అమ్మ కడుపు చల్లగా-36

0
9

[అడవులను, జల వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

తరచి చూస్తే అన్నీ ప్రశ్నలే!

[dropcap]ఆ[/dropcap]స్ట్రేలియాలో 18% భూభాగం ఎడారే. ఎడారిగా రూపాంతరం చెందిన నల్లార్బర్ మైదానంలో ప్రస్తుతం సున్నపురాతి కొండలు మాత్రమే ఉన్నాయి. స్లావేనియన్ పరిశోధకులు అక్కడ సాగించిన అధ్యయానాలలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. వారు వెలువరించిన 3D శాటిలైట్ డేటా ప్రకారం గతంలో అక్కడ సుమారు 4000 అడుగుల విస్తీర్ణం గల పగడపు దిబ్బలు ఉన్నట్లు బయటపడింది. మిలియన్ల సంవత్సరాల క్రిందట ఈ పగడపు దిబ్బలు ఉష్ణమండల సముద్ర జలాలలో కూరుకొనిపోయి ఉండవచ్చని శాస్త్రజ్ఞుల అంచనా.

కర్టిన్ యూనివర్శిటీ – ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్‌కు చెందిన శాస్త్రజ్ఞుల బృందం అత్యధిక రెజల్యూషన్ గల శాటిలైట్ ఫోటోగ్రఫీ ద్వారా పరిశీలించినప్పుడు మైక్రోబియల్ లక్షణాలతో సహా అక్కడి పురాతన చరిత్ర వాతావరణ ప్రభావాలకు అతీతంగా మిలియన్ల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండటాన్ని కనుగొన్నారు. వాతావరణంలోని పొడి స్వభావం కారణంగా అలా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. భూగర్భంలో అన్ని విశేషాలను దాచుకొన్న ఆ ప్రాంతం సుమారు – 76000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఎడారిగా రూపాంతరం చెందిపోయి ఉండటం ఇప్పటి వాస్తవం.

ఆర్కిటిక్ త్రవ్వకాల లోనూ 400 మీటర్ల లోతు నుండి సిలెండర్ ఆకారంలో అవశేషాలను త్రవ్వి తీసి పరిశీలించినప్పుడు 5½ కోట్ల సంవత్సరాల క్రిందట ఆర్కిటిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు తేలింది. మరి ఆర్కిటిక్ ఎలా గడ్డ కట్టింది? ప్రొఫెసర్ బ్రింకుయిస్ విశ్లేషణ విశ్లేషణల ప్రకారం 5000 సంవత్సరాల క్రిందట ఆర్కిటిక్‍లో మొదటిసారిగా నీరు గడ్డ కట్టిన ఛాయలు కనిపించాయి. భూమిపై సహజంగా జరిగే మార్పుల కారణంగా మనిషి ప్రభావం లేని రోజుల్లోనూ కాలుష్యాలు విడుదలయ్యేవనీ అభిప్రాయాలు ఉన్నాయి.

యూరప్‍లో 47% భూమి కరువు బారిన పడే ప్రమాదానికి చేరువలో ఉంది. 17% ప్రమాదంలోనే ఉంది. ఇ.యు. సంయుక్త పరిశోధన కేంద్రం పరిశోధనల ఫలితాలు ఈ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందనీ చెప్తున్నాయి.

వాతావరణం ఇలాగే ఉండి వేడి గాలులు, ఉష్ణోగ్రతలు తగ్గకపోతే, పంటల దిగుబడులు తగ్గిపోతాయి. పాడి వ్యవస్థలు దెబ్బతింటాయి. పరోక్షంగా అనేకమంది జీవనోపాధి దెబ్బ తింటుంది. స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాలు హెచ్చు స్థాయిలో దుష్పరిణామాలను అనుభవిస్తున్నాయి. యు.కె.లో రైతులు సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పశువులకు దాణా లేదు. మత్స్య సంపద మనుగడ ప్రమాదంలో పడింది. దక్షిణ, మధ్య ప్రాంతాలలో అధికారికంగా ప్రకటించబడిన కరువు నెలకొని ఉంది.

ఉత్తర ఇటలీ గత 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వర్షభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ‘పో’ నది ఎండిపోయింది. ఫ్రాన్స్ లోనూ మత్స్య సంపదకు ముప్పు ఏర్పడింది. ఇక అక్కడ చిన్న చితక నీటి వనరుల గురించి చెప్పడానికి ఏముంటుంది? అన్నీ ఎండిపోయాయి. రుమేనియాలో 70% కరువు కోరల్లో చిక్కుకుని ఉంది. రైన్, డాన్యూబ్ వంటి జీవ నదులలోనూ జలసిరులు అడుగంటి పురాతన వస్తువులు బయట పడుతున్నాయి. మిగిలిన దేశాలూ జల సంక్షోభానికి అతీతం కావు.

జల సంరక్షణ, అడవుల పునరుద్ధరణ వంటి చర్యలను చేపట్టి అమెరికా, ఆఫ్రికా, మెక్సికో వంటి దేశాలలో కొన్ని ప్రాంతాలు కొంతవరకు ఊరట పొందగలిగాయి. అడవుల పునరుద్ధరణతో బాటుగా అడవుల నడుమ వ్యవసాయాన్ని సైతం కొనసాగిస్తూ పశ్చిమ ఆఫ్రికా లోని నైగర్ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఏది ఏమైనా ప్రకృతి మనిషి మేధస్సును సవాలు చేస్తున్న అతి క్లిష్టమైన ప్రహేళిక అని అంగీకరించక తప్పదు. ప్రకృతి వ్యవస్థలను గౌరవిస్తూ, వాటిని సంరక్షించుకొంటూ, మేర మీరకుండా మసలాలన్న ప్రాప్తకాలజ్ఞతను సంతరించుకోకతప్పని పరిస్థితి నేటి మనిషిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here