అమ్మ కడుపు చల్లగా-5

0
5

[box type=’note’ fontsize=’16’] “ప్రకృతి నుండి పొందడం నుండి – తీసుకోవడం, క్రమేపీ దోచుకోవడం స్థాయికి చేరిన మనిషి ఆశే ప్రస్తుత పరిణామాలన్నిటికీ మూల కారణం” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]ఈ[/dropcap] చరాచర జగత్తులో అంతులేని జీవ వైవిధ్యంతో కోటానుకోట్ల జీవరాశులతో అలరారే ప్రకృతి వ్యవస్థ ప్రాణికోటికి ఒక అపురూపమైన వరం.  పిపీలికాది పర్యంతం ఉన్న సృష్టిలో మానవుడు ఒక జాతి మాత్రమే. ఆద్యంతాలు తెలియని ప్రకృతి వ్యవస్థపై ఆసాంతం ఆధారపడి జీవించే మనిషి మిగిలిన జీవరాశుల కన్న ఏ రకంగానూ అధికం కాదు. ప్రకృతి వ్యవస్థ సమతౌల్యం దెబ్బ తిననంతవరకు మానవజన్మ ఉత్కృష్టమైనదిగానే భావించబడింది. ఆ అహంకారంతోనే వ్యవస్థలో జీవించవలసిన మనిషి వ్యవస్థనే చెండుకుని తినడం మొదలుపెట్టాడు. నిజానికి ప్రకృతి సమతూకంలో మనిషి అస్తిత్వం ఒక చిన్న గులకరాయి పాటి కూడా కాదు.

అయినప్పటికీ సమస్త ప్రకృతీ తన ఒక్కడిదేనన్న అహంభావంతో మిగిలిన జీవజాలాన్ని వేరుగా చూడటం మొదలుపెట్టిన నాటి నుండే ప్రకృతి పట్ల మనిషి విధ్వంస రచన మొదలైంది. ప్రకృతిలో మమేకం కావడానికి బదులు ప్రకృతిని/వనరులను వినియోగ వస్తువుగా చూడడం మొదలుపెట్టిన తర్వాత విచక్షణా రహితంగా ప్రకృతి వనరులను దోచుకోవడం మొదలుపెట్టాడు. క్రమేపీ రాటుదేలిపోయాడు. ఎంతగా అంటే ఆ దోపిడీ ప్రకృతి వ్యవస్థకే చేటు చేసేటంత. ఫలితం పర్యావరణ విధ్వంసం.

ప్రకృతి నుండి పొందడం నుండి – తీసుకోవడం, క్రమేపీ దోచుకోవడం స్థాయికి చేరిన మనిషి ఆశే ప్రస్తుత పరిణామాలన్నిటికీ మూల కారణం. ఆ నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు – వాటిని వెన్నంటి పర్యావరణ ఒప్పందాలు కుదుర్చుకోవడం తప్పనిసరి కావడం వరకూ రావడం జరిగింది.

పర్యావరణానికి జరుగుతున్న హానిని 1974లోనే గుర్తించడం జరిగింది. 1977లో వివిధ దేశాలకు చెందిన 30 మంది నిపుణులతో వాషింగ్టన్‌లో సదస్సు నిర్వహించబడింది. కార్యాచరణ ప్రణాళిక ఒకటి రూపొందించబడింది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు కొన్ని అనధికార సంస్థలకు కొన్ని కార్యక్రమాల బాధ్యతను అప్పగించడం జరిగింది. ఒక సమన్వయ కమిటీ సైతం ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ 9 నివేదికలు సమర్పించింది. ఆ 9 నివేదికల ఆధారంగా అంతర్జాతీయంగా సంప్రదింపులు మొదలయ్యాయి. 1981లో U.N.O.కి చెందిన గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ సమితి ఏర్పడింది. ఈ అడ్‌హాక్ గ్రూప్‍లో సాంకేతిక నిపుణులతో బాటు న్యాయరంగ నిపుణులూ ఉన్నారు. వారు ఉద్గారాల కారణంగా ఓజోనుకు రాగల ప్రమాదం గురించి అంచనా వేసి నివారణా చర్యలు సూచించారు.

అనేక తర్జన భర్జనల అనంతరం 1985లో వివిధ దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. 1987లో పర్యావరణానికి హాని కలగకుండా తీసుకోవలసిన చర్యలను సైతం నిర్దుష్టంగా పేర్కొంటూ సభ్యదేశాలన్నీ ‘మాంట్రియాల్ ప్రోటోకాల్’పై సంతకం చేశాయి. దాని ప్రకారం 2000 నాటికే ఉద్గారాలన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన నిర్మూలించవలసి ఉంది. ఉద్గారాల విడుదలలో పారిశ్రామిక దేశాలదే సింహశాతం అయిన కారణంగా 2000 సంవత్సరం వరకు ఉద్గారాల నియంత్రణ బాధ్యతా నిర్మూలనా బాధ్యతా పూర్తిగా పారిశ్రామిక దేశాలదే. అదీ గాక ఆ దేశాలు వర్ధమాన దేశాలకు ఆ దిశగా సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించవలసి ఉంది. అయితే –

ప్రమాద తీవ్రత అంచనాలకు మించి ఉండడంతో 1996 నాటికే అన్ని C.F.Cలను నిర్మూలించాలనీ, 1992 నాటి ‘కోపెన్‌హెగెన్’ సదస్సు అంగీకారనికి వచ్చింది. నిజానికి అప్పటి నుంచే చర్యలు ముమ్మురం చేసి ఉంటే ఈనాడు మానవాళి ఇంత సంక్షోభంలో ఉండేది కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here