అమ్మకు పండగ

0
12

[అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘అమ్మకు పండగ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మో[/dropcap]డు వారిన కొమ్మ చిగురిస్తుంది
ఈ రోజు ఆమె తను జీవించివున్నానని గుర్తిస్తుంది
ఈ రోజు అమ్మా అని పిలిచే తన కొడుకు పిలుపును
మళ్ళీ ఏడాది దాకా పదిలంగా
గుండెల్లో దాచుకుని పదే పదే తలచుకుంటుంది

ఈ రోజు కొడుకు ఆమె చెయ్యి పట్టుకుని
భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు
ఆ స్పర్శ,వర్షం కోసం ఎదురు చూసే బీడులా
తన ముడతలు పడ్డ దేహాన్ని పులకింప చేస్తుంది
ఆ ఆత్మీయ (రహిత) స్పర్శ ఆమెలో ఆశలు కల్పిస్తుంది

ఈ రోజు ఆమె మహారాణి
సింహాసనంలో కూర్చోబెట్టి జరీ మెరుపుల
కొత్త చీరను ఆమెకు చుట్టబెడతాడు
ఊరందరినీ పిలిచి విందు చేస్తాడు
నవ మాసాలు మోసి కని, పెంచిన తల్లి భూమ్మీద దేవతని,
అమ్మ ప్రేమ ఆకాశమంతని
అమ్మ ఉన్న ఇల్లు దేవాలయమని
అక్కడా ఇక్కడా కవితల్లోని మాటలు కాపీ కొట్టి
మధుర మధురంగా చదివి చప్పట్లు కొట్టించుకుంటాడు
364 రోజులు అసూర్యంపశ్యగా, వాడి పడేసిన పాత సామానులా,
పనయిపోయిన యంత్రంలా, మూల గదిలో బందీలా,
ఎవరికీ ఏమీ కాకుండా ఉన్న ఆమెకు,

ఆ అమ్మకు
ఏడాది కోసారి ఇచ్చే లైఫ్ సర్టిఫికెట్‌లా
ఈ అమ్మల పండుగ తను బతికేవున్నానని గుర్తు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here