అమ్మ కడుపు చల్లగా 2

0
7

[dropcap]మ[/dropcap]నిషి ఎన్ని నిర్భంధనాలకు, కష్టనష్టాలకు గురి అవుతున్నప్పటికి స్వేచ్చగా తిరుగుతున్న వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలు, తేటదేరుతున్న నదీవనాలు, సుస్పష్టంగా గోచరిస్తున్న కొండకోనలు, వినీలాకాశం – వంటి అరుదైపోయిన దృశ్యాలతో తిరిగి అలరారుతున్న నేలతల్లిని చూస్తుంటే-

మానవుడు తన విశృంఖల విహారాన్ని గూర్చి ఆత్మావలోకనం చేసుకోక తప్పని పరిస్థితినీ, నడత మార్చుకుంటే భవిష్యత్తు బాగుపడగల అవకాశం ఉందన్న సంకేతాన్నీ ఈ సంక్షోభం రూపంలో ప్రకృతి మనిషికి అందిస్తోందా అన్నట్లు ఉంది.

దేశ జనాభా దాదాపు 60% మంది స్యీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. పరిశ్రమలు మూతబడ్డాయి. వాహనాలు, గ్యారేజీలు, ఇళ్ళకే పరిమితమయిపోయాయి. కనీసస్థాయికి కుదించబడిన మానవచర్యల ఫలితంగా ప్రకృతి కొంచెం కొంచెం కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. లాక్‍డౌన్‍లో మార్చినెలాఖరు నాటికే గాలి నాణ్యతలో అనూహ్యమైన మార్పు వచ్చింది. వాయు కాలుష్యంలో ప్రథమస్థానంలో ఉన్న ఢిల్లీలో ఆకాశం స్వచ్ఛంగా నీలం రంగులో కనుపించడం ఢిల్లీ వాసులకు కన్నుల పండుగ అయ్యింది. దాదాపు మూడూ దశాబ్దాల తరువాత అంత స్వచ్ఛమైన ఆకశాన్ని చూడగలిగామని స్థానికులు ఆనందంతో వ్యాఖ్యానించడం జరిగింది. మార్చి చివరివారంలో 40  నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 1.8 మిల్లిమీటర్ల వాన పడింది. ఆ కారణంగా అక్కడ గాలి మరింత బాగుపడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థేశిత ప్రమాణాల ప్రకారం ఒక ఘనపుమీటరు గాలిలో ఏడాదిగా సగటుగా 10 మైక్రోగ్రాములకు మించి ధూళికణాలు ఉండకూడదు. భారతదేశపు ప్రమాణాల ప్రకారం 60 మైక్రోగ్రాములకు మించకూడదు.

అయితే చాలాకాలంగా దేశరాజధానిలో మిగిలిన నగరాలలో, ఆ పరిమితులను వాయుకాలుష్యం ఏనాడో దాటేసింది. ఆంధ్రప్రదేలోని విజయవాడలో 80-90 మైక్రోగ్రాములుగా, విశాఖలో 70-80 మైక్రోగ్రాములుగా, రాజమండ్రిలో దాదాపు 80 మైక్రోగ్రాములుగా ఉంటూ వచ్చిన ధూళి కాలుష్యం మార్చి నెలాఖరు నాటికి అదేవరుసలో 30-40 మైక్రోగ్రాములు, 30-40 మైక్రోగ్రాములు రాజమండ్రి 56 మైక్రోగ్రాములుగా నమోదుకావడం విశేషం. ఇదంతా లాక్ డౌన్ ప్రభావమే.

లోహవిహంగాల పాత్ర – ఆకాశాన్ని, భారీవాహనాల మోత నేలతల్లినీ:

2019 – 20 లతో పోలిస్తే ఎయిర్‍లైన్స్ కర్బన ఉద్గారాలు కూడా రమారమి 10 మిలియన్ టన్నులు తగ్గిపోయాయి. కరోనా నేపథ్యం లాక్‍డౌన్, విమాన ప్రయాణం తగ్గుదల కారణంగా గత సంవత్సరం ఫిబ్రవరి మార్చిలతో పోలిస్తే ఈ ఏడాది కనిపిస్తున్న తగ్గుదల అది.

బెల్జియంలోని ’రాయల్ అబ్జర్వేటర్’ పరిశోధనలలో భూప్రకంపనలను విశ్లేషించడానికి వినియోగించే సిస్మోమీటర్ అధ్యయనాలలో అంతరాయం కలిగించే ధ్వనులు దాదాపు 30 శాతానికి తగ్గిపోయాయి. కాలిఫోర్నియా I.O.T లాస్ ఏంజిల్స్ ఇదే రకమైన విశేషాలు తెలిపాయి. భూమిలోపలి పలకలు సర్దుకుంటున్నప్పుడో ప్రకంపనలు వెలువడతాయన్నది తెలిసిందే. అయితే రవాణా వాహనాల ధ్వనులు, ట్రక్కులు, టాంకర్స్, వంటి భారీ వాహనాల కారణంగా ఏర్పడే కుదుపులు భూమి సహజ ప్రకంపనలను సంకేతాలను లెక్కగట్టడంలో అవరోధానికి కారణమవుతున్నాయి.

సంబంధిత పరికరాలు సముద్ర తరంగాల వడివేగాలను గుర్తించడంలోనూ ఇటువంటి సమస్యలే ఎదురౌతున్నాయి. మానవ ప్రేరేపిత శబ్దకాలుష్యం కారణంగానే ఈ సమస్యలన్నీ తెలెత్తుతున్నాయి.

గాలి, నేల, మాత్రమే కాదు నీటికీ కాలుష్యం చెర కొద్దిగా సడలినట్లే కనిపిస్తోంది. గంగా పరీవాహక ప్రాంతంలో 30కి పైగా పర్యవేక్షక ప్రాంతాలు ఉన్నాయి. దశాబ్దాలుగా కోట్ల రూపాయలు గ్రుమ్మరిస్తున్నా, నినదిస్తున్నా కానరాని ఫలితాలు లాక్‍డౌన్ నేపథ్యంలో దర్శనమిస్తున్నాయి. దాదాపు 30 పర్యవేక్షక ప్రాంతాలలో నీరు తేటదొరకడమే కాక స్నానానికి యోగ్యంగానూ తయారయిందని (C.R.C.B) కేంద్రకాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలు చెప్తున్నాయి.

2020 నాటికి ఉద్గారాలు తగ్గింపుదిశగా మళ్ళకపోయిన పక్షంలో వాతావరణంలో వచ్చే దుష్పరిణామాలను అనుభవించక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యయనాల నివేదిక కనీసం 7.6 శాతమైనా తగ్గిస్తూ పోతేగాని ప్రపంచ ఉష్ణోగ్రతల సగటు పెరుగుదలను 1.5 c కి నియంత్రించలేమని స్పష్టం చేసింది.

కాకతాళీయంగా 2020లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గడం విశేషమే. అయితే ఈ తగ్గుదల మౌలిక వ్యవస్థలను సంస్కరించడమో మార్పుచేయడమో ద్వారా వచ్చినవి కాదు. ఇది కేవలం కేవలం దిగ్భందనం కారణంగా వచ్చిన మార్పు. లాక్‍డౌన్ అనంతరం యథాపూర్వ స్థితికి రావన్న గ్యారంటీ ఏమీలేదు. చైనాయే దృష్టాంతం – ఫాక్టరీలో మూతపడి ఎగుమతులపై కఠినమైన నియంత్రణలో పాటించడంతో ఉద్గారాల విడుదలలో చైనాలో 25% తగ్గుదల కనిపించింది. చైనా ఒక్క సంవత్సరంలోనే 100 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేసింది. కోవిడ్-19 సంక్షోభం కారణంగా సద్దుమణిగిన ఉద్గారాలు, కాలుష్యం లాక్‍డౌన్ అనంతరం తిరిగి పుంజుకోవన్న గ్యారంటీ చైనాలోనూ లేదు.

నిపుణుల అభిప్రాయాలు:

కొలరడాలోని ఒక యూనిర్శిటీకి చెందిన ప్రొఫెసర్ క్రిష్టఫర్ కర్నాస్కన్ హానికారక వాయువుల విడుదలలో మనిషి ప్రమేయాన్ని, పాత్రను నిరూపించుకోడానికి తప్ప ఈ వార్తల వలన పెద్దగా ఒరిగేది ఏమీ లేదని కొట్టిపారేశారు.

స్టాన్‍ఫర్డ్ లోని ‘ఎర్త్ సిస్టమ్స్ సైన్సెస్’లో ప్రొఫెసర్ రాజ్ జాక్సన్ – ఈయన ‘గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్’ చైర్‍మన్ కూడా. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఉద్గారాల విడుదలలో తగ్గుదల ఈ స్థాయిలో ఎన్నడూ లేదని 2008 రెసిషన్ తరువాత 1.4% ఉద్గారాల తగ్గుదల నమోదైందనీ మరికొంత తగ్గుదల జమ పడినప్పటికీ ఆశ్చర్యపోనక్కరలేదనీ వ్యాఖ్యానించారు.

ఈ సంక్షోభం తరువాతైనా యుద్ధప్రాతిపదికన నడుం బిగించి ప్రకృతి సంకేతాలకు అనుగుణంగా స్పందించి చర్యలు చేపట్టినట్లయితే కొంచెం ఆలస్యమైనా రాబోయేది మాత్రం ఖచ్చితంగా మంచికాలమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here