[అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘అమ్మ వచ్చింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]ల్లంతా ఎందుకిలా బోసిపోయింది
మనసంతా ఎందుకిలా దిగులుగా ఉంది
రాత్రి నిద్ర కూడా పట్టలేదు
అన్నం తిందామంటే ఆకలి లేదు
వారం రోజుల నుండి ఇదే తంతు
అమ్మ ఊరికెళితే ఇంతేనా
పొద్దున్న లేచి అమ్మను చూడకుంటే
అదోలా ఉంటుంది ఎందుకు
అమ్మలో ఏముంది మహాత్మ్యం
తొమ్మిది నెలలు గర్భంలో మోసినందుకా
శిశువుగా ఉన్న నాకు స్తన్యం ఇచ్చినందుకా
నాకు మాటలు నేర్పినందుకా
నాతో నడక నడిపించినందుకా
అడిగితేగాని అమ్మైనా అన్నం పెట్టదు
ఈ నానుడి శుధ్ధ అబద్ధం ఇది నిజం
ఆకలి లేకపోయినా చందమామను
చూపించి గోరుముద్దలు తినిపిస్తుందే
ఎందుకు ఏదో తెలియని ఆనందం
ఒక్కసారిగా నాలో పొంగుకొస్తుంది
ఎవరో వచ్చినట్టున్నారు తలుపు తట్టారు
తలుపు తెరిస్తే ఎదురుగా అమ్మ
చిరునవ్వులు చిందిస్తూ చూస్తోంది
అమ్మ తలపే ఓ అమృత రాగం
అమ్మ లేకపోతే జీవితం వ్యర్థం
అయినా అమ్మ వచ్చిందిగా
ఇక హాయిగా నిద్ర పోవొచ్చు