అమ్మ కడుపు చల్లగా-24

0
11

[box type=’note’ fontsize=’16’] పడమటి కనుమల పూర్వాపరాల గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

పడమటి కనుమలు – పూర్వాపరాలు

[dropcap]1[/dropcap]600 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలకు ఒక ప్రత్యేకత ఉంది. భూమి లోపలి పొరలో నుండి గుమ్మటాల వంటి ఆకారంలో భూమి పైకి పొడుచుకొని వచ్చిన ఈ శిఖరాలు అత్యంత పురాతనమైనవిగా ప్రతీతి. వీటి దిగువన ఉన్న శిలలు 2000 మిలియన్ సంవత్సరాలు అంటే 200 కోట్ల సంవత్సరాలు పురాతనమైనవిగా ప్రసిద్ధి. అటువంటి అత్యంత పురాతనమైన ఈ శిలలు త్రవ్వి తీయబడి నిర్మాణపు పనులకి తరలించబడుతున్నాయి. హైకోర్టు మధురై  బెంచ్ క్వారీ పనులను ఆపివేయాలని కోర్డ్ ఆర్డర్ జారీ చేసిన తరువాత కూడా అక్రమంగా త్రవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

దశాబ్దాలుగా ఇక్కడ క్వారీయింగ్ జరుగుతూనే ఉంది. అయితే అది చిన్న స్థాయిలో కూలీల ద్వారా జరిగేది. ఆ కారణంగా పెద్దగా దుష్ప్రభావం కనబడలేదు. ఇప్పుడు బోరుబావులు తవ్వే మిషన్లతో కొండలను దొలచి పేలుడు మందు కూర్చి పేల్చటం వలన భారీ విస్ఫోటనాలు, అదే స్థాయిలో విధ్వంసం సర్వసాధారణం అయిపోయింది. ఎలక్ట్రిసిటీ బోర్డు నిబంధనల ప్రకారం అత్యవసర పరిశ్రమలు మాత్రమే 24 గంటలు పని చేయవచ్చు. కానీ క్రషింగ్ యూనిట్లకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండటం గమనార్హం. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల నుండి వెలికితీయబడిన గ్రానైట్ షిప్పింగ్ ద్వారా మాల్దీవులకు రవాణా అవుతూ ఉంటుండి. వెలికి తీయబడిన గ్రానైట్‍లో 20% (సుమారు) మాత్రమే స్థానికంగా అందుబాటులో ఉంటుంది. మిగిలినది కేరళ వంటి ప్రాంతాలకు సైతం తరలిపోతుంది.

‘విళింజం’ అంతర్జాతీయ ఓడరేవు నిర్మాణం పనుల నిమిత్తం ఆ నడుమ కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలోని కొన్ని గ్రానైట్ వనరులను కేటాయించమని కోరింది. అయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం  జనావాసాలకు, క్వారీలకు నడుమ కనీసంగా 200 మీటర్ల బఫర్ జోన్ ఉండాలి. ఆ కారణంగా కేరళకు క్రొత్త క్వారీలను కేటాయించడం కుదరదని తమిళనాడు ప్రభుత్వం తన అసహాయతను వ్యక్తం చేయడం జరిగింది.

క్వారీలను లీజుకు తీసుకున్న వారు ఒక ఘనపు మీటరు గ్రానైట్‍కు ₹ 135 మించి చెల్లించరు. కానీ మార్కెట్‍లో దాని విలువ ₹ 3000 లకు పై మాటే. ఆ కారణంగా అక్రమ త్రవ్వకాలు కొనసాగుతూనే ఉండడంలో ఆశ్చర్యం లేదు.

అయితే అడవుల నరికివేత, నీటి వనరులను నాశనం చేయడం వంటి వాటి కంటే కూడా పర్వత ప్రాంతాలను నాశనం చేయడం అన్నది దిద్దుకోలేని పొరపాటు. మనిషి కొండకోనలను సృష్టించలేడు.

ప్రభుత్వ సహకారం ఏది?

2018 మార్చిలో యునెస్కో పడమటి కనుమలను – ప్రపంచంలో అత్యధికంగా జీవ వైవిధ్యం ఉన్న 8 ప్రాంతాలలో ఒకటిగా గుర్తించింది. అంటే మానవాళి శ్రేయస్సుకు, సకల జీవరాశుల మనుగడ కోసమైనా వీటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గుర్తింపు పడమటి కనుమలకు ప్రపంచంలో ఒక గుర్తింపును, ఒక హోదాను కల్పించగలిగింది తప్ప వాటి పరిరక్షణకై ఎటువంటి చట్టపరమైన అధికారాలు యునెస్కోకు లేవు. దానితో గ్రానైట్ కోసం కనుమల విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. ఆ కారణంగా అక్కడి పర్యావరణ ప్రేమికులు న్యాయనిపుణులే వాటిని కాపాడుకోగలగడానికై శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

తమిళనాడు ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం పడమటి కనుమలలోని చాలా ప్రాంతాలు ‘హకా’ (HACA) పరిధిలోకే వస్తాయి. ఈ పర్వత ప్రాంతాల పరిరక్షణ అథారిటీ – 1990లో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏర్పడింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ అథారిటీలో కనీసంగా నలుగురు పర్యావరణవేత్తలు, పర్యావరణం గురించి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు భాగాంగా ఉండాలి. కానీ కన్యాకుమారిలోని స్థానిక ఔత్సాహిక కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తల కథనం ప్రకారం ‘HACA’ కార్యకలాపాలేమీ కొనసాగడం లేదు. సమావేశాల వంటి వాటి నిర్వహణా లేదు. ఈ సంస్థ ఇంచుమించు నిద్రాణంగా ఉంది.

‘DYFI’ వంటి సంస్థలు పడమటి కనుమలను రక్షించుకోవలసిన తప్పనిసరి అవసరం గురించి స్థానికులలో అవగాహన కల్పించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అక్కడ స్థానికులలో చాలామంది క్వారీలను తమకు పని కల్పించి ఆదాయాన్నిచ్చే వనరుగా భావిస్తున్నందువల్ల అదీ చాలా కష్టమే అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here