అమెరికా సహోద్యోగుల కథలు -3: ఈనాటి విక్రమార్కుడు

0
11

[box type=’note’ fontsize=’16’] “అప్లై చెయ్యడానికి అర్హత పొందిన వయసు నుంచీ పాల్ ప్రయత్నిస్తూనే ఉన్నా, వ్యోమగామిగా సెలక్ట్ అయింది మాత్రం వయసు నిబంధన ననుసరించి నాసా అనుమతించిన చివరి ప్రయత్నంలో” అని తన సహోద్యోగి ‘పాల్ రిచర్డ్స్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ [/box]

[dropcap]పా[/dropcap]ల్ రిచర్డ్స్ అంతరిక్ష యాత్రికుడు. 2001 లో స్పేస్ షటిల్ ఫ్లయిట్ STS-102 లో రోదసియాత్ర చేసివచ్చాడు. అంతరిక్షంలో అతను గడిపింది 307 గంటలపాటు. అందులో 6.4 గంటలపాటు స్పేస్ స్టేషన్ బయట. ఆ సమయంలో గర్భంలో ఉండే శిశువు ప్రాణానికి ఆధారమయిన బొడ్డుతాడు వంటిదే అతని స్పేస్ సూటుని స్పేస్ స్టేషన్ కి కలిపి రక్షణని కలుగజేసింది. అనంతరం, అతను ప్రభుత్వంలో కాకుండా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చెయ్యడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కణ్ణించీ నేను పనిచేస్తున్న GOES-R శాటలైట్ ప్రాజెక్టుకి అబ్సర్వేటరీ మేనేజర్ పొజిషన్లో నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లో 2004 లో చేరాడు. ఆ ఉద్యోగ నిర్వహణ విధిలో అతను స్పేస్‌క్రాఫ్ట్ తయారు చేస్తున్న కంపెనీ పనిని సక్రమంగా, బడ్జెట్టు పరిమితిలో ఉంటూ, సకాలంలో పూర్తి చేసేలా చూడాలి. ఇది ప్రభుత్వం డబ్బుతో చేస్తున్న ప్రాజెక్టు కాబట్టీ, ఈ శాటలైట్ ద్వారా వెలువడే భూమిమీది వాతావరణ సమాచారాన్ని వాడుకుని రాబోయే కొన్ని గంటలనించీ ఆ తరువాత కొన్ని రోజులదాకా వాతావరణ సూచనలని దేశంలోని అన్ని ప్రాంతాలకీ అందజేస్తారు గనుకా, లాంచ్ అయ్యేదాకానే కాక శాటలైట్ తన కక్ష్యలోకి చేరిన తరువాత కూడా దీని అభివృద్ధిని దేశంలో అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. పైగా, GOES-R అనేది ఒక్క శాటలైట్ కాదు. ఒకలాగే వుండే నాలుగు నమూనాల సీరీస్.

నేను మొదటిసారి అంతరిక్ష యాత్రీకుణ్ణి చూసింది ఐఐటీ మద్రాసులో బి.టెక్ చదువుతున్నప్పుడు. ప్రతీ బుధవారం మధ్యాహ్నం జరిగే సెమినార్లల్లో భాగంగా. (ఈ సెమినార్ల గూర్చి ఉపోద్ఘాతంలోనే విశదీకరించానని మీకు గుర్తుండే వుంటుంది. పబ్లిక్ అవుట్రీచ్ కింద నాసా వ్యోమగాములు ప్రపంచమంతా తిరుగుతూ తమ అనుభవాలను పంచుకుంటూంటారని – ముఖ్యంగా విద్యార్థులలో స్పేస్ ప్రోగ్రాం మీద ఆసక్తిని కలిగించడంకోసం – నా ప్రస్తుత ఉద్యోగంలో తెలుసుకున్న విశేషం.) 1981 లోనో లేక 1982 లోనో అయ్యుండాలి. చంద్రమండలానికి వెళ్లి తిరిగివచ్చినవాడు ఆ రోజు ఉపన్యాసకుడు గనుక ఆ రోజు ఆడిటోరియం క్రిక్కిరిసిపోయింది. మొదటి ఇరవై నిముషాలో లేక అరగంటో స్లైడ్స్ చూపిస్తూ అతని యాత్రా విశేషాలు చెప్పాడు. తరువాత, దాదాపు అంతసేపూ ఆ యాత్ర అతణ్ణి ఎలా జీసస్ క్రైస్ట్ వైపు మళ్లించిందో చెప్పాడు. జీసస్ గూర్చి చెప్పినంత సేపూ ఆనాడు ఇదేమిట్రా బాబూ, అంతరిక్ష యాత్రీకుడేమిటి, ఈ మతప్రచార మేమిటి అని అనుకున్నాం. చంద్రుని మీద నిల్చుని చూసినప్పుడు భూమి పరిమాణం తన బొటనవేలి గోరంత మాత్రం ఉండడం, అనంత విశ్వంలో మనం అనుకునే నలుసులకన్నా ఎంత చిన్న పరిమాణం కలిగి ఉన్నామో అన్న జ్ఞానోదయం చేకూరిన తరువాత కొంతమంది మానవుడి ప్రతిభకీ, ఈ అనంత సృష్టికీ అచ్చెరు వందితే, మరి కొంతమంది దేవుడిమీదా, మతంమీదా నమ్మకాన్ని పెంచుకోవచ్చని ఈమధ్య ఆలోచిస్తే అర్థమయింది. (గూగుల్ చేస్తే ఆనాడు ఉపన్యాస మిచ్చింది జేమ్స్ ఇర్విన్ అన్న రోదసి యాత్రికుడు అయివుంటాడని అనిపించింది. 1971 లో అపోలో 15 లో ప్రయాణించిన అతను దాదాపు పదేళ్లలో ఐఐటి, మద్రాసు కొచ్చి ప్రసంగించాడని ఈనాడు తలచుకుంటేనే ఆశ్చర్య మేస్తుంది, అతని ప్రసంగాన్ని ఏర్పాటు చేసిన ఐఐటి మేనేజ్మెంట్ కి జోహారు లర్పించా లనిపిస్తుంది.) ఆ బాక్‌గ్రవుండ్‌లో చూస్తే పాల్ రిచర్డ్స్ తిరిగి వచ్చిన కూడా తరువాత నేలమీద రెండు కాళ్లూ ఆనించే ఉన్నాడని అర్థమవుతుంది.

పాల్ రిచర్డ్స్ సునిశితంగా ఆలోచించే వ్యక్తి. రోదసి యాత్రీకులకి ఇచ్చే ట్రైనింగ్ లో ప్రాసెస్ ని ఫాలో అవడానికి ఇచ్చే ప్రాధాన్యత విలువ చెప్పనలవి కాదు. మానవ మాత్రులనించీ ఏ సహాయాన్నీ అందుకోవడానికి వీలవనంత దూరంగా ఉన్నప్పుడు వాళ్లకి అండ అదే. ఆ ట్రైనింగ్ పొందివున్నాడు గనుక ప్రాసెస్ కి ఇచ్చే ప్రాధాన్యతతో బాటు పాల్ ఎదుటివాళ్ల అభిప్రాయాలకి విలువనిస్తూ, వాటిల్లో లోపాలున్నట్లు తనకి అనిపిస్తే ఛాలెంజ్ చేస్తూ, గౌరవానికి భంగం కలుగనివ్వకుండా సంయమనం పాటించాడు. ఎవరి నయినా సరే, ఛాలెంజ్ చెయ్యడం అనేది ఎంతో దృఢ మయిన ఆత్మవిశ్వాసం ఉంటే గానీ సాధ్యం కాదు. దానికి, ఏదయినా సాధించాలనే పట్టుదల అతనికి ఆలంబన.

ఆ పట్టుదలే 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగుపెట్టడాన్ని లైవ్ టెలికాస్ట్ లో టీవీలో చూసినప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలని పాల్‌కి కలిగిన కోరికని సాధించేలా చేసింది. ప్రతీ ఏడాదీ నాసా లాటరీ వేసి కొంతమంది అంతరిక్ష యాత్రీకులని సెలక్ట్ చేసుకుంటుంది. ఒకసారి సెలక్ట్ అవనివాళ్లు మళ్లీ తరువాత సంవత్సరం, అప్పుడూ రాకపోతే ఆ పై  సంవత్సరం చొప్పున వయసు పరిమితిని చేరేదాకా ప్రయత్నించవచ్చు. అప్లై చెయ్యడానికి అర్హత పొందిన వయసు నుంచీ పాల్ ప్రయత్నిస్తూనే ఉన్నా, సెలక్ట్ అయింది మాత్రం వయసు నిబంధన ననుసరించి నాసా అనుమతించిన చివరి ప్రయత్నంలో.  ఆ విధంగా పాల్ ని విసుగు చెందని విక్రమార్కుడితో పోల్చవచ్చు.

దాదాపు 2000 సంవత్సరంలో మొదలయిన GOES-R ప్రోగ్రాంలో నాలుగు శాటలైట్లలో మొదటిదాన్ని నవంబర్ 19, 2016లోనూ, రెండవదాన్ని మార్చి 1, 2018లోనూ లాంచ్ చేశారు. దేశానికి ప్రతిష్ఠాత్మక మయిన సీరీస్ లో మొదటి శాటలైట్ గనుక 2016 లాంచ్ అట్టహాసంగానే జరిగింది. అప్పటికి పాల్ మా ప్రోగ్రాంనించీ వేరే ప్రోగ్రాంకి మారి కొన్నేళ్లయింది. ఫ్లారిడాలోని కెనెడీ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లో జరిగే ఈ లాంచ్ చూడడానికి దాదాపు పదివేలమంది వచ్చివుంటారని అంచనా. వాళ్లల్లో, ఏదో విధంగా సంబంధం ఉంటే తప్ప ఈ ప్రోగ్రాం గూర్చే గాక ఈ శాటలైట్ గూర్చి కూడా వివరాలు తెలిసే అవకాశం చాలా తక్కువ. పనిచేసినవాళ్ల కుటుంబ సభ్యులతో కలిపి ఈ శాటలైట్ వివరాలు తెలియనివాళ్ల శాతం 90కి పైగానే ఉంటుంది. ఒక్క శాటలైట్ లాంచ్ ని కూడా చూడనివాళ్లు నాలాగా చాలామందే ఉన్నారు. వాళ్లకి సమాచారా న్నందించడానికి పబ్లిక్ అవుట్రీచ్ కింద కొంతమంది రోదసీయాత్రీకులకి ఆ రోజు అక్కడ డ్యూటీ వేశారు. ఒకసారి అంతరిక్షంలోకి వెళ్లివచ్చినవాళ్లు ఎప్పటికీ అంతరిక్షయాత్రీకులే! అందుకని వాళ్లు పబ్లిక్ తో కలిసేటప్పుడు ఆ వ్యోమగామి సూటులో కనిపిస్తారు. అయితే, అంతరిక్షయాత్రీకుని సూటులో పాల్ వచ్చి వెనకనించీ భుజం తట్టి పలుకరించేదాకా ఆ రోజు అతనక్కడ ఉంటాడని నాకు తెలియదు. అతణ్ణి ఎప్పుడూ సహోద్యోగిగానే అనుకున్నాను కాబట్టి అతనితో కలిసి ఫోటో దిగాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు కూడా అంతే. వెళ్లి స్పీచ్ ఇవ్వాలని తొందరపడుతూనే మా అబ్బాయి విరించితో ఫోటో దిగాడు.

పాల్ ఎంత నిగర్వి అంటే – నేను అతని గూర్చి రాస్తానన్న విషయాన్ని అతనికి చెప్పకుండా అతనితో మాట్లాడాలని, అతనికి వీలయినప్పుడు వచ్చి కలుస్తానని మాత్రమే ఈమెయిల్ పంపాను. ముఖతః చెప్పాలని సంకల్పం. ఏకంగా నా ఆఫీసుకే వచ్చి నన్ను కలిసినప్పుడు మాత్రం ఆఫీసు మా కాంపస్ లోనే ఉన్నా గానీ అతను వాషింగ్టన్, డి., సి., లో ఉన్న నాసా హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నాడని తెలిసింది.

పాల్ ఒక యూనివర్సిటీలో బోర్డు మెంబర్. ఆ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విద్యార్థులకి, అందులోనూ నాసాలో పనిచెయ్యాలనీ, అక్కడి వాతావరణాన్ని స్వయంగా చూడాలనీ ఆసక్తి ఉన్నవాళ్లకి, కో-ఆప్ ప్రోగ్రాం కింద కొంతమందికి మూడు, నాలుగు నెలలపాటు నాసాకి వచ్చివుండే అవకాశాన్ని కలుగజేశాడు. అతను ఈనాడు మా ప్రోగ్రాంలో పనిచెయ్యకపోయినా గానీ, ఇంకా విద్యార్థులు వస్తూనే వున్నారు. వాళ్లు కో-ఆప్ ప్రోగ్రాం అయిన తరువాత వెనక్కి వెళ్లే ముందర తమ అనుభవాలను మాతో పంచుకుంటారు. ఒకతను, “నాసాలో ఎలాంటివాళ్లుంటారో అనుకున్నాను. ఇక్కడ ఉన్నది మామూలు మనుషులేనని తెలిసింది!” అని చెప్పడం మాత్రం మరపురానిది. పాల్‌తో పనిచేసిన అనుభవమూ అలాంటిదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here