అమెరికా ముచ్చట్లు-8

0
8

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికా వ్యవసాభివృద్దికి దోహదం చేసిన హూవర్ డ్యాం

[dropcap]సా[/dropcap]గునీటి శాఖలో ఇంజినీర్‌గా ప్రపంచంలో గొప్ప సివిల్ ఇంజినీరింగ్ నిర్మాణాలుగా పేరు గడించిన మూడు డ్యాములు చూడాలని కోరిక చాలాకాలంగా నాలో ఉన్నది. ఒకటి ఈజిప్ట్‌లో నైలు నదిపై నిర్మించిన ఆస్వాన్ డ్యాం, రెండోది అమెరికాలో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ డ్యాం, మూడోది చైనాలో యాంగ్జి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యాం. మొదటి రెండు డ్యాముల గురించి 1981-84 మధ్య హైదరాబాద్‌లో ముప్ఫఖంఝా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునే కాలంలోనే విన్నాను. త్రీగార్జేస్ డ్యాం గురించి మాత్రం 1990 వ దశకంలో సాగునీటి శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా చేరిన తర్వాత విన్నాను. అది దేశంలో పెద్ద డ్యాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న కాలం. మధ్యప్రదేశ్‌లో నర్మదా నదిపై తలపెట్టిన ఇందిరాసాగర్, సర్దార్ సరోవర్ డ్యాం, ఉత్తరప్రదేశ్‌లో భాగీరథి నదిపై తలపెట్టిన తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం జరుగుతున్న కాలం. పెద్ద డ్యాముల వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు వాటిల్లే నష్టాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న కాలం. పర్యావరణవాదులు పెద్ద డ్యాములకు ప్రత్యామ్నాయంగా చిన్న వాటర్‌షెడ్స్, చెరువులు, కాంటూర్ బండ్స్, చెక్ డ్యాములను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ చర్చలలో ప్రముఖ ఇంజినీర్, ఐరాసకు సలహాదారుగా ఉన్న కీ.శే. టి.హనుమంతరావు కూడా పాల్గొన్నారు. పెద్ద డ్యాముల ఆవశ్యకతను నొక్కిచెపుతూ అనేక వ్యాసాలు రాశారు. చిన్న నీటి పథకాలు పెద్ద డ్యాములకు ప్రత్యామ్నాయం కాజాలవని వాదిస్తూ, 1986లో దేశంలో సంభవించిన కరువును ఎదుర్కొని దేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించినవి భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు లాంటి పెద్ద డ్యాములేనని గణాంకాలతో వివరించారు.  ఈ చర్చ చేస్తున్న సందర్భంగా ఈజిప్టులో నైలు నదిపై నిర్మిచిన ఆస్వాన్ డ్యాం ఈజిప్ట్ ఆర్థిక ప్రగతికి ఎట్లా దోహదం చేసింది, ఆఫ్రికా ఖండమంతా కరువు కోరల్లో చిక్కుకొని ప్రజలు ఆకలిచావులకు బలవుతుంటే ఈజిప్ట్ దేశాన్ని కరువు నుంచి, వరదల నుంచి కాపాడింది ఆస్వాం డ్యామేనని వివరించారు. ఆ కాలంలో చైనాలో నిర్మాణమవుతున్న త్రీగార్జేస్ డ్యాం కూడా చైనా ఆర్ధిక ప్రగతికి దోహదం చేయనున్నదని జోస్యం చెప్పారు.

2018 ఏప్రిల్‌లో త్రీగార్జెస్ డ్యామును సందర్శించే అవకాశం వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగత సెలవుపై అమెరికా వచ్చిన తర్వాత హూవర్ డ్యామును 2019 జూన్ 8న సందర్శించాను.

1) హూవర్ డ్యాంని మన శ్రీశైలం డ్యాంతో పోల్చవచ్చు. ఎత్తైన లోయలో నుంచి ప్రవహిస్తున్న కొలరాడో నదిపై ఈ arch gravity డ్యాంను నిర్మించారు. అందుకే 720 అడుగుల ఎత్తు డ్యాంని నిర్మించారు. శ్రీశైలం డ్యాం కూడా లోయలో నిర్మించారు. వీటి పొడవు తక్కువ ఎత్తు ఎక్కువ. జలాశయం నదీ లోయలో ఉంటుంది కనుక పొడవు ఎక్కువగా ఉంటుంది. అదే నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ డ్యాంల ఎత్తు తక్కువ, పొడవు ఎక్కువ. జలాశయం విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం డ్యాంలో వరద గేట్లు కాంక్రీట్ డ్యాంలోనే ఉన్నాయి. హూవర్ డ్యాంలో జలాశయం fore shore లో రెండు వైపులా కట్టారు. గ్రావిటీ డ్యాంలో కాంక్రీట్ structure ద్వారా నీటిని ఆపుతారు. బ్యారేజీలలో మాత్రం మొత్తం నీరు గేట్ల ద్వారానే ఆపుతారు. మన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వద్ద కడుతున్నవి బ్యారేజీలు. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, భాక్రానంగల్ తదితరాలు గ్రావిటీ డ్యాంలు.

హూవర్ డ్యాం ఏరియల్ వ్యూ
ఆర్చ్ బ్రిడ్జ్

2) ఈ ఫోటోలు ఉన్న బ్రిడ్జి నిర్మాణ పరంగా చూసినప్పుడు ఇంజనీరింగ్‌లో కొత్త ప్రయోగం లాంటిది. హూవర్ డ్యాం ఒక 150 మీ దిగువన కొలరాడో లోయ దాటడానికి కట్టారు. డ్యాంకు కుడి వైపున నేవేడా రాష్ట్రం, ఎడమ వైపున ఆరిజోనా రాష్ట్రం. డ్యాం మీద నుంచి ట్రాఫిక్ మళ్లించడానికి రెండు రాష్ట్రాల మధ్య రహదారి మీద ఈ బ్రిడ్జి కట్టారు. మామూలుగా బ్రిడ్జి లకు కింద నుంచి పిల్లర్స్ ద్వారా సపోర్టు చేస్తారు. ఇక్కడ అది సాధ్యం కాదు కాబట్టి పై నుంచి ఆర్చ్ కి సపోర్ట్ ఇచ్చారు. ఈ structural design క్లిష్టమైనది. నిర్మాణంలో వారు అనుసరించిన construction టెక్నాలజీ వినూత్నమైనది.

హూవర్ డ్యాం schematic diagram

3) సాగునీటికి సంబంధించి.. ఇక్కడి నదులకు మన నదులకు పోలికే లేదు. ఇక్కడి వ్యవసాయానికి మన వ్యవసాయానికి పోలిక లేదు. ఇంజనీరింగ్ సైన్స్ & టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా తేడా లేదు. అయితే భారీ యంత్రాలను ఇక్కడ ఉపయోగిస్తున్నట్టు మన దేశంలో ఉపయోగించము. మనం మానవ శ్రమ మీద ఎక్కువ ఆధారపడతాము. వారు భారీ యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ యంత్రాల వినియోగం బాగానే జరిగింది. కాబట్టే మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయగలిగినాము. ఈ స్థాయిలో టెక్నాలజీ వినియోగం మనకు ఎప్పటికీ సాధ్యం అవుతుందో చెప్పలేము.

4) ఈ ఫోటోలో ఉన్నది హూవర్ డ్యాం వద్ద ఉన్న ఒక కుక్క సమాధి. ఈ కుక్క డ్యాం నిర్మాణం జరిగేటప్పుడు కార్మికులతో పాటు డ్యాం వద్దకు వచ్చేదట. అది వారి ప్రియ నేస్తం. ఒకరోజు ట్రక్ కింద నలిగి చనిపోయింది. దాని జ్ఞాపకార్థం డ్యాం వద్ద సమాధి నిర్మించారు.

కొలరాడో నది:

కొలరాడో నది ఉత్తర అమెరికా ఖండం నైరుతీ ప్రాంతంలో ప్రవహించే పెద్ద నదుల్లో ఒకటి. హూవర్ డ్యామును నిర్మించకముందు కొలరాడో బేసిన్‌లోని దిగువ రాష్ర్టాలైన కాలిఫోర్నియా, ఆరిజోనా, నెవెడా రాష్ర్టాలు వరదలతో అతలాకుతల మయ్యేవి. 1905లో కొలరాడో నదికి వచ్చిన వరదల్లో కాలిఫోర్నియా రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరద నష్టాల నుంచి రైతులను కాపాడటానికి, పునరావాసానికి అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టవలసి వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం కొలరాడో నది నుంచి వృథాగా సముద్రానికి తరలిపోతున్ననీటిని నిల్వ చేసుకొని వరదలను నియంత్రించడమే కాకుండా వ్యవసాయాభివృద్ధికి వినియోగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటగా కొలరాడో నదిపై కొన్ని చిన్న డ్యాముల నిర్మాణం జరిగింది. 1920 నాటికి నదిలో లభ్యమయ్యే జలరాశిని నిల్వ చేయగలిగే ఒక పెద్ద జలాశయాన్ని నిర్మిస్తే తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరయని కాలిఫోర్నియా, నెవెడా, ఆరిజోనా రాష్ర్టాల ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న లాస్ ఏంజిల్స్, నెవెడా రాష్ట్రంలో లాస్‌వేగస్, ఆరిజోన రాష్ట్రంలో ఫీనిక్స్ నగరాలు, ఇత ర పట్టణాల్లో గృహ, పారిశ్రామిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి కూడా పెద్ద డ్యాం అవసరమనే భావన బలపడింది.

కొలరాడో నది పొడవు 1450 మైళ్ళు(2330 కి మీ). నది పరివాహక ప్రాంతం 6,40,000 చదరపు కి మీ. 97% పరివాహక ప్రాంతం అమెరికాలో ఉండగా 3% మెక్సికో ఉన్నది. కొలరాడో నదిలో 85 నుంచి 90% ప్రవాహాలు ఎండాకాలం మంచు కరిగినందువలన చేరేవి. 10 నుంచి 15% ప్రవాహాలు ఎండాకాలంలో కురిసే వర్షాలు, భూగర్భ ప్రవాహాల (Sub Surface flows) ద్వారా నదిలోకి చేరుతాయి. నదిలో ఏటా సరాసరి 22,500 క్యూసెక్కులు ప్రవహిస్తాయి. అయితే ప్రతీ ఏటా ఎండాకాలంలో ఒక లక్ష క్యూసెక్కులకు పైనే ప్రవహించే సందర్భాలు కూడా ఉంటాయి. 1884 సంవత్సరంలో అత్యధికంగా 3,84,000ల క్యూసెక్కులు ప్రవహించినట్టు రికార్డు అయ్యింది. మన గోదావరి, కృష్ణా నదుల్లో వర్షాకాలం నాలుగు నెలల్లో ప్రవహించే నీటి పరిమాణంతో పోలిస్తే కొలరాడో నదీ ప్రవాహాలు చాలా తక్కువనే చెప్పాలి. గోదావరిలో పోలవరం వద్ద సగటు ప్రవాహాలు 83,500 క్యూసెక్కులు, కృష్ణా నదిలో సగటు ప్రవాహాలు 81,750 క్యూసెక్కులు. అయితే అమెరికా ఖండంలో ప్రవహించే నదులన్నీ సంవత్సరం అంతా ప్రవహిస్తాయి. మన నదుల్లో సంవత్సరానికి 5,6 నెలలు మాత్రమె ప్రవాహాలు ఉంటాయి.

కొలరాడో నదీ జలాల పంపకం:

డ్యాం నిర్మాణం జరిగితే కాలిఫోర్నియా రాష్ట్రం అత్యధికంగా ప్రయోజనాలను పొందనున్నదన్న అనుమానం బేసిన్‌లో ఉన్న ఇతర రాష్ట్రాలు వ్యక్తం చేసినాయి. ఈ అనుమానాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం పురమాయింపుతో వాణిజ్య కార్యదర్శిగా (Secretary of Commerce) ఉన్న హెర్బర్ట్ హూవర్ నేతృత్వంలో కొలరాడో రివర్ బేసిన్లో ఉన్న ఏడు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి చర్చలు మొదలయినాయి. సుదీర్ఘ చర్చల అనంతరం 1922 లో రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాన్నే Colorado River Compact-1922 గా పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం కొలరాడో నదిలో ప్రతీ ఏటా లభ్యమయ్యే నీరు 16.5 Million Acre feet (718.74 TMC) అని లెక్క గట్టారు. ఈ నీటిని బేసిన్‌లో ఉన్న ఎగువ రాష్ట్రాలకు (కొలరాడో, ఉటా, న్యూ మెక్సికో, వ్యోమింగ్), దిగువ రాష్ట్రాలకు (ఆరిజోనా, కాలిఫోర్నియా, నెవెడా) సరి సమానంగా 7.5 Million Acre feet (326.70 TMC) కేటాయించినారు. కొద్ది పాటి నీటిని మెక్సికో దేశానికి కూడా ఇవ్వాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరిజోనా రాష్ట్రానికి ఈ ఒప్పందం పట్ల అభ్యంతరాలు ఉన్నప్పటికీ డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆరు సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందం ఆధారంగా కొలరాడో నదిపై దిగువన ఆరిజోనా, నెవెడా రాష్ట్రాల సరిహద్దులో బౌల్డర్ అనే ప్రాంతంలో డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ 1928 అమెరికా కాంగ్రెస్ ఒక చట్టాన్ని చేసింది. అదే బౌల్డర్ కాన్యాన్ ప్రాజెక్ట్ చట్టం -1928 (Boulder Canyon Project Act -1928). డ్యాంకు కొలరాడో రివర్ డ్యాం గా నామకరణం చేసారు.(1941 లో ఈ డ్యాంకు హెర్బర్ట్ హూవర్ పేరు మీద హూవర్ డ్యాం గా, జలాశయాన్ని బ్యూరో మొదటి కమీషనర్, ఇంజనీర్ డా. ఎల్ వుడ్ మీడ్ పేరు మీద మీడ్ లేక్ అని నామకరణం చేసారు.) డ్యాం నిర్మాణానికి నాలుగు లక్ష్యాలను చట్టంలో పేర్కొన్నారు. 1) వరద నియంత్రణ 2) వ్యవసాయానికి, గృహ , పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం 3) విద్యుత్ ఉత్పత్తి 4) దేశీయ జల రవాణా అభివృద్ధి.

హూవర్ డ్యాం నిర్మాణం:

బ్యూరో ఇంజనీర్లు తమ మేధస్సును ధారపోసి డ్యాం డిజైన్లను రూపొందించినారు. వందలాది చిత్ర పటాలను తయారు చేసినారు. డ్యాం నిర్మాణానికి పక్కా కార్యాచరణ తయారు చేసినారు. హూవర్ డ్యాం ఎత్తు 726 అడుగులు, పొడవు 1,244 అడుగులు, డ్యాం అడుగున వెడల్పు 660 అడుగులు, పైన వెడల్పు 45 అడుగులు. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1243 TMC లు. జలాశయం విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు. జలాశయం పొడవు 180 కి మీ. డ్యాం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2080 మెగావాట్లు. 1931 లో డ్యాం నిర్మాణం ప్రారంభం అయ్యింది. డ్యాం నిర్మాణం ప్రారంభం అయ్యే నాటికి కొలరాడో ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన హెర్బర్ట్ హూవర్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఆయన ప్రోత్సాహంతో డ్యాం నిర్మాణం 1935లో పూర్తి అయ్యింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసి డ్యాంని అనుకున్న సమయాని కన్నా రెండేండ్ల ముందుగానే పూర్తి చేయగలిగినారు.

ముందు నుంచి హూ వర్ డ్యాం దృశ్యం

డ్యాం నిర్మాణం కోసం బ్యూరో ఇంజనీర్లు అనేక సాంకేతిక ఆవిష్కరణలు చేసినారు. ఈ ఆవిష్కరణలు హూవార్ డ్యాం నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా డ్యాంల నిర్మాణ సాంకేతికతకు కొత్త చేర్పులుగా ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లకు ఉపయోగపడినాయి. అటువంటి ఆవిష్కరణలు కొన్ని:

  • 30 మంది ఒకేసారి మూడు అంతస్తుల్లో డ్రిల్లింగ్ చేయడానికి ఒక జుంబో యంత్రాన్ని ప్రవేశపెట్టారు.
  • డ్యాం ని monolithic గా కాకుండా ఇంటర్ లాకింగ్ బ్లాకులుగా (Inter Locking Blocks) కాంక్రీట్‌ని వేయడం జరిగింది. ఈ పద్ధతి వలన డ్యాం నిర్మాణం వేగవంతం అయ్యింది.
  • డ్యాం నిర్మాణ ప్రాంతం ఎండా వేడిమి ఎక్కువగా ఉండే ఎడారి ప్రాంతం. కాంక్రీట్ క్యూరింగ్ కోసం పైపుల చల్లటి నీటిని సరఫరా చేసినారు.
  • డ్యాం ని ఎత్తైన లోయలో నిర్మిస్తున్న కారణంగా Aerial cable way system అభివృద్ధి చేసినారు.
  • పెద్ద ఎత్తున కాంక్రీట్ ఉత్పత్తి కోసం అత్యాధునిక Batching plants ని నిర్మించారు. అంతకు ముందు ఇటువంటి కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్స్ లేవు.
  • బండ రాళ్ళ నుంచి రక్షణ కోసం కార్మికులకు గట్టి హెల్మెట్లను రూపకల్పన చేసినారు.

హూవర్ డ్యాం ఫలితాలు:

డ్యాం నిర్మాణానికి 2.60 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 18 మిలియన్ టన్నుల స్టీల్‌ని వినియోగించినారు. ఈ కాంక్రీట్‌తో శాన్ ఫ్రాన్సిస్కో నగరం నుంచి న్యూయార్క్ నగరానికి నాలుగు లేన్ల రోడ్డును నిర్మించవచ్చు. ఇంత పెద్ద డ్యాం ని నిర్మించడం ఆనాటి బ్యూరో ఇంజనీర్లకు ఒక సవాలుగా నిలచింది. హూవర్ డ్యాం నిర్మించిన కాలం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ఆవరించిన కాలం. డ్యాం నిర్మాణానికి 21 వేల మంది కార్మికులు నిరంతరం పని చేసారు. 96 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్యాం నిర్మాణం పూర్తి అయిన తర్వాత అది అది తన లక్ష్యాలను నెరవేర్చడంలో సఫలం అయ్యింది. అరిజోన, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో తరచుగా సంభవించే వరదల పీడ పోయింది. ఆరిజోనా, కాలిఫోర్నియా, నెవెడా రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ఆరిజొనా రాష్ట్రంలో లాస్ వేగాస్, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏంజిల్స్ వంటి నగరాల, అనేక పట్టణాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తున్నది. విద్యుత్తును అందిస్తున్నది.

హూవర్ వెనుక ఏర్పాటు అయిన లేక్ మీడ్

ఈ డ్యాం నిర్మాణం ద్వారా వచ్చిన అనుభవంతో అమెరికాలో అన్ని ప్రధాన నదులపై అనేక డ్యాంల నిర్మాణం నిర్మాణం చేపట్టినారు. 1942లో కొలంబియా నదిపై గ్రాండ్ కూలీ (Grand Coulee) డ్యాం నిర్మాణం పూర్తి అయింది. 1940-80 మధ్య కాలంలో కొనసాగిన ఈ డ్యాంల నిర్మాణంతో 1940 తర్వాత అమెరికాలో వ్యవసాయ విస్తరణ వేగంగా కొనసాగింది. వ్యవసాయాభివృద్దిని అంచనా వేయడానికి హూవర్ డ్యాంకి ముందు, తర్వాత అన్న అంశం విశ్లేషకులకు ప్రామాణికంగా మారింది. 1940కి ముందు అమెరికాలో డ్యాంల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. అది 1978 నాటికి 40 million acre feet (1742 TMC) లకు పెరిగింది. 1940 తర్వాత దేశ వ్యాప్తంగా బ్యూరో వారు నిర్మించిన డ్యాంల వలన సాగునీరు అందుబాటులోకి వచ్చింది. దీని ఫలితంగా సాగునీరు అందే ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 1910 – 1940 మధ్య కాలంలో 20 మిలియన్ల ఎకరాల సాగు భూమి స్థిరంగా ఉన్నది. 1940–78 మధ్య కాలంలో అది 43 మిలియన్ ఎకరాలకు పెరిగింది. ఇది అమెరికాలో సాగు అవుతున్నమొత్తం విస్తీర్ణంలో 7.5% అయినప్పటికీ మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో 55% విలువ కలది కావడం గమనార్హం. అంటే 1940 తర్వాత అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కల్పించిన వసతుల కారణంగా సాగు విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తుల విలువ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అభివృద్ధి అమెరికా అంతటా కనిపించినప్పటికీ పశ్చిమ అమెరికాలో ఉన్న రాష్ట్రాల్లో మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది. పశ్చిమ అమెరికా రాష్ట్రాల్లో బ్యూరో ఇంజనీర్లు, అమెరికా సైనిక ఇంజనీర్లు, రాష్ట్ర ప్రభుత్వాల సాగునీటి సంస్థలు నిర్మించిన పెద్ద డ్యాంలు, సాగు నీటి ప్రాజెక్టులు 180 ఉన్నాయని, వీటి ద్వారా వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నీటి సరఫరా జరుగుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కూడా హూవర్ డ్యాంని అమెరికా ఏడు సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా పరిగణించింది.

అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సందేశం:

డ్యాం నిర్మాణం పూర్తి అయ్యే నాటికి అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ డి రూస్వేల్ట్ (Franklin D Roosevelt) ఎన్నిక అయినారు. సెప్టెంబర్ 30, 1935 న హూవర్ డ్యాం ని జాతికి అంకితం చేస్తూ ఆయన అన్న మాటలని మననం చేసుకోవడం అవసరం.

హూవర్ డ్యాం జాతికి అంకితం చేస్తూ ప్రసంగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్

“ఈ రెండేండ్లలో ఈ అమెరికా జాతీయ ప్రాజెక్టులో ఎంతో సాధించినాము. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా అమెరికాకే కాదు యావత్ మానవ జాతికే మేలు చేసినాము. దేశంలో వ్యవసాభివృద్దికి, పారిశ్రామికాభివృద్దికి పునాదులు వేసినాము. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మనం వెచ్చించిన పెట్టుబడుల ఫలితాలు లబ్ధిదారులకు చేరుతాయి. వారు దేశంలో పరిశ్రమలను ప్రారంభిస్తారు. వాణిజ్యాన్ని పెంపొందిస్తారు. శ్రమశక్తి సంపదను సృష్టిస్తుంది. నిర్మాణాలలో వినియోగించే వస్తువులు సంపద సృష్టికి దోహదం చేస్తాయి. వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి. బౌల్డర్ డ్యాం అందుకు ఒక ప్రభలమైన ప్రతీక. ఇప్పటిదాకా అపారమైన కొలరాడో జలరాశి వృథాగా సముద్రంలోకి పరుగెడుతున్నాయి. ఈరోజు నుంచి ఆ జలరాశి మన జాతీయ సంపదగా రూపు దాల్చింది. ఈ రోజు బౌల్డర్ డ్యాం ని జాతికి అంకితం చేస్తున్నాను. ఇది మన ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ఒక గొప్ప విజయం. అమెరికా జాతి శక్తియుక్తులు, సంకల్ప బలం సాధించిన అద్భుత విజయం. ప్రాజెక్టు పనిలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.”

హూవర్ డ్యాం ను జాతికి అంకితం చేసినప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలకం
హూవర్ డ్యాం నిర్మాణంలో అసువులు బాసిన వారి స్మారకం

హూవర్ డ్యాంని జాతికి అంకితం చేసిన సందర్భంలో డ్యాం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో డ్యాం నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్ల పేర్లను కూడా రాసినారు. డ్యాం నిర్మాణంలో పాలుపంచుకున్న వారి కోసం ఒక స్మారకం, డ్యాం నిర్మాణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఇంజనీర్ల కోసం ఒక స్మారకం డ్యాం వద్ద ఏర్పాటు చేయడం గొప్ప విషయం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here