అమ్మా నాన్న..

0
11

[శ్రీ ప్రమోద్ ఆవంచ గారి ‘అమ్మా నాన్న..’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]ల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. అకస్మాత్తుగా ఎండ మాయమై వాతావరణం చల్లబడినట్లు అనిపించింది. కొంచెంసేపటినుంచి  ఆకాశంలో భానుడు మేఘాలతో పోరాడుతున్నాడు. నిండు గర్బిణిలా ఉన్న మేఘం ఏ క్షణాన్నైనా వర్షించేలా ఉంది. తన చల్లని స్పర్శతో ప్రపంచాన్ని అహ్లాదపరచడానికి, సిద్ధంగా ఉంది. వీచే వాయువు మూలంగా మేఘాలు వేగంగా కదులుతున్నాయి. అయినా మేఘాలు గాలి మాటలను పెడచెవిన పెట్టాయి. పర్యవసానం ఏమిటో కొద్ది నిమిషాల్లో తెలుస్తుంది. చినుకు పడితే మనసు సంతోషంతో నృత్యం చేస్తుంది. వర్షపు చినుకు తాకిన ప్రతి చెట్టూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ ఆనందంలో తనను తాను మైమరచిపోయి చిందులు వేస్తుంది. మనిషి జీవనం, జీవితం, ప్రకృతితో ముడిపడి ఉంది. వర్షం వస్తే రైతు కళ్ళల్లో వెలుగులు విరజిమ్ముతాయి. చెట్టుకు, మనిషికి బతకడానికి నీళ్ళే కదా ఆధారం.. ఆదివారం.. సమయం అయిదు సాయంత్రం గంటలు.. నేను గురువు గారు వేదాంత సూరి గారి ఇంటికి బయలుదేరాను, అదీ నా టూ వీలర్ పైన. ఆయన రాంనగర్‌లో ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట మీదుగా రాంనగర్‌కు నా ప్రయాణం సాగింది. అంబర్‌పేటకి రాగానే చినుకులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో మొదటిసారి వర్షంలో తడవడం వల్ల మనసంతా హాయిగా అనిపించింది. ఆకాశంలో అప్పుడప్పుడు ఉరుములు, వాటితో పాటు క్షణంలో మెరిసి మాయమైయ్యే మెరుపులు. ఉరుములెందుకో కొంచెం భయం పెట్టిస్తాయి.

ముసరాంబాగ్ నుంచి అంబర్‌పేట అలీ కేఫ్ సెంటర్ వెళ్ళే దారిలో మూసీ కాలువపై ఒక బ్రిడ్జ్ ఉంటుంది. పెద్ద వర్షం వస్తే బ్రిడ్జంతా నీళ్ళతో నిండిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది, ఇది నేను గత ముప్పై ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉన్నాను.

వర్షం వచ్చినప్పుడు ఆ రోడ్డుపై వెళ్ళడానికి వాహనదారులు సాహసం చేయరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు తీరవు. డబ్బు తీసుకొని ఓట్లు వేసే ప్రజలున్నంత కాలం ఈ నాయకులు ఇలాగే ఉంటారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి కుడివైపు ఏవో పైప్ లైన్ల నిర్మాణాలు, మరమ్మతులు జరుగుతుండడం వల్ల ఆ రోడ్డును పూర్తిగా మూసివేసారు.

అలీ కేఫ్ సెంటర్ దగ్గర కేవలం వన్ వే మాత్రమే కొనసాగుతుంది. వాహనాలను జిందాతిలస్మాత్ రోడ్డు నుంచి గోల్నక మీదుగా మూసీ కాలువ పక్క నుంచి మూసరాంబాగ్ బ్రిడ్జిని తాకే దారిలోకి మళ్లిస్తున్నారు.

మూసారంబాగ్ నుంచి తిలక్ నగర్, విద్యానగర్ వెళ్ళాలనుకునే వాళ్ళు జిందాతిలస్మాత్ గోల్నక, చే నెంబర్ మీదుగా వెళుతున్నారు.

అంబర్‌పేటలో  మేఘం కొన్ని వర్షం చినుకులను చిలకరించి అందరినీ అలెర్ట్ చేసింది. నేను ఆగకుండా గోల్నక, చే నెంబర్ మీదుగా శివం రోడ్డుకు ఎంటర్ అయ్యేసరికి వర్షం చిలకరింతలు, ఒళ్ళు పులకరింతలు, గిలిగింతలతో నేను నా వాహనం వేగం పెంచాను. సరిగ్గా డిడీ కాలనీ సెంటర్ నుంచి ఎడమ వైపు విద్యానగర్‌కి వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జి ఎక్కగానే వర్షం తీవ్రత పెరిగింది. అలాగే తడుస్తూ బ్రిడ్జి చివర్లో ఎడమ వైపు ఉన్న విద్యానగర్ బస్టాప్ ముందు బండి పెట్టి బస్టాప్‌లో నిలుచున్నా. వర్షం తీవ్ర స్థాయికి చేరింది. బస్టాప్‌లో నాతో పాటు ఇంకో ఇద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళు సెల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు. బస్టాప్ కొత్తగా కట్టినట్లు ఉన్నా వాన నుంచి తడవకుండా ఉండలేనీ పరిస్థితి. ముందు వైపు వర్షం జల్లు పడి కాళ్ళు, చెప్పులతో పాటు యాంకిల్ పై భాగం వరకు ప్యాంట్ తడుస్తూనే ఉంది. బస్టాప్ ఎదురుగా రోడ్డుకి అటువైపు ఒక మసీదు ఉంది. ఆ మసీదు పక్క నుంచి ఒక చిన్న సందు ఉంది. ఆ సందు నుంచి వెళితే రాంనగర్ కు షార్ట్ కట్ రూట్. ఆ సందుకు మరోవైపు డానియల్ క్రికెట్ అకాడమీ ఉంది. దాని పక్కన గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ ఉంది. వాతావరణం చల్లగా ఉంది. రోడ్డంతా ఊడ్చి కడిగినంత శుభ్రంగా ఉంది. రోడ్డుపై పడి చినుకులు చిట్లి తుళ్ళి పడుతున్నాయి. రోడ్డు లోపలి పొరల్లో నుంచి వేడి ఆవిరై బయటకు వస్తుంది. వాహనాల టైర్ల మరకలపై చినుకులు పడి ఈసీజీ గ్రాఫ్స్‌లా మారి రోడ్డులోకి ఇంకి పోతున్నాయి. రకరకాల డిజైన్లు రోడ్డుపై ప్రత్యేక్షం అయి ఇట్టే మాయమవుతున్నాయి. రోడ్డుపై అద్బుత దృశ్యం కనువిందు చేస్తుంది. ముఖ్యంగా రోడ్డుపై చినుకులు పడుతూ చేసే శబ్ధం చూస్తూ, వింటుంటే చెవులకు ఇంపుగా ఉంది.

పక్కన ఏదో శబ్దం కావడంతో పక్కకు చూసాను. నా కంటే ముందు వచ్చి సెల్ ఫోన్లతో బిజీగా ఉన్న ఆ ఇద్దరూ ఫోన్ చూసుకుంటూ రోడ్డు మీదకు ఉమ్ముతున్నారు. బస్టాండ్ దాదాపుగా నిండిపోయింది. నా వెనక ఒకతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మెల్లగా మాట్లాడుతున్నాడు. ఎంత మెల్లగా అంటే ముందున్న నాకు కూడా వినిపించనంతగా. ఆ ఇద్దరూ మళ్ళీ రోడ్డు పైన ఉమ్ముతున్నారు. వాళ్ళవైపు సీరియస్‌గా చూసాను. కానీ వాళ్ళు ఈ లోకంలో లేరు. కనీసం తలెత్తి పైకి కూడా చూడడం లేదు.

అప్పుడే బస్టాండ్ ముందు ఒక టూ వీలర్ ఆగింది. బార్యాభర్తలు ఇద్దరూ పరుగు లాంటి నడకతో బస్టాండ్ లోనికి వచ్చారు. భార్య ఒక చంటి పిల్లాడిని ఎత్తుకొని, ఆ పిల్లాడు తడవకుండా తన కొంగును కప్పింది. ఇద్దరూ దాదాపుగా తడిచిపోయారు. భర్త దగ్గర కర్చీఫ్ తీసుకొని ఆ పిల్లవాడి ముఖం తుడిచింది. బార్యాభర్తలు ఇద్దరూ తాము కూడా తడిచిపోయామన్న విషయం మర్చిపోయి పిల్లవాడి గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడే భర్త దగ్గర ఉన్న ఫోన్ మ్రోగింది. “ఇదిగో మాట్లాడు, మీ అమ్మ మాట్లాడుతుందట” అని భార్యకు ఫోన్ ఇచ్చాడు. “విద్యానగర్‌లో ఉన్న అమ్మా. ఆ ఆ జాగ్రత్తగనే నడుపుతున్నాడు. మొత్తం  తడిచిపోయాం.. ఇంటికి పోయి వండుత.. పది నిమిషాల్లో ఇంటికి పోతం..” ఈ మాటలు నాకు వినిపించాయి..

నా పక్కన నిలుచున్న ఆ ఇద్దరూ ప్రతి అయిదు నిముషాలకు రోడ్డుపైన ఉమ్ముతునే ఉన్నారు. అర్ధగంటకు పైగా సమయం అవుతుంది బస్టాప్‌లో నిలబడి, అయినా వర్షం తగ్గుముఖం పట్టడం లేదు. భర్త తన అంగీ తీసి పిల్లాడి చుట్టూ కప్పి, “నేను యూ టర్న్ చేసుకొని వస్తా, నువ్వు రోడ్డు క్రాస్ చేసి రా” అని చెప్పి బనీన్ మీద బండీని యూ టర్న్ చేసుకొని వచ్చి రాంనగర్ షార్ట్ కట్ రోడ్డుపై ఆపాడు. ఈ భార్య తన కొంగును పిల్లాడి తలకు చుట్టి తడుస్తూనే మెల్లగా రోడ్డు క్రాస్ చేసింది. అక్కడి నుంచి ఆమె బండీ ఎక్కిన తరువాత ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇదంతా నేను అక్కడ ఉండి గమనిస్తునే ఉన్నాను. బస్టాప్ లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఆ పిల్లవాడి పట్ల చూపిస్తున్న శ్రద్ధ, ఆ ప్రేమ, పిల్లవాడికి ఏమవుతుందో అని వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు నన్ను కదిలించివేసాయి. ఇదే కదా తల్లిదండ్రుల ప్రేమంటే.

నాకేమైనా పర్వాలేదు కానీ పిల్లలకు ఏం కావద్దని నాన్న పడే తాపత్రయం, తాను తడిచినా పిల్లాడు తడవవద్దని ఆలోచించే అమ్మ. ఎప్పుడూ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆలోచించే అమ్మా నాన్నలు. ఒక పిల్లాడికి తల్లి అయినా కూడా ఆ కూతురు గురించి కన్న తల్లి తడ్లాడుతూనే ఉంటుంది. వర్షంలో కూతురు సరిగ్గా ఇంటికి చేరుకుందా లేదా ఫోన్లు చేసుకుంటూ ఆరాటపడుతుంది ఆ అమ్మ. ‘ఇక్కడే తిని పోతే అయిపోతుండే కదా బిడ్డా’ అని అంటే ‘నేను ఇంటికి పోయినంక వండుతా’ అని సమాధానం ఇచ్చింది ఆ కూతురు. అంటే కూతురు ఎంత పెద్దగా పెరిగినా, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మకు బిడ్డ తిన్నదో లేదో.. ఎట్లున్నదో ఏమో.. పిల్లల పెంపకంలో అల్లుడు సహాయం చేస్తున్నాడో లేదో.. అన్న ఆలోచనలో ఉంటుంది.

నాకు మా అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు. ఒక కన్నీటి పొర కళ్ళను కమ్మేసింది. మా అమ్మ తర్వాత అమ్మ మా పెద్దక్క జ్ఞాపకం వచ్చింది.. బాధతో గుండె బరువు అయ్యింది. వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. బండి రాంనగర్ వైపుకు సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here