[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
కరిగిపోతున్న అక్షయపాత్ర
[dropcap]టి[/dropcap]బెటన్ పీఠభూమి ప్రస్తుతం ఉన్న స్థితికి రావటానికి అనేక మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఇండియా-ఆసియా టెక్టానిక్ పలకల అమరికలు అక్కడ శిఖరానికి తగిన శీతలత్వాన్ని కలిగించాయి కూడా. మెకాంగ్, యాంగ్జీ లతో పాటుగా ఇంచుమించుగా అన్ని పెద్ద నదులనూ జీవజలాలతో సుసంపన్నం చేసే అక్కడి గ్లేసియర్స్ వేగంగా కరిగిపోతున్నాయి. టిబెటన్ పీఠభూమి గత అర్ధ శతాబ్దంలోనే 15% గ్లేసియర్స్‌ని కోల్పోయింది.
చైనాలోని ‘దాగు’ గ్లేసియర్ సముద్ర మట్టానికి 3 మైళ్ళ ఎగువన ఏర్పడిన ప్రకృతి వ్యవస్థ. గత అర్ధ శతాబ్దిలో అక్కడి హిమనీనదాలు సగానికి పైగా కరిగిపోయాయి. సాధారణ పరిస్థితులలోనైతే హిమనీనదాల నుండి మంచు కరిగి దిగువకి ప్రవహించినప్పుడు పరిసరాలలోని వేలాది ప్రజల నీటి అవసరాలను తీర్చడమే కాకుండా కొద్దో గొప్పో జలవిద్యుత్ ఉత్పాదనకూ ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ.
ఈ ప్రాంతం సాలీనా 2,00,000 టూరిస్టులకు కేంద్రంగా ఉంటోంది. ఆ రీత్యా సుమారు 2000 మందికి ఉపాధి దొరుకుతోంది. భూతాపం కారణంగా ఇదంతా ప్రమాదంలో పడింది.
ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న వాతావరణంలో క్రమబద్ధమైన ఈ ప్రక్రియలన్నీ తమ సహజ గతి రీతులను కోల్పోతున్నాయి. వ్యవస్థల ఉనికికీ ముప్పు ఏర్పడుతోంది. హిమాలయాలలో పాత రికార్డులను బ్రద్దలు చేస్తూ కరుగుతున్న మంచు పాకిస్తాన్‍లో వరదలకు కారణం అవడం ఒక ప్రకృతి వైపరీత్యం.
బెటర్ లేట్ దేన్ నెవర్:
ఆల్ఫ్ పర్వత శ్రేణులు కేవలం 2001-22 నడుమ కాలానికే తన వద్ద నున్న మంచు ఫలకాలలో 30 శాతం పరిమాణంలో మంచు వనరులను కోల్పోయాయి. గ్లేసియర్స్ అంతగా ప్రభావితం కావడానికి కారణమవుతున్న భూతాపాన్ని అదుపు చేయడానికి స్విస్ ప్రభుత్వం 2050 నాటికల్లా కార్బన్ తటస్థత సాధించగలిగేలా సరికొత్త పర్యావరణ బిల్లును తీసుకువచ్చింది.
సంపన్నమైన ఆ దేశం తన ఇంధన వినియోగంలో ¾వ వంతు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దిగుమతులను తగ్గించుకుని పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగం అదీ దేశీయమైనవి వినియోగంలోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నిర్దేశిత లక్ష్యాలతో పర్యావరణ పరిరక్షణ దిశగా ఫెడరల్ చట్టమూ చేయబడింది. కార్పోరేట్ పన్నులను పెంచే దిశగానూ ఆలోచిస్తున్నది.
గ్లేసియర్స్ కరిగిపోయే క్రమాన్ని కొంతమేరకైనా నియంత్రించడానికై పలురకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
యూరోపియన్ SKY మంచుఫలకాలపై తెల్లటి దుప్పట్లు పరవడం ద్వారా 2 దశాబ్దాలుగా మంచు కరిగే వేగాన్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్వచ్ఛమైన తెలుపు రంగు సూర్యకిర్యాణాలను వెనక్కి మళ్ళిస్తాయన్నది చీకట్లో చిరుదీపంలా చిన్న ఆశ.
చైనా కూడా ఇప్పుడిప్పుడే అదే విధానాన్ని అమలు చేయబోతోంది. అయితే ఈ విధానం అంత సులభ సాధ్యమైనదేమీ కాదు. భూమికి అంత ఎత్తులో పని చేస్తున్నప్పుడు తలనొప్పి, వికారం వంటివి ఆరోగ్య సమస్యలు అనేకం తలెత్తుతాయి. అదీ గాక, తెల్లని షీట్స్ నుంచి వెలువడే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు, రసాయనాల కారణంగా స్థానిక ప్రకృతి వ్యవస్థలకు అపకారం జరిగే అవకాశం లేదనడానికి వీలు లేదు. ఇతరత్రా విపరీత పరిణామాలు సంభవించి పర్యావరణానికి మరింత హాని జరిగే అవకాశం ఉందన్న వాదనలూ కొట్టిపారేయడానికి వీలు లేనివి.
చేతులు కాలాకా, ఆకులు పట్టుకున్నట్లు – ఇంత ప్రయత్నిస్తున్నా ఇదంతా మరణశయ్య మీదున్న రోగికి తాత్కాలిక ఉపశమనం ద్వారా జీవితకాలాన్ని మరికొద్ది కాలం మాత్రమైనా పొడిగించడానికి చేసే ప్రయత్నం వంటిది మాత్రమేనని, సమస్య పరిష్కారం మాత్రం కాదని గ్లేసియాలజీ నిపుణులు అంటున్నారు.