అమ్మ కడుపు చల్లగా-35

0
9

[box type=’note’ fontsize=’16’] అడవులను, ప్రకృతి వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]జో[/dropcap]ధ్‌పూర్ లోని ‘జయ్‌నారాయణ్’ యూనివర్సిటీ, కెనడాకు చెందిన ప్రొఫెసర్ రోహిత్ జిందాల్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనాలు – రాజస్థాన్ లోని పడమటి ప్రాంతాలలోని సాంప్రదాయక నీటి సంరక్షణ విధానాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. జోధ్‌పూర్, బార్మేర్ వంటి జిల్లాలు దాహార్తితో అల్లాడుతూ ఉంటాయి. ఇక్కడ వర్షాలు వానదేవుడి ఆగ్రహనుగ్రహాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ కారణంగా చెరువులు, కుంటలు, కాల్వలు వంటి నీటి నిలువ వ్యవస్థలపై ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవిక సాగిస్తూ ఉంటారు. వేసవిలో ఈ వనరులు ప్రజల, పశువుల నీటి అవసరాలు తీరుస్తూ ఉంటాయి. అనేక వన్యప్రాణులూ ఈ నీటి వనరులపై ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉంటాయి.

అయితే నిర్లక్ష్యం కారణంగా ఈ నీటి వ్యవస్థలు చాలా వరకూ పాడైపోయాయి. సహజంగానే వాటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. గత సంవత్సరం కురిసిన అసాధారణ వర్షాలు వరదలకు కారణమవడానికి అదీ ఒక కారణం. జోధ్‌పూర్‍కు ఈశాన్యంగా ఉన్న భోపాల్‌ఘర్ తహసిల్ లోని రెండు కాల్వలు శ్రద్ధగా కాపాడుకుంటున్న కారణంగా గత ఏడు కురిసిన అసాధారణ వర్షాలకు నిండా నీటితో కళకళలాడాయి. నీటి నిల్వ వ్యవస్థలను శ్రద్ధగా కాపాడుకుంటున్న ప్రజలందరూ ఇప్పుడు నీటి సమృద్ధితో సంతోషంగా ఉన్నారు. అంతటి ఎడారి ప్రాంతంలో నీటి నిల్వ వ్యవస్థలను సరిగ్గా నిర్వహించుకొనక నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలలో నీటికి కటకట. ఆకస్మికంగా కురిసిన అసాధారణ వర్షాలకు వరదలూ సహజమే.

ప్రకృతి మాత ముద్దుబిడ్డలు బిష్ణోయిలు:

ఈ తెగల ప్రజలు ప్రకృతిని ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ప్రకృతి వ్యవస్థలను ఎంతో భక్తి శ్రద్ధలతో పరిరక్షిస్తూ ఉంటారు. స్థానిక గ్రామ దేవతలను ఆరాధించడలో భాగంగా అరణ్యాలలో కొంత ప్రాంతాన్ని ఆ దేవతలకు ప్రీతిపాత్రమైన వృక్షాలతో, నీటి వనరులతో తీర్చిదిద్ది కాపాడుతూ ఉంటారు. బిష్ణోయిలు అనేక శ్రమ దమాదులకు ఓర్చి ఈ వ్యవస్థలను కాపాడుకొంటూ వచ్చారు. ‘పవిత్ర వనాలు’గా వ్యవహరించబడే ఈ చిట్టడవులు వివిధ రకాల జీవజాతులతో అపూర్వమైన జంతు వైవిధ్యంతో అలరారుతూ ఉంటాయి. ఇక్కడి విశిష్టమైన కొన్ని జాతుల వృక్షాలు వాన నీటిని ఒడిసిపట్టి, ప్రవాహవేగాన్ని నియంత్రించడం లేదా తగ్గించడం వంటి చర్యలతో స్థానిక ఉపరితల జలవనరులలో ఆ నీరు ఇంకడానికి దోహదం చేస్తాయి. ఎంత నీరు ఇంకినప్పటికీ గట్లు తెగవు. నీటి నిల్వ నిర్వహణ వ్యవస్థలు అంత పటిష్టంగా రూపొందించబడ్డాయి.

రాజస్థాన్ లోని ఈ ‘ఓరన్’ వ్యవస్థలను ఆదర్శంగా తీసుకొని, ఆ నమూనా వ్యవస్థలను రూపొందించుకొని పరిరక్షించుకొంటేనే ఆకస్మిక వరదల ముప్పును గణనీయంగా తగ్గించుకోగల/నివారించుకోగల అవకాశం ఉంటుందని కెనడాకి చెందిన ప్రొఫెసర్ నవీన్ జిందాల్ అభిప్రాయ పడ్డారు.

వృక్షాలను దేవతలుగా కొలచి ఆరాధించడం బిష్ణోయిల సాంప్రదాయంలో వీరు పూజించే వృక్షాలలో ‘ఖేజ్రీ’ వృక్షానిది ప్రథమ స్థానం. నుయ్యి తవ్వితే ఆ చెట్టును పూజిస్తారు. శ్రీకృష్ణాష్టమి నాడు ఖేజ్రి శాఖను పూజిస్తారు. స్థానిక దేవతగా ‘గోగా’కు నివేదించడానికి ఈ పండుతో ‘సంగ్రి’ అనే ప్రసాదాన్ని తయారు చేసుకొంటారు. ఖేజ్రి వారికి వరప్రసాదిని వంటిది. వారి విశ్వాసానికి బలమైన నేపథ్యమే ఉన్నది.

ఖేజ్రి పట్టపొడిని అనేక వ్యాధులకు చికిత్సలో వినియోగిస్తారు. వీటి పుష్పాలు తుమ్మెదలను ఎక్కువగా ఆకర్షించడం ద్వారా పరాగ సంపర్కానికి విశేషంగా దోహదం చేస్తాయి. కలప సైతం వినియోగ యోగ్యమైనదే. అదీగాక, 1868లో రాజ్‌పుతానా రాజస్థాన్‌లో ఏర్పడిన కరువు కాటకాల సంకట కాలంలో ఈ వృక్షం వేల ప్రాణాలను కాపాడింది. చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ అడవిని రక్షించుకోవటానికై జరిగిన మొట్టమొదటి ఉద్యమం ‘చిప్కో’కు స్ఫూర్తినిచ్చిన ఘన చరిత్ర ఈ వృక్షానికి ఉంది.

మార్వాడ్ మహారాజు తన క్రొత్త రాజభవనం నిర్మాణం నిమిత్తం ఈ రక్షిత వనాలలోని చెట్లని నరకడానికి ఆదేశించినప్పుడు బిష్ణోయిలు ఖేజ్రి చెట్లను కౌగిలించుకుని చెట్లను నరకకుండా నిరోధించారు. ఈ పోరాటానికి ఆద్యురాలు రాజకుమారి అమృతాదేవి. సుమారు 363 మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి చెట్ల నరికివేతను అడ్దుకొన్నారు. తరువాత విషయం మహారాజు వరకు వెళ్ళింది. జరిగిన మారణకాండకు బాధ్యత వహిస్తూ, ఖిన్నుడైన మహారాజు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా బిష్ణోయి ప్రాంతాలలో చెట్లను నరకడాన్ని నిషేధిస్తూ రాజ శాసనం వెలువరించారు. గొడ్డలి వేటుకు సైతం వెరవక చెట్లను హత్తుకుని వృక్షాలను రక్షించటానికి ప్రయత్నించడంతో ఆ పోరాటాన్ని ‘చిప్కో’ ఉద్యమంగా వ్యవహరిస్తారు.

తరువాతి కాలంలో అడవుల నరికివేతను వ్యతిరేకిస్తూ – చండీప్రసాద్ భట్, సుందర్‍లాల్ బహుగుణ వంటి పర్యావరణవేత్తలు సాగించిన ఉద్యమాలన్నీ అప్పటి ‘చిప్కో’ ఉద్యమానికి కొనసాగింపే. అయినప్పటికీ విచక్షణారహితంగా సాగిన నరికివేత, ఫంగల్ వ్యాధుల కారణంగా ఖేజ్రి వృక్షాల సంఖ్య బాగా తగ్గిపోయింది. రాజస్థాన్ లోని కొన్ని జిల్లాలలో భూగర్భ జలాలు కరువైపోవడం గురించి 2015లో CAZRI (సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్) చేసిన పరిశోధనలో ఖేజ్రి వృక్షాల సంఖ్య సగానికి పైగా (సుమారు 35 శాతానికి) పడిపోయిందని వెల్లడి అయింది. జోధ్‍పూర్ లోని AFRI (అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) కూడా ఈ కోవకు చెందిన సంస్థే. హిమాలయాలలో ‘చిప్కో’ ఉద్యమాలను లెక్క చేయక విచక్షణా రహితంగా సాగిన అడవుల నరికివేత తాలూకు దుష్ప్రభావాలను ఇంచుమించు ప్రతి సంవత్సరం మనం అనుభవిస్తున్నాం. అయినప్పటికీ మేలుకోవడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here