అమెరికా సహోద్యోగుల కథలు -4: పిల్లల పాలిటి పెన్నిధి

0
9

[box type=’note’ fontsize=’16’] “డిసెంబర్ 2017లో వ్యాన్ రిటయిరయ్యాడు. అంత గొప్ప వ్యక్తిని రోజూ కలిసే అవకాశం ఇంక లేదు” అని తన సహోద్యోగి ‘వ్యాన్ జాన్సన్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]

[dropcap]ఈ[/dropcap]నాడు డెభ్భయ్యవ పడిలో ఉన్న వ్యాన్ జాన్సన్ ఆరున్నర అడుగుల వ్యాయామం చేకూర్చిన దేహదార్ఢ్యంతో కనీసం ఇరవయ్యేళ్లు చిన్నవాడిగా అనిపిస్తాడు. ఆఫ్రికన్ అమెరికన్. సబ్జెక్టులో దిట్ట. దాదాపు పాతికేళ్ల పరిచయం మాది. ఇరవయ్యేళ్లకి పైగా ఫోస్టర్ కిడ్స్ ని అతనూ, భార్యా సాకుతున్నారంటే కలిగే ఆశ్చర్యం, ఆ పిల్లల సంఖ్య వందకు దాటిందంటే – అది కూడా వాళ్లకు పుట్టిన పిల్లలే పెరిగి పెద్దవుతున్న సమయంలో – కొన్ని రెట్లు ఇనుమడింపక మానదు.

డేటింగ్ సమయంలోనే అతని భార్య ఫోస్టర్ కిడ్స్ ని పెంచుదాం అన్నదట. అప్పుడతను అంతగా పట్టించుకోలేదు గానీ, వాళ్ల పిల్లలకి ఒక వయసు రాగానే ఆమె “ఇప్పుడు” అనేసరికి, ఆమె కమిట్మెంట్ గూర్చి అతను నివురు అనుకున్న స్థానంలో నిప్పు కనిపించిందట.

ఫోస్టర్ కిడ్స్ అంటే దత్తత తీసుకున్నవాళ్లని కాదు. తల్లిదండ్రులు సాకలేనప్పుడో, తల్లి డ్రగ్ అడిక్ట్ అవడంవల్లనో, లేక ఆ కుటుంబంలో మనుగడకే ముప్పు అని సోషల్ వర్కర్లు నిర్ధారించినప్పుడో, దత్తత తీసుకునేవాళ్లు దొరికేదాకా పిల్లలకి వాడే పేరది. అప్పుడే పుట్టినవాళ్ల దగ్గరనుంచీ పదహారేళ్ల వయసున్నవాళ్ల దాకా ఆ వందమందిలో ఉన్నారన్నాడు వ్యాన్.

ఆ పిల్లలతో అనుబంధం శాశ్వతం కాదని తెలిసినా, రక్త సంబంధం ఏమాత్రం లేకపోయినా, రోజుల వయసుతో మొదలుపెట్టి, మూడు సంవత్సరాల వయసుదాకా ఉన్న పిల్లలకి తమ పిల్లలకు లాగే అర్థరాత్రివేళ పాలుపట్టడాలూ, డైపర్లు మార్చడాలూ, ఏడిస్తే సముదాయించడాలూ చెయ్యడంతో బాటు అవసర మయినప్పుడు డాక్టర్ల దగ్గరకి తీసుకెళ్లడాలూ కూడా చేశారంటే, మానవత్వాన్ని మించిన దేదో ఆ దంపతుల్లో ఉన్న దనిపిస్తుంది. ఒక్కోసారి డాక్టర్ డయాగ్నోసిస్ తప్పని అతని భార్య చెప్పడమే గాక నిరూపించిందంటే ఆమె ఆ డిగ్రీ లేని పీడియాట్రీషియన్ అనుభవాన్ని ఎంత మంది పిల్లలని సాకి గడించిందో అర్థమవుతుంది.

అతనికి బాగా గుర్తుండిపోయిన పిల్ల లిద్దరు.

కలిసి గడిపింది కొన్ని నెలలే అయినా పదహారేళ్ల వయసున్న అమ్మాయి ఒకతె. ఆమె గర్భవతని తెలిసి ఆ పిల్ల తండ్రి ఆమెని ఒక చర్చి ముందు వదిలేసి వెళ్లాట్ట. ఆ చర్చ్ ఫాదర్ అక్కడికి వెళ్లే వ్యాన్ని పిలిస్తే, ఆమెని ఇంట్లో ఉంచుకుని పోషణ బాధ్యతని ప్రసవం అయ్యేదాకా స్వీకరించారు ఈ దంపతులు. ప్రసవం అయిన తరువాత హాస్పిటల్లో ఆమెని చూడడానికి వచ్చిన చుట్టపక్కాలు “నీకు మేమున్నాం” అని భరోసా ఇచ్చారట గానీ, ప్రపంచపు పోకడలు తెలిసిన వ్యాన్ మాత్రం, “నువ్వు మా ఇంట్లో గడిపిన సమయంలో వీళ్లెవరికీ నువ్వున్నావన్న సంగతి ఎరిక లేదన్నది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి!” అని చెప్పాట్ట. ఆ అమ్మాయి హాస్పిటల్ నించీ తనవాళ్ల దగ్గర కెళ్లిపోయిందనీ, తరువాత కాంటాక్ట్ ఏదీ లేదనీ అన్నాడు. ఒకసారి వెళ్లిపోయిన తరువాత వాళ్లని కాంటాక్ట్ చెయ్యకూడ దనే నియమాన్ని ఫోస్టర్ పారెంట్స్ పాటించాలట. అందుకే వాళ్లతో మితిమీరి బంధనాలని పెంచుకోకూడ దన్నాడు.

అయితే, ఆ బంధనాలని పెంచుకోవడాన్ని తప్పనిసరి చేసింది దాదాపు మూడు సంవత్సరాలు వాళ్లతో గడిపిన ఒక  పిల్లాడు. వారాల వయసునుంచీ ఆ మూడు సంవత్సరాలూ అతను వాళ్లతోనే ఉన్నాట్ట. సాన్నిహిత్యం పెరిగే కొద్దీ బంధం తెంచుకోవడం కష్ట మవుతుందని వాళ్లకి తెలుసు. అతని చర్చ్ కుటుంబంలోవాళ్లు కూడా అతనికి అదే చెప్పారట. అయితే, ఆ పిల్లవాణ్ణి అతని అధీనంలో ఉంచిన ప్రభుత్వం అతణ్ణి దత్తత తీసుకొనే తల్లిదండ్రులని చూపేదాకా వీళ్లకి ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ పిల్లాడు వ్యాన్ కీ, అతని భార్యకీ మాత్రమే కాక వాళ్ల పిల్లలకి కూడా బాగా మాలిమి అయ్యాట్ట. ఆ సమయంలో దత్తత తీసుకోవడానికి ఒక జంట ముందుకొచ్చారు. దత్తతలో భాగంగా, పిల్లలకీ, దత్తత తీసుకునే జంటకీ మాలిమిని పెంచడానికి కొంతకాలాన్ని (వారాలు, లేదా నెలలు) కేటాయిస్తారు. ఆ కాలంలో వాళ్లు కలిసి గడిపే సమయాన్ని క్రమంగా పెంచుతూ, చివరికి పిల్లాడు (లేక పిల్ల) ఆ దత్తత తీసుకునే తల్లిదండ్రులవద్ద ఉండగలడు(దు) అని నిర్ధారణ అయిన తరువాత దత్తత కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.

ఈ పిల్లాడి దత్తత కార్యక్రమాన్ని నిర్వహించింది వ్యాన్ వాళ్లు వెళ్లే చర్చిలో. వ్యాన్ స్వంత కుటుంబమే గాక వాళ్ల చర్చి కుటుంబం కూడా దానిలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చివరి అంశం, వ్యాన్ మెడ చుట్టూ రెండు చేతులూ వేసివున్న పిల్లాణ్ణి అవతలి జంట తీసుకోవడం. ఆ పిల్లాడికి వ్యాన్ వాళ్ల కుటుంబంతో ఉన్న మాలిమిని ఎరిగినవాళ్లు గనుక చూస్తున్న అందరి కళ్లల్లో నీళ్లు. ఆ పిల్లాడు వ్యాన్ మెడని వదులుతాడా అనేది అందరికీ సందేహమే. వాళ్ల కెవరికీ తెలియని విషయ మేమిటంటే, చేతులు సాచిన దత్తత కుటుంబం దగ్గరికి ఆ పిల్లాడు స్వయంగా వెళ్లకపోతే, వీళ్లే అతన్ని దత్తత చేసుకోవడానికి నిర్ధారించుకుని ఉన్నారని. వ్యాన్ మెడని వదిలి ఆ పిల్లాడు స్వయంగా సాచిన చేతులవైపు వెళ్లేసరికి అందరికీ పెద్ద రిలీఫ్.

ఆ కార్యక్రమం అయిన తరువాత ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా వ్యాన్ తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కెళ్లాడు. అక్కడ వాళ్ల మధ్యలో కొంతసేపు నిశ్శబ్దం రాజ్య మేలిం దన్నాడు. తరువాత అది ఎలా బ్రేక్ అయిందో – ఎవరు ఏం అనడంవల్లనో – గుర్తు లేదన్నాడు గానీ, తరువాత డిన్నర్ మామూలుగానే అయిందన్నాడు.

ఈ వయసులో ఇంక ఫోస్టర్ కిడ్స్ కార్యక్రమాన్ని మానేద్దామా అని భార్య నడిగాట్ట ఈ మధ్య. వయసు తెచ్చే బాధలతో అర్ధరాత్రి పూట పాలు పట్టడానికి బెడ్ రూమ్ లెవెల్ నించీ కిచెన్ లెవెల్ కి మెట్లు దిగుతూ రావడం కష్ట మవుతోందన్న ఉద్దేశంతో. ఆమె ససేమిరా అనడంతో ఈ మధ్యనే బెడ్ రూమ్, కిచెన్ ఒకే లెవెల్లో ఉండే ఇంట్లోకి మారారు.

డిసెంబర్ 2017లో వ్యాన్ రిటయిరయ్యాడు. అంత గొప్ప వ్యక్తిని రోజూ కలిసే అవకాశం ఇంక లేదు. అతనికి ఫోన్ చేసి, నీతో మాట్లాడాలి అనగానే వచ్చి రెస్టారెంటులో కలిశాడు. అతని గూర్చి రాస్తానని చెప్పి ఫోటో అడిగితే పంపాడు. అతనితో, అతని భార్యతో గడిపిన ఆ వందకు పైగా ఫోస్టర్ కిడ్స్ లో మరీ చిన్నవాళ్లకి ఈ దంపతులు చేసిన సహాయం ఎప్పుడూ తెలియకపోవచ్చు, కొద్దిగా పెద్ద పిల్లలకి గుర్తుండకపోవచ్చు.  కానీ, భార్యతో కలిసి అతను సంఘానికి అందిస్తున్న పరిమళం దాన్ని చేరిన వాళ్లకి అది ఇంకా కావాలి అనేటట్లుగా చెయ్యగలిగితే, వాళ్లు ఇంకా ఎంతోమంది పిల్లలకి అందిద్దా మనుకుంటున్న సహాయానికి చేయూత నందించేలా చెయ్యగలిగే అవకాశ మున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here