అమెరికా సహోద్యోగుల కథలు-6: ఆనందపు చిరునామా పట్టేశాడు!

1
6

[box type=’note’ fontsize=’16’] “ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారనే నానుడికి ఇతనూ, ఇతని భార్యా నిజజీవితంలో ఋజువు లనిపించింది” అని తన సహోద్యోగి ‘నార్మన్ ఏకర్మన్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]

[dropcap]రొ[/dropcap]నాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు రూల్స్ మార్చేదాకా ప్రభుత్వోద్యోగులకి రిటయి రయిన తరువాత పెన్షన్ గారంటీ ఉండేది. రిటయిర్మెంట్ తీసుకుని, పెన్షన్ అందుకుంటూ కాంట్రాక్టర్ గా పనిచేసేవాళ్లకి ఇటు జీతమూ, అటు పెన్షనూ రావడంవల్ల రెండు విధాలుగా లాభం. ప్రభుత్వం కూడా వాళ్ల అనుభవాలని ఉపయోగించుకుంటూ లాభం పొందుతూ ఉంటుంది.

నార్మన్ ఏకర్మన్ తో నేను దాదాపు ఇరవయ్యేళ్లు పనిచేశాను. అతను థర్మల్ బ్రాంచ్ కి హెడ్ గా రిటయిరయి మా ప్రాజెక్టులో పనిచేశాడు. సరదా మనిషి. హిప్పీ జనరేషన్ వాడు. ఈ శతాబ్దం మొదటి దశకంలో పంధొమ్మిది వందల అరవయ్యవ దశకంనాటి తన జులపాల ఫోటో చూపిస్తే, ‘ఈనాడయితే టెర్రరిస్టు వని నిన్ను అరెస్టు చేసేవాళ్లు!’ అని చెప్పాం అతనికన్నా ఇరవై, ముఫ్ఫయ్యేళ్ల చిన్నవాళ్లం. ప్రాజెక్టులో పనిచేస్తున్న స్త్రీలమీద ఓపెన్ గానే విసుర్లు విసిరేవాడు. వాళ్లు కూడా అతనికి సమంగా జవాబు చెప్పేవాళ్లు. వయసులో ఉన్నవాళ్లు నగ్నంగా జరుపుకునే పార్టీల గూర్చి వినడం వేరు, తనూ, తన ఇప్పటి భార్యా ‘కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు (నలభయ్యేళ్లకి పైగా వెనుకటి సంగతి)  అలాంటి పార్టీల కెళ్లేవాళ్లం’ అని అతను చెప్పగా వినడం వేరు. విడాకుల తరువాత కూడా మొదటిభార్యతో సఖ్యతగానే ఉంటానని చెప్పాడు.

ఆ మొదటి భార్య కూతురూ, ఆమె భర్తా కూడా పెద్ద లాయర్లు. కూతురి తెలివితేటల గూర్చి అతనికి అపార మయిన గర్వం. ఆ తెలివితేటలు తన దగ్గర నుంచీ రాలేదని తనే చెబుతూంటాడు. మనవరాళ్ల తెలివితేటల గూర్చి కూడా. ఒకరోజు అతనూ, భార్యా పదేళ్ల మనవరాలిని తీసుకుని కారులో వెడుతుండగా వెనక సీట్లో కూర్చున్న ఆ పిల్ల ఎంత గొప్పగా పాడినదీ, తన కళ్లవెంట నీళ్లు ధారగా ఎలా కారినదీ, తను చర్చి క్వాయిర్లో పాడడం వల్ల ఆ అమ్మాయి ప్రతిభని గుర్తించగలిగినదీ చెప్పాడు. అందరూ స్టేజీ ఎక్కడానికి అర్రులు చాచే న్యూయార్క్ సిటీలోని బ్రాడ్‌వేలో ఒక మ్యూజికల్ లోని పాత్ర కోసం ఆ పిల్లని ఆడిషన్ చెయ్యడానికి ఆ బృందమే వాషింగ్టన్‌కి వస్తున్నారని ఎంతో గర్వంగా చెప్పాడు. సారంగలో వెలువడిన నా “రవి గాంచినది” కథలో గేరీ ఇతనే.

తను స్పష్టంగా, వ్యాకరణ దోషాలేమీ లేకుండా ఇంగ్లీషు రాస్తాడని అతని నమ్మకం. అందుకని, అతని రాతలో ఇంకొకళ్లు చేసే సవరణలని సహించడు. నేను చేసిన ఒక సవరణ గూర్చి వాదించి, చివరకు ఒప్పుకున్నాడు – ‘నువ్వు ఇంగ్లీషుని రెండవ భాషగా నేర్చుకోవడం వల్ల నీకు సరయిన అవగాహన ఉన్నది,’ అంటూ. ఇదే గనుక మా హైస్కూలు ఇంగ్లీషు పంతులుగారు విని వుంటే మూర్ఛపోయి ఉండేవారు. (మూర్ఛపోవడానికి ఆయన ఇప్పుడు లేరు. అది వేరే సంగతి.) ఆయన నా రాతని ఎర్ర పెన్నుతో చేసిన సవరణలు కాగితం రంగునే మార్చేసేవి మరి!

ఉద్యోగ రీత్యా మాకు ప్రయాణాలు తరచుగా తగులుతుంటాయి. నార్మన్ తో నేను చేసిన ఒక ప్రయాణం మరువలేనిది. అతను బాల్టిమోర్ నించీ విమానంలో ఉత్తర దిశలో న్యూ హాంప్‌షయిర్ రాష్ట్రంలో ఉన్న మాంచెస్టర్ నగరాన్ని చేరుకుని, అక్కడ అద్దె కారుని తీసుకోవడానికి ఐడెంటిటీ ప్రూఫ్ కింద చూపిద్దామని డ్రైవింగ్ లైసెన్స్ తీస్తే అది అతని భార్యది! విమానం ఎక్కేముందర ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం చూపించినది కూడా ఆ ఫోటోనే నట. సెక్యూరిటీ వాళ్లెలా ఆ తేడాని గ్రహించలేదో అర్థంకాని విషయం. ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారనే నానుడికి ఇతనూ, ఇతని భార్యా నిజజీవితంలో ఋజువు లనిపించింది.

2000 సంవత్సరంలో నేను నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లో ఉద్యోగాన్ని వదిలి వేరేచోటికి వెళ్లేటప్పుడు నా ప్రాజెక్ట్ సహోద్యోగులు ఇచ్చిన సెండాఫ్ మరువలేనిది. అతనికి మేనేజ్‌మెంట్ లో ఏ పొజిషనూ లేకపోయినా గానీ, దానికి నార్మన్ జోడింపు – “నువ్వు ఎప్పుడు తిరిగిరావా లనుకున్నా నీకు ఈ ప్రాజెక్టులో స్థానం ఉంటుంది!” అని. దాన్ని నేను అప్పుడు నమ్మలేదు గానీ, మూడు సంవత్సరాల వ్యవధి తరువాత మళ్లీ వెనక్కు వచ్చిన నేను పదిహేనేళ్ల తరువాత కూడా ఇక్కడే ఉన్నాను.

మా ప్రాజెక్టులో పనిచేసినన్నాళ్లూ రిటయిరయిన వాళ్లకి ఉండే స్వేచ్ఛని నార్మన్ చక్కగా ఉపయోగించుకున్నాడు.  కన్వర్టబుల్ స్పోర్ట్స్ కార్లో ఆఫీసు కొచ్చేవాడు. చలికాలం వచ్చే ముందర మా ప్రాంతంలో పడే మంచు, ఐస్ బాధల బారినుంచీ తప్పించుకోవడానికి భార్యతో ఫ్లారిడా వెళ్లి వసంతం వచ్చిన తరువాత  వెనక్కి తిరిగివచ్చేవాడు. దాదాపు వెయ్యిమైళ్ల దూరంలో ఉంటూ కూడా వారానికి కొన్ని రోజులు ప్రాజెక్టుకు కావలసిన పని చేసిపెట్టేవాడు. అతను రెండవసారి రిటయిరయి ఏడెనిమిదేళ్లు దాటింది. వయసు ఈపాటికి కనీసం ఎనభయ్యవ దశకం మధ్యలో ఉండాలి. దాదాపు ఎనభై ఏళ్లున్నవాళ్లు ముగ్గురుండే మా ప్రాజెక్టులో ఆ వయసుండే చివరి సహోద్యోగి డిసెంబర్ 2018లో రిటయిరయారు.

జీవితాన్ని అనుభవించడం తెలిస్తే ఆనందం చిరునామాని పట్టుకోవడం తేలికేమో? ఎంత ఆర్ణవ మయినా ఆనందాన్ని ఆస్వాదించాలంటే ముందు దోసిలిలో కొంత తీసుకుని ఒక్క గుక్క వెయ్యడంతోనే కదా మొదలుపెట్టాలి, అని అనిపిస్తుంది నార్మన్‌ని తలచుకుంటే. ఫోటోలో ఆ ఆనందం కనపడంలేదూ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here