[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
[dropcap]ఇ[/dropcap]టీవలి కాలంలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాడ్పులు, తీవ్రమైన ఎండలు వంటి విపరిమాణాలతో ప్రాణికోటి అల్లల్లాడుతున్నది. వాతావరణ సంక్షోభాల కారణంగా పంటల దిగుబడులూ దెబ్బ తింటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఆహార భద్రతకూ ముప్పు ఏర్పడగల ప్రమాదం ఉంది.
ప్రపంచ జనాభాలో సగం మంది వాతావరణ మార్పుల ప్రభావానికి గురికాగల అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. గత దశాబ్దం నుండి తుఫానులు, కరువులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో వడగాలుల కారణంగా సంభవించే మరణాలూ పెరిగిపోతున్నాయి.
భూతాపం రేటు పెరిగేకొద్దీ ప్రకృతి వైపరీత్యాలకు అవకాశం పెరిగిపోతూ ఉంటుంది. తీవ్రమైన వడగాలులు, అనావృష్టి వంటి వైపరీత్యాలు పెరిగిపోతాయి. నిజానికి ఈ పర్యావరణ విపత్తులకు కారణమైన కాలుష్యాలకు ముఖ్య కారణమైన దేశాలు/ప్రజలు కంటే చాలా తక్కువ పాత్ర ఉన్న దేశాలు వాటి ఫలితాలను అనుభవించడం జరుగుతోంది.
ప్రకృతి వ్యవస్థలకు ముప్పు ఎవరి కారణంగా ఏర్పడిందన్న విషయంతో సంబంధం లేకుండా ముప్పు తాలూకు పరిణామాలు ప్రపంచంలో ఎక్కడైనా సంభవించగల అవకాశం ఉందన్న దానికి అంతకంటే పెద్ద ఉదాహరణ లేదు.
వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే ఆహార సంక్షోభం, నీటి కరువు, తత్ఫలితంగా మళ్ళీ పెరిగే భూతాపం ఇవన్నీ మానవాళికే కాదు, ప్రకృతి వ్యవస్థలకీ తీవ్రమైన ముపును తెచ్చిపెట్టే గొలుసుకట్టు పరిణామాలు. వీటికి తోడు అంతుచిక్కని వ్యాధులు ప్రబలడం వంటి ప్రమాదాలు తోడైతే పరిస్థితులు చక్కబెట్టడం అసాధ్యం అయిపోతుంది.
వెంటనే సరైన చర్యలు చేపడితే కొంతలో కొంతైనా సమతౌల్యత, సుస్థిరతల దిశగా అడుగులు పడినట్లే అవుతుంది.
పరిశుభ్రమైన ఇంధనం, శుద్ధ సాంకేతికలు వంటి అంశాలే ఇరుసులుగా లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధి కొనసాగాలి. రవాణా విషయానికి వస్తే నడక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షేరింగ్ వంటి ప్రక్రియలను తక్షణ చర్యలుగా చేపట్టినట్లయితే వాయు కాలుష్యం కొంత మేరకు నియంత్రించడం వీలు పడుతుంది.
గాలి నాణ్యతలో మెరుగుదల వస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్గారాలను నియంత్రించడం వలన కలిగే తాత్కాలికమైన ఆర్థిక నష్టం కంటే ప్రజారోగ్యం మెరుగుపడడం వంటి సత్ఫలితాల వలన కలిగే ప్రయోజనాలు బహుముఖమైనవి. వాతావరణం దుష్ప్రభావాలను తగ్గించడం ద్వారా సామాన్య ప్రజానికి ఒనగూరే ప్రయోజనాలు ఖచ్చితంగా ఎక్కువ.
పెట్టుబడులను ఆకర్షించడంతో బాటుగా పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉన్న చోట నిష్కర్ష గాను, ఖచ్చితంగాను వ్యవహరించే విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. పర్యావరణానికి మేలు కలిగే అంశాలకు ప్రాధాన్యత నీయాలి. ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వారి భాగస్వామ్యంతో వాతావరణంలోని మార్పులను నియంత్రించగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.