అమ్మణ్ని కథలు!-12

0
11

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని తల్లో చింతచెట్టు!!?

[dropcap]ఒ[/dropcap]కరోజు మధ్యాహ్నం వరండాలో కూర్చుని నేనూ, సావిత్రీ, భాగ్యా, సుబ్బలక్ష్మీ ‘ఊపుడు చింతగింజల ఆట’ ఆడుకుంటున్నాం. ఆ రోజు యేదో సెలవురోజు అనుకుంటా. అందుకే పెద్ద గేమ్ మొదలు పెట్టినాము.

మామూలుగా మా అమ్మ సంవత్సరానికొకేసారి చాలా కిలోల చింతపండు కొంటుంది. దాంట్లో చాలా చింతగింజలు వొస్తాయి. అవన్నీ మా రకరకాల ఆటలకు ఉపయోగపడతాయి. ఈ చింతగింజలతో ఎన్నో ఆటలు ఆడుకోవొచ్చు.

వామనగుంటల ఆట అయితే ఎంతసేపు ఆడినా తనివితీరదు. పెద్దమ్మా, నేనూ, లేదా జయా, నేనూ ఆడుతూ వుంటాము.

కానీ, చిన్నపిల్లలుంటే చింతగింజలతో జాగ్రత్తగా వుండాలి. ముక్కులో, నోట్లో పెట్టేసుకుంటారు. ఓసారి మా తమ్ముడు చింతగింజను ముక్కులో పెట్టుకున్నాడు. అది ముక్కులోని తడికి తడిసిపోయి ఉబ్బిపోయింది. ముక్కులో ఇరుక్కునిపోయింది. వాడు ఒకటే యేడుపు!

అప్పుడు డాక్టరు దగ్గరికి తీసుకొనిపోయి చింతగింజను తీయించాల్సి వొచ్చింది.

ఇంకా చింతగింజలతో చాలా ఆటలాడుకుంటాను నేను.

అసలు ఆ ఊపుడు చింతగింజల ఆట ఎట్లా ఆడాలంటే.. ఓ చాటెడు చింతగింజలు కుప్పగా పోయాల. కుప్ప దగ్గరగా చేసి, కుప్ప అంచుల్లో మూడుసార్లు ఊపిరంతా బిగబట్టి ఊఫ్.. మని ఊదాల. పక్కకు విసురుకుని వొచ్చి పక్కకు పడిన చింత గింజలను, ఒక దాని కొకటి తాకకుండా జాగ్రత్తగా తీసేసుకోవాల. అప్పుడు అవి మనవి అవుతాయన్నమాట. గింజకు గింజ తాకితే ‘అవుట్’ అయినట్టు. అప్పుడు వేరే వాళ్లకు ఛాన్సు ఇవ్వాల.

అందరూ అట్లనే ఊపి గింజలను ఏరుకోవాల. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ చింతగింజలుంటే వాళ్లు గెలిచినట్టు!

ఇదంతా బాగానే వుంది గానీ, ఊపేటప్పుడు ఎలా పోయిందో యేమో గానీ.. ఒక చింతగింజ నా నోట్లోకి పోయింది. ఆ తొందరలో గబుక్కున మింగేసినాను కూడా.

ఎవరో నీళ్లు తెచ్చి యిస్తే తాగేశాను.

నా నేస్తురాళ్లు అందరూ చప్పట్లు చరుస్తూ,

“ఇంక కొన్ని రోజుల్లో నీ తల్లోనించి చింతచెట్టు మొలుస్తుందిలే! అప్పుడు మేము చింతచిగురు, చింతకాయలు అన్నీ కోసుకుంటాంలే!” అని ఏడిపించడం మొదలుపెట్టినారు.

నాకు దుఃఖం ఆగలేదు. వాంతి చేసుకోవడానికి ప్రయత్నించినాను. అయినా గింజ బయటికి రాలేదు.

‘ఇక చెట్టు మొలకెత్తడం ఖాయం’ అని అందరూ తీర్మానించేసినారు. నేను ఏడుపు మొదలుపెట్టినాను. ఆట అర్ధాంతరంగా ఆగిపోయింది.

అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయినారు.

నేను యేడుస్తూ పోయి అమ్మకు చెప్పినాను.

“ఏం కాదులే.. భయపడొద్దు.. రేపు పొద్దున బయటికొచ్చేస్తుంది..” అని పొడి పొడిగా చెప్పింది. అయినా నా దిగులు తగ్గలేదు.

నేను బెంగపడిపోయి హాల్లో చెక్క సోఫాలో పరుపు పైన పడుకున్నాను ఏడుపు మొహంతో.

మా అన్నలిద్దరూ ఇదే అదననుకొని నన్ను సతాయించడం మొదలుపెట్టినారు.

“అవునురా.. అన్నా! ఇంక కొన్నాళ్ల వరకూ మనింట్లో రోజూ చింతాకు పప్పే! మనం డబ్బు పెట్టి, జొన్నలు పోసీ చింతచిగురు కొననవసరం లేదు. అమ్మణ్ని తల్లోనించి చింతచెట్టు ఎటూ రెండ్రోజుల్లో వొస్తుంది” అంటూ చిన్నన్న యేడిపించడం మొదలుపెట్టినాడు.

“బాగా ఆలోచించుకో అమ్మణ్నీ.. నువ్వు కొంచెం ఓర్చుకొని కొన్నాళ్లు ఆపరేషన్ చేయించి చెట్టును తీయించకుండా వుంటే, చింతకాయలు కూడా ఒస్తాయి. ఈసారి చింతకాయపచ్చడికి కాయలు కొనుక్కోనక్కరలేదు.. చుట్టుపక్కల వాళ్లకు కూడా ఇవ్వొచ్చు” అంటూ పెద్దన్న వేధింపు మొదలుపెట్టినాడు.

“అది సరే గానీ అమ్మణ్నీ.. నువ్వు చింతగింజ తినే కంటే ఎట్లాగో ఓపిక చేసుకొని, ఒక చిన్న మామిడి టెంక మింగి వుంటే మంచి మామిడి కాయలు కాసేవి కదా? మంచి ఛాన్సు పోగొట్టినావు కదా అమ్మణ్నీ! ఇటువంటివి మింగేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాల. కొంచెం లాభదాయకంగా వుండేట్టు చూసుకోవాల! ఇంత తెలివైనదానివి. ఈ విషయంలో ఎట్లా బోల్తా పడితివి? ఆవకాయకు మామిడికాయలు కొనే పనే వుండేది కాదు కదా? అనవసరంగా తొందరపడితివి కదా?” మా వూళ్లోనే వుండే మా బంధువుల అబ్బాయి కిట్టూ సతాయింపు.

నాకు ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చింది. “ఏయ్.. ఆపు.. యేం మాటలు మాట్లాడుతున్నావు కిట్టూ? చింతగింజకే భయపడి ఛస్తుంటే మామిడిటెంక మింగాల్నా? నువ్వు మింగి చూపించు ముందు. తర్వాత నేను మింగుతాలే!” విసురుగా అన్నాను.. కోపంగా చూస్తూ.

తర్వాత మా అన్నావాళ్ల వైపు తిరిగి,

“నిజంగానే చెట్టు మొలుస్తుందా అన్నా? ఎవరికైనా అట్లా మొలవడం మీరు చూసినారా? నిజ్జంగా చెప్పండి. నాకు చాలా భయమేస్తుంది అన్నా.. ప్లీజ్ ..” చాలా అమాయకంగా, దీనంగా అడిగినాను నేను అన్నా వాళ్లను. నన్ను యేడిపించే ఛాన్సు దొరికితే వాళ్లు వొదులుతారా?

“ఔనురా కిట్టూ.. మీ మేనమామ కొడుకు.. వాసూ మన క్లాసే కదా! వాడు ఇట్లే దానిమ్మ విత్తనం తింటే దానిమ్మచెట్టు తల్లో నించి ఒచ్చింది కదా.. దానిమ్మ కాయలు కాశాక డాక్టరు చేత ఆపరేషన్ చేయించి తీయించేసినారు కదా? ఆ దానిమ్మకాయ గింజలు మీ ఇంట్లో నేనూ తిన్నా కదా? అసలు అంతటి తియ్యటి దానిమ్మగింజలు నేనెప్పుడూ తినలేదనుకో! అందులో వాడి తల్లో మెదడు బదులు బంకమట్టే ఎక్కువ వుందని మన లెక్కల సారు తిడుతూ వుంటాడు కదా! ఆ బంకమట్టిలో బాగా పెరిగి నట్టున్నాయి దానిమ్మకాయలు! ఆహా.. యేమి రుచిగా వుండినాయో! అమ్మణ్నీ ఈసారి ఎట్లయినా దానిమ్మ గింజలు తినాల చూడవే!” అన్నాడు పెద్దన్న .

అందరూ అట్లా మాట్లాడుతూ వుంటే నాకు యేడుపు ఆగడం లేదు.

“నువ్వే తిను దానిమ్మ గింజలూ.. జామగింజలూ.. మేం కోసు కుంటాంలే కాయలు..” యేడుపు బిగబట్టి బింకంగా అన్నాను కానీ, ఈ ఆపద నుంచి ఎట్లా బయట పడాలో తెలీలేదు.

ఏడుస్తూనే వున్నాను సోఫాలో కూచుని.

జయ నా పక్కన కూర్చొని “యేడవొద్దే అమ్మణ్నీ.. వీళ్లు తమాషా పట్టిస్తున్నారు నిన్ను. నువ్వు యేడిచే కొద్దీ వాళ్లకు కుశాలు ఎక్కువైతాయి. గింజలు తింటే తల్లో నించి చెట్టు రావడం ఎక్కడైనా చూసినావా చెప్పు? మనం సెనిక్కాయలు ఎన్నిసార్లు తినలేదూ? మరి సెనిక్కాయ చెట్లు ఒచ్చినాయా.. తలలోనించి?” అని నన్ను సముదాయిస్తోంది.

“కానీ గింజలు నమిలితినడం వేరు.. మింగడం వేరు కదే..” నా సందేహం.

“అయినా గింజ మింగినానే అనుకో.. పొట్టలోనించి చెట్టుమొలవాల గానీ, తల్లోనించి ఎట్లా మొలుస్తుందే?” అని అనుమానం వ్యక్తం చేసినాను.

“పొట్టలో నించి చెట్టు వొస్తే అది కిందికి వాలిపోతుంది. పడిపోతుంది. నిటారుగా నిలబడలేదు కదే! తల్లోనించైతే నేరుగా నిలబడుతుంది కదా.. భూమిలోనించి వొచ్చినట్టు!” అన్నది జయ చింతచెట్టు నా తలలోనించి వచ్చినట్టు ఊహిస్తూ..

“అయినా మన డాక్టరు వున్నారు కదా? వొచ్చినా ఆపరేషన్ చేసి తీసేస్తారులే.. భయపడొద్దు!”

నాకు డాక్టరు, ఆపరేషను ఈ పదాలన్నీ భయం కలిగిస్తున్నాయి.

“డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు.. నేను చచ్చిపోతానో.. యేమోనే జయా! నేను చచ్చిపోతే నువ్వు ఎవరితో ఆడుకుంటావే? నేను చచ్చిపోతే నా బొమ్మలు, నా నెమలీక, రామచిలక ఈక, ఊలుదారాలు, సినిమావాళ్ల ఫోటోలు, సినిమా పేపర్లూ, తిరపతి నించి నాయన తెచ్చిన చెక్క వంటసామానూ అన్నీ నువ్వే తీసేసుకోవే! చిన్నన్నకు ఒక్కటి కూడా ఇవ్వొద్దు.. నా కొత్త పట్టు పావడా పసుపు రంగుది.. అది కూడా నువ్వే కట్టేసుకోవే! నేనెట్లాగూ చచ్చిపోతా కదా.. సినిమా నెగెటివ్‌లు కొన్ని మాత్రం సావిత్రికివ్వు. అది మొన్ననే అడిగింది. సుబ్బలక్ష్మికి సినిమాపాటల పుస్తకాలు ఇవ్వు.. దానికి సినిమాపాటలు నేర్చుకోవడం అంటే ఇష్టం కదా..” అని ఏడుస్తూ నా ఆస్తి పంపకాలు కూడా చేసేశాను.

“అమ్మో! అమ్మణ్ని తన ఆస్తిని మొత్తం జయకు, తన స్నేహితురాళ్లకూ రాసిచ్చేస్తున్నది చూడండే పాపం! అంత భయపడొద్దే అమ్మణ్నీ! నీకేం కాదు లేవే! మల్లికార్జునరావు డాక్టరు చిన్న ఆపరేషను చేస్తాడంతే. నొప్పి కూడా అంత వుండదులే. రెండ్రోజుల్లో నొప్పి తగ్గిపోతుందిలే!” ఓదార్చింది మూడో అక్క గుంభనంగా నవ్వుతూ.

దిండులో మొహం దాచుకొని వలవలా యేడ్చినాను, ఆపరేషన్ భయంతో. క్షణక్షణానికీ దిగులు వామనావతారంలాగా పెరిగిపోతున్నది.

ఇంతలో నాయన వొచ్చినారు కళ్లం నించి.

బయట అన్నావాళ్లు విషయం చెప్పినట్టున్నారు.. ముసిముసిగా నవ్వుతూ..

“చింతచెట్టు మొలుస్తుందని అంత భయపడడమెందుకే అమ్మణ్నీ.. చింతకాయలు కోసుకోవచ్చని సంతోషించాల గానీ..” అన్నారు నాయన.

“నాయనా.. నాకు ఆపరేషన్ చేసి చెట్టు తీసేస్తారంట. ఆపరేషన్‌లో నాకేమైనా అవుతుందేమో.. నేను చచ్చిపోతానేమో.. అప్పుడెట్లా?” అన్నాను కళ్లు తుడుచుకుంటూ.

“మన మల్లికార్జునరావు డాక్టరు నొప్పి లేకుండా ఆపరేషన్ చేస్తాడులే.. నొప్పి ఎక్కువేమీ వుండదు. నీకేమీ కాదు. నేనున్నా కదా! “ అన్నారు నాయన నా తల నిమురుతూ. లోలోపల నవ్వుకుంటున్నారు.

“నేను మల్లికార్జునరావు దగ్గర ఆపరేషన్ చేయించుకోను. దాక్షాయని డాక్టర్ దగ్గర చేయించుకుంటా నాయనా..” అన్నాను.

“ఆమె అయితే ఇంకా మంచిది. పైసా ఖర్చు లేకుండా గవర్నమెంటాసుపత్రిలో చేసేస్తుందిలే!” అని సముదాయించినారు నాయన.. ఓరగా అన్నావాళ్లను చూసి నవ్వుతూ.

ఇంతలో యశోదత్త వొచ్చింది అమ్మతో యేదో మాట్లాడాలని.

“అమ్మణ్నీ.. నన్ను మర్చిపోవద్దే! అసలే మీ మామకు చింతాకు పప్పు అంటే మహా ప్రాణం! నాలుగు రోజులు ఓర్చుకున్నావనుకో.. కాలంగాని కాలంలో మేమంతా చింతాకుపప్పు తిన్నాక ఆపరేషన్ చేయించుకుందువులే!” అన్నది యశోదత్త. అది ఓదార్చడమో, యేడిపించడమో అర్థం కాలేదు నాకు.

ఆ చీకటివేళ అప్పుడే ముహూర్తం కుదిరినట్టు చాకలమ్మ ఓబులమ్మ ఇస్త్రీ బట్టలు తీసుకొని వొచ్చి, మూట దించి, యశోదత్త మాటలు వినింది.

ఆమెనడిగి పూర్తి వివరాలు తెలుసుకొని, పకపకా నవ్వుతూ.. “అమ్మణ్నమ్మా.. నన్ను మరిచి పోయేవు! చింతకాయ తొక్కంటే మహా పానం నాకు! నేను చింతకాయలు కోసుకునేవరకూ ఆపరేషన్ చేయించుకోవాకు!” అని నా సోఫా దగ్గరికి వొచ్చి ఒకటే నవ్వుతున్నది.

నాకు ఒళ్లు మండిపోయింది. కానీ ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకున్నాను కదా.. యేమీ అనలేక కోపంగా మిర్రిమిర్రి చూసినాను.

నాలో దిగులు హిమాలయా పర్వతంలాగా పెరిగిపోతున్నది.

ఇంతలో రాత్రి క్లినిక్ నించి ఇంటికెళ్లే ముందు తాతను ఒకసారి చూసిపోదామని ఒచ్చినారు మల్లికార్జునరావు డాక్టరు గారు. తాతకు ఎప్పుడూ యేదో ఒక ఆరోగ్య సమస్య వుంటుంది. అందుకే తరచుగా డాక్టరుగారు వొస్తుంటారు.

ఆయన మేడ మీద గదిలో తాత దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు.

నేను ఏదో ఒకటి తేల్చుకోవాలని పట్టుదలతో డాక్టరుతో మాట్లాడుతానని చెప్పినాను జయతో.

కానీ, చాలా సిగ్గుగా, సంకోచంగా, అవమానంగా వుంది.

జయ నా చేయి పట్టుకొని “నేను డాక్టరుతో మాట్లాడుతాలే.. పద..” అని మిద్దె పైకి నన్ను లాక్కుపోయింది.

డాక్టరు ముందుకు వొచ్చి నిలుచుకుంది జయ.

దాని వెనుక నేను నిలుచుకున్నాను అపరాధి లాగా.

మా అన్నావాళ్లు నా వెనక నిలుచుకొని ఆయనకు సైగలు చేస్తున్నారు.

మా పెద్దన్న ఆయన పక్కకు పోయి చెవిలో రహస్యంగా యేదో చెప్పినాడు. సరేనన్నట్టు తల ఊపినాడు డాక్టరు కొంటెగా నవ్వుతూ.

“ఏంది కత?” అన్నాడాయన జయతో.

“ఏమి లేదు సార్! మా అమ్మణ్ని పొరబాటున చింతగింజ మింగింది. తన తల్లో నించి చింతచెట్టు మొలుస్తుందని మా అన్నావాళ్లు అంటున్నారు. మీరు ఆపరేషన్ చేసి తీసేస్తారంట కదా? ఆపరేషన్‌లో తనకేమైనా అవుతుందేమోనని భయపడుతూ వుంది..” అన్నది జయ దిగులుగా నాకేసి చూస్తూ. నేను దీనంగా ఆయన వైపు చూస్తున్నాను.

ఆయన నా వైపు తిరిగి,

“అది చాలా మామూలు ఆపరేషనేలే అమ్మణ్నీ! నీకేం కాకుండా చూస్తాలే! చాలామందికి దానిమ్మచెట్లూ, జామచెట్లూ మొలుస్తుంటాయి. అది మామూలే! ఎంత అదృష్టం కదా? నీ తల్లో చింతచెట్టు మొలవడం! నాకు కొంచెం చింత చిగురు పంపించు మరి! చింతాకుపప్పు అంటే నాకు చాలా ఇష్టం!” అన్నాడు ఆయన కొంటెగా నవ్వుతూ. అన్నావాళ్లంతా పకపకా నవ్వులు.

మా తాతగారు నా వీపు నిమిరి, “భయపడవాకు.. ఉట్టుట్టిదిలే!” అన్నారు.. నాలుక బయటపెట్టి. కానీ, నా మనసులో గుబులు పెరిగిపోతూనే వుంది.

నేను భయం భయంగా తలవొంచుకుని కిందికి దిగి వొచ్చినాను. అన్నావాళ్లతో చేరి డాక్టరు గారు కూడా నవ్వడం వినిపిస్తోంది.

ఇదంతా ఉట్టిదేనని అనిపిస్తోంది. కానీ, నిజమేమోనని కూడా అనిపిస్తున్నది.

రాత్రంతా కలత నిద్రే! మాటిమాటికి తలమీద చెయ్యి పెట్టుకొని చూసుకుంటున్నాను..

చింతమొలక వొచ్చిందేమోనని!

మరుసటి రోజు ఈ సాకుతో బడి ఎగ్గొట్టేసినాను.

చెక్క సోఫా మీదే దిగులుపడుతూ పడుకున్నాను. మధ్యాహ్నం పెద్దమ్మ నా దగ్గర కూచుని, అదంతా నిజం కాదని, మొక్కేమీ మొలవదనీ చెప్పింది. అయినా అప్పటికి నిజమేననిపిస్తున్నా.. మనసులో పెనుభూతం వంటి అనుమానం ఆవరించేస్తూ వుంది.

అమ్మ మధ్యాహ్నం దాకా నాపైన తన సానుభూతిని నిలబెట్టుకుంది. ఇక ఓర్చుకోలేక సాయంత్రం నించీ మామూలుగా నేను చేయాల్సిన పనులన్నీ చేయించింది.. నిర్దాక్షిణ్యంగా. అమ్మలకు కొంచెమయినా దయా దాక్షిణ్యం ఉండదెందుకో?

తల్లోనించి చింతచెట్టు రావడం.. అదంతా ఉట్టుట్టిదేమోనని ఓ వైపు అనిపిస్తున్నా.. యేమో.. నిజంగా వస్తుందేమోనన్న సందేహం నన్ను వెంటాడుతూనే వుంది. అట్లా భయపడుతూనే రెండ్రోజులు గడిపేశాను.

రెండ్రోజులయినా నా తల మీద చింత మొలకా రాలేదు.. యేమీ రాలేదు.. నేను అప్పుడప్పుడూ దిగులు పడుతూవున్నా.. మామూలూగానే ఆడుతూ పాడుతూ మరో రెండురోజులు గడిపేశాను.

అన్నావాళ్లు అట్లా నన్ను కావాలని ఏడిపించినారని అప్పుడు అర్థమైంది.

వాళ్లిద్దరినీ ఎక్కడ దొరికితే అక్కడ, ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకొని కొట్టినాను. కిట్టూను కూడా బాగా కొట్టినాను. నా చేతులు పట్టుకొని దెబ్బలు తప్పించుకున్నాడు.

“చింతాకు కావాల్నా నీకు? చింతకాయలు కావాల్నా నీకు? నీవు తిను జామగింజలు.. మేం కోసుకుంటాంలే జామకాయలు!” అని బాగా తిట్టినాను. తప్పించుకుని పారిపోయినాడు కిట్టూ.

“మేము చెప్పింది నిజమేనే అమ్మణ్నీ! మామూలు వాళ్లకైతే చెట్టు మొలిచేదే! నీకు మొండి ఎక్కువ కదా! అందుకే చింతగింజను కూడా హరాయించే సుకున్నావన్నమాట! గట్టిదానివే అమ్మణ్నీ నువ్వు!

కానీ, చింతాకు పప్పు మిస్ అయిపోయాం. పాపం.. డాక్టరు కూడా చింతాకు పప్పు మీద ఆశపెట్టుకున్నాడు. యశోదత్త కూడా పాపం.. చింతాకుపప్పు చేసుకుందామనుకుంది. ఓబులమ్మ చింతకాయపచ్చడి చేసుకుందామనుకుంది. ప్చ్.. యేం చేస్తాం? మంచి ఛాన్స్ మిస్ చేసినావు. ఈసారి పెద్ద చింతగింజ చూసుకోని మింగవే అమ్మణ్నీ!” అని నవ్వుతున్నాడు పెద్దన్న.

మీదపడి గోళ్లతో గట్టిగా గిల్లాను.. నా కోపం చల్లారేటట్టుగా..

“హా.. హా.. హా.. అంత కోపమా? తాళు.. తాళు..(ఆగు) శాంతం.. శాంతం..” అన్నది అమ్మ.

అప్పుడు శాంతించినాను. ఎందుకంటే ఆవేశం మరీ ఎక్కువైతే నాపైనున్న సానుభూతి పోయి ఎదురు నాకే తిట్లు పడతాయనే భయంతో.

ఆ సానుభూతిని ఇంకా ఒకటి రెండు రోజులు డాలు లాగా వుపయోగించుకొని అమ్మ తిట్లనుంచి తప్పించుకోవాలని నిశ్చయించుకున్నాను మరి!

చింతచెట్టు మొలుస్తుందనే భయం లేకుండా ఆరోజు నిశ్చింతగా నిద్రపోయినాను.. చాలా రోజుల తర్వాత. అయినా నాకు తెలీకుండానే అప్పుడప్పుడూ తలమీదికి నా చెయ్యి పోతూనే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here