అమెరికా ముచ్చట్లు-6

0
10

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

డాలస్ డౌన్‌టౌన్‌లో విన్సెంట్ వాంగో చిత్ర ప్రదర్శన సందర్శన

[dropcap]ని[/dropcap]న్న ఆదివారం (12.6.2022) పిల్లలు డాలస్ డౌన్‌టౌన్‌కు తీసుకుపోయారు. అమెరికాలో ప్రధాన నగరాన్ని డౌన్ టౌన్ అని పిలుస్తారు. ఇక్కడే అన్ని రకాల కార్పొరేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు, విశాలమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు, టూరిస్టు కేంద్రాలు, మ్యూజియంలు, కళా కేంద్రాలు.. ఇట్లా ఎన్నో ఆకర్షణలు డౌన్‌టౌన్ లోనే ఉంటాయి. ఆ నగరం యొక్క సాధనా సంపత్తి, ఐశ్వర్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఈ ప్రధాన నగరం చుట్టూ అనేక శాటిలైట్ పట్టణాలు లేదా నగరాలు అభివృద్ది అవుతాయి. డాలస్ ప్రధాన నగరం చుట్టూ ఇర్వింగ్, మెకని, ఫ్రిస్కో, ప్రిస్టన్.. ఇట్లా శాటిలైట్ పట్టణాలు చాలా ఉన్నాయి. టెక్సాస్ రాష్ట్రలో అతి పెద్ద నగరాలు డాలస్, హూస్టన్‌లు ఉన్నప్పటికీ ఆస్టిన్ నగరాన్ని రాజధాని నగరంగా ఎంపిక చేశారు. అన్ని రాష్ట్రాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. బహుశా అభివృద్ది వికేంద్రీకరణ లక్ష్యంగానే ఈ పద్ధతి అమల్లో ఉందని అనుకోవాలి. అ రోజు డాలస్ డౌన్‌టౌన్‌లో మూడు ప్రత్యేక దర్శనా స్థలాలను చూసాము

1.విన్సెంట్ వాంగో చిత్ర ప్రదర్శన:

ఈ ఆదివారం మేము ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు విన్సెంట్ వాంగో పెయింటింగ్ ప్రదర్శన చూసాము. ఇటీవలేనే విన్సెంట్ వాంగో జీవితంపై ఇర్వింగ్ స్టోన్ రాసిన నవల Lust For Life ను చిత్రకారుడు పి మోహన్ తెలుగు అనువాదం ‘జీవన లాలస’ చదివి ఉన్నాను.

నిజానికి ఇది విన్సెంట్ వాంగో పెయింటింగ్‌ల ప్రదర్శన కాదు. వాంగో చిత్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిన అద్భుతమైన యానిమేషన్ వీడియో ప్రదర్శన అనుకోవాలి. మూడు గదుల్లో నాలుగు గోడలపై విన్సెంట్ వాంగో చిత్రాల యానిమేషన్ వీడియోలు వరుసగా వస్తూ ఉంటాయి. ఇదొక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. చూసిన వాళ్ళు వెళ్ళి పోతూ ఉంటారు. ఈ ప్రదర్శన చూసిన వాళ్ళు అనంతరం జ్ఞాపికలు తప్పక కొనుగోలు చేస్తారు.

పుస్తకాలు, నోట్‌బుక్‌లు, కప్పులు, కీ చైన్‌లు, టి షర్ట్స్, పోస్టర్‌లు ఇంకా అనేక రకాల వస్తువులను జ్ఞాపికలుగా అమ్ముతారు. ప్రస్తుతం విన్సెంట్ వాంగో చిత్ర వీడియో ప్రదర్శన జరుగుతున్నది. త్వరలోనే మెక్సికో చిత్రకారిణి ఫ్రిదా కాహ్లో చిత్ర ప్రదర్శన ఉంటుందని ప్రకటించారు.

ఈ ప్రదర్శనను వారు The Original Immersive Van Gogh Exhibition అని పిలుస్తున్నారు. ఈ ప్రదర్శనకు సంబందించిన కొన్ని ఫోటోలు పెడుతున్నాను. ఇటువంటి ప్రయోగం మన భారతీయ చిత్రకారులపై కూడా తయారు చేయాల్సిన అవసరం ఉందని అనిపించింది. విన్సెంట్ వాంగో స్థాయికి తూగే భారతీయ చిత్రకారులు అనేకం ఉన్నారు.

కేరళలో రాజా రవివర్మ, తెలంగాణలో కొండపల్లి శేషగిరిరావు, కాపు రాజయ్య, పి టి రెడ్డి, బెంగాల్ లో చిత్త ప్రసాద్, నందలాల్ బోస్, ఆంధ్రప్రదేశ్‌లో దామెర్ల రామారావు, వడ్డాది పాపయ్య, బాపు.. లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కళాకారులు ఉన్నారు.

నకాశి, కలంకారీ, నిర్మల్, మధుబని, వర్లి తదితర జానపద, ఆదివాసీ కళా సాంప్రదాయాలు దేశంలో ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కళాకారులపై, కళా సాంప్రదాయాలపై ఇటువంటి ప్రయోగాన్ని చేయగలిగితే వారి చిత్రకళా ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ కళాభిమానులను ఆకర్షించే అవకాశం ఉన్నది.

విన్సెంట్ వాంగో సంతకం

2.అమెరికా అధ్యక్షుడు జాన్ ఫిట్జీరాల్డ్ కెన్నెడీ స్మారకం:

వాంగో చిత్ర ప్రదర్శన నుంచి అమెరికా అధ్యక్షుడు జాన్ ఫిట్జీరాల్డ్ కెన్నెడీ స్మారక కేంద్రానికి పోయాము. కెన్నెడీ 43 ఏండ్ల అతి పిన్న వయసులో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక అయినాడు.

అమెరికా 35వ అధ్యక్షుడు కెన్నెడీ

1961-63 మధ్యలో అమెరికాకు 35వ అధ్యక్షుడిగా కెన్నెడీ ఎన్నికయ్యాడు. అధ్యక్షుడిగా మూడేండ్ల పదవీ కాలం పూర్తి కాక ముందే 46 ఏండ్ల చిన్న వయసులోనే 22 నవంబర్, 1963న హత్యకు గురి అయినాడు. కెన్నెడీ హత్య డాలస్ నగరం లోనే జరిగింది. ఇక్కడే ఆయన సమాధిని, స్మారకాన్ని నిర్మించారు.

కెన్నెడీ స్మారకం గొప్పగా ఉంటుందని ఊహించిన నాకు నిరాశ కలిగింది. శ్లాబ్ లేని నాలుగు పెద్ద కాంక్రీట్ గోడల మధ్యన సమాధి ఉంది. దిల్లీలో మన ప్రధానుల, రాష్ట్రపతుల స్మారకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇది కెన్నెడీ ప్రవచించిన స్వేచ్ఛకు చిహ్నమని ఈ స్మారకాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ జాన్ ఫిలిప్ భావించినట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద రాసి ఉంది.

జాన్ ఫిట్జీరాల్డ్ కెన్నెడీ స్మారకం

ఈ స్మారకాన్ని వర్ణిస్తూ ఫిలిప్ అన్న మాటలను కూడా ఇట్లా ఉటంకించారు. “A place of quite refuge, an enclosed place of thought and contemplation separated from the city around, but near the sky and earth”.

కెన్నెడీ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకం

ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువగా ఉటంకించబడే 10 కోట్స్‌లో కెన్నెడీ మాట తప్పక ఉంటుంది. అదే.. “Ask not what your country can do for you, but what you can do for your country”.

కెన్నెడీ అమెరికా ప్రజలు గొప్పగా ప్రేమించే అధ్యక్షులలో ఒకరు. న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లోరిడాలో నాసా అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఆయన పేరు మీదనే ఉన్నాయి.

3.డాలస్ మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్స్:

కెన్నెడీ మెమోరియల్ దగ్గరలోనే డౌన్‌టౌన్‌లో ‘Dallas Museum of Illusions’ ఉంది. చాలా చిన్నదే కానీ గొప్పగా ఉంది. మన కళ్ళు, మనస్సు ఎట్లా బ్రాంతులకు లోనవుతుందో చూపే వస్తువులు ఇందులో ప్రదర్శనకు పెట్టారు. అట్లా భ్రాంతికి గురి కావడానికి శాస్త్రీయ కారణాలు వివరించే చిన్న పోస్టర్లు కూడా వాటి పక్కన ఉంచారు. పిల్లలు, పెద్ద వారు అందరు సరదాగా ఈ illusions ను ఎంజాయ్ చేస్తారు. ఫోటోలు దిగుతారు. చిన్నప్పుడు సోవియట్ యూనియన్ రాదుగ ప్రచురణాలయం, మాస్కో వారు తెలుగులో అనువాదం చేసి పంపించే పుస్తకాలలో యాకోవ్ పెరల్మాన్ రాసిన ‘నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం’ అనే పుస్తకం రెండు వాల్యూమ్‌లు నా వద్ద ఉండేవి. మొన్నటి దాకా ఈ పుస్తకాలను భద్రంగా దాచి పెట్టుకున్నాను. ఇక్కడ ప్రదర్శనకు పెట్టిన చాలా ఐటమ్స్ చిన్నప్పుడు అందులో చదివినవే. ఈ సందర్భంగా ఆ పుస్తకం యాదికి వచ్చింది.

పై ఫొటోల్లో మొదటి దానిలో ఉన్న ఫోటోలో ఉన్నది నలుగురమే. కానీ ఒక పెద్ద గుంపు ఉన్నట్టు భ్రాంతి కలుగుతుంది. ఇదొక చిన్న అద్దాల గది. అందులో నిలబడితే మన ప్రతిబింబాలే వందల సంఖ్యలో కనబడి అక్కడ ఒక గుంపు ఉందని భ్రాంతిని కలుగజేస్తుంది. ఇక రెండ ఫోటోలో నేనే మరో 5 గురు ‘నేను’ లతో పత్తాలు ఆడుతున్నాను. ఇది కూడా ఒక చిన్న అద్దాల గది. తల మీద ఫుట్‌బాల్ మైదానంతో కనిపిస్తున్నది అసలైన నేను. మిగతావి నా ప్రతిబింబాలు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here