మంచి బుద్ధుల కథలు

1
11

[dropcap]ఆ[/dropcap]ధ్యాత్మిక యాత్రా రచయిత్రిగా పేరుగాంచిన శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి గారు బాలబాలికల కోసం అందించిన కథల సంపుటి ‘అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు‘. పిల్లలకు తేలికగా అర్థమయ్యేలా, సరళమైన వాక్యాలలో చక్కని బుద్ధులు నేర్పే కథలివి. అమ్మమ్మలు, తాతయ్యలే కాకుండా, వీలు చిక్కినప్పుడు తల్లిదండ్రులు కూడా చదివి వినిపించదగ్గ కథలు ఇవి.

ఈ పుస్తకంలో 13 కథలు ఉన్నాయి. అన్నీ కథలకి తగిన అందమైన చిత్రాలను తుంబలి శివాజీ గారు గీశారు. పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే ఈ కథల గురించి తెలుసుకుందాం.

‘జామకాయలు – చిట్టి చిలకలు’ అనే కథలో మెత్తని రుచికరమైన జామ చెట్లున్న తోటలోకి కొన్ని చిలకలు వచ్చి చేరుతాయి. పెద్ద చిలకలు ఆకలి తీరినంత మేర పళ్లని తినగా, కొన్ని చిన్న, అల్లరి చిలకలు ఆకతాయితనంతో పళ్లని పాడు చేస్తాయి. రైతులకు నష్టం కలుగుతుంది. తరువాత చిలకలు కూడా ఆహారం కోసం మరో తోటని వెతుక్కోవలసి వస్తుంది. ఆహారాన్ని వృథా చేయకూడదని, ఆహారం వృథా చేయటం వల్ల ఎంత మంది ఇబ్బందులకు గురవుతారో ఈ కథలో చిలకల ద్వారా చెప్పారు రచయిత్రి. అంతే కాక జామకాయలోని పోషక విలువలను గురించి సందర్భానుసారంగా చక్కగా వివరించారురు.

‘పని విలువ’ చక్కని కథ. అల్లరిగా ఉండే బాలుడిలో తన చర్యల ద్వారా మార్పు వచ్చేలా చేస్తాడో మిత్రుడు. ఈ కథలో పని విలువని ఎంతో చక్కగా చెప్పారు. పిల్లలు ఆడా/మగ అన్న తేడా లేకుండా తమ పనులు తాము చేసుకోవడం, అలాగే అమ్మకి సహాయం చేయడం వల్ల అమ్మకి కొంత పని భారం దగ్గుతుందని సున్నితంగా చెప్తారు రచయిత్రి. పని వచ్చి ఉంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనమే చేసుకోగలమని వికాశ్ పాత్ర ద్వారా చాలా బాగా చెప్పారు.

చిన్నపిల్లలకు వేమన శతకం, సుమతీ శతకం వంటివి అర్థమయ్యేలా ఎందుకు నేర్పాలో ‘అర్థం లేని చదువు వ్యర్థం’ కథ చెబుతుంది. ‘అప్పిచ్చువాడు వైద్యుడు..’ అనే బద్దెన పద్యం ద్వారా ఈ కథను చెప్పటం జరిగింది. ఈ  పద్యం అర్థం కాక చిన్నా సతమతమవుతుంటే – వాళ్ల అమ్మ ఆ పద్యానికి అర్థం చెబుతుంది. అంతే కాదు అర్థం చేసుకోలేని చదువు వల్ల ప్రయోజనం లేదు అని కూడా చెబుతుంది. ఏ విషయమైనా అర్థం చేసుకుని నేర్చుకుంటే త్వరగా వస్తుందని చెబుతుంది.

‘భావి పౌరులు’ కథలో నీటి విలువను, ప్రాముఖ్యతను ఎంతో బాగా చెప్పారు. ఆరీ అనే పిల్లాడు వాళ్ల అమ్మా అమ్మమ్మ వాళ్లతో కలసి ఒక జలపాతం చూడటానికి అక్కడ ఆ నీటిలో ఆడుకుందామని చాలా సరదా పడతాడు. కాన అక్కడకు వెళ్లిన తరువాత చూస్తే నీళ్లు ఎక్కువ లేకపోవడంతో చాలా నిరాశపడతాడు. వాళ్ల అమ్మను నీళ్లు ఎందుకు లేవని అడుగుతాడు. వాళ్ల అమ్మ చెప్పినదాన్ని గ్రహించి నీళ్లు వృథా పారబోయకూడదని చెట్లును ఎక్కువగా పెంచాలని నిర్ణయించుకుంటాడు. ఆలోచనలు రేకెత్తించి కార్యాచరణ దిశగా ప్రేరేపించే కథ ఇది.

‘అమ్మమ్మ మడి’ కథలో పూర్వపు ఆచారమైన మడి గురించి ఇప్పటి వాళ్లకు అర్థం అయ్యేటట్లు చెప్పడం జరిగింది. వరుణ్ వాళ్ల అమ్మమ్మను బిస్కట్లు అడిగితే ఆవిడ “నేను మడిలో వున్నాను, అన్ని ముట్టుకోకు” అని అంటుంది. అప్పుడు వరుణ్ వాళ్ల అమ్మను మడి అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె అమ్మమ్మ శుభ్రంగా స్నానం చేసి శుచిగా వుండి వంట చేస్తుందని, అందువల్ల ఎటువంటి క్రిములు బ్యాక్టీరియాలు రావు అని దాని వల్ల రోగాలు  రావు అని వివరంగా పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్తుంది. వాడికి అమ్మమ్మ మీద కోపం పోతుంది.

అనవసరమైన పోటీ వల్ల కలిగే దుష్ఫలితాలను చెబుతుంది ‘ఎవర్ ఫస్ట్?’. ఈ కథ నేటి సమాజానికి ఈ కాలపు చదువుల పట్ల ఒక పాఠం లాంటిది. ఇందులో అరవింద్ అనే కుర్రవాడు తాను క్లాసులో ఫస్టు రాలేదని, ఎప్పటిలాగే సుభాష్ ఫస్టు వచ్చాడని తన తల్లితో చెపుతాడు. అరవింద్ తల్లి కుమారి – క్లాసు ఫస్టు రావటం ముఖ్యం కాదు; చదివిన చదువును ఆడుతూ పాడుతూ చదవాలి, అర్థం చేసుకుంటూ ఇష్టంగా చదవాలి అని చెబుతుంది. అలాగే – అనవసరమైన పోటీతత్వాన్ని పెంచుకోవద్దని, దాని వల్ల అనేక కుళ్లు బుద్ధులు వస్తాయి అని వివరించి చెప్తుంది.

ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది పోయాకా దాని ప్రాముఖ్యతని గుర్తిస్తారు జనాలు. ‘చెట్టు విలువ’ కథ ఈ నిజాన్నే చెబుతుంది. నవీన వాళ్ల ఇంటి ఎదురింటి వాళ్లకి వారి గుమ్మంలో పున్నాగ చెట్టు వుంది. దాని ఆకులు చాలా రాలుతుంటాయి, వాటి కొమ్మలు నవీన ఇంటికి మీదికి వాలి వుంటాయి, వాటిని శుభ్రం చేసుకోవడం వాళ్లకు చాలా కష్టంగా వుంటుంది. అంతే కాదు వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒకసారి వర్షం పడ్డప్పుడు చెట్టు కొమ్మ ఒకటి విరిగి పడుతుంది. వాళ్ల ఇంటి యజమాని చెట్టు కొమ్మలను కొట్టించేస్తాడు. అప్పుడు వాళ్లంతా చాలా సంతోషిస్తారు. కాని వేసవికాలంలో చాలా ఎండగా వుండడం వల్ల వాళ్లు ఆ ఎండను తట్టుకోలేరు. అప్పుడు వాళ్లకు ఆ చెట్టు విలువ తెలుస్తుంది.

‘గెలుపు – ఓటమి’ కథలో గౌరవ్ అనే అబ్బాయి తన స్కూల్లో జరిగే ఆటల పోటీలలో పేరు ఇవ్వలేదని వాళ్ల అమ్మకి చెప్తాడు. ఎందుకు అని అడిగితే ఎప్పుడూ తను గెలవడం లేదని అందుకనే ఈసారి పేరు ఇవ్వలేదని చెప్తాడు. అప్పుడు వాళ్ల అమ్మ గెలుపు ఓటమి ముఖ్యం కాదు. బాగా ఆడే వాళ్లతో ఆడితే ఆట బాగా వస్తుందని, ఎన్నో మెళకువలు నేర్చుకోవచ్చు అని చెప్తుంది. అంతే కాదు తాను ఎప్పుడు ఛెస్ ఆడినా తాను కావాలని ఓడిపోయి తన కొడుకును గెలిపించడం లోని తప్పుని గ్రహిస్తుంది. తరువాత తన కొడుకును బాగా ఆట నేర్చుకోవాలని ఎంతో ప్రోత్సహిస్తుంది. ఆలోచింపజేసే కథ.

‘తీరిన సమస్య’ చక్కని కథ. సాధారణంగా పరిసరాలు పరిశుభ్రత లోపించడం వల్ల, పేదపిల్లలలో ఎదురయ్యే చిన్న చిన్న శారీరక అనారోగ్యాలను గుర్తించి వాటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుందీ కథ. తల్లిదండ్రులు పనికి వెళ్ళే పిల్లల ఆరోగ్య జాగ్రత్తలకి మనమేం చేయవచ్చో ఈ కథ చెబుతుంది.

‘ముద్దు బిడ్డ’ కథలో పిల్లలతో ఎంత ఆప్యాయంగా వుండాలి, వాళ్లకి అన్ని విషయాలు ఎంత ప్రేమగా చెప్పాలో తెలుపుతారు రచయిత్రి. మఖ్యంగా ఇద్దరు చిన్న పిల్ల మధ్య తేడా రాకుండా వాళ్లు కూడా వాళ్ల మధ్య అమ్మ తేడా చూపుతోంది అని అనుకుండా ప్రేమగా అన్ని తెలుపుతూ ఎలా పెంచాలో ఈ కథ చెబుతుంది.

‘అమ్మమ్మ దొంగతనం’ ఆసక్తికరమైన కథ. ఈ కథలో పిల్లలు ఎంత క్రమశిక్షణతో వుండాలో చెప్పి, బాలబాలికలు మంచి చెడును తెలుసుకోవాలని; ముఖ్యంగా దొంగతనం చేయకూడదని, దాని వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తారు. ఒక తప్పు చేసినందువల్ల దానిని కప్పిపుచ్చడానికి అనేక తప్పులు చేస్తారని అవి చాలా ప్రమాదకరం అని వివరిస్తారు రచయిత్రి.

గాంధీ తాత గురించిన కథ ‘మాట విలువ’, కుందేలు తాబేలు కథ ఎప్పటిలానే పిల్లలను ఆకట్టుకుంటాయి. సన్మార్గం వైపు నడుపుతాయి.

***

అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు (బాల సాహిత్యం)
రచన: పి.యస్.యమ్. లక్ష్మి
పేజీలు: 54
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత్రి: 9866001629
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు:
https://books.acchamgatelugu.com/product/ammamma-cheppina-kammani-kathalu-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here