అమ్మ కోసం

    1
    9

    [box type=’note’ fontsize=’16’] “రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు కోసం నీ జీవితాన్ని వృథా చేసుకోకు” అంది అమ్మ. “లేదు లేమ్మా! చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంక ఈ విషయంలో మాట్లాడేదేం లేదు” అన్నాడతను. ‘అమ్మ కోసం‘ అతను తీసుకున్న కఠిన నిర్ణయమేమిటో వివరిస్తున్నారు చెంగల్వ రామలక్ష్మి ఈ కథలో. [/box]

    [dropcap style=”circle”]ఉ[/dropcap]దయం ఐదు గంటల సమయం.

    ఫోన్ మోగుతోంది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని చూశాను. అమ్మ!

    ఈ సమయంలో ఎప్పుడూ చేయదే! ఇవాళేంటి?

    “అమ్మా! ఎలా ఉన్నావు?”

    “బాగానే ఉన్నానురా!” మాటలో దుఃఖం కనిపిస్తోంది.

    “ఒంట్లో బాగా లేదామ్మా? గొంతు అలా ఉందేంటి?”

    “నేను నీ దగ్గరకు వచ్చేస్తానురా. వెంటనే రాగలవా?”

    ఏమయిందో అక్కడ అనుకుంటూ, “అమ్మా! ఇవాళ కాలేజి వెళ్ళి శెలవు చెప్పి, రాత్రికి బయల్దేరి వస్తాను. రేపు వచ్చేద్దాం. సరేనా, ఒక్క రోజు ఓపిక పట్టు” అంటూ అమ్మ చేత ‘ఊఁ’ అనిపించి ఫోన్ పెట్టాను.

    వెంటనే చెల్లెలు రవళి ఫోన్.

    “అన్నయ్యా! ఇక్కడ అమ్మ పరిస్థితేం బాగా లేదు. నడవలేకపోతోంది. రెండు అడుగులు వేస్తే పడిపోతోంది. మా ఆయన వాళ్ళ తమ్ముడింటి నుంచి మా అత్తగారిని తీసుకువచ్చారు. వచ్చినప్పటి నుండి ఆవిడ అమ్మని సూటిపోటి మాటలతో సతాయిస్తోంది. అమ్మ మాట్లాడకుండా సర్దుకుపోతున్నా, ఆవిడ ఆగట్లేదు. ఈయన ఎటూ చెప్పలేకపోతున్నారు. నాకేం చేయాలో తోచడం లేదు.”

    “రవళీ! మీ అత్తగారిని తీసుకొచ్చారని నాకెందుకు చెప్పలేదు? ఆవిడ కోపంలో, అసహనంలో న్యాయముంది. బావగారు మంచివారు కాబట్టి అమ్మను ఇన్నాళ్ళు అట్టేపెట్టుకున్నారు. నేనీ రాత్రికే బయలుదేరి వస్తాను. నువ్వేం బాధపడకు.”

    నా భార్య లలిత అన్నీ విని కూడా “ఏమైందిట?” అంది.

    “రాత్రి వెళ్ళి అమ్మని తీసుకువస్తున్నాను” అన్నాను క్లుప్తంగా.

    “ఎక్కడికి?”

    “ఎక్కడికేమిటి? ఇక్కడికే. నేనెక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది.”

    “నాకిష్టం లేదని చెప్పానుగా ఎప్పుడో?”

    “ఎందుకిష్టం లేదు? ఆవిడేమయినా సతాయించే, సాధించే మనిషా? ఓపికున్నన్నాళ్ళు ఇంటి పనంతా కూర్చోపెట్టి చేసింది, నువ్వు తనని మనిషిగా చూడకపోయినా. ఓహో! మీ అమ్మా నాన్నలా ఇల్లు, ఆస్తి ఉన్న మనిషి కాదనా? పల్లెటూరి మనిషని చులకనా? అమ్మకున్న ఆస్తంతా నేనే. నన్ను రెక్కలు ముక్కలు చేసుకుని ఇంతవాణ్ణి చేసింది. నీ నోటికి భయపడి, నలుగురిలో నవ్వుల పాలవుతామని ఇన్నాళ్ళు పద్ధతి కాకపోయినా రవళి ఇంట్లో పెట్టాను. వాళ్ళత్తగారు వచ్చారు. అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు. అక్కడ అమ్మకి ఇబ్బందిగా ఉంది. నేనింక ఆమెను అక్కడ ఉంచను.”

    “నాకిష్టం లేదంతే. నేను ఒక్క క్షణం కూడా ఆవిణ్ని భరించను. ఆవిడో, నేనో ఒకరే ఉండాలి ఇంట్లో.”

    “ఇదేనా నీ నిర్ణయం?”

    “అంతే! అంతే!”

    “సరే, అయితే. అమ్మకు స్థానం లేని చోట నాకూ అక్కరలేదు. అమ్మతోనే ఉంటాను ఎక్కడైనా!”

    “భార్యాపిల్లల పట్ల బాధ్యత లేదా నీకు?”

    “నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే, ఈ మాట అనే అర్హత ఉండేది నీకు. ఉద్యోగం వుందని,  బాగా సంపాదిస్తున్నావనేగా నీ గర్వం? ఆ సంపాదనతోనే బతుకంతా బతుకు. నీకు భర్త ప్రేమ, అత్తగారి ఆప్యాయత విలువ ఏం తెలుస్తుందిలే? ఇన్నాళ్ళ నుంచీ ఈ ఇంటి భాగోతాన్ని పిల్లలు చూస్తూనే వున్నారు. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయిలే” అంటూ కాలేజీకి వచ్చేశాను.

    ***

    మనసంతా చిరాగ్గా, అశాంతిగా ఉంది. ‘అమ్మను ఎక్కడికి తీసుకురావాలి?’

    ఇల్లేమైనా చూస్తే?

    ఒక్క రోజులో ఇల్లెలా దొరుకుతుంది?

    అమ్మ ఆరోగ్యం బాగుండ లేదు. ఆరోగ్యం లేకపోతే అద్దె ఇల్లు కూడా దొరకదు. ఇల్లు చూసినా, నేను ఉదయం 8 గంటలకు వెళ్లిపోతే సాయంత్రం ఆరింటికి వస్తా. వచ్చాక మళ్ళీ బైట క్లాసులుంటాయి. రోజంతా అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది? అమ్మకి మనిషి తోడుండాలని రవళి చెప్పిందిగా!

    ఇదే కాలేజీ వేరే బ్రాంచిలో చేస్తున్న శర్మకు ఫోన్ చేశాను. తనకు మా యింటి విషయాలన్నీ తెలుసు. లంచ్ అవర్‌లో వచ్చాడు. సంగతంతా చెప్పాను.

    “వాసూ! నువ్విప్పుడు ఇల్లు తీసుకుని సంసారం పెట్టడం ఇవన్నీ రిస్క్. నువ్వింట్లో వుండవు రోజంతా. నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది ఈ ఊళ్ళో. ఇదివరకు మా ఊరిలో తెలిసినావిడను చేర్పిస్తే చూడడానికి వెళ్ళాను. చాలా బాగుంది. డబ్బు కొంచెం ఎక్కువ తీసుకుంటారనుకో. వేళకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మంచంలో ఉన్నవాళ్ళకి నర్సులు కూడా ఉంటారు. డాక్టరు రోజూ వచ్చి చూస్తాడు.

    ఇప్పుడు వెళ్ళి చూసొద్దాం పద. రేపెటూ శెలవ్ పెట్టావుగా, ఈ పూట కూడా పెట్టెయ్యి. నేను కూడా ఫోన్‌లో చెపుతాను. అమ్మని అక్కడ చేర్పించి, నువ్వు అక్కడికి దగ్గరలో గదేమైనా తీసుకుని కొన్నాళ్ళు నీ తిప్పలు నువ్వు పడుదూగాని. కొందరు ఆడవాళ్ళకి భర్త కావాలి కాని అత్తమామలు పనికిరారు. నువ్విన్నాళ్ళ నుంచీ ఇంత సహనంగా నెట్టుకొస్తున్నా లలిత నిన్నర్థం చేసుకోవడం లేదు” అన్నాడు శర్మ కోపంగా.

    ఇద్దరం వెళ్ళి వృద్ధాశ్రమం చూసొచ్చాం. వాతావరణం బాగుంది. కాని మనసంతా ఏదోగా అయిపోయింది. కొడుకు, కోడలు ఉండి కూడా ఇలా అనాథలా ఆశ్రమంలో! అమ్మ ఎలా స్పందిస్తుందో దీనికి, చూడాలి.

    రేపు రాత్రికి అక్కడ బయల్దేరి, ఎల్లుంది పొద్దున్నే అమ్మని తీసుకుని తిన్నగా ఆశ్రమానికే వచ్చేస్తానని నిర్వాహకులకి చెప్పాను. ఈ లోపల, అక్కడికి దగ్గరలోనే గది చూడమని శర్మకి చెప్పి, ఇంటికి వచ్చాను.

    నా బట్టలు, పుస్తకాలు సర్దుకుని ఆ రాత్రే ఇంటి నుంచి బయలుదేరుతుంటే –

    “ఇదేనా నీ నిర్ణయం – నన్నిలా ఒంటరిగా వదిలేసి…”

    “లలితా, నేనెంతో సహనంగా ఇన్నాళ్ళూ భరిస్తూ వచ్చాను. ఎప్పుడూ నన్నూ, అమ్మని తక్కువ చేస్తూనే ఉన్నావు. నీకు మా అమ్మ అక్కర్లేదు. పిల్లలు వేరే వేరే ఊళ్ళలో చదువుకుంటున్నారు. నీకు తోడు కావాలి. నీ భద్రత కోసం, రక్షణ కోసం మాత్రమే నేను కావాలి. కాని, నాకు మాత్రం అమ్మే కావాలి. నువ్వు ఆమెకు చేసిన అవమానం నేను ఎప్పటికీ మర్చిపోను.”

    “తల్లి కోసం భార్యాపిల్లలను కాదనుకునే ఘనుణ్ణీ నిన్నే చూస్తున్నాను” అంది లలిత వ్యంగ్యంగా.

    నేను మాట్లాడకుండా బైటకి వచ్చేశాను.

    ***

    పొద్దున్నే రవళి వాళ్ళింటికి వెళ్ళేటప్పటికి అమ్మ మంచం మీద పడుకుని ఉంది. నన్ను చూస్తూనే “వచ్చావా నాన్నా” అంది. కళ్ళలో తడి.

    “ఊళ్ళో ఒకటి, రెండు పనులున్నాయి. చూసుకున్నాక, రాత్రి బయలుదేరుదాం. పగలు ప్రయాణం కష్టం నీకు” అన్నాను.

    “అలాగే. కోడలు బాగుందా?” అంది.

    “ఊఁ” అంటూ లేచాను.

    రవళి కాఫీ తెచ్చింది. భర్త అక్కడే ఉన్నాడు. “ఇన్నాళ్ళు మీకు శ్రమ ఇచ్చాను. రాత్రికి అమ్మను తీసుకువెళతాను” అన్నాను.

    “అదేం లేదు. శ్రమేముంది? ఆవిడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండచ్చు” అన్నాడు మొహమాటంగా.

    రవళి వంటింట్లో ఉన్నప్పుడు విషయమంతా చెప్పాను. బాధ పడింది.

    “బస్సెక్కాక, అమ్మతో నెమ్మదిగా చెప్పన్నయ్యా, అమ్మ అర్థం చేసుకుంటుంది. నువ్వు రోజూ చూసి వెళతానంటే అమ్మ ఎక్కడైనా సంతోషంగా ఉంటుంది. అమ్మని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుందామనుకున్నా నన్నయ్యా, కాని…”

    “వద్దమ్మా. ఇప్పటికే నీ శక్తికి మించి చేశావు” అన్నాను.

    ***

    బస్సులో “అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇంటికి వెళ్ళడం లేదు. ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ నీ వయసు వాళ్ళంతా ఉంటారు. నీకు బాగుంటుంది. నేను అక్కడికి దగ్గరలోనే గది తీసుకుని వుంటాను. రోజూ ఉదయం, రాత్రి వచ్చి చూస్తాను” అంటూ ఇంట్లో జరిగిన గొడవంతా చెప్పాను.

    అమ్మ ముఖం వివర్ణమైపోయింది. “నానీ నేను ఎక్కడైనా ఉంటాను. నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు. కోడలు ఇవాళ కాకపోతే, రేపైనా మారవచ్చు. వయసు వచ్చే కొద్దీ మార్పు వస్తుంది.  పంతాలు వద్దు. ఇన్నాళ్ళ నీ ఓర్పే నీకు మంచి చేస్తుంది. పిల్లలెక్కడో దూరంగా ఉన్నారు. కోడల్ని ఒంటరిగా వదిలి నువ్విలా రావటం నేను భరించలేను. అంతేకాక, నీకు అక్కడ కాలేజీ పక్కన ఇల్లు. నేనుండే చోటుకు దగ్గరగా వుండాలంటే కాలేజీ చాలా దూరమయిపోతుంది. నా కోసం ఆదివారాల్లో రా చాలు. రోజూ ఫోన్‌లో మాట్లాడు చాలు. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు కోసం నీ జీవితాన్ని వృథా చేసుకోకు” అంది అమ్మ.

    “లేదు లేమ్మా! చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంక ఈ విషయంలో మాట్లాడేదేం లేదు” అన్నా.

    ***

    అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాను. కొత్తలో దిగులుగా ఉండేది.  నన్ను చూస్తేనే కళ్ళలో వెలుగు కనిపించేది. రోజూ పొద్దున్న, రాత్రి వెళ్ళి చూసి వస్తున్నాను. ఆశ్రమం దగ్గరే గది తీసుకుని, కాలేజి హాస్టల్‌లో భోజనం చేస్తూ, రాత్రి బైట తింటూ, రోజూ రెండు గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణిస్తూ కాలేజికి చేరుకుంటూ నానా అవస్థలు పడుతుంటే, “పిల్లలిద్దరి చదువులకు నేనెక్కడ తేగలను? ఒకరి బాధ్యత నువ్వు వహించు” అంటూ ఫోన్‌లో గట్టిగా అరిచింది లలిత. అబ్బాయి చదువు బాధ్యత, అమ్మ వృద్ధాశ్రమంలో నెలకు 15,000 రూపాయలు, నా ఇంటి అద్దె, ఖర్చులు… ఎంత పొదుపుగా వాడుతున్నా చాలని ఆర్థిక పరిస్థితి.

    అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. సరిగా తినడం లేదు. రాత్రిళ్ళు నిద్రపట్టదుట. నేను పొద్దున్న 6.30కి కాలేజికి బయలుదేరేముందు వెళితే, పడుకుని వుంటోంది. తెల్లవారు జామునెప్పుడో నిద్ర పడుతోందట.  రాత్రిళ్ళే వెళుతున్నాను. కాలేజీ దూరమయి, 6.30కి బయల్దేరితేగాని టైంకి చేరుకోలేకపోతున్నాను.

    ఒకరోజు రాత్రి అమ్మకు గుండె నొప్పి వచ్చింది. ఆశ్రమం వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కంగారుగా పరిగెత్తాను. హాస్పిటల్‌లో చేర్చాను. నాలుగు రోజులుంచి పంపారు. హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి తీసుకువెళుతుంటే ఏడుపు వచ్చేసింది నాకు. నేను అమ్మతో ఉండడానికి లేదు. ఇంటి వాతావరణం కాదు. ఎంత బాగా చూసినా అక్కడ, తన అనే మనిషి లేరు. పోనీ, నేనుండే గదిలో నాలుగు రోజులుంచుదామా అంటే నేను రోజంతా గదిలో ఉండను. ఒంటరిగా అమ్మ అనారోగ్యంతో! దీనికన్నా వృద్ధాశ్రమమే మెరుగు.

    అమ్మకి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఏమైనా చెబితే వింటుంది. తన గురించి ఏమీ చెప్పదు. ఎక్కువగా భగవద్గీత చదువుకుంటూ ఉంటుంది.  నా పెళ్ళయ్యే వరకు నేనే తన లోకంగా గడిపింది.

    ఈ మధ్య నేను వెళితే అమ్మ చిన్న పిల్లలా ఏడుస్తోంది. వయసు, అనారోగ్యం మనుషుల్ని బలహీనుల్ని చేస్తాయోమో! “ఇంటికి తీసుకెళ్ళరా” అంటుంది.

    ఏ ఇంటికి తీసుకెళ్ళాలి?

    లలిత ఏనాడు అమ్మెలా ఉందని, ఎక్కడ ఉందని అడగలేదు. పిల్లలిద్దరూ నానమ్మ ఎలా ఉందని ఫోన్‌లో అప్పుడప్పుడూ ఉంటారు. వాళ్ళు ఊళ్ళోకొచ్చినప్పుడు నా దగ్గరకొస్తామన్నా లలిత రానివ్వదు. నాకు తెలుసు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళయ్యాక నన్నర్థం చేసుకుంటారనీ, నా దగ్గరకి వస్తారని నమ్మకం నాకుంది.

    అమ్మని రెండు మూడు సార్లు హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. ఆశ్రమం నుంచి అర్ధరాత్రి ఫోన్ అంటే గుండె దడ వస్తోంది. చివరిసారి, బాగా జ్వరమొచ్చి హాస్పిటల్‌లో చేర్చినప్పుడు, అమ్మ అక్కడే పోయింది. అమ్మ తన కష్టాల నుంచి విముక్తి పొందింది.

    లలితకు చెప్పాలని కూడా అనిపించలేదు. రవళి, బావగారు వచ్చారు. రవళి చెప్పిందేమో, లలిత కూడా వచ్చింది. నేనేం మాట్లాడలేదు. వృద్ధాశ్రమంలో ఎక్కువసేపు ఉంచకూడదన్నారు. అమ్మను పంపించే ఏర్పాట్లు శర్మ సాయంతో వెంటవెంటనే జరిగిపోయాయి.

    అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ పేరుతో వృద్ధాశ్రమంలో నా ఖర్చుతో భోజనాలు పెట్టించాను. డబ్బు బాగా తీసుకున్నా అక్కడ ఆదరంగా చూశారు అమ్మని. నాకు నిశ్చింతనిచ్చింది ఆ ఆశ్రమం. అందుకే ఆ కృతజ్ఞత. ఒక రోజు అనాథాశ్రమంలో భోజనాలు పెట్టించాను. నాకు ఈ కర్మలు, తంతుల మీద నమ్మకం లేదు. అమ్మ పేరుతో ఓ వందమందికి తృప్తిగా భోజనం పెట్టగలిగాను. నాకదే సంతోషం. అమ్మ కూడా పైనుంచి చూస్తూ సంతోషించే ఉంటుంది.

    నాలుగు రోజులు తనింట్లో ఉండమన్నాడు శర్మ. సున్నితంగానే తిరస్కరించాను. గదికి వస్తే అంతా శూన్యం. అమ్మ లేని ఈ బ్రతుకు ఊహించుకోలేకపోతున్నాను. అంతే! కట్టలు తెగింది కన్నీటి ప్రవాహం! నిశిరాత్రి చూసేవాళ్ళు, పలకరించేవారు లేరు. బిగ్గరగా, హృదయ విదారకంగా, గుండె పగిలేలా ఏడుస్తూనే వున్నాను.

    రెండు రోజుల తర్వాత లలిత వచ్చింది.

    “ఇంటికి వెళ్దాం రా” అంది.

    “అమ్మ లేదని రమ్మంటున్నావా?”

    “ప్లీజ్, ఎన్నాళ్ళిలా ఉంటావు?”

    “జీవితం ఉన్నంత వరకూ. అమ్మ భౌతికంగా లేదు అంతే. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది.”

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here