అమ్మ కడుపు చల్లగా-17

0
8

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి మిత్ర విధానాలతో సేద్యం చేయడం రైతులకి శ్రేయస్కరమని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

డా. స్వామినాథన్ సూచనలు – ప్రకృతితో చెట్టాపట్టాలు:

[dropcap]సే[/dropcap]ద్యానికి అన్ని విధాల అనువైన ప్రాంతాలను, భూములను ‘స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్’గా గుర్తించి వాటికి కాపాడుకోవాలని డా. స్వామినాథన్ సూచించారు. వర్షాధార భూముల్లో సైతం ‘వాటర్ షెడ్’, ‘పానీ పంచాయత్’ వంటి విధానాలను అవలంబించడం ద్వారా నీటిని పంచుకుని సేద్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోవచ్చని ఆయన సూచించారు.  చిన్న సన్నకారు సేద్యాలకు ‘కమ్యూనిటీ వాటర్ షేరింగ్’ విధానంలో నీటిని పంచుకుని ప్రకృతికి హాని కలగని రీతిలో ఎరువులను, పురుగు మందులను వాడి సాగు విధానాలను మెరుగు పరుచుకోవాలన్నది ఆయన సిద్ధాంతం.

ఇళ్లళ్ళో, కమతాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను తప్పనిసరి (మేన్‌డేటరీ) చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి సహకరించనపుడు అతివృష్టి, అనావృష్టిల కారణంగా; ప్రకృతి సహకరించినపుడు సైతం సరైన దిగుబడులు వచ్చినా, గిట్టుబాటు ధర లభించక వ్యవసాయం రైతుకు జీవనాధారం కాకపోగా, గుదిబండగా మారుతున్నదనేది చేదు నిజం.

బెంగాల్‍లో రైతులకు బంగాళాదుంప సేద్యం చక్కని దిగుబడుల నందించినప్పటికీ సరైన ధర లభించక నష్టాలలో కూరుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో టొమాటో, నిమ్మ వంటి కూరగాయలను పండించిన రైతుల నష్టాల కథ ఇటీవలిదే! ఈ ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కుని వ్యవసాయ రంగం మనగలగాలంటే పైన పేర్కొనబడిన (‘ప్రకృతి మిత్ర’) విధానాలను అవలంబించాలి. అప్పుడే ఆహార భద్రతకు కేంద్ర బిందువైన రైతూ భద్రమైన జీవితాన్ని గడపగలుగుతాడు.

విత్తన స్వావలంబన – చీకట్లో చిరుదీపంలా:

జహీరాబాదు మండలంలోని పలు గ్రామాలలోని ప్రజలు కేవలం సాంప్రదాయక విత్తనాలతోనే వ్యవసాయం చేస్తారు. అక్కడ ఒక ఎకరం పొలం ఉన్న రైతు కూడా సాంప్రదాయక విధానాలను అవలంబించి ‘సాగు’ చేస్తుండడంతో ఫలితాలు బావుండడమే కాక క్రమక్రమంగా స్వయంసమృద్ధిని సాధించడంతో పాటు తృప్తిగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

వీరి భూములన్నీ వ్యవసాయ భూములే అయినప్పటికీ వర్షాధార భూములు. ఆ కారణంగా అతివృష్టి, అనావృష్టిల బెడదతో ఇక్కట్లు పడేవారు. క్రమేపీ చిన్న చిన్న మార్పులతో వ్యవసాయాన్ని అనుకూలంగానూ, లాభసాటిగానూ మార్చుకున్నారు. వారు ఒకే పొలంలో 9 నుండి 10 రకాల విత్తనాలను వేస్తారు. అన్నీ కందులు, మినుములు వంటి గింజ ధాన్యాలే. మిశ్రమ సేద్యం కావడంతో ప్రకృతి సహకరించకపోయినప్పటికీ రైతు మొత్తంగా దెబ్బతినే పరిస్థితి రాకపోవటం ఇక్కడి విశేషంగా చెప్పుకోవాలి. ఒకటి రెండు పంటలు దెబ్బ తిన్నా, మిగిలినవైనా చేతికి వస్తాయి.

ఇక్కడి రైతులు ఏ రకమైన పురుగు మందులు వాడరు. ఎరువుల వాడకమూ లేదు. తమ పశువులను పొలాలలోనే కట్టడం ద్వారా భూమికి కావలసిన సారం సహజసిద్ధంగానే అందుతూ ఉంటుందని వాళ్ళు చెప్తారు. పశువులకూ అన్ని రకాల మేతా దొరుకుతుంది. ఇక్కడి పంటలకు – ‘ఆర్గానిక్ ఉత్తత్పుల’ రీత్యా 10% ధర కూడా ఎక్కువే. అన్ని పంటలూ ఒకేసారి కోతకు రావు. ఆ కారణంగా రైతులు చేతికి అందిన పంటను కోసుకొని ఒబ్బిడి చేసుకొనే వెసులు లభిస్తుంది. ఈలోగా మరొక పంట చేతికి వస్తుంది. ఈ రకంగా వారికి నిరంతరం పని ఉంటుంది. లోటూ ఉండదు. అనారోగ్యాలు లేవు. కారణం, గ్రామాలలో ఎటు చూసినా పచ్చదనమే!

విత్తనాలు:

విత్తనాలను వీరు కొనరు. అమ్ముకోరు. పంటలో కొంత మొత్తాన్ని వేప పిండి, ఆవు పేద, బూడిద వంటి వాటితో – విత్తనాల నిమిత్తం శుద్ధి చేసి విత్తనాల రకాన్ని బట్టి బుట్టలలో, కుండలలో నిల్వ చేస్తారు. ఆ నిల్వ విధానంలో విత్తనం రెండు మూడు సంవత్సరాల వరకు చెడిపోదు. ఆ కారణంగా విత్తనాల గురించి వెతుకులాట ఉండదు. ఏ రైతైనా మరొకరి వద్ద విత్తనాలను తీసుకొన్నట్లయితే అతను తన పంట చేతికి వచ్చాకా తీసుకొన్న గింజలకు రెట్టింపు (తూకం/బరువు) తిరిగి అప్పజెప్పాలి. ఇది అక్కడి పద్ధతి. ఈ విధానంలో డబ్బు మారకంలో లేదు.

కొన్ని సంవత్సరాల క్రిందట ‘మాలే’లో జరిగిన రైతు సదస్సుకు ఇక్కడి రైతులు కొందరు హాజరు అయ్యారు. సదస్సులో ఈ మిశ్రమ పంటల విధానాన్ని వారికి వివరించినప్పుడు వారు అపరిమితమైన ఆశ్చర్యానికి గురి అయ్యారు. కొన్ని రకాల వంగడాలను కూడా వారు పరస్పరం బదలాయించుకోవడం జరిగింది. సదస్సుకు హాజరైన రైతు ఒకరు 10, 15 మొదళ్ళు ఉండే జొన్నను అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ వేశారు.

రసాయనిక ఎరువులు లేవు. పురుగు మందులు లేవు. వీరి విత్తన నిధికి మాచవరం గ్రామం కేంద్ర బిందువు. దక్కన్ డెవెలప్‍మెంట్ సొసైటీ వీరికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here