అమ్మ కడుపు చల్లగా-57

0
9

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

శ్రద్ధే ప్రకృతి పరిరక్షణకు కవచంగా

[dropcap]వే[/dropcap]ల సంవత్సరాలుగా ప్రకృతిని పూజించి ఆరాధించడం అన్నది మానవ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. దేశమేదైనా, భాష ఏదైనా ప్రపంచమంతటా ఈ సంస్కృతి ఉన్నది. మన మనుగడకు ఆధారభూతమైన ప్రకృతిని భక్తితో, ప్రేమతో ఆరాధించటం, కృతజ్ఞతను చాటుకోవడం అనాదిగా వస్తున్నదే.

అటవీ వ్యవస్థలతో సైతం కొన్ని ప్రాంతాలను ‘పవిత్ర వనాలు’గా ప్రత్యేకించి, వాటిని అతి జాగ్రత్తగా సంరక్షిస్తూ స్థానిక సాంప్రదాయాల మేరకు వాటిని ఆరాధిస్తూ రావటం ఏనాటి నుండో ఉంది. ఈ పవిత్ర వనాలు అరుదైన జాతి వృక్షాలతో, దేవతామూర్తులతో, జలవనరులతో అంతులేని వైవిధ్యంతో అలరారుతూ ఉంటాయి.

భారతదేశంలో అటువంటి వ్యవస్థలు కాశీ హిల్స్‌లో ఉన్నాయి. స్థానిక సమూహాలు ఖచ్చితమైన విధివిధానాలతో ఆ వ్యవస్థలను కాపాడుకుంటూ ఉంటాయి. గుజరాత్ లోని బిష్ణోయ్ తెగ కూడా అంతే. వనసంరక్షణ నుంచి జలసంరక్షణ వరకు పకడ్బందీగా ఏర్పాటు చేయబడిన వారి వ్యవస్థలను చూస్తే అబ్బురపడి తీరవలసిందే. వ్యవస్థల లోని జీవజాలాన్ని కూడా వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటూ ఉంటారు. కృష్ణ జింకను వేటాడి చంపినందుకు వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, వీరికి అనుకూలంగా తీర్పు రావడం పాత సంగతే.

జపాన్‌లో ‘యకుషిమా’ అటవీ వ్యవస్థ అటువంటి పవిత్ర వనాల కోవకు చెందినదే. 1900 జాతులు, ఉపజాతుల జీవరాశులతో సిడార్ చెట్లతో (100 సంవత్సరాల పురాతనమైనవి) అలరారుతూ ఉంటుంది. దానికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. వీరికి చెట్లు చాలా పవిత్రమైనవి.

న్యూజిలాండ్‍లో – ‘విరినాకి’ అడవులు. ‘మావ్‌రీ’ తెగ ప్రజలు ఈ వ్యవస్థలను తమ పూర్వీకుల ఆవాసాలుగా పరిగణించి పూజిస్తూ ఉంటారు.

గ్రీస్‌లో – ‘డోడోనా’ ఓక్ అడవులు. వీరు ఓక్ చెట్లను వారి దేవతల అధిదేవతగా భావించి కొలుస్తారు. ఏథెన్స్ పరిసరాలలోని ఆలివ్ చెట్ల వ్యవస్థలను కూడా పవిత్ర వనాలుగా ఆరాధిస్తారు. ‘జాగోరీ’ వ్యవస్థ కూడా అటువంటిదే. ఈ వ్యవస్థలను వారు తమ ప్రయోజనాలకై వినియోగించరు. ఇవి వారికి దేవాలయాల వంటివి.

నైజీరియాలో ‘ఓసన్’ నది పేరున ఏర్పడిన ‘ఓసోగ్ బో’ పవిత్ర వనాలు వీరి దేవత యోరుబా పేరిట భక్తి శ్రద్ధలతో సంరక్షించబడుతూ ఉంటాయి.

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ మనిషి తన మనుగడకు ఆధారభూతమైన ప్రకృతి పట్ల భయభక్తులతో శ్రద్ధతో మసలినన్నాళ్లు పర్యావరణానికి ఏ రకమైన హాని జరగలేదు.

ప్రకృతి వ్యవస్థలు – స్థానిక సమూహాలే రక్షా కవచాలు:

మనిషి ఎంత అభివృద్ధిని సాధించినప్పటికీ తెలుసుకోవలసినదీ, నేర్చుకోవలసినదీ ఇంకా చాలా ఉంటూనే ఉంటుంది. అటువంటి అంశాలలో ప్రకృతి వ్యవస్థలు ముఖ్యమైనవి. వాటి గురించి మనకు తెలియనిది ఎంతో ఉంది. నేర్చుకోవలసినదీ ఎంతో ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో, భూతాపాన్ని నియత్రించే ప్రయత్నాలలో ప్రకృతి ఆధారిత పరిష్కారాలు ఎన్నో ఉన్నాయన్నది ప్రకృతి నిరూపించిన సత్యం. అయినా మనిషికి కనువిప్పు కలగడం లేదు.

ఏ వ్యవస్థ పరిరక్షణ కైనా ఆ వ్యవస్థను నమ్ముకుని, ఆ వ్యవస్థలో బ్రతికే స్థానిక ప్రజలు/సమూహాల వద్ద నుండే సాంప్రదాయ విధానాలకు మించిన సంరక్షణ రీతులు అరుదు. స్థానిక సమూహాలు, తెగలను మించిన అటవీ ప్రకృతి పరిరక్షకులు ఉండరు. ఈ సత్యాన్ని గుర్తించిన కొన్ని దేశాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది.

2001 లోనే బ్రెజిల్ ప్రభుత్వం వివిధ వ్యవస్థల స్థానిక ప్రజల భూమి హక్కుల పరిరక్షణను కట్టుదిట్టం చేసింది. కారణం వారు తమ హక్కులను ఎటువంటి అవరోధాలు లేకుంగా వినియోగించుకోగలిగితే వారి సాంప్రదాయ వ్యవస్థలను, వనరులను వారే కాపాడుకోగలుగుతారు. అడవులలో బ్రతికే స్థానికులను రక్షించుకోలేకపోతే, ‘అటవీ సంరక్షణ’ అనే మాటకే అర్థం లేకుండా పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here