[శ్రీ తటవర్తి త్రినాధ నాగేశ్వరరావు రచించిన ‘అమ్మా! శార్వరీ!’ అనే నవలని విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ.]
[dropcap]ప్ర[/dropcap]పంచాన్నంతా ‘కరోనా’ తన క్రూర దంష్ట్రలతో కాటేస్తున్న కాలంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఉన్న మూడు తెలుగు పూజారుల కుటుంబాల వారు ఎలాంటి అవస్థలు పడ్డారో, వాటిని ఎలా ఎదుర్కొన్నారో వివరించే నవల – ‘అమ్మా! శార్వరీ!’
తటవర్తి త్రినాధ నాగేశ్వరరావు (T.T. నాగేశ్వరరావు) USA లో ఉన్నప్పుడు తన అర్ధాంగిని కోల్పోయిన ఆవేదనలో మునిగిపోయిన పరిస్థితి నుండి బయటపడటానికి రచనా రంగాన్ని ఎన్నుకొన్నారు. అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల్ని, ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారడం కూడా ఆయన గమనించారు. అన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ విధింపబడింది. ఎవరూ ఇళ్లలోంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. న్యూజెర్సీ నగరానికి 50 మైళ్ళ దూరంలో ఒక కొండమీద ఉన్న గుడి ప్రాంగణంలో తమ ఇళ్లలోనే ఉండిపోయి, బాహ్య ప్రపంచంతో సంబంధంలే(క)ని మూడు పురోహితుల కుటుంబాల అవస్థల్ని గమనించి అక్షరీకరించ పూనుకున్నారు. సజీవ జీవన చిత్రణతో తాను గమనించిన విషయాలే కాబట్టి ప్రతిభావంతంగా చిత్రించగలిగారు. ఆయా సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. గతంలో కూడా భారతదేశము నుండి వచ్చిన తెలుగు అర్చకులతో స్నేహంగా ఉండే వారాయన. 75 ఏళ్ల వయసులో సమాజాన్ని, మనుషుల్ని, మనస్తత్వాన్ని, జీవన స్థితిగతులను పరిశీలించి చూడటం, వాటిని అక్షర రూపంలోకి మార్చటం, అదీ చిత్తశుద్ధితో, ఒక యజ్ఞం లాగా నిర్వహించటం గొప్ప విషయం. దేవాలయాల సందర్శన, పూజా కార్యక్రమాల నిర్వహణ ఇష్టంగా పరిశీలించడం వల్ల కొన్ని విషయాలు ఆకళింపు అయింది
వారసత్వం ద్వారా సంక్రమించిన పౌరోహిత్యం చేయటం ఇష్టంగా స్వీకరించిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు నరసింహ. భార్య శ్రీలక్ష్మి. న్యూజెర్సీ లోని దేవాలయం ప్రధాన అర్చకులు రామశర్మ గారు ఆహ్వానించడంతో నరసింహ, శ్రీలక్ష్మి విజయవాడ నుండి బయలుదేరారు.
ప్రధాన అర్చకులు రామశర్మ గారి ఆధ్వర్యంలో, ఉప ప్రధాన అర్చకులు రమణాచార్యుల వారి నిర్వహణలో గుడికి సంబంధించిన విషయాలు తెలుసుకోసాగారు నరసింహ, శ్రీలక్ష్మి. శని, ఆదివారాలు ఆ గుడికి భక్తులు బాగా వచ్చేవాళ్ళు. భక్తుల సౌకర్యార్థం ఒక క్యాంటీన్ కూడా ఉంది. వేదాధ్యయనం చేసిన భారతదేశ వేద పండితుల్ని పురోహితులుగా అక్కడ నియమించుకొనే ఆచారం వల్ల అంతకుముందే రెండు పురోహిత కుటుంబాలు అక్కడ ఉన్నాయి.
అక్కడకు అలవాటుగా వచ్చే భక్తులు కొందరు వాలంటీర్ల కమిటీగా ఏర్పడి, కొందరు క్యాంటీన్ నడపటం, కిచెన్‌లో పని, ప్రసాదాల పంచడం మొదలైన పనులన్నీ నిర్వహిస్తూ ఉంటారు. గుడి ఖర్చులు, అర్చకుల, కొందరు పనివార్ల జీతభత్యాలు, ఇతర నిర్మాణ ఖర్చులు అన్నీ భక్తుల విరాళాలతోనే చెల్లుబాటు అవుతుంటాయి. ఆ గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే పూజలు, అభిషేకాలతో పాటు పితృ కార్యాలను అనుమతించి, ఒక పురోహితుని భక్తులకు కావలసిన మాసికం, ఆబ్దికం తేదీలకు కేటాయిస్తారు. నిర్ణయించిన ఫీజు ఆ రోజున చెల్లించాలి. ఆ సౌలభ్యం అమెరికాలోని అన్ని గుళ్ళలో ఉండదు. స్వయంపాకంగా ఇంటి నుండి కూర, పప్పు, బియ్యం వగైరా తీసుకెళ్లి పురోహితునికి సంభావన ఇవ్వటం ఉంది. అక్కడ పూజారులను బాగా గౌరవిస్తారు.
చైనాలో వికృత అలవాట్ల ఫలితంగా ఒక క్రిమి ఉద్భవించి ‘కరోనా’ పేరుతో భయంకరంగా ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. గుడికి వచ్చే జనం పల్చబడుతున్నారు. పూజల మీద వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. క్యాంటీన్ మూత పడింది. హారతి పళ్లెంలో వేసే డబ్బు లేకపోయింది. ఒకసారి గుడికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శార్వాణి గుడిలో జనం లేకపోవడం పూజారుల పరిస్థితి గమనించింది. అక్కడ ఉన్న అందరి పేర్లు, తరచుగా వచ్చే భక్తుల ఇంటి నెంబర్లు, ఫోన్ నెంబర్లు తీసుకొని వెళ్ళింది. న్యూ జెర్సీ ప్రాంతాలవారు కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు, హార్బర్లు ఉన్న పట్టణాల్లో మరింత కట్టడి పాటిస్తున్నారు. ఉద్యోగస్తులు ఇంటి నుండే పని చేయటం మొదలుపెట్టారు. గుడికి ఎవరూ రావడం లేదు. నరసింహ మొదలగు వాళ్ళ పరిస్థితిని గమనించి కమిటీ వారు ఎప్పుడైనా సరుకులు పంపితే కొద్ది రోజులు గడిచిపోతాయి. బయటకు వెళ్ళటానికి వీలు లేదు. కార్లు లేవు.
గుడి పూజారులకి ఎలక్ట్రానిక్ మిషన్స్ కానీ, కంప్యూటర్లు వాడకం కానీ ఏమీ తెలియదు. కనీసం మైకు ఏర్పాటు చేసుకోవడం కూడా రాదు. మూడు కుటుంబాల వారు కలిసి తమ బాధలను పంచుకుంటూ నిరాశతో కుంగిపోతున్న సమయంలో ఒకరోజు సాంకేతిక పరిజ్ఞానం కల రమేష్ అనే భక్తుడు వచ్చాడు. శర్వాణి ద్వారా వీరి పరిస్థితి తెలిసి ఉండటం వల్ల మూడు పెద్ద పెద్ద కవర్లలో పప్పు, ఉప్పు లాంటి సామానులు తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారి ఆబ్దికం కొరకు వచ్చాడతను. వారి అభ్యర్ధన మేరకు అతను మైక్ ఎలా పెట్టాలో నేర్పించాడు. అందరూ ఒక మాట మీద ఉండి ధైర్యంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నారు.
2020 మార్చిలో వచ్చే ఉగాది ‘శార్వరీ’ నామ సంవత్సరాది. అందుకే ‘అమ్మా! శార్వరీ!’ అని నమస్కరించుకుని, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తమ గుడి విశేషాలు బయట వారికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారు అర్చకులు.
ఎలక్ట్రిక్ పని, టీవీలు, వైరింగ్ అంతా తమకు వచ్చినంతలో సరి చేశారు. లైట్లన్నీ ఆన్ చేసి గురువుగారు ఇద్దరినీ చెరొక విగ్రహం ముందు కూర్చోబెట్టి నరసింహ చిన్న టేబుల్ మీద మైకు పెట్టాడు. ప్రతి సంవత్సరం లాగే ఉదయం సుప్రభాతం సహస్రనామార్చన అభిషేకాలు సాయంత్రం మళ్ళీ సేవలు రాత్రి పవళింపు సేవ చేస్తూ ఆన్లైన్లో భక్తులకు చూపించారు. భక్తుల కోరికను బట్టి వారి ఇష్ట దేవతలకు అష్టోత్తరం, సహస్రనామ, పూజలు, అభిషేకాలు, వారి వారి గోత్రనామాలతో అర్చనలు చేశారు. భక్తులు ఇంటి నుండి బయటకు రాకుండా వీడియో కాల్‌లో ఇదంతా చూసి ప్రత్యక్షంగా చూసిన అనుభూతి పొందారు.
యూట్యూబ్ లోంచి సన్నాయి
ఉగాది రోజు గుడి గంటలు మోగించారు. చుట్టుపక్కల ఒక నవ చైతన్యం వెలివెరిసింది. ఈ సంబరాల వల్ల లాక్‌డౌన్ భావన నుంచి మానసికంగా బయట పడుతున్నారు. శార్వారి గారు పంపటంతో ఒక వ్యాన్లో ఎలక్ట్రిక్ సామాన్లతో కొందరు స్టాఫ్ దిగి, ఒక కంప్యూటర్ డెస్క్‌టాప్‌ని టేబుల్ మీద అసెంబుల్ చేయించి, ఎలక్ట్రికల్, మరియు కంప్యూటర్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలు బాగా కనపడాటానికి మంచి లైటింగ్ ఏర్పాటు చేశారు.
అంతకు ముందే దాతలతో ఫోన్లలో మాట్లాడారు. అన్ని పనులు చురుగ్గా చేస్తున్న శ్రీలక్ష్మిని గుడికి ఆఫీస్ మేనేజర్‌గా కమిటీ నియమించింది. అందరికీ ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్ ఆప్ ద్వారా స్ట్రీమింగ్ చేయటానికి, విడివిడిగా వ్యక్తులతో మాట్లాడటానికి, హ్యాంగ్ అవుట్, ఫేస్ టైం, వాట్సాప్, వీడియో కాల్, ఎక్కువమందితో ఒకేసారి మాట్లాడటానికి జూమింగ్ కాల్ లింక్ పంపించి, ఒకేసారి అందరూ చూడటానికి ఏర్పాట్లు చేశారు.
ఉగాది రోజున రాశిఫలాలు, వారి వారి జన్మ నక్షత్రాల అనుసరించి సంవత్సర ఫలితాలు కూడా చెప్పడంతో అందరూ తృప్తి పడ్డారు. భక్తులు ప్రత్యక్ష దర్శనానికి రాలేకపోయినా అభిషేకాలు, అర్చనలు తనివి తీరా చూశారు. గుడి ఖాతాలోనే కాకుండా పురోహితుల వెల్ఫేర్ ఫండ్‌కి కూడా బాగానే ధనం జమ చేశారు. పండుగ తర్వాత కూడా ఆ కార్యక్రమాలు మరింతగా కొనసాగడంతో ముగ్గురు పురోహితులకి ఖాళీ లేనంత పని వచ్చింది. కొందరు వంట సరుకులు పంపారు. పైగా గుడి ఆవరణలో ఆకుకూరలు కూరగాయలు పండించడంతో తాజా కూరగాయలు లభ్యమవుతున్నాయి. అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుండి ఆత్మవిశ్వాసంతో తనకు తోచిన ఆలోచనలతో, కొందరు నిపుణుల సలహాలు తీసుకుంటూ, ఆ ఊరు కాని ఊరు, దేశం కానీ దేశంలో వారందరూ సమస్యల నుండి బయట పడగలిగారు. భగవంతునిపై నమ్మకంతో, తమకు చేతనైన పౌరోహిత్యం తోనే కష్ట సాగరాన్ని దాటగలిగారు. లాక్‌డౌన్‌లో బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో తమ గుడిని, తమ వృత్తిని ఆధారం చేసుకొని ఓర్పుతో, ధైర్యంతో విజయం సాధించారు. ఎవరు బయటకు వెళ్లలే(క)ని పోవటం, ఎవరైనా వస్తువులు పంపినా, బయటనే ఒక రోజంతా ఉంచి, శానిటైజ్ చేసుకొని లోపలికి తీసుకురావడం వల్ల, ఆ కుటుంబాల్లో ఎవరికీ కోవిడ్ సోకకపోవటం మరొక ప్రశంసనీయమైన విషయం.
ఆదాయం సమకూర్చే పద్ధతులను తెలిసిన వారి సలహాలు తీసుకొని, నిజం చెప్పాలంటే కోవిడ్ లోనే కాదు ఉపవాసాలతో ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి నుండి బయటపడ్డారు. ఈ విషయాలన్నీ అందరూ ఫోన్ల ద్వారా చెప్పుకోవటంతో బాగా ప్రచారం జరిగింది. ఒక ప్రముఖ మ్యాగజైన్‌లో ‘కరోనా లాక్‌డౌన్ అండ్ సర్వేవల్ ఆఫ్ సిక్ యూనిట్ – కేసు స్టడీ’ అని ఒక ప్రొఫెసర్ గారు రాసిన ఆర్టికల్ పబ్లిష్ అయింది. వారు శ్రీలక్ష్మి చేసిన సేవ, సహకారానికి వెయ్యి డాలర్లు చెక్ పంపించారు కూడా .
తర్వాత ఆ ప్రొఫెసర్ గారు ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివరాలు చెప్పారు… “నాకు భారతీయ సంప్రదాయం మీద ఉన్న గౌరవం పెరిగింది. వారి ఆత్మవిశ్వాసానికి, సమస్య పరిష్కారానికి అనుసరించే పద్ధతులకి హాట్సాఫ్. సంతోషాలు తప్ప బాధలు ఎవరికి చెప్పకుండా మౌనంగా భరించి, స్వయంశక్తితో కరోనా లాక్‌డౌన్ సమయంలో వారి సేవా సంస్థని సిక్ యూనిట్ దశ నుండి సర్వైవల్ దశకి తెచ్చిన ఒక భారతీయ మహిళ, ఆమెకు తోడుగా నిలిచిన మూడు కుటుంబాలు కథ ఈ కేస్ స్టడీ. దీనిని మరింతగా స్టడీ చేయవలసిందిగా రీసెర్చ్ విద్యార్థులను కోరుతున్నాను” అన్నారు. ఇంకా –
“మనసులో ఆత్మబలం ఉంది. కార్యదక్షత ఉంది. దొరికిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. భక్తులకు గుడి దగ్గరయ్యే మార్గాలు అన్వేషించారు. వారికి వ్యాపార పదజాలం (బిజినెస్ టెర్మినాలజీ) తెలియకపోయినా, వనరుల నిర్వహణ (రిసోర్స్ మేనేజ్మెంట్), వినియోగదారుల అవసరాలు (కామర్స్ నీడ్స్), సమయ నిర్వహణ (టైం మేనేజ్మెంట్), శ్రమ విభజన (డివిజన్ ఆఫ్ లేబర్), సాంకేతిక పరిజ్ఞానం లభ్యత (టెక్నాలజీ అవైలబిలిటీ) లేకపోయినా, తమ యావత్ శక్తిని ఉపయోగించి తమ సేవా సంస్థకు ఆదాయం మరియు తమ కుటుంబాలకు ఆలంబన, ప్రజలకు ఈ కరోనా లాకౌట్ సమయంలో కావాల్సిన మానసిక శారీరక బలం ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు” అని ప్రశంసించారాయన.
~
శ్రీ తటవర్తి త్రినాథ నాగేశ్వరరావు 1945లో అమలాపురంలో జన్మించారు. కాకినాడలో బి.కాం., ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.కాం. చదివారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తూ, మధ్యలో డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ‘నెహ్రూ యువ కేంద్రం’ లో ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేసారు. తర్వాత మధురై దగ్గర గ్రామీణ విశ్వవిద్యాలయం IDARA (Information Development And Resource Agency) లో పనిచేసారు. దక్షిణ భారతంలోని రాష్ట్రాలలో నెహ్రూ యువ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు గురించి నివేదికలు ప్రభుత్వానికి అందజేయడమే కాక, International Youth Organisations వారు కూడా ఈ సెమినార్స్‌కి వచ్చేవారు.
తర్వాత కరీంనగర్ జమ్మికుంట ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి 2003లో పదవీవిరమణ చేశారు. మరు సంవత్సరమే భార్యాభర్తలు కలిసి పిల్లల దగ్గరకు అమెరికా వెళ్ళిపోయారు. అయినా ప్రతి సంవత్సరం ఇండియా వచ్చి, తెలుగు సాహితీకారులకు, సాహిత్య సంస్థలకు ప్రోత్సాహక బహుమతులు, సన్మాన సత్కారాలు చేస్తూ ఉంటారు. అర్ధాంగి భారతీదేవి గారు విరివిగా తెలుగు నవలలు చదవడంతో నాగేశ్వరరావు కూడా చదవడం ప్రారంభించారు. కానీ ఆమె హఠాన్మరణంతో ఆ సాహిత్యమే ఆయనకు తోడుగా నిలిచింది. డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయినా, ఉద్యోగమంతా కామర్స్ బోధించినా, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన్న విపత్తులు చూసి, ముఖ్యంగా తెలుగు ప్రాంతం నుండి వచ్చిన పురోహితులు పడ్డ కష్టాలు, సమయస్ఫూర్తితో నిలుపుకున్న జీవితాల్ని స్వయంగా గమనించి కథ రాయడం మొదలుపెట్టారు. పూర్తయ్యేసరికి నవలగా పరిణమించింది. అదే ‘అమ్మా! శార్వరీ!’
***
అమ్మా! శార్వరీ! (నవల)
రచన, ప్రచురణ: తటవర్తి నాగేశ్వర రావు.
పుటలు: 96
పుస్తకం వెల: ₹ 120/- అమెరికాలో $5 (డాలర్లు)
[ఈ మొత్తం పిల్లల వైద్యం కోసం డొనేషన్‌గా ఇవ్వబడుతుంది]
ప్రతులకు:
ఇండియాలో:
సహరి డిజిటల్ మేగజైన్స్,
C/o. జి. శ్రీనివాస రావు,
ప్లాట్ నెంబర్ 165, రవి కాలనీ, తిరుమలగిరి,
సికిందరాబాద్ 500 015
అమెరికాలో:
Sirisha Aditham
1379 story CT
San jose( CA).
USA 95127-4331.
Mob :1-408-835-8107.
&
Saritha Ivaturi,
525 strauss dr, Thousand Oaks, CA 91320.