అమ్మా, నాన్న కావాలి

0
5

[dropcap]ఏ[/dropcap]దో ఒకరోజు కొడుకు నోటినుంచి అ ప్రశ్న వస్తుందని ఆ తల్లికి తెలుసు.

అయినా తనేం చేయగలదు. జరిగినదాంట్లో తన తప్పేమిలేదు.

జరిగిన విషయాన్ని చెప్తే ఆ చిన్ని మనసు అర్ధం చేసుకోగలదా లేదా? అనేదే ఆమె సంశయం.

ఆ విషయం తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది ఆమెకు.

కొడుకు మనసు గాయపడకూడదనే ఉద్దేశంతో కడివెడు దుఃఖాన్ని కడుపులో దాచుకుని కొడుకు ప్రయోజకుడవ్వాలని కన్నీళ్లను అదిమిపట్టి పెదవులపై చిరునవ్వులు పూయిస్తూ కొడుకు కళ్ళల్లో ఆనందం చూసేది రమణమ్మ.

కూలి పనిచేసి కాణీ పరక సంపాదించేది. ఆ వచ్చిన డబ్బులతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు నితీష్‌ని చదివించేది. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచాలన్నది ఆమె ఉద్దేశం.

పాఠశాల నుంచి కొడుకు వచ్చేసరికి పనులన్నీ పూర్తి చేసుకుని కొడుకు దగ్గరే కూర్చుని చదివించేది. ఆమె పెద్దగా చదువుకోక పోయినా ఆమెకి చదువంటే ప్రాణం. కొడుకులో భర్తని చూసుకుంటూ మురిసి పోయేది రమణమ్మ.

ఒక నాడు వంట చేస్తూ అన్యమనస్కంగా ఉన్న తల్లిని గమనించాడు నితీష్. దగ్గరగా వెళ్లి రెండు చేతులతో అమ్మ ముఖాన్ని తన వైపు తిప్పుకుని…

“అమ్మా ఎందుకలా ఉన్నావు?” అని అడిగాడు గోముగా.

“అబ్బే ఏమీలేదు నాన్నా! ఏదో గుర్తుకు వచ్చి.. అలా..” అని సముదాయించి కొడుకు బుగ్గపై ముద్దు పెట్టి “నీకెందుకురా అంత బెంగ నాకేమీ కాలేదులే నువ్వు బుద్ధిగా చదువుకో” అని చెప్పింది తల్లి.

తల్లి తన దగ్గర ఏదో దాస్తున్నది, ఎందుకో బాధ పడుతోంది అన్న అనుమానం నితీష్ మనసులో కలిగింది.

తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాడు.

ఒకరోజు పాఠశాలనుంచి వస్తూనే “అమ్మా నీకొకటి చూపిస్తాను కళ్ళు మూసుకో” అన్నాడు నితీష్ తన రెండు చేతుల్ని వెనక్కి దాచి.

“అల్లరి పెట్టకురా, నాకు బోలెడు పని ఉంది..” అంటూ తన రెండు కళ్ళని మూసుకుంది తల్లి.

“ఇదిగో చూడు” అంటూ తన పిడికిలిని విప్పాడు. చేతిలో పెన్సిల్ ఉంది.

పెన్సిల్ చూసి “చాలా సంతోషం బుద్ధిగా చదువుకో “అని ముద్దులిచ్చింది తల్లి.

తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే మెరుపులాంటి ఆలోచన వచ్చింది నితీష్‌కి.

తల్లి ముఖంలో నిత్యం ఆనందాన్ని చూడాలంటే ఏదో ఒకటి తేవాలి అనుకుని ఆరోజు మొదలు రోజూ పెన్నో పెన్సిలో పుస్తకామో ఏదో ఒకటి బడినుంచి తెచ్చేవాడు.

అవేవి పట్టనట్టు ఎప్పటిలాగానే చదువుకోమనేది తల్లి.. ఇలా కొంత కాలం గడిచింది…

ఒకరోజు నితీష్ ఇంటికి వస్తూనే ఏడవడం మొదలు పెట్టాడు…”ఏమైందిరా కన్నా అలా ఏడుస్తున్నావ్? అని అడిగింది తల్లి.

వెక్కి వెక్కి ఏడుస్తూ “రేపు.. రేపు..” అన్నాడు.

“చెప్పరా రేపు ఏమిచెయ్యాలి?”

“నిన్ను తీసుకుని రమ్మన్నారు మా సారు”

“ఏమైందిరా ఎవరితోనైనా గొడవ పడ్డావా?”

“లేదమ్మా”

“సరేలే వస్తాను. ఏడవకు” అని బుజ్జగించింది తల్లి.

మర్నాడు కొడుకుతో కలసి పాఠశాలకి వెళ్ళింది. ప్రధానోపాధ్యాయుల వారు నితీష్‌ని తరగతికి పంపించి రమణమ్మతో చెప్పడం ప్రారంభించారు.

“మీ అబ్బాయి తోటి విద్యార్థుల పెన్నులు పుస్తకాలు డబ్బులు తరచూ దొంగతనం చేస్తున్నాడు. ఎన్ని సార్లు మందలించినా ఫలితం లేకపోయింది” అన్నారు.

కొడుకు పరిస్థితి విన్న రమణమ్మకు నోటమాట రాలేదు. వరదలా మంచుకొస్తున్న కన్నీటిని తుడుచుకుని…

“అయ్యా! నా భర్తకి యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో కూలి నాలి చేసి కష్టపడి బాబును పోషిస్తున్నాను.. నాన్న కావాలని అడిగినప్పుడల్లా వాడికి ఎలా చెప్పాలో అర్థం కాక మాటల్లో పెట్టి దృష్టి మరలుస్తున్నాను. రాను రాను పెద్దవాడు అవుతున్నాడు, నాన్న ఎక్కడంటే ఏమి చెప్పాలో తెలియక సతమతమౌతున్నాను. పెన్ను దొరికిందని ఒకసారి, పెన్సిల్ దొరికిందని ఒకసారి చెప్పాడు. అది పెద్ద విషయం కాదు కదా అనుకున్నాను.దాని కోసం కోప్పడితే పిల్లాడు ఏమైపోతాడోనని ఏమీ అనలేదు. ఇలా తయారవుతాడనుకోలేదు..” అంది రమణమ్మ.

“సరే ప్రస్తుతం మీ వాడికి మీ సమస్యని వివరించినా అర్థం చేసుకునే అవకాశం లేదు. అందరి నాన్నలు పాఠశాలకు, వార్షికోత్సవాలకు వస్తూ ఉంటే తన నాన్న ఎందుకు రావడం లేదు అనేది ఆ చిన్ని మనసులో ఉదయించే ప్రశ్న. తోటి పిల్లలను వాళ్ళ నాన్నలతో సరదాగా చూసినప్పుడు తనూ నాన్నతో అలాగే ఉండాలనుకోవడం సహజం. దాచి పెట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. పిల్లలకి ఏమీ తెలియదని మనం అనుకుంటాం కానీ మనకంటే వాళ్లే ఎక్కువ ఆలోచిస్తారు. పెన్సిల్ దొరికింది అని చెప్పిన రోజే దొరికిన వస్తువులు తీసుకోకూడదని తల్లిగా మీరు చెప్పి ఉంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేదికాదు” అన్నారు ప్రధానోపాధ్యాయులు వారు.

“నిజమేనండీ నేను అంత దూరం ఆలోచించలేదు. నేను కొనని వస్తువులు వాడి దగ్గరికి ఎలా వచ్చాయో ఆరా తీసే ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. మీరే ఏదోలా సర్దిచెప్పి సరైన మార్గంలో పెట్టాలి” అని రెండు చేతులు జోడించి ప్రాధేయ పడింది రమణమ్మ.

“సరే మీరు ఇంటికి వెళ్ళండి” అన్నారు ప్రధానోపాధ్యాయులు వారు.

రమణమ్మ ఇంటికి వచ్చిందేకాని బుర్ర నిండా జవాబు దొరకని ప్రశ్నలే.. కొడుకుకి ఏ రకంగా చెప్పాలి. మంచి మార్గంలో ఎలా పెట్టాలి అని ఆలోచించింది.

ఇలా తయారవ్వడానికి కారణం నేనే అని తనలో తానే అనుకుంటోంది..

ఈ లోగా నితీష్ వచ్చాడు. ముద్దుగా పిలిచి దగ్గరగా కూర్చోబెట్టుకుని.. “బంగారం నువ్వు పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేస్తావు?” అని అడిగింది.

“అమ్మా నేను పెద్దయ్యాక పోలీసునౌతా” అన్నాడు గొప్పగా..

“పోలీసు అవ్వాలి అంటే బాగా చదవాలి. నువ్వు పోలీసు అవ్వాలనుకుంటే దొంగలని పట్టాలి కానీ దొంగతనం చెయ్యకూడదు కదా! మరెందుకు చేస్తున్నావు? ” అని అడిగింది తల్లి.

“మరి.. మరి.. నాన్న రాడని నువ్వు ఎప్పుడూ దిగాలుగా ఉంటావు.. పెన్సిల్ నాకు దొరికింది అన్నరోజు నువ్వు నవ్వుతూ ఉన్నావు. అలా చేస్తే నువ్వు నవ్వుతూ ఉంటావనే ఉద్దేశంతో రోజూ ఏదో ఒకటి తెస్తున్నాను..” అన్నాడు నితీష్.

ఏదైతే తెలియకూడదు అనుకుందో అదే విషయం కొడుకు నోటినుంచి వినేసరికి స్థాణువులా ఉండిపోయింది. క్షణకాలం తర్వాత తేరుకుని..

“అయ్యో ఎంతపని చేశావురా? నీ మనసు గాయపడకూడని నేను నిజాన్ని దాచిపెట్టాను.. నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుని దొంగగా మారావు. అది మాయని మచ్చ. అది పోవాలంటే నువ్వు దొంగతనం మానెయ్యాలి. అందరితో మంచిగా మసలుకోవాలి. ఇకమీదట నువ్వు ఎవ్వరి వస్తువులు దొంగిలించకుండా ఉండి బుద్ధిగా చదువుకుంటేనే నీ అమ్మ సంతోషంగా ఉండగలదు” అంది రమణమ్మ కొడుకుతో…

“సరేనమ్మా” అంటూ ఆ నాటి నుంచి తల్లి ఆనందం కోసం బుద్ధిగా చదువుకున్నాడు నితీష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here