అమెరికా ముచ్చట్లు-4

1
5

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

టెక్సాస్ ఎ & ఎం యూనివర్సిటీ కామర్స్ పర్యటన

[dropcap]ఒ[/dropcap]కరోజు మా బిడ్డ అంజలి చదువుకున్న Texas A&M University కి వెళ్ళాము. ఈ యునివర్సిటీకి నాలుగు చోట్ల కాంపస్‌లు ఉన్నాయి. మేము వెళ్ళింది కామర్స్ అనే ప్రాంతంలో ఉన్నది. డల్లాస్ నుంచి కారులో ఒక గంట ప్రయాణం. ఈ యూనివర్సిటీ 1889లో Agriculture & Mechanical యూనివర్సిటీగా ప్రారంభం అయి ఆ తర్వాత పూర్తి స్థాయి యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.

2015 మా బిడ్డ కంప్యూటర్ సైన్స్ లో MS కోర్సు పూర్తి చేసి డల్లాస్‌లో నాలుగేళ్ళుగా ఉద్యోగాలు చేసుకుంటున్నది. ఆ సంవత్సరం యూనివర్సిటీ convocation కి వెళ్లాలని వీసా తీసుకున్నాము. కాని వెళ్ళలేకపోయాము. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఆమె చదువుకున్న యూనివర్సిటీకి తీసుకెళ్ళింది.

సుందరమైన, విశాలమైన కాంపస్. ఈ కాంపస్‌లో చదువుకున్న వాళ్ళని ‘లయన్స్’ అని పిలుస్తారట. అందుకే కాంపస్‌లో సింహం కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అయితే ఉస్మానియా కాంపస్‌కు ఉన్న రాజసం, సహజత్వం ఇక్కడ కనిపించలేదు. అయితే అమెరికన్ యూనివర్సిటీల్లో ఒక స్థాయి కలిగిన యూనివర్సిటీగా పేరున్నది.

యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సింహం బొమ్మ దగ్గర ఒక శిలాఫలకం నన్నుఆకర్షించింది. అందులోని సారాంశం ఏమిటంటే… ఈ యూనివర్సిటీ ఏర్పాటు అయిన ప్రాంతం ఒకప్పుడు కాడ్దో (Caddo) అనే జాతికి చెందిన స్థానిక ఇండియన్ల (native Indians) నివాస ప్రాంతం. వీరి నివాస ప్రాంతం నైరుతీ (South West) దిశలో ఆర్కాన్సాస్ వరకు, వాయవ్య (North West) దిశలో లూసియానా వరకు విస్తరించి ఉండేది. 16వ శతాబ్దానికే వీరు గ్రామాల్లో స్థిర వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మక్క జొన్న, కూరగాయలు పండించేవారు. జంతువులు, చేపల వేట కూడా చేసేవారు. వేటకు విల్లు, బాణాలు ఉపయోగించేవారు. వీరికి ప్రత్యేకమైన భాషా, సంస్కృతి, పండుగలు, ఆచార వ్యవహారాలూ స్థిరపడినాయి. యూరప్ నుంచి వలసవాదులతో వ్యాపార లావాదేవీలు జరిపేవారని శిలాఫలకంలో రాసినారు. అయితే 1889 ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించడంతో వారిని ఒక్లాహామా ప్రాంతానికి తరలించి అక్కడ వారికి పునరావాసం కల్పించినారని రాసారు. అక్కడ అమెరికా ఫెడరల్ రాజ్యాంగానికి లోబడి ఉండే స్వయం ప్రతిపత్తి కలిగిన ‘కాడో నేషన్’ను ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ట్రానికి ఆ పేరు కాడ్దో జాతి వారి భాషలో ఉన్న Tayshas అనే పదం నుంచి ఉత్పన్నం అయ్యిందని రాసారు. అంటే ‘స్నేహితులు’ అని అర్థం.

యూరప్ వలసవాదులు అమెరికా ఖండాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడి స్థానిక అమెరికన్ జాతుల ప్రజలతో జరిగిన ఘర్షణలు, ఆ ఘర్షణల్లో జరిగిన మానవ హననం అమెరికా ఖండ అభివృద్ధి చరిత్రలో ఒక రక్తసిక్త చరిత్ర. మానవ జాతి చరిత్రలో మానని గాయం. ఈ వివరాలన్నీ హోవార్డ్ జిన్ రాసిన ‘అమెరికా ప్రజల చరిత్ర (A Peoples History of the United States)’ పుస్తకంలో చదవవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ వారు తెలుగులో ప్రచురించారు.

15వ శతాబ్దంలో యూరప్ వలసవాదులు కొత్త భూభాగాల కోసం అన్వేషణ ప్రారంభించారు. భారత దేశానికి దారి కనుక్కునే క్రమంలో దారి తప్పి కొలంబస్ అమెరికా ఖండానికి చేరుకున్నాడు. అదే ఇండియా అనుకున్నాడు. అక్కడి స్థానిక ప్రజలని ఇండియన్స్ అన్నాడు. వారి చర్మం రంగు ఎరుపుగా ఉండడంతో వారు రెడ్ ఇండియన్స్ అయ్యారు. అక్కడి నుంచి రెడ్ ఇండియన్స్‌కి యూరప్ వలసవాదులతో ఘర్షణల పర్వం మొదలయ్యింది. విల్లు బాణాలతో చేసే వారి పోరాటాలు యూరోపియన్ల తుపాకుల ముందు నిలువలేకపోయింది. యూరోపియన్ వలసవాదులకు లొంగిపోయి బానిసలుగా మారినారు. దిక్కరించిన జాతులు ఊచకోతకు గురి అయినాయి. ఈ విశాలమైన అమెరికా భూఖండాన్ని అభివృద్ధి చేయడానికి వారికి మానవ శ్రమ కావలసి వచ్చింది. ఆఫ్రికా నుంచి దొంగతనంగా వేటాడి తీసుకు వచ్చిన వేలాది మంది నల్లజాతి బానిసల శ్రమతో, వలస దేశాల నుంచి తరలించిన సొమ్ముతో అమెరికా ఖండంలో వ్యవసాయం, గనులు, పరిశ్రమలు, నగరాలు అభివృద్ధి చెందాయి. ఈ అమెరికా అభివృద్ధి చరిత్ర అంతా రక్తసిక్త చరిత్ర అని ఆ పుస్తకం సోదాహరణంగా వివరించింది. యూనివర్సిటీలో ఆ శిలాఫలకం చూసిన తర్వాత అమెరికా ఖండం అభివృద్ధి చరిత్ర అంతా మదిలోకి వచ్చింది. కాడో జాతి ప్రజలకు ఉన్నట్టే అమెరికా అంతటా ఇటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక అమెరికన్ నేషన్స్ చాలా ఉన్నాయి. ఆరిజోనా రాష్ట్రంలో గ్రాండ్ కాన్యాన్ పర్వత శ్రేణుల ప్రాంతంలో ఇటువంటి స్థానిక వాలాపై నేషన్ ఉన్నది. ఆ సంగతులు తర్వాతి ఆర్టికల్‌లో రాశాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here