అమ్మ కడుపు చల్లగా-38

0
9

[అడవులను, జల వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

కడలిలో కడుపు కోత:

[dropcap]స[/dropcap]ముద్రాలకు సంబంధించిన పరిజ్ఞానంలో మనమింకా ఓనమాల దశలో ఉన్నాం. ‘సముద్రమంత లోతైనది’ అని ఉదహరిస్తారు. సముద్రం లోతైనదే కాదు, అంతకు మించి నిగూఢమైనది కూడా. సముద్ర గర్భంలోని అద్భుతాలూ, ఐశ్వర్యాలు ఎన్నో!

అటువంటి సముద్రాలు సైతం మనిషి అనాలోచిత చర్యల ఫలితంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కుంటున్నాయి. వాటి అంతర్గత ఆచరణ వ్యవస్థలలోని సమతౌల్యానికీ ప్రమాదం ఏర్పడుతోంది. తీర ప్రాంత ఆవరణ వ్యవస్థల గురించి చెప్పేదేముంది?

ప్రపంచ ఆర్థికానికి సముద్రాలు, సాలీనా 1.5 ట్రిలియన్ డాలర్లను అందిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే ఈ లెక్క మరిన్ని రెట్లు కానున్నదని అంచనా. ఆర్థికపరంగా, పర్యావరణపరంగా ఇంతటి కీలకమైన పాత్రను పోషిస్తున్న సాగర ప్రాంతాలను, వ్యవస్థలను, తీరాలను భూతాం ముప్పు నుండి కొంతవరకైనా ఉపశమింపజేయడానికి ప్రపంచ బ్యాంకు సముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించటం, నివారించడం, పర్యావరణ హిత శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, టూరిజంకు సంబంధించిన పర్యావరణ హిత మార్గదర్శకాలు చేసింది.

బొగ్గు లాంటి భూగర్భ వనరుల నుండి వెలువడే ఉద్గారాలలో 90% వరకు సముద్రాలు శోషించేసుకుంటాయి. భూ ఉపరితల కార్యకలాపాల ఫలితంగా వెలువడే ఉద్గారాలను శోషించుకోవటంలోనూ సముద్రాలదే పెద్ద పాత్ర. ఆ కారణంగా సముద్రపు నీరు ఇంకా ఉప్పుదేరిపోతాయి. సముద్ర జలాలలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి సముద్ర జీవులే కాకుండా, తీర ప్రాంతాల వారికీ హాని కలుగుతోంది. సముద్ర జీవులలోనైతే కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. సముద్ర మట్టాలు 20-30% పెరుగుతాయని వివిధ అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. నానాటికీ ముప్పు పెరిగి పోతోంది గాని తగ్గటం లేదు.

మానవ చర్యల కారణంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలను శోషించుకోవటం లోనూ సముద్రాలది కీలకమైన పాత్రే. మానవ చర్యల ఫలితంగా వెలువడే బొగ్గుపులుసు వాయువులో కొంచెం ఇంచుమించుగా 4వ వంతు వరకు సముద్రాలే శోషించుకుంటాయి. ఆ విధంగా వాతావరణం తాలూకు ప్రభావం సముద్రాలపై, వాటి సహజ ఆవరణ వ్యవస్థలపై మరింత అధికం. ఉదాహరణకు పగడపు దిబ్బలు అతి సంక్లిష్టమైన, సున్నితమైన వ్యవస్థ. వాటి మనుగడ ప్రమాదంలో పడింది. దానికి కారణం సముద్ర జలాలు వాటి సహజమైన పరామితులకు మించి ఉప్పుదేరిపోవడం. ఆ కారణంగా అవి క్రమక్రమంగా అంతరించి పోతున్నాయి.

సముద్ర పరిసర ప్రాంతాలలో రూపొందే ఆవరణ వ్యవస్థలు, మడ అడవులు, చిత్తడులు, వంటి వన్నీ కలిపి యూనిట్ల లెక్కన లెక్కగడితే, అడవుల కంటే అధికంగా కార్బన్‍ను నిక్షేపించుకొని ఉంటాయి. తుఫానుల సమయంలో ఈ ఆవరణ వ్యవస్థలు గాలి వేగాన్ని నియంత్రించడం ద్వారా అలల తాకిడిని కొంత వరకు నియంత్రిస్తాయి. ఇటీవల జరిగిన అధ్యయనాలలో అలల వేగాన్ని 29%-90% వరకు కూడా తగ్గించడంలో ఈ ఆవరణ వ్యవస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని తేలింది. తీరప్రాంతాలు కోతకు గురి కాకుండనూ, తద్వారా తీర ప్రాంతాల ప్రజల జీవితాలు కల్లోలం కాకుండానూ ఈ తీర ఆవరణ వ్యవస్థలు కాపాడుతున్నాయి.

ప్రపంచ రవాణా వ్యవస్థలో 90% వరకు సరుకు రవాణ సముద్ర మార్గాల గుండానే జరుగుతోంది. చాలా వరకు ఓడలు బంకర్ ఆయిల్‍నే వినియోగిస్తాయి. ఇది చాలా నాసిరకం శిలాజ ఇంధనం. వీటి నుండి వెలువడే కాలుష్యం ఎక్కువ. ఇటువంటి అనేక మానవ కార్యకలాపాలు సముద్రాలకూ, వాటి ఆవరణ వ్యవస్థకూ ఎనలేని హాని చేస్తున్నాయి. అయితే సముద్రాలకు జరుగుతున్న ఈ హాని గురించి ఇటీవలి కాలం వరకు మనిషి పెద్దగా ధ్యాస పెట్టనే లేదు. భూతాపం పెరిగిపోవడం, ప్రమాదం ముంగిట నుంచున్న స్థితిలో అన్నీ ప్రాధాన్యత గల అంశాలేనన్న విషయం బోధపడడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here