ఆశాభావపు బీజం నాటే అల్లూరి గౌరీలక్ష్మి కథలు

0
10

[box type=’note’ fontsize=’16’] “అల్లూరి గౌరీలక్ష్మి కథల సంకలనంలోని కథలన్నీ ఒక పాజిటివ్ దృక్పథాన్ని ప్రదర్శిస్తాయి. ఎంతటి జటిలమైన సమస్యలయినా పరిష్కరించుకోవాలన్న ఆలోచన ఉంటే సులభంగా పరిష్కారమవుతాయన్న సత్యాన్ని ప్రదర్శిస్తాయి కథలన్నీ” అని అమ్మకో అబద్ధం పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]అ[/dropcap]ల్లూరి గౌరీలక్ష్మిగారి 18 కథల సంపుటి ‘అమ్మకో అబద్ధం’. కథా రచయితగా, నవలా రచయితగా, కాలమిస్టుగా అల్లూరి గౌరీలక్ష్మిగారు సుప్రసిద్ధులు. ఎలాంటి ఆడంబరాలు, వాదాలు, వివాదాలకు తావివ్వకుండా నిశ్శబ్దంగా తాను రాయాలనుకుంటున్న రచనలను తనకు నచ్చిన రీతిలో రచించి పాఠకుల మెప్పు అందుకుంటూ ముందుకు సాగుతున్న రచయిత అల్లూరి గౌరీలక్ష్మి,

కథా రచనను ఒక రకమైన catharsis (ప్రక్షాళన) గా అభివర్ణిస్తారు మానసిక శాస్త్రవేత్తలు. అంటే రచయిత తన నిజ జీవితంలో తాను గమనిస్తున్న అనుభవిస్తున్న అనేక అంశాలపట్ల తన మనసులో ఉన్న భావనలను, ఆలోచనలను, ఆశలను, నిరాశలను, ఆవేశాలను తన రచనల్లో ప్రతిబింబించటం ద్వారా ఒక రకమైన సంతృప్తిని పొందుతాడన్నమాట. అందుకే రచయిత రచనలు అతని వ్యక్తిత్వానికి దర్పణం పడతాయని అంటారు. అల్లూరి గౌరీ లక్ష్మిగారి ‘అమ్మకో అబద్దం’ సంపుటిలోని 18 రచనలూ అల్లూరి గౌరీలక్ష్మిగారి మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి, ఆలోచనా విధానానికి అద్దంపడతాయి. తన చుట్టూ ఉన్న మనుషులను, సమాజాన్ని గమనిస్తూ, వారిలోని వైరుధ్యాలను, సందిగ్ధాలను, సంతోషాలను, ద్వైదీభావనలను అర్థం చేసుకుంటూ విభిన్న వ్యక్తిత్వాలు, ఆలోచనలు, అపోహల నడుమ సమన్వయాన్ని సాధిస్తూ, సామరస్యపూర్వకంగా, శాంతి సాధించాలన్న రచయిత్రి తపన, ప్రయత్నాలు ఈ సంకలనంలోని ప్రతి కథలో కనిపిస్తాయి.

సాధారణంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో సమస్యను ప్రతిబింబించే కథలనే ఉత్తమ కథలుగా భావించటం జరుగుతూ వస్తోంది. అంటే రచయిత ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు చెప్తే చాలన్నమాట. కానీ అది వార్తా రచన అవుతుంది. రచయిత తాను చూసిందాన్ని తన సృజనాత్మక స్రవంతిలో ప్రక్షాళన చేసి, దానికి తనదైన ప్రత్యేకమైన పరిష్కారాన్ని సూచించాలి. ఆ రచన చదివిన తరువాత పారకుడికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల ఆలోచన కలగాలి. తన చుట్టూ ఉన్న మనుషుల పట్ల అవగాహన కలగాలి. తన గురించి తనకు బోధపడాలి. నిత్యజీవితంలో పరిష్కారం లభించని సమస్యలకు రచయిత తన సృజనాత్మక ప్రపంచంలో పరిష్కారాలు సూచించాలి. రచన చదివేవారిలో ఆశాభావాన్ని బీజాన్ని నాటాలి. అల్లూరి గౌరీలక్ష్మి కథలు సరిగ్గా ఈ పనే చేస్తాయి.

‘అమ్మకో అబద్దం’ కథ ఒక వ్యక్తికి ఆనందం కలిగించేందుకు అవసరమైతే అబద్ధాన్ని ఆశ్రయించటంలో పొరపాటు లేదన్న సత్యాన్ని సున్నితంగా సూచిస్తుంది. ‘సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం’ అన్న సూక్తి ఆధారంగా, అప్రియమైన సత్యాన్ని చెప్పి వ్యక్తి మనస్సును నొప్పించటంకన్నా ఒక చిన్న అబద్ధంతో వ్యక్తి అపరిమితానందాన్ని కలిగించగలిగితే అబద్ధం చెప్పటమే ఉత్తమం అన్న నిజాన్ని అతి సున్నితంగా ప్రదర్శిస్తుందీ కథ. పల్లెటూరి నుంచి కొడుకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి వచ్చిన అమ్మ తన సహజమైన స్నేహపూర్వకమైన స్వభావంతో అపార్ట్‌మెంట్‌లో అందరినీ పలకరిస్తుంది. కానీ ఎవరికి వారు మూతులు ముడుచుకుని బిగదీసుకుని ఉంటారు. మళ్లీ తాను ఊరికి వెళ్ళినప్పుడు అందరూ అమ్మనే తలచుకుంటున్నారని అబద్దం చెప్పటం ద్వారా తల్లికి ఆనందం కలిగిస్తుంది ప్రధాన పాత్ర. ఆ ఆనందాన్ని పాడు చేసే బదులు తానే అపార్ట్‌మెంట్ మార్చాలని నిశ్చయించుకోవటంతో కథ ముగుస్తుంది. మానవ సంబంధాలలో ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండటం, ఒకరి సున్నితమైన మనోభావాలను మరొకరు అర్థం చేసుకుని ప్రవర్తించటం అనే సున్నితమైన అంశాన్ని అతి చక్కగా ప్రదర్శిస్తుందీ కథ.

‘సీ…రియల్’ కథ తెలుగు టీవీల్లోని కుటుంబ గాధల సీరియళ్లు కుటుంబ సభ్యుల సంబంధాలను ప్రభావితం చేసే తీరును ప్రదర్శిస్తుంది. సాధారణంగా అత్తమామల్ని నిర్లక్ష్యం చేసే సీరియళ్ళతో కథలతో నిండి ఉన్న తెలుగు ప్రపంచంలో పిల్లలు తమని సరిగ్గా చూస్తున్నా సీరియళ్ల ప్రభావంతో వారిని అపార్థం చేసుకుని వారి సేవలను గుర్తించని ముసలి దంపతుల కథ ఒక రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఎంత సేపూ సంతానం దౌష్ట్యం చూపే కథలే చదివి చదివీ ఈ కథ చదివితే సమస్యకు మరోవైపు కూడా ఉందని అర్ధమవుతుంది.

‘జీవనది’ కథ బ్రతకటం ఎలాగో నేర్పే కథ. ‘జో మిల్ గయా ఉసీకో ముఖద్దర్ సమఝ్ లియా (దొరికిందే అదృష్టంగా భావించి సంతృప్తి చెందాలి) అని సాహిర్ అన్నదానికి కథారూపం ఈ కథ అనిపిస్తుంది. విదేశం నుండి తనవాళ్లని చూడటానికి వచ్చిన ప్రసాద్ ఎంత ఉన్నా ఇంకా సంతృప్తి కలగని తనకు, ఏమీ లేకున్నా ఉన్నదానితో సంతృప్తిపడుతూ, జరిగినదానితో రాజీపడే తన బంధువులు విచిత్రంగా తోస్తారు. కానీ తనలో లేని సంతృప్తిని, శాంతిని వారిలో చూసి ఆశ్చర్యపోతాడు. వారు పరిస్థితుల్ని, సమయాన్ని ఎలా వస్తే అలా అంగీకరిస్తూ, జీవితాన్ని కొండలు, గుట్టలు, లోయలగుండా పరుగెత్తిస్తూ, నిర్భయంగా ముందుకు సాగిపోతున్న వాళు సహజంగా ప్రవహిస్తున్న జీవనదులు అని అర్థం చేసుకుంటాడు. ఏదో సాధించమని ప్రేరేపించే కథల నడుమ జీవితాన్ని ఎలా ఉంటే అలా స్వీకరించి సంతృప్తిగా బ్రతకమని చెప్పే ఈ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

‘మెసేజ్’ కథ చెప్పేదొకటి, చేసేదొకటిగా ద్వంద్వ ప్రవృత్తి ప్రదర్శించే రచయితలపై విసురులాంటి కథ. ‘మాటకో మనసు’ కథ మానవ సంబంధాలలో మాట ప్రాధాన్యాన్ని మృదువుగా ప్రదర్శిస్తుంది. మాటలు వినిపిస్తాయి. కానీ ఆ మాటల వెనుక దాగి ఉన్న మనసును గ్రహించే సున్నితత్వం అందరికీ ఉండదు. అందువల్ల మాటలవల్ల అపోహలు కలుగుతాయి. మనుషుల మధ్య పరదాలు దిగుతాయి. ఎప్పుడయితే మనుషులు ఈ పరదాలు తొలగించి చూడగలుగుతారో అప్పుడు అసలు మనసును గ్రహించగలుగుతారని చూపిస్తుందీ కథ.

‘నువ్వు నాకు నచ్చావు’ ఈ సంకలనంలోని సుదీర్ఘమైన ప్రేమ కథ. ఆకర్షణ, విచక్షణ కల ప్రేమకు నడుమ తేడాను హృద్యంగా ప్రదర్శిస్తుందీ కథ. ఆడంబరాలకు పైపై మెరుగులకు అక్షరణ అధికం. కానీ అవి ఎల్లకాలమూ ఉండవు. అసలైన ప్రేమలో ఆర్భాటాలుండవు. కానీ అది దీర్ఘకాలికము అని ఆకర్షణకూ ప్రేమకూ తేడాను విప్పి చూపిస్తుందీ కథ. మనుషులను దూరం చేసే ప్రవాహంపై వంతెనలు నిర్మించి మానవ సంబంధాలను పటిష్టం చేసుకోవాలని బోధించే కథ ‘వంతెన’. భేదాభిప్రాయాలు మనుషుల నడుమ అగాధాలు సృష్టిస్తాయి. వాటిపై మానవ సంబంధాల వంతెనలు నిర్మించాలన్న ఆదర్శ కథ ఇది.

‘నీ దారే రహదారి’ కథలో మనిషి రెండు దారులలో ప్రయాణించకూడదని, తన దారి ఏదో ఎంచుకుని వెనక్కు తిరిగి చూడకుండా అదే దారిలో ప్రయాణించిన సత్యం ప్రదర్శితమయింది. పరిస్థితుల్ని బట్టి రకరకాలుగా మారినా కాలక్రమేణా తన సహజ స్వభావానికి వస్తాడని చెప్పే కథ ‘లోపలి మనిషి!

‘చలువ చెట్టు’ కథలో కొద్దికాలం సేపుసాగిన ఆహ్లాదకరమైన స్నేహం జీవితాంతం ఆనందాన్నిస్తుందన్న సత్యాన్ని అతి సున్నితంగా ప్రదర్శించారు రచయిత్రి. వెర్రి వ్యామోహతకు, ఆకర్షణలకూ లోనయ్యి ముందు వెనుకా చూడకుండా అడుగేసే యువత ఆవేశాన్ని తగ్గించి ఆలోచనను కలిగించే కథ ‘అడుగెయ్ నిబ్బరంగా’. వృద్ధాప్యాన్ని పరిణతితో ఆనందంగా గడపటానికి మార్గం సూచించే కథ ‘ఆనందాశ్రమం’. లేనిదానికి బాధపడటం కన్న ఉన్న పరిస్థితులను అర్థంచేసుకుని ఉన్నదానిలోనే ఆనందంగా ఉండటం ఉత్తమం అని చూపుతుందీ కథ. ‘గో గ్రీన్’, ‘ఆత్మజ్యోతి’ వంటి కథలు కూడా మనిషి తనలోనే నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మశక్తిని గుర్తించటం వల్ల తానే కాదు తన చుట్టూ ఉన్నవారికే ఆనందం కలిగిస్తాడని చెప్పే కథలు.

అల్లూరి గౌరీలక్ష్మి కథల సంకలనంలోని కథలన్నీ ఒక పాజిటివ్ దృక్పథాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న చిన్న విషయాలను అపోహలవల్ల అహంకారాల వల్ల పెద్దవిగా మార్చుకుని జీవన్మరణ సమస్యలుగా ఎదిగింప చేసుకుని అశాంతిపాలయ్యే మానవ మనస్తత్వాన్ని చూసి విస్తుపోతూ ‘ఇవి చిన్న విషయాలు, వాటిని ఇలా పరిష్కరించుకోవచ్చు. ఇంత గోల అవసరం లేదు అని అంటున్నట్టుంటాయి. ఈ కథలు. ఎంతటి జటిలమైన సమస్యలయినా పరిష్కరించుకోవాలన్న ఆలోచన ఉంటే సులభంగా పరిష్కారమవుతాయన్న సత్యాన్ని ప్రదర్శిస్తాయి కథలన్నీ.

‘అమ్మకో అబద్దం’ సంపుటిలోని కథలన్నీ ఒక ఎత్తు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాసిన మొత్తం మూడు కథలు 2013లో రాసిన సత్యం. 2010లోని పరిష్కారం, 2018లోని కొత్త మట్టి, ఈ సంకలనంలోని ఇతర కథలనుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ మూడు కథలు అల్లూరి గౌరీలక్ష్మికి రచయితగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదిస్తాయి. తెలుగు సాహిత్యంలో ఏక్టివిస్ట్ రచయితలున్నారు. వీరు రంగుటద్దాలు ధరించి ఏ సమస్యనైనా, ఏ సంఘటననైనా ఏకపక్షంగా చూస్తూ అత్యంత పాక్షికమైన రీతిలో సమస్యను ప్రదర్శిస్తారు.  ఉద్యమాల అలలపై ఎగసి, అల విరగగానే విరుగుతారు. ఇలాంటి రచయితల పేర్లు బాగా నలుగుతాయి. కానీ వారు రాసిన కథలు ఎవరికీ గుర్తుండవు. వారి పేర్లద్వారా వారి కథలు గుర్తింపు పొందుతాయి తప్ప కథల వల్ల రచయితకు పేరు రాదు. ఇంకొందరు రచయితలు ఏ ఎండకా గొడుగు పట్టే రచయితలు. ఏ అభిప్రాయం సర్వజనామోదకరంగా ఉంటుందో, అదే తమ కథల్లో ప్రదర్శిస్తారు. ఇలాంటివారు కూడా పేరు వల్ల తప్ప కథల వల్ల కాకుండా ఎప్పుడూ చర్చల్లో ఉంటారు. మరికొందరు కథకులు తటస్థంగా ఉంటారు. సమకాలీన ప్రపంచంతో సంబంధం లేనట్టు తమ ధోరణిలో తాము రచనలు చేస్తూ పోతారు. కానీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సామరస్య ధోరణిలో కథలు రాసేవారు కానీ, సమస్య మరో రూపును ప్రదర్శించి పరిష్కారాలు సూచించే రచయితలు కానీ చాలా అరుదు. అలాంటి అరుదైన రచయితల జాబితాలో ఈ మూడు కథల వల్ల అల్లూరి గౌరీలక్ష్మి పేరు కూడా చేరుతుంది.

2010లో ప్రచురితమైన ‘పరిష్కారం’ కథ ఓ కుటుంబంలో కలహాలను తీసేసి ఇంట్లోంచి తొలగించటం వల్ల శాంతిని సాధించటం చూపిస్తుంది. గోరంత సమస్యను కొండంత చేసి చూపుతూ, సెన్సిటివిటీ కన్నా సెన్సేషనలిజంకు ప్రాధాన్యమిచ్చే టీవీ మీడియాపై వ్యంగ్య విమర్శలాంటి ఈ కథ విన్నవి కన్నవి అన్నీ నిజమేననుకుని ఆవేశకావేశాలకు గురయ్యే అమాయక సామాన్యుల బలహీన మనస్తత్వాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. ప్రతి పార్టీ ఓ టీవీ ఛానెల్ పెట్టటం, తమ దృక్కోణాన్ని వినిపించటానికి ఉద్యమ సమయంలో పత్రికలు, టీవీలు పెట్టటం ఈ కథ ప్రదర్శించిన నిజాన్ని నిరూపిస్తాయి. నిజానికి ఆవేశకావేశాల తీవ్రతలు పెరిగే సమయంలో రచయితలు ప్రజలకు నిజానిజాలు వివరించి, వారిని చైతన్యవంతులను చేయాలి. రచయితలంతా ఆవేశాలు పెంచేందుకు ప్రవాహంలో కొట్టుకుపోతున్న తరుణంలో తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిన రచయిత్రి అల్లూరి గౌరీ లక్ష్మి,

2013లో అల్లూరి గౌరీ లక్ష్మి రచించిన ‘సత్యం’ కథ ఆ కాలంలో ప్రభుత్వోద్యోగుల నడుమ నెలకొన్న భేదాలు, సంశయ వాతావరణానికి దర్పణం పట్టే కథ. ఆంధ్ర నుంచి వచ్చిన సత్యాన్ని అనుమానంగా చూడటం, తమ ప్రాంతం ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకుని అపోహలకు ఇతరులు గురవటంలోని నిజానిజాలను నిక్కచ్చిగా చూపిన కథ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రభుత్వోద్యోగుల పరిస్థితిని ప్రదర్శించే అరుదైన కథ ఇది. సమాజంలోని సంకుచిత భావాల ప్రభావం సామాన్యుడిపై ఎలా ఉందో చూపే కథ ఇది.

‘ఇలాంటిదే’ 2018లో ప్రచురితమైన ‘కొత్త మట్టి’ కథ. ఉద్యమం జయవంతమయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ సామాన్యులలో ఉద్యమ సమయంలో కలిగిన ద్వేషభావనలు, అపోహలు తొలగిపోలేదు. తెలంగాణ భార్య, ఆంధ్ర భర్త… భార్య ప్రత్యేక తెలంగాణ సమర్ధురాలు. కానీ విభజన తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఇన్నాళ్లూ తాను ద్వేషించి, దూషించిన ఆంధ్రావాళ్ల నడుమ నివసించాల్సి రావటం, ఏడు మాటలాడినంత ఎట్టివారూ బంధవులవుతారన్న సూక్తిని అనుసరించి ఆమెకు తనవన్నీ అపోహలు అని అర్థమై భ్రమలు తొలగటం ఈ కథ. మనుషులు కలసి మాట్లాడుకుంటే మనసులు కలుస్తాయని, అపోహలు తొలగుతాయని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుందీ కథ.

ఈ సంపుటిలోని కథలు చదివితే మనుషులు తమ అహంవల్ల, అపోహల వల్ల, భ్రమల వల్ల ఎలా తమ చుట్టూ అడ్డుగోడలు నిర్మించుకుని అనవసరమైన అశాంతికి గురవుతున్నారో అర్ధమవుతుంది. మనుషుల మనసుల నడుమ అగాధాలు పూడ్చి, అడ్డుగోడలు కూల్చి వంతెనలు నిర్మించటం తెలుస్తుంది. ఒకవైపు సమకాలీన సామాజిక సమస్యలను ప్రదర్శిస్తూనే వీలయినంత పరిణతి, సమన్వయం, సామరస్యం, అవగాహనలతో కూడుకుని మంచి చెప్పే చక్కని కథలు ఇవి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదివి ఆలోచించాల్సిన కథలు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తాను నమ్మినవిధంగా, నచ్చిన రీతిలో, తనకు మంచి అనిపించిన రీతిలో కథలను సృజిస్తూ అల్లూరి గౌరీలక్ష్మి సాగిపోవాలి. మరిన్ని మంచి కథలను తెలుగు సాహిత్యానికి అందించాలి.

***


అమ్మకో అబద్ధం
అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి
పేజీలు: 152
వెల:₹90/-
ప్రతులకు: సాహితి ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ 520004

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here