సమయాలు భూమి పరిభ్రమించే దారిలో సూర్యుడి యొక్క స్థానాన్ని బట్టి ఉంటుంది. దాన్ని నిర్ధారించేది భూఅక్షం యొక్క వంపు.

మార్చ్ 21 న సూర్యుడు సరిగ్గా భూమధ్య రేఖ మీద ఉంటాడు. ఆ రోజున పగలు రాత్రి ఉత్తర, దక్షిణ అర్ధ గోళాల్లో సమానంగా ఉంటాయి. మార్చి 21 తర్వాత జూన్ 22 వరకు సూర్యుడు ఉత్తర అక్షాంశాల వైపుకు జరుగుతూ ఉంటాడు. ఉత్తరార్ధ గోళంలో ఉండే ప్రాంతాలు ఎక్కువ కాలం సూర్యుడి వెలుతురుకు అనుకూల స్థానంలో ఉంటాయి. అందుకే సూర్యుడు ఉత్తరార్ధ గోళంలో తొందరగా, దక్షిణార్ధ గోళంలో ఆలస్యంగా ఉదయిస్తాడు. సూర్యాస్తమయం ఉత్తరార్ధ గోళంలో ఆలస్యంగా దక్షిణార్ధ గోళంలో తొందరగా జరుగుతుంది. సెప్టెంబర్ 23 తర్వాత సూర్యుడు ఉత్తరార్ధ గోళం నుంచి దక్షిణార్ధ గోళం వైపుకు దిగుతూ ఉంటాడు. డిసెంబర్ నాటికి సూర్యుడు పూర్తిగా దక్షిణార్ధ గోళంలోకి మారిపోతాడు. అప్పుడు ఉత్తరార్ధ గోళంలో ఉన్న ప్రాంతాలకు చలికాలం, దక్షిణార్ధ గోళంలో ఉన్న ప్రాంతాలకు ఎండాకాలం వస్తుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. కర్కాటక రేఖకు(Tropic of Cancer), మకర రేఖకు(Tropic of Capricorn) మధ్యన సూర్యుడి ఈ గమనానికి కారణం భూఅక్షానికి ఉన్న 23.44 డిగ్రీల వంపు అని ఈ పాటికి అర్థం అయి ఉంటుంది. ఈ వంపు కారణంగానే భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి. భూఅక్షానికి ఈ వంపు గనుక లేకపోయి ఉంటే మన భూమి స్థితిగతులు వేరే విధంగా ఉండేవి.

ఇప్పుడు మేమున్న టెక్సాస్ రాష్ట్రం ఉత్తరార్ధ గోళంలో ఉన్న కారణంగా ఇక్కడ ఎండాకాలం ఉంది. సుమారు 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉండడం వలన సూర్యాస్తమయం ఆలస్యంగా రాత్రి 8.30 కు అవుతుందని తెలిసింది. దీనికి ఇంత కథ ఉందని భూగోళ శాస్త్రం బోధించిన సార్లు ఎవరూ చెప్పలేదు. నిజానికి ఇదొక సంక్లిష్టమైన అంశం. అంత తొందరగా పిల్లలకు అర్థం అయ్యే అంశం కూడా కాదు. ఇప్పటి పిల్లలకు అద్భుతమైన animation వీడియోలు వచ్చాయి. వీటి సహాయంతో భూభ్రమణం, భూ పరిభ్రమణం ఎట్లా జరుగుతుందో స్పష్టంగా అర్థం చేసుకో గలుగుతున్నారు.

టెక్సాస్ రాష్ట్ర రాజధాని నగరం ఆస్టిన్ లో రాత్రి 8.30 కు సూర్యాస్తమయం దృశ్యాలు
టెక్సాస్ రాష్ట్ర రాజధాని నగరం ఆస్టిన్ లో రాత్రి 8.30 కు సూర్యాస్తమయం దృశ్యాలు

ముక్తాయింపు: అమెరికాలో ఎండాకాలం పగలు సుధీర్ఘంగా ఉంటుంది కనుక ఉదయం పని వేళలను ఒక గంట ముందుకు జరుపుతారట. దీన్ని వారు Day Light Saving Time (DST) అంటారు. ఉదయం 2 గంటలు గడియారంలో 3 అవుతుంది. ఈ మార్పు ప్రతీ సంవత్సరం మార్చ్ రెండవ ఆదివారం మొదలవుతుంది. నవంబర్ మొదటి ఆదివారం తిరిగి మునుపటి సమయానికి గడియారం మారిపోతుంది. ఈ ఏర్పాటు యూరప్‌లో కూడా ఉంది. అయితే వారి DST స్థానికంగా ఉండే పగటి కాలాన్ని బట్టి ఏ నెలలో మొదలవ్వాలి, ఏ నెలలో రివర్స్ చేయాలి అనేది నిర్ణయిస్తారు. అమెరికాలో ఈ పద్దతి 2007లో అమల్లోకి వచ్చింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 2005లో ఒక చట్టాన్ని(The Energy Policy Act of 2005) కూడా ఆమోదించింది. ఈ చట్టాన్ని అమలు పరచే బాధ్యత US Department of Transportation (DOT) వారిది. ఇదంతా మనకు గమ్మతు వ్యవహారంగా కనిపిస్తుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here