అమ్మ కడుపు చల్లగా-44

0
8

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

జల సంరక్షణ – సర్వకాలిక ప్రమాణాలు

[dropcap]వ్య[/dropcap]వసాయ రంగంలో విప్లవాత్మకమైన విధానాలను ప్రవేశపెట్టిన వారిలో ఆద్యులు ముస్లింలు. వేల సంవత్సరాల క్రిందట హరిత విప్లవాన్ని సాధించిన ఘనత వీరికే దక్కుతుంది. ఇస్లామిక్ వ్యవసాయ విప్లవం నిజానికి మొదటి ‘హరిత విప్లవం’.

వీరు నీటిని వినియోగించే విధానాలనే మార్చివేశారు. ముస్లిం రైతులు నీరు, మట్టి, మొక్కలను గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడమే గాక, మంచు గతి రీతులను కూడా కూలంకుషంగా అర్థం చేసుకున్నారు. ఆ విజ్ఞానాన్ని తగిన నైపుణ్యాలు, శక్తియుక్తులతో సమర్థవంతంగా వ్యవసాయంలో వినియోగించారు.

మధ్యయుగాల తొలి కాలంలోనే వారు చక్కని వ్యవసాయ రీతులను, నీటి పంపిణీ విధానాలను రూపొందించారు. ఈ నీటి పంపిణీ విధానానికి ‘సెక్వియా’ అని వాడుక పేరు. ‘సెక్వియా’ అన్నది అరబిక్ పదం. నీటిని తీసుకునిపోయే ప్రవాహం అని దాని అర్థం. దాని నుండే ‘అసెక్వియా’ అనబడే పదం సైతం వాడుకలోనికి వచ్చింది. ‘అసెక్వియా’ అన్నది స్పానిష్ పదం. ‘పంటకాల్వ’ అని ఆ పదానికి అర్థం.

వేల సంవత్సరాల క్రిందటే ముస్లింలు రూపొందించిన 1000 కిలోమీటర్లు నిడివి గల ఒక నీటి పంపిణీ వ్యవస్థ భూమికి 1,800 మీటర్లు లేదా 5,900 అడుగుల ఎత్తులో ప్రారంభం అవుతుంది. కరిగే మంచు ఆధారితంగా రూపొందించబడిన వ్యవస్థ ఇది. వాన నీరు గాని, కరుగుతున్న మంచును గాని ప్రవాహాన్ని అదుపు చేసి నిల్వ చేసి వినియోగించే ఈ విధానం తరువాతి కాలంలో యూరప్‍కూ విస్తరించింది.

8వ శతాబ్దంలో అరబ్బులు స్పెయిన్‍ని ఆక్రమించినప్పుడు వారి ద్వారా మధ్యప్రాచ్యంలో శతాబ్దాలుగా అనుసరిస్తున్న నీటి నిర్వహణ, నిలువ ఉపాయాలు స్పెయిన్ లోనూ వాడుకలోకి వచ్చాయి. మధ్యధరా ప్రాంతంలో నీటిని వాడే విధానాలే పూర్తిగా మారిపోయాయి. ఆ నైపుణ్యాలు పంటల వైవిధ్యానికి అవకాశం ఇచ్చాయి. చెరకు, నిమ్మజాతి పంటలు సాగులోనికి వచ్చాయి. ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా వచ్చిన సత్ఫలితాలకు చక్కని ప్రచారం లభించడంతో ఆ విధానాలు త్వరితగతిన వ్యాప్తి చెందాయి. కారణం – అప్పటి వరకు మధ్యధరా ప్రాంతంలోకి నీరు చాలా కొద్ది మొత్తంలోనే వచ్చేది. చాలా నీరు సముద్రంలోకి వృథాగా పోయేది. ఆ కారణంగా అనేక ప్రాంతాలు నీటి ఎద్దడితో సతమతమయ్యేవి. ఈ విధానాలలోని మేధస్సు నీటి నడతను, ప్రవాహాన్ని నియంత్రించి నీరు అక్కడికక్కడే, ఎక్కడికక్కడ ఇంకేలా చేయటంతో ఆ నీరు – నీటి ఎద్దడి కాలంలో ఉపయోగపడేది. ఫలితంగా వలసలూ గణనీయంగా తగ్గిపోయాయి. పల్లె ప్రాంతాలూ, పట్టణ ప్రాంతాలు తిరిగి ప్రజలతో కళకళలాడటం జరిగింది.

ఈ ‘సెక్వియా’ విధానం స్పెయిన్ లోని పర్వతశ్రేణులను మాలిమి చేసుకోగలిగింది. సిర్రా నెవడా పర్వతశ్రేణులు అత్యంత పురాతనమైన భూగర్భ నీటి వ్యవస్థలు. కాలానుగుణంగా రీఛార్జ్ కాగలిగిన ఈ వ్యవస్థలు సుదీర్ఘమైన కరువు కాటకాలు, నీటి ఎద్దడి వంటి సమస్యల నుండి స్పెయిన్‍కు ఉపశాంతిని కలిగించాయి. 1000 సంవత్సరాలకి పైగా చరిత్ర కలిగిన ఈ వ్యవస్థలు యూరప్ మొత్తంలోనే అత్యంత ప్రాచీనమైనవి. స్థానిక సమూహాలు/ప్రజలు వీటిని ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటూ ఉంటారు. ఆ కారణంగా వీటి నిర్వహణలో కూడా ప్రజలు భాగస్వాములే. తమ తమ పొలాలు, స్థలాల లోని కాలవల నిర్వహణ పూచీ ప్రతి ఒక్కరిదీ. ఇది ఒకప్పటి కథ.

యూరప్‍లో మరెక్కడా లేని అత్యంత వినూత్నమైన ఈ వ్యవసాయ పద్ధతి వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసింది. అంతులేని సంపద సృష్టికి కారణమయింది. స్పెయిన్‌ను సుభిక్షమూ, సుసంపన్నమూ చేసిన ఈ విధానం పారిశ్రామికీకరణ పరుగు పందెంలో – వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురికావడంతో క్రమేపీ మూలనబడింది. యూరప్ లోని బీడు భూములను సైతం సాగుభూములుగా చేసిన ‘సెక్వియాస్’ నిరాదరణ కారణంగా పాడుబడ్డాయి.

ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా స్పెయిన్‍ని మళ్ళీ కరువు కాటకాలు, నీటి ఎద్దడి సంక్షోభంలోనికి నెట్టివేస్తున్నాయి. ఆ కారణంగా ప్రజలు, ప్రభుత్వాలు మళ్ళీ వేల ఏళ్ళ నాటి – ఆ నీటి నిర్వహణ పద్ధతుల పట్ల కుతూహలం చూపిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ నెవడా – స్థానిక ప్రజలు, యూరోపియన్ యూనియన్ ఆర్థిక సహకారంలో ఈ విధానంలోని వ్యవస్థల పునరుద్ధరణ దిశగా కృషి చేస్తోంది. యూనివర్శిటీ లోని బయోకల్చర్ ఆర్కియాలజీ విభాగం ‘మెమోలాబ్’ ప్రాజెక్టు ఈ దిశగా పని చేస్తున్నాయి.

ఈ విధానాన్ని పునరుద్ధరించుకోవడం అంటే వారసత్వ సంస్కృతిని కాపాడుకున్నట్లే అని, ప్రాజెక్టుకు సంబంధించి పని చేస్తున్న నిపుణులు అంటున్నారు. కారణం ముస్లింల ఏలుబడిలోని స్పెయిన్‌లో సింహభాగం వ్యవసాయిక సమాజం.

అయితే ఈ జ్ఞానం ఎక్కడా వ్రాతపూర్వకంగా నిక్షిప్తమై లేదు. వివిధ స్థాయిలలోని ప్రజలు, సమాజాలు ఎక్కడెక్కడో తిరిగి అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని ఒక చోట క్రోడీకరించవలసి ఉంటుంది. చెదురుమదురుగా ఉన్న జ్ఞానాన్ని సేకరించి సమీకృతం చేయటం చాలా ప్రయాసతో కూడుకున్నదే. అయినప్పటికీ ప్రయత్నాలు అంతే ముమ్మరంగా జరుగుతున్నాయి.

దక్షిణ స్పెయిన్ లోని నీటీ నిర్వహణ వ్యవస్థ చాలా వరకూ బాగానే ఉంది. కానీ కొన్ని చిక్కులను పరిష్కరించుకోవలసి ఉంది. ఇపుడు 800 దాకా సెక్వియాస్ ఉత్తర మెక్సికో లోని వ్యవసాయ భూములకు నీరు అందిస్తున్నాయి.

సాంకేతిక విజ్ఞానంతో ఏ మాత్రం ప్రమేయం లేని ఈ నీటి నిర్వహణ విధానాలు స్థానిక సమాజాలు/సమూహాలు సమర్థవంతంగా నిర్వహించుకోగలిగిన చక్కని వ్యవస్థలు. అనేక లాటిన్ అమెరికన్ దేశాలూ, అవే రకం నైపుణ్యాలను అవలంబించి తమ పురాతన నీటి పారుదల వ్యవస్థలను పునురదుద్ధరించుకొంటున్నాయి. పెరూ ఆ దిశగా ముందంజలో ఉంది.

ఆధునిక సాంకేతికతలు సైతం అక్కరకు రాని అనుభవాలను చవిచూసిన కాలిఫోర్నియా సైతం ఈ పరిజ్ఞానం పట్ల కుతూహలం ప్రదర్శిస్తుండటం ఇటీవలి పరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here