అమ్మ కడుపు చల్లగా-31

0
17

[box type=’note’ fontsize=’16’] చిత్తడి నేలలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]వె[/dropcap]ట్‌లాండ్స్ లోని పీట్‌లాండ్స్ పునరుద్ధరింపబడటానికి వీలులేని ప్రత్యేకమైన నేలలు. ఎండిన, కూలిన చెట్ల వంటి ప్రకృతి సహజమైన శిధిలాలే కాక విపరీతమైన వాతావరణ పరిస్థితులలో పట్టు కోల్పోయి ఎక్కడికక్కడ విడిపోయే స్పాగ్నమ్ శిధిలాలు కూడా ఈ నేలలు రూపొందండంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ నేలలలో ఈ స్నాగ్నమ్ పొరలు కూడా ఉంటాయి. వేల సంవత్సరాల కాల భ్రమణంలో ఏర్పడే ఈ పీట్ నేలలు పెద్దగా సారవంతమైనవేమీ కావు. P.H. లెవెల్స్ అధికంగా ఉండి లవణీయ లక్షణాలను కలిగి ఉండే ఈ మట్టిలో పోషకాలు పెద్దగా ఉండవు కానీ వేళ్ళు సులభంగా వ్యాపించడానికి అనువైన పోరస్ ఉంటుంది. ఆ కారణంగా ఉద్యానవనాల పెంపకంలో దీనిని విస్తారంగా వాడతారు. ఈ నేలలు కార్బన్‍ను అధికంగా కలిగి ఉంటాయి.

నీటి సంరక్షణలోనూ కీలకపాత్ర:

వివిధ సందర్భాలలో ఎగువ ప్రాంతాల నుండి నీరు విస్తారంగా పారినప్పుడు ఆ నీటిని ఈ నేలలు ఒడిసిపట్టి అవక్షేపాలన్నింటినీ బంధించి స్వచ్ఛమైన నీటిని మెల్లమెల్లగా విడుదల చేస్తాయి. ఆ కారణంగా ఇక్కడ నీరు ఒక క్రమపద్ధతిలో ఇంచుమించు ఏడాది పొడవునా విడుదల అవుతూనే ఉంటుంది. U.K.లో అయితే ఇలా వడకట్టబడిన నీరు నీటిశుద్ధి కర్మాగారాలకు చేరే సమయానికి ఇంచుమించు నూరు శాతం స్వచ్ఛతతో ఉంటుంది.  ఆ కారణంగా అక్కడ ఇప్పుడు ఈ నేలల సంరక్షణ కోసం ఉద్యమాలే జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలను కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తూనే (బ్రిటన్) 2022 నుండి ‘పీట్‍లాండ్స్’ ను ఇతర వినియోగాలకై మళ్ళించడంపై నిషేధం విధించింది. అక్కడైతే ఈ నిషేధం తక్షణం అమలు లోనికి వస్తుంది.

పీట్‍లాండ్స్ – కార్బన్ ఎఫెక్ట్:

ప్రకృతిలో విస్తారమైన పరిణామంలో కార్బన్‍ను శోషించుకునే ప్రాంతాలు విధ్వంసానికి గురయినప్పుడు అవే కార్బన్ నిల్వలు విచ్చిత్తి చెంది వాతావరణంలోని ఆక్సీజన్‍తో రసాయనిక చర్యలకు గురై CO₂ గా మారి వాతావరణంలోకి విడుదల కావడం జరుగుతుంది. ఈ నేలలను వేరే రకం వినియోగానికి మళ్ళించడం వంటి మానవ కార్యకలాపాల వలన విడుదల అవుతున్న ఉద్గారాలు 5 శాతానికి పై మాటే. శతాబ్దాంతానికి 100 బిలియన్ టన్నుల ఉద్గారాలు కేవలం పీట్‌లాండ్స్ నుండే వెలువడతాయని అంచనా. శిలాజ ఇంధన వనరుల వాడకం వలన వెలువడే హరితగృహ వాయువుల పరిణామంలో ఈ నేలల నుండి వెలువడే ఉద్గారాల శాతం 10 శాతానికి సమానంగా ఉంటోంది.

ప్రపంచంలోని అడవుల సగటు శోషణ శక్తికి రెట్టింపు శోషణ శక్తిని ఈ నేలలు కలిగి ఉంటాయి. స్కాట్‌లాండ్ లోని పీట్‍లాండ్స్ కార్బన్ రిజర్వ్ రమారమి 1.7 బిలియన్ టన్నులు. ఆ దేశంలో ఏటా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులతో పోలిస్తే 140 సంవత్సరరాలలో వెలువడే మొత్తానికి సమానం.

U.K.లో 18 మిలియన్ టన్నులకు మించి కర్బన ఉద్గారాలు ధ్వంసం చేయబడిన పీట్‍లాండ్స్ నుండే వెలువడుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అక్కడ 80% పైగా పీట్‍లాండ్స్ ఇప్పటికే విధ్వంసానికి గురయ్యాయి. ఈ నేలలను U.K.లో వర్షారణ్యాలుగా పిలుస్తారు. ఇవి 3.2 బిలియన్ టన్నుల కార్బన్ నిల్వలను కలిగి ఉంటాయి. ఇవి అరణ్యాల, ఉడ్‍లాండ్స్ ఉమ్మడి నిల్వల కంటే అధికం. అటువంటిది దశాబ్దాల దుర్వినియోగం కారణంగా ఈ వ్యవస్థలు చాలా దీనావస్థలో ఉన్నాయి. అక్కడ గార్డెనింగ్ నిమిత్తం జరిగే త్రవ్వకాల కారణంగానే ఏటా 16 మిలియన్ టన్నులకి మించి ఉద్గారాలు వెలువడుతున్నాయి.

ఈ శతాబ్దాంతనికి 100 బిలియన్ టన్నుల ఉద్గారాలు కేవలం పీట్‍లాండ్స్ నుండే వెలువడతాయని అంచనా. వ్యవసాయం గురించి ఈ నేలలలో మంటలు పెట్టినప్పుడు అప్పటివరకు ‘కార్బన్ సింక్స్’గా ఉన్న నేలలు ‘కార్బన్ సోర్సెస్’గా మారి CO₂ ను విడుదల చేస్తాయి. ఇది ఒక అసంకల్పితమైన పరిణామమే కాని అనూహ్యమైనది మాత్రం కాదు. పశువుల దాణా పెంపకానికి, పంటల గురించి తవ్వకాలు జరిపినప్పుడూ అదే పరిస్థితి.

సారవంతమైన నేలలు తగ్గిపోయిన కారణంగా మలేసియా, ఇండోనేసియాలలోనూ విస్తారమైన పరిమాణంలో పీట్‍లాండ్స్‌ని ‘ఆయిల్ పామ్’ సాగుకు మళ్ళిస్తున్నారు. సంపద సృష్టి పట్ల మనిషి ఆశ అత్యాశగా ఆఖరికి దురాశగా మారిన తరువాత వేల సంవత్సరాల తరబడి పరస్పరాధారితంగా రూపుదిద్దుకున్న ప్రకృతి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై పోయాయి. ప్రకృతి సమతూకం దెబ్బతినడం ప్రారంభమైంది. సంపద సృష్టికి మూలమని మనిషి ఏ వ్యవస్థలనైతే దోచుకోవడం మొదలుపెట్టాడో ఆ వ్యవస్థలన్నీ ఇపుడు తిరుగుబాటు చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన దిద్దిబాటు చర్యలు చేపట్టినా పరిస్థితులు సమీప భవిష్యత్తులో చక్కబడగల అవకాశం లేదన్నది నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here