అమ్మణ్ని కథలు!-1

2
11

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని తొలి జ్ఞాపకం!

[dropcap]అ[/dropcap]న్ని నాళ్లలోకీ ఏ నాడు మేలంటే ‘చిన్ననాడే’ అని మనందరం ఏకకంఠంతో సమాధానం చెబుతాం కదా..

కానీ, మన బాల్యంలో మనకు మనదిగా, మనకు మనంగా గుర్తున్న మొదటి సంఘటన యేదంటే చప్పున చెప్పలేం!

నేను ఈ ప్రశ్న వేసుకుని అన్వేషణ అనే తవ్వుగోలతో నా జ్ఞాపకాలను తవ్వుకుంటూ వెళ్లాను. నా మూడేళ్ల వయసులో ‘నేను’ అన్న స్ఫురణ కలిగిన నా మొదటి అనుభూతి నా మనసులో మెదిలింది.

అది మా పెద్దక్క పెండ్లి జరిగిన రోజు. పెండ్లి పొద్దున రంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం దంపతులిద్దరూ దైవదర్శనానికని కారులో ఊరేగింపుగా వెళ్లారు. దాన్ని మా వూళ్లలో ‘మెరవణి’ అంటారు. ఊరు వూరంతా విరగబడి చూశారు కొత్త దంపతులను. నేనూ మొండికేసి ఆ కారులో కూర్చున్నాను లెండి!

రాత్రి ‘బువ్వంబంతి’ (బూజంబంతి, భోజనాల వేడుక) జరుగుతోంది. మా ఇంటి వసారాలో వున్న పెద్దఅరుగు మీద రెండు పెద్ద పీటలు వేశారు. ఐదు అరిటాకులు, ఒకదాన్ని ఆనుకుని మరొకటి గుండ్రంగా వేసి, రెండు పెద్ద కొత్త వెండిపళ్లాలు, రెండు పెద్ద కొత్త వెండిగ్లాసులు, వెండిచెంబులో నీళ్లు, వెండికప్పుల్లో పాయసాలు పోసి, అమర్చి, ఆకుల ముందర పెద్ద పెద్ద వెండిదీపాలు పెట్టి, చుట్టూ అందమైన ముగ్గులు వేసి, వాటిపై రంగులు తీర్చి, ముగ్గుతోనే అక్కా బావా పేర్లు రాశారు (అప్పుడు ఆ అక్షరాలేమిటో నాకు తెలియదు లెండి. చదువురాదు కదా.. పెద్దయ్యాక తెలుసుకున్నాను). ముగ్గుల మధ్యలో దీపాలు అలంకరించారు. మా అక్కా బావా వచ్చి పీటలపై కూర్చున్నారు.

మా అక్క సిగ్గులమొగ్గ లాగా వుంది. అక్క జుట్టు చిన్నదే గానీ, పెద్ద సవరం పెట్టి బారెడంత జడ అల్లారు. పూలదండ చుట్టారు. మా బావ పెళ్లికొడుకు అలంకరణలో కొత్తగా కనిపిస్తున్నాడు.

వాళ్లిద్దరికి రెండు పక్కలా మా అక్క అత్తగారింటి వాళ్లకు ఆకులు వేసి, ఆకుల ముందు ముగ్గులు వేసి, అందరూ కబుర్లాడుకుంటూ, హాస్యాలు చేసుకుంటూ భోజనాలు చేస్తున్నారు.

మా అమ్మా, నాయనా వాళ్లకు మర్యాదలు చేస్తూ ఆదరంగా మాట్లాడుతూ, వడ్డనలు చేస్తూ వున్నారు.

అమ్మా, మరి కొందరు అత్తలూ పాటలు పాడినారు. హాస్యాలాడినారు.

పెండ్లికొడుకు తరఫు వాళ్లు కూడా పోటీలు పడి పాటలు మొదలెట్టారు.

అందరూ అన్నాలు తినడం అయిపోయింది కానీ, పాటలు మాత్రం అయిపోలేదు. చేతులు ఎండిపోయాయి.

ఓ పక్కన మా తాతగారు ఠీవిగా కూర్చుని మనవరాలి పెళ్లిసంబరాలను ముసిముసి నవ్వులతో వీక్షిస్తున్నారు. కొడుకూ, కూతురూ వియ్యంకులైన శుభసందర్భాన్ని సంతోషంగా విలోకిస్తున్నారు.

మా అక్కలూ, అన్నలూ హడావిడిగా బంధువుల పిల్లలతో మాట్లాడుతూ పనులు చక్కబెడుతున్నారు. అటూ ఇటూ తిరుగుతున్నారు. నా చెల్లెలు జయ అమ్మ చంక దిగకుండా అమ్మను చికాకు పెడుతున్నది.

మరి నేనెక్కడున్నానంటే.. ఆ అరుగుకు మరో చివర బోరింగు పంపు పైనున్న చిన్న అరుగుపై కూర్చున్నాను.. ఒక అత్త ఒడిలో. ఆవిడ వెండిగిన్నెలో యేదో అన్నం కలిపిపెడుతోంది. అదే నా తొలి జ్ఞాపకం.

తిండితోనే తొలి జ్ఞాపకం ఆరంభం అన్నమాట! అందునా పెళ్లిభోజనం! ఇప్పటి నా భారీకాయానికి పునాదులు అప్పుడే పడ్డాయని అర్థమైంది నాకు! సరే.. నా ప్రారబ్ధం ఇలా వుందనుకుని సరిపెట్టుకున్నాను.

మరురోజు పొద్దున ఇరువైపుల పెళ్లివాళ్లూ వసంతాలు చల్లుకున్నారు. నాకూ ఎవరో చెప్పారు అక్కా బావ పైన వసంతం చల్లమని. నేను సిగ్గుపడుతూ వుంటే ఎవరో నా పైన వసంతం పోసి నన్ను తడిపేశారు.

నాకూ ధైర్యం వచ్చి నేనూ వసంతం పోశాను అందరిపై. కలిపిన వసంతమంతా అయిపోయింది. కానీ ఉత్సాహం అయిపోలేదు. జీతగాళ్లు బోరింగుపంపులో నించి నీళ్లు కొట్టిపోస్తూనే వున్నారు. కాస్సేపయ్యాక..

“ఇక చాల్లెండి. అందరూ పోయి స్నానాలు కానివ్వండి” అన్న మా తాత హెచ్చరికతో అందరూ స్నానాలకు బయలుదేరారు. పిల్లలంతా గోలగోలగా మాట్లాడుకుంటున్నారు.

నాకెవరో స్నానం చేయించి, బట్టలేసి, జడలు బిగించారు. కొత్త రిబ్బన్లు పెట్టి రెండు జడలు వేశారు. రెండు జడలనూ కలిపి వంతెనలాగా చిట్టి పూలదండ కూడా పెట్టారు.

మెడలో గొలుసు, చేతికో బంగారు మురుగూ, చెవులకు లోలాకులూ, వేలికి ఉంగరమూ పెట్టింది అమ్మ.

జాగ్రత్తలు చెప్పింది. బయటికి పోవద్దని చెప్పింది. సరేనన్నాను. కానీ, చెప్పినమాట చెప్పినట్టు వింటే నేను అమ్మణ్నిని ఎందుకవుతాను?

మెల్లగా వంటింట్లోకి నడిచాను. పెండ్లి అయిపోయినా చాలామందే వున్నారు. వంటింట్లో ఇంకా సందడి బాగానే వుంది. దూరపు బంధువులు కొందరు వెళ్లిపోయారు. కానీ, దగ్గరవాళ్లు బాగానే వున్నారు. ఆ రోజుల్లో ఐదురోజుల పెళ్లిళ్లు కదా! రోజుకో వేడుక చేసేవారు.

‘లడ్లు అన్నీ అయిపోతే గానీ ఈ చుట్టాలు ఇండ్లకు పోరు!’ అని మా నాయన తరఫు చుట్టం ఒక అవ్వ విసుక్కుంటోంది.

వంటవాళ్లు వేడివేడి ఉప్మా చేసి దించారు. విడిదింటికి పంపడానికి చట్నీపొడీ, నెయ్యీ, ఆకులూ సిద్ధం అవుతున్నాయి. వంటకు యేర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

పెద్దమ్మా, మా బంధువుల్లో పెద్దవాళ్లూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మా పెద్దమ్మ పొద్దునపూట అంత తీరిగ్గా కబుర్లాడటం నేను ఎప్పుడూ చూడలే!

అమ్మ అటూ ఇటూ బొంగరంలా తిరుగుతూ వియ్యాల వాళ్ల టిఫిన్ యేర్పాట్లు చూస్తోంది. నాకు ఎవరిచేతో ఉప్మా తినిపించింది.

ఇంతలో పక్కవూరి నుంచి రైతులు కడవల్లో పాలు తెచ్చారు. అవన్నీ వంటవాళ్లు గంగాళాలలో పోయించుకున్నారు. గాడిపొయ్యిల పైన పెట్టారు.

పక్కన ఇంకేదో వూరి నించి రైతులు కూరగాయలు జొల్లగంపలలో తెచ్చారు. పెద్దమ్మ అవన్నీ కుప్ప పోయించింది. పెద్దవాళ్లంతా తలో చెయ్యి వేసి, అన్నింటినీ వేరువేరు గంపలలోకి మార్చారు. మిరపకాయల తొడిమలు ఒల్చారు. మటిక్కాయలు (గోరుచిక్కుడు) నారఒలవడం మొదలుపెట్టారు కొందరు. నిన్న మిగిలిపోయిన పూలతో పూలదండలు కడుతున్నారు కొందరు.

నేను మెల్లగా ఉగ్రాణం గది (స్టోర్ రూమ్) లోకి తొంగిచూశాను. చీకటిగా వుంది. కానీ, మంచి మంచి వాసన లొస్తున్నాయి.

ఓ నిముషం సేపటి తర్వాత అన్నీ కనబడుతున్నాయి.

రకరకాల పిండివంటలు గంపలలో, డబ్బాల్లో అమర్చి, మూతలు పెట్టి, ఆకులు మూసిపెట్టీ వున్నాయి. లడ్లగంపలోనించి ఓ లడ్డూ బయటికి కనిపిస్తూ నన్ను ఊరించింది. తీసుకోబోయాను. ఆ పక్కనే కూర్చుని వున్న ఒక అత్త “యేయ్! ఎవరే?” అని గద్దించింది. నేను ఉలిక్కిపడ్డాను. అయినా వెనక్కి తగ్గలేదు.

“నేను పెండ్లికూతురి చెల్లెల్ని అత్తా! అమ్మణ్నిని. లడ్డు తింటాను అత్తా..” అన్నాను కొంచెం ధైర్యం తెచ్చుకొని.

ఆ మాత్రం గద్దింపులు, కసుర్లు ఆ వయసుకే అలవాటయ్యాయి.. ఎందుకంటే బోలెడుమంది అక్కలూ, ఇద్దరు అన్నలూ వున్నదాన్ని కదా మరి!

“అవునా? నీవు పెండ్లికూతురి చెల్లెలివా? మాకు తెలీదులే.. సరే.. పెండ్లికూతురి చెల్లెలివయితే మాత్రం లడ్డు ఇవ్వాల్నా నీకు? శాంతక్క చూసిందంటే నన్ను తిడుతుంది. ఒక్కటే తీసుకోని పో అవతలికి! మళ్లీ ఎవరినీ పిల్చుకొనిరావద్దు” అన్నది.

నేను లడ్డు తీసుకొని బయటికి రాంగానే పకపకా నవ్వుతూ పక్కనున్న ఇంకో అవ్వతో, “పెండ్లికూతురు చెల్లెలంట! సిఫార్సు ఎట్లా చేసుకుంటుందో చూడు. భూమికి జానెడు లేదు పిల్ల..” అని, పడీ పడీ నవ్వింది అత్త. అవ్వ కూడా నవ్వుతోంది.

ఆ అత్తకు అంత నవ్వెందుకొచ్చిందో అర్థం కాలేదు నాకు!

మెల్లిగా బయటికి వచ్చి పందిట్లోకి వచ్చి లడ్డూ కొరుకుతూ వున్నాను. పందిట్లో అమర్చిన కొబ్బరాకులతో పీపీలు (బూరలు) చేస్తూ.. ఒక బిచ్చగత్తె పిల్లలకు అమ్ముతూ వుంది.

అమ్మకాలు ముగిసిపోయాయేమో చకచకా నడుస్తూ ఆమె వెళ్లిపోతూ వుంది.

“నాకూ పీపీ కావాలా.. చేసియ్యవా..” అని ఆమె వెంటపడ్డాను. ఆమె పట్టించుకోలేదు. నేను చిన్నపిల్లనని లెక్కజెయ్యలేదనుకుంటా!

నేను సందు తిరగబోతుండగా మా పెద్ద జీతగాడు పుల్లయ్య నన్ను ఆపి, “అమ్మణ్నమ్మా! లోపలికి పో.. నీకు నేను పీపీ సేసిస్తాలే.. బంగారం పెట్టుకోనున్నావు.. పద లోపలికి..” అని కసిరాడు. పిల్లలంటే అందరికీ లోకువే కదా!

నేను యేడుపు మొహంతో ఇంటి వైపు అడుగులు వేస్తుండగా ఓ పెద్ద కోతి వచ్చి నా ముందు నిలుచుకుంది.

నేను కిల్లుమని యేడుస్తూ భయంతో నిలబడి పోయాను. అది నా చేతిలోని లడ్డు లాక్కుని పందిరెక్కింది. పైగా పండ్లు బయటపెట్టి బెదిరించింది. పుల్లయ్య వచ్చి, కోతిని తరిమేసి, నన్ను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకుపోయాడు.

అమ్మ కోసం యేడ్చియేడ్చీ, అమ్మకు నా దగ్గరకు వచ్చే తీరిక లేకపోవడంతో పెద్దమ్మ ఒళ్లో పడుకుని నిద్రపోయాను. కలలో ఆ కోతి ఇంకా బెదిరిస్తూనే వుంటే.. నిద్రలోనే వెక్కిళ్లు పెడుతున్నాను. చాలాసేపటి తర్వాత..

“కోతిని చూసి భయపడినట్టుంది పిల్ల!” అని చల్లని చేతులతో నన్ను ఎత్తుకొని వెళ్లి చాపమీద పడుకోబెట్టి, చిన్న ముద్దుపెట్టి, పక్కన కూచుని జోకొడుతున్నారెవరో.

చెమటతో కొద్దిగా తడిసిన కొత్త పట్టు చీరలో చుట్టుకున్న అమ్మ వాసన, గంధం, పసుపు, కుంకుమ వాసనలతో నిండివున్న ఆ చల్లటి చేతి స్పర్శ నాకు ఎంతో తృప్తిని కలిగించింది. కోతి భయం తగ్గింది. మంచినిద్రలోకి జారుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here