అమ్మ చివరి సెల్యూట్

0
9

[dropcap]చి[/dropcap]న్నప్పుడు మా ఇంట్లో స్వాతంత్ర్య దినోత్సవం చక్కగా చేసుకునే వాళ్ళం. మా అమ్మ శుక్రవారం రోజున తలకు పొయ్యడం మర్చిపోతుందేమో గాని ఆగస్టు 15వ తేది నాడు మాత్రం మర్చిపోదు. చక్కగా తలంటి పోసుకుని 7 గంటలకల్లా తయారై స్కూలుకు వెళ్ళేవాళ్ళం. 8 గంటలకు జెండా ఎగరేస్తారు. ఆ రోజు శలవు కాబట్టి చాల మంది స్కూలుకు, కాలేజికి ఎగ్గొట్టేవాళ్ళు. స్కూల్లో, కాలేజిలో లెక్చరర్స్ అటెండెన్స్ తీసుకుంటామని బెదిరించినా కూడా వచ్చేవాళ్ళు కాదు. నన్ను మాత్రం ఉదయాన్నే లేపి తయారు చేసి పంపేవాళ్ళు.

అందరిళ్ళలో పండగ రోజుల్లో కరెక్టుగా పన్నెండు గంటలకు వంటలన్నీ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసేవాళ్ళు. కాని మా ఇంట్లో లేటవుతూ ఉండేది. ఉదయమే లేవలేక అలా లేటయిపోయేది. వాళ్ళమో శ్రద్ధగా తెల్లవారు ఝామునే లేచి పనంతా పూర్తి చేసేవాళ్ళు. మా అమ్మ పండుగలకు లేట్ చేసినా ఆగస్టు 15 నాడు జెండా పండుగ రోజున మాత్రం కచ్చితమైన టైముకు కాలేజికి పంపేది. ఇంట్లో చిన్న జెండా గుడ్డను పుల్లకు చుట్టి నేలలో పాతి దానికే జై జై అని సెల్యూట్ చేసే వాళ్ళం. ఇంతకి ఇంత శ్రద్దకు కారణం మా నాన్న స్వాతంత్ర్య సమరయోధుడు కావటం. మా నాన్నతో పాటు మా అమ్మ కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం.

అలా చిన్నతనంలో స్వాతంత్ర్య దినోత్సవానికి కరెక్టుగా స్కూలుకు, కాలేజికి వెళుతుంటే మా ఫ్రెండ్స్ ‘చాలా దేశ భక్తి ఉందే’ అని నవ్వేవాళ్ళు. ‘అబ్బ ఈ రోజేందుకు కాలేజికి వెళ్ళటం, లెక్చరర్ల ఉపన్యాసాలు వినటం’ అని చాలా మంది ఆ రోజున కాలేజికి వచ్చేవాళ్ళు కాదు. నేను ఫ్రెండ్స్‌నూ లాక్కేళ్లేదాన్ని. కాలేజిలో జెండా ఎగరవేయటం, ఆ తర్వాత సెల్యూట్ చేస్తూ జనగణమన పాడుతుంటే నాకెందుకో ఉద్వేగంతో రోమాలు నిక్కబోడుచుకునేవి. జెండాల బొమ్మలు వేయటం, భారతదేశం గురించి వ్యాసాలు రాయడం, హింసను తగ్గించాలని బోధించే స్లోగన్లు రాయటం చేసేదాన్ని. కాలేజిలో లెక్చరర్లు చూసి నువ్వు బాగా వ్యాసాలు రాయి అనేవాళ్ళు.

నా పెళ్ళి తర్వాత మా వారు స్వాతంత్ర్య దినోత్సవం మనింట్లో బాగా చేసుకుందాం అన్నారు. ఆ రోజున తాను హాస్పిటల్ కు వెళ్లబోయే ముందే ఇంట్లో జెండా ఎగురవేసేవారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 9 గంటలకు జెండా ఎగరేసేవారు. ఒక్కొక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ టైము అయిపోతుందనిపిస్తే నన్ను ఇంటి దగ్గర ఎగరవేయమనే వారు. నాకు జెండా ఎగరవేయడమంటే చాల ఇష్టం. నాకు హఠత్తుగా కలెక్టర్ పదవి వచ్చినంత సంతోషపడేదాన్ని. చాలా సంతోషంగా పవిత్రంగా గాంధీజీ ఫోటో దగ్గర కొబ్బరికాయ కొట్టి మరీ నేను జెండాను ఎగరేసేదాన్ని. ఇవన్ని చెప్తుంటే అమ్మ చాల సంతోషించేది. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మావారు జెండా ఎగరేసే పని నాకే అప్పజెప్పారు. నా ఇష్టాన్ని, నా సంతోషాన్ని చూసి. అలా మా ఇంట్లో ప్రతి సంవత్సరమూ పండగలా చేసుకోవటం అలవాటయింది.

ఒకసారి స్వాతంత్ర్య దినోత్సవం నాడు అమ్మకు సన్మానం చేయాలనీ అనుకున్నాం. నాన్న మరణించి చాలా రోజులయింది. ఇప్పుడు మేము మా హాస్పిటల్ స్టాఫ్‌తో, పేషంట్లతో స్వాతంత్ర్య దినాన్ని పండగ లాగా జరుపుకుంటున్నాం. కాబట్టి అలాంటి పండగలలో అమ్మకు సన్మానం చేయాలనీ తల పెట్టాం. జెండా కింద కుర్చీ వేసి అమ్మను కుర్చోబెట్టాం.

హాస్పిటల్ సెక్యూరిటీ యూనిఫామ్‌లో ఉంటారు కదా. వాళ్ళందరికీ లైన్లో నిలబడి సెల్యూట్ చేయమన్నాం. మా అబ్బాయిలు ఇద్దరూ అమ్మ మేడలో పూలమాల వేశారు. మా స్టాఫ్ అందరూ ఒక్కొక్క గులాబీ తెచ్చి అమ్మకిచ్చి కాళ్ళకు నమస్కారం చేశారు. ఆరోజు చాలా ఆనందం చేసింది. ఒక స్వాతంత్ర్య సమరయోధుని భార్యకు సన్మానం చేయడం చాలా బాగుంది. నేను చేసిన పని మా పిల్లలకు బాగా నచ్చింది.

మరో స్వాతంత్ర్య దినం నాడు జెండా ఎగరేశాక అమ్మను కుర్చీలో కుర్చోబెట్టాము. అమ్మకే స్వీట్ ప్యాకెట్ ఇచ్చి అందరూ అమ్మ చేత స్వీట్లు తీసుకునేలా ప్లాన్ చేశాం. ఆ రోజు స్పెషల్‌గా లడ్డూ తయారు చేయించాం. పెద్ద లడ్డూ చేతి నిండుగా వచ్చింది. పేషెంట్లు అందరూ అమ్మ దగ్గర తీసుకున్నారు.

2020 ఆగస్టు 15వ తేదీ నాటికీ అమ్మ ఆక్సిజన్ పెట్టుకొని మంచం మీద ఉన్నది. అయినా అమ్మ గుండెకు జెండా పెట్టాము. జెండా ఎగరేసినంత సేపు అయినా మెల్లగా జెండా దగ్గరకు తిసుకెళ్ళలనుకున్నాం. కానీ ఆక్సిజన్ తీయగానే తాను పడిపోతుండటంతో మంచం మీద నుండే చూసింది. మేము లోపలి వచ్చి అమ్మకు సెల్యూట్ చేసి జనగణమన పాడి లడ్డూ చేతిలో పెట్టాను. ఆ తర్వాత పది రోజులే బతికింది. ఆ రోజు ఆక్సిజన్ పైపులతోనే మంచం మీద లేచి కుర్చోబెట్టాం. తన భర్త తాను దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్న ఆగస్టు నెలలోనే కన్ను మూయడం ఆమె చేసుకున్న పుణ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here