అమ్మ కడుపు చల్లగా-39

0
7

[అడవులను, జల వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

జల సంరక్షణ:

[dropcap]ప్ర[/dropcap]పంచ జనాభాలో మనది 17 శాతానికి పైమాటే. నీటి వనరుల రీత్యా మాత్రం 5 శాతానికి మించదు. మన దేశంలో నీటి వినియోగం వ్యవసాయానికి 80%, తాగునీటి అవసరాలకు 8%, పరిశ్రమలకు 12% అని లెక్కలు చెప్తున్నాయి. వివిధ రకాలకు చెందిన నీటి వనరులు 24 లక్షలకు పై మాటే అని సర్వేలు చెప్తున్నాయి.  కాకపోతే సింహభాగం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉండగా, మొత్తం నీటి వనరులలో 4 లక్షలకు పైగా నిరుపయోగంగా ఉన్నాయి. కొంచెం ఇంచుమించుగా 39000 వరకు వనరులు ఆక్రమణలో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 250కి పైగా జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వాననీటి ప్రవాహాలకు వాలులో పెద్ద పెద్ద నిర్మాణాలు పెరిగిపోవడంతో ప్రవాహాలు దారి మారుతున్న కారణంగా వాన నీరు నేల, నీటి వనరులైన చెరువులు, కుంటలు వంటి వాటిలో ఇంకడానికి బదులు వివిధ ప్రాంతాలలో పల్లపు ప్రాంతాల ముంపుకూ కారణమవుతోంది. ఆ కారణంగా ప్రజా జీవితం అతలాకుతలం అవుతోంది.

సుమారుగా 150 సంవత్సరాలకు ముందు ప్రజల నీటి అవసరాలను తీర్చటం అన్నది ప్రభుత్వాల బాధ్యత కాదు. అప్పుడు రకరకాల ఉపాయాలతో ప్రజలు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకొని వినియోగించేవారు. రాను రాను నీరు సులభంగా లభ్యం కావటం మొదలుపెట్టింది. మోటార్లు వచ్చాక శ్రమ లేకుండానే నీరు అందుబాటులోనికి వస్తుండటంతో వాడకంలో జాగ్రత్త తగ్గి నిర్లక్ష్యం పెరిగిపోయింది. యథేచ్ఛగా తోడి వేస్తుండటం, ఇంకే అవకాశాలు తగ్గిపోవటం వల్ల భూగర్భ జలమట్టాలు క్రమేపి తగ్గిపోతూ వచ్చాయి. పర్యావరణానికి హాని చేసే అనేక మానవ కార్యకలాపాల కారణంగా నదీ జలాల ప్రవాహ రాశులలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

భారతదేశంలో 17 రాష్ట్రాలు, 365 జిల్లాలు, 200 నగరాలు అయితే నీటికి కరువు లేకపోతే వరదలు. కారణం విపరీతమైన నీటి వృథా. తలసరి నీటి వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. భూగర్భ జలాలను వెలికితీయడంలో మోటార్లు ప్రవేశించాకా, శారీరక కష్టం లేకుండా నీరు లభిస్తూండడంతో చాలా వెసులుబాటు లభించి సమయం, శక్తి కలిసి వచ్చినప్పటికీ వాడకంలో నిర్లక్ష్యమూ క్రమేపీ పెరిగిపోయింది. ఆ నిర్లక్ష్యం యింత అంతై నీటి వృథా అంతే లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాలు నీరు చుక్క లభించక అల్లల్లాడుతుంటే నీటి కరువు లేని చోట నీరు వృథా కాల్వల పాలు అవుతోంది.

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా నీటి కటకటతో అల్లాడిపోయేది. ఊళ్ళకు ఊళ్ళు నీటి కరువును తట్టుకోలేక ఖాళీ అయిపోయేవి. ప్రజలు పొట్ట చేతబట్టుకొని వలసపోయేవారు. వృత్తి రీత్యా అక్కడకు వెళ్ళిన డా. రాజేంద్ర సింగ్ అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయి అందుకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేశారు. ఒక అవగాహనకు వచ్చాక అక్కడ జల సంరక్షణకై నడుం బిగించారు. మెల్లిమెల్లిగా స్థానిక ప్రజల భాగస్వామ్యమూ పెరిగింది. పూడిక తీత వంటి చర్యలతో బాటు అనుకూలమైన ప్రదేశాలలో క్రొత్తగా చెరువులను ఏర్పాటు చేయటం వంటి పనులతో అవిశ్రాంతంగా జరిపిన కృషి అద్భుతమైన ఫలితాలను అందించింది. 11,800 చెరువులు నీటితో కళకళలాడటం మొదలుపెట్టాయి. మొదటగా నీటి కరువు తీరింది. క్రమక్రమంగా వ్యవసాయ అవసరాలకు సరిపడ నీరు సమకూరింది. దాణా, నీరు లభించటంతో పశు సంపద వృద్ధి చెందసాగింది. వలసలు తగ్గటమే కాక, వలసపోయిన వాళ్ళలో చాలామంది తిరిగి రావడమూ జరిగింది.

అయితే ఇదంతా ఒక్క రోజులోనో, సంవత్సరంలోనో జరిగిన అద్భుతం కాదు. దీని వెనుక డా. రాజేంద్ర సింగ్ అవిశ్రాంత కృషి, పట్టుదల ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ కృషికి తగిన ఫలితాలతో క్రమక్రమంగా 20 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆ ప్రాంతాలన్నీ జలకళతో, పశు సంపదతో, పచ్చని పైర్లతో, స్వయం సమృద్ధితో ఈనాడు మిగిలిన ప్రాంతాలకు, ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఆయన అవిరళ కృషే ప్రజలను సైతం భాగస్వాములయ్యేలా చేసింది. ఈ మహాక్రతువు పూర్తి అయ్యేనాటికి ఆయన జల సంరక్షణ, శాస్త్రీయమైన విధానాలు వంటి అంశాలలో నిష్ణాతులైపోయారు.

డా. రాజేంద్ర సింగ్ అధ్యయానల ప్రకారం –

భారతదేశం నైసర్గిక, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారు 19 రకాల ప్రాంతాలతో ఉంది. అక్కడి స్థానిక పరిస్థితులకు అనువైన ప్రణాళికలను రచించుకొని అనుసరించడం ద్వారా నీటి కటకటను చాలా సులభంగా అధిగమించవచ్చు. వీటికి సంబంధించి ఆయన అభిప్రాయాలు ఎంతో ఉదాత్తంగా ఉంటాయి. మన దేశంలో నీటిని పూజిస్తాం. ఆ కారణంగా వినియోగించేటప్పుడు నీటిని అదే గౌరవంతో చూడాలంటారు రాజేంద్ర సింగ్. నీటిని గౌరవించడం, వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవడం, నేలలో ఇంకేలా చూడడం, శుద్ధి చేసుకోవటం, రీసైకిల్ చేసి వాడుకోవటం వంటి చర్యల ద్వారా కూడా ఆ గౌరవాన్ని కొనసాగిస్తే నీటి కరువును తేలికగా అధిగమించవచ్చునన్నది ఆయన తన స్వానుభవంతో ఇచ్చే సందేశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here