అమ్మ కడుపు చల్లగా-34

0
8

[box type=’note’ fontsize=’16’] కార్క్ చెట్ల విశిష్టతని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

ప్రకృతి మిత్రలుగా కార్క్ వనాలు:

కార్క్ చెట్లు గాలి వేగాన్ని తగ్గిస్తాయి. ఆ రీత్యా మట్టి కొట్టుకుని పోకుండా నిరోధిస్తాయి. ఆ కారణంగా అక్కడ స్థానికంగా కురిసే వర్షపు నీటిలో 27% మించి నీరు నేలలోనే ఇంకిపోతుంది. తద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతూ ఉంటుంది. పశుగ్రాసానికీ ఇక్కడ కొరత ఉండదు. జల చక్రం క్రమబద్ధీకరణ నిరంతరం సాగుతూ ఉంటుంది.

1990లలో ఫంగస్ కారణంగా చాలా కార్క్ చెట్లు అంతరించిపోయాయి. తరువాత చాలా జాగ్రత్తగా వాటిని సంరక్షించి కాపాడుకొంటూ వచ్చారు. మెల్లిమెల్లిగా ఫంగస్ తెగులు నుండి కోలుకుని ఆ వనాలు పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలిగాయి.

ఉద్గారాల కారణంగా వేడి మారిపోయి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి నేల తల్లి తల్లడిల్లిపోతున్న ప్రస్తుత తరుణంలో నైతే కార్క్ వనాలు ఆ తల్లికి కొంతైనా ఉపశమనాన్ని కలిగిస్తున్న ముద్దు బిడ్డలనే భావించాలి. ఇది శాస్త్రీయంగా నిరూపింపబడిన విషయం. కారణం –

ఈ చెట్లు కార్బన్‍ను తమ బెరడు నిర్మాణంలో వినియోగించుకుంటాయి. బెరడు తీయబడిన చెట్లు తిరిగి బెరడు తయారు చేసుకోవడానికి మిగిలిన కార్క్ చెట్ల కంటే 5 రెట్లు ఎక్కువగా కార్బన్‍ను వినియోగించుకుంటాయి. లేత చెట్లు కూడా బెరడు తయారీకి ఎక్కువగా కార్బన్ వినియోగించుకొంటాయి. స్పెయిన్‍లోని అడవుల కారణంగా 150 మిలియన్ టన్నుల కర్బనం గ్రహంచబడుతుండగా వాటిలో ఓక్ వృక్షాల వాటా 10 శాతానికి పైమాటే.

ఓక్ వనాలు సాలీనా రమారమి 6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‍ను గ్రహిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఆ లెక్కన 2 మిలియన్ల హెక్టార్లకు మించి ఉన్న ఓక్ వనాలు పర్యావరణ పరిరక్షణలో ఎంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయో అంచనా వేయవచ్చు. రసాయనాలు, ఎరువులు ప్రమేయం లేని కారణంగా కార్క్ అడవులు సాలీనా 14 మిలియన్ టన్నుల కార్బన్ శోషించుకుంటాయని అంచనా. వందల సంవత్సరాల జీవితకాలం, చెట్లను నరకనవసరం లేకుండా చెట్టు బెరడు పొరలే చక్కని ఆర్థిక లబ్ధిని చేకూర్చే వనరు కావడం ఈ అడవుల మనుగడ సాఫీగా సాగడానికి దోహదం చేస్తోంది. అడవుల సంరక్షణ కూడా కారణమే.

మధ్యయుగాల నుండీ ఈ చెట్లకు చట్టపరమైన రక్షణ ఉంది. అప్పటి నుండీ ఈ చెట్లను నరకటం గాని, అనుమతులు లేకుండా బెరడు తీయడం కానీ నేరం. ఈ చెట్టు బెరడు తీయడానికి ప్రత్యేకమైన శిక్షణ పొందిన మనుషులు ఉంటారు. వారు ఎంతో నైపుణ్యంతో లోపలి కాండానికి ఏ మాత్రం నష్టం జరగకుండా బెరడును వలుస్తారు. 70 c.m. వ్యాసం కొలత వరకు కాండం రావాలి. వయసు రీత్యా 20 సంవత్సరాలు రావాలి. 20 సంవత్సరాల వరకు దాని నుండి లబ్ధిని ఆశించరు. ఒకసారి బెరడు వలచిన పిమ్మట మరో 10 సంవత్సరాల వరకు పొరపాటున కూడా ఆ చెట్టు జోలికి పోరు. ఏదైనా వ్యాధి సోకి గాని, చాలా పాతవైపోయి గాని చచ్చిపోతే తప్ప కార్క్ చెట్లను నరకరు. ఒకవేళ అలా జరిగి నరికినప్పుడు సైతం మరో రెండు చెట్లను నాటడం సాంప్రదాయం. అంటే ఒక చెట్టుకు, రెండు చెట్లు పరిహారం!

బయోడిగ్రేడబిలిటీ – వివిధ స్థాయిలలో:

కార్క్ మట్టిలో ఎటువంటి విపరిణామాలు లేకుండా మిగిలిన ప్రకృతి సిద్ధమైన వస్తువులవలె జీర్ణించిపోయే గుణం కలది. ఒక సుస్థిరమైన, తడవ, తడవలుగా అర్థిక లబ్ధిని చేకూర్చే వనరు. ఆ కారణంగా కార్క్‌తో రకరకాల ఉత్పత్తులు తయారవుతూ ఉంటాయి. కార్క్ వనాల వలన జరుగుతున్న ఉపకారమే కాకుండా ఈ ఉత్పత్తుల వినియోగం సైతం కాలుష్య నియంత్రణలో పరోక్షంగా సహాయకారి అవుతున్నట్లే. అయితే ఈ ఉత్పత్తులు కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటాయి. సీసా మూతలుగా మొదలైన కార్క్ వినియోగం పరిధి తరువాతి కాలంలో బాగా విస్తరించింది. అయితే ఇప్పటికీ విస్తారంగా వినియోగంలో ఉన్న వైన్ కార్క్ బిరడా ఒక్కటి 112 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్‍ను వివిధ స్థాయిలలో (Net Positive) నిరోధిస్తుంది. అదే వైన్ కార్క్‌కు ప్రత్యామ్నాయంగా తేబడిన అల్యూమినియం స్క్రూ మూతలు హెచ్చు మోతాదులో కార్బన్ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. అల్యూమినియం వినియోగం తయారీ దశలో ఏటా 70 మిలియన్ టన్నుల విష వ్యర్థాలను విడుదల చేస్తోంది. అయినా పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభమే ముఖ్యం.

అందుకున్న గౌరవమూ తక్కువది కాదు:

ఈ చెట్టు వైశిష్ట్యాన్ని గుర్తించిన పోర్చుగీస్ 2011లో ‘జాతీయ వృక్షం’గా గుర్తించింది. ముసాయిదా తీర్మానం ద్వారా ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో పోర్చుగీసు పార్లమెంటు ‘కార్క్’ వృక్షానికి ఈ అపూర్వమైన గౌరవాన్ని కట్టబెట్టింది.

2018లో అతి పొడవైన కార్క్ ఓక్ వృక్షం ‘విజిల్ ట్రీ’ ‘యూరోపియన్ యూనియన్ ట్రీ ఆఫ్ ద ఇయర్’గా గౌరవించబడింది. జీవవైవిధ్యం, అరుదన పక్షి/జంతుజాలాలకు ఆలవాలంగా అలరారుతున్న అపురూపమైన ప్రాంతంగా ఇ.యూ. కౌన్సిల్ లోనూ ఈ వనాలు నమోదు చేయబడ్డాయి.

ముక్తాయింపు:

CoP సదస్సులు తీర్మానాలతోనూ, వాగ్దానాలతోనూ ముగుస్తున్నాయి కాని ఆశించిన స్థాయిలో కార్యాచరణ, ఫలితాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సమానంతరంగా భౌగోళిక పరిస్థితులు అనుకూలించే ప్రతి ప్రాంతంలోను కొంత విస్తీర్ణాన్ని కేటాయించి ఈ కార్క్ వనాల నమూనాను తీసుకుని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే భూతాపం తగ్గడానికి కొంత దోహదం కాగలదేమో ప్రపంచ దేశాలు ప్రభుత్వాలు ఆలోచించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here