అమ్మణ్ని కథలు!-16

1
10

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మమ్మ ఇంట్లో అమ్మణ్ని నిర్వాకం!!?😢😀🤔

[dropcap]ప్ర[/dropcap]తి ఎండాకాలంలోనూ మా అమ్మమ్మా వాళ్ల ఊరికి.. గుత్తికి వెళ్లడం అలవాటు మాకు. ఎందుకంటే అక్కడికి మా ఏడుగురు మేనమామలూ, అత్తలూ, వాళ్ల పిల్లలూ, మా పిన్నమ్మ, ఆమె కుటుంబం వొచ్చేవాళ్లు, ఎండాకాలం సెలవులు గడపడానికి.

పిల్లా పెద్దా అంతా కలిసి ఓ అరవై మందికి పైగా అయ్యేవారు.. నిజంగా..!

అమ్మ వొచ్చి మూడురోజులు వుండి, మమ్మల్ని వొదిలేసి తాను వెళ్లిపోయేది.

నూరు నియమాలు, వెయ్యి నిబంధనలూ, లక్ష జాగ్రత్తలూ చెప్పి వెళ్లేది.

మేము ఆ ఊరికి పోయేటప్పుడు ఇంట్లో పండిన సెనక్కాయలు లాంటివి, పెద్ద క్యారేజీ నిండా నెయ్యీ, మరో పెద్దక్యారేజీ నిండా పాలూ తోడు పెట్టి తీసికెళ్లేవాళ్లం. మేం వెళ్లిన తర్వాత ఒక రెండు రోజులు వాళ్లంతా పెరుగుతో తృప్తిగా తినేవారు.

దారిలో బనగానపల్లె అనే వూరు వొస్తుంది. అది మా ఊరికి చాలా దగ్గర. అక్కడ మంచి బేనీషాన్ (బంగినపల్లి) మామిడిపండ్లు దొరుకుతాయి.

అసలు బేనీషాన్ అనే రకం మామిడిపండ్లు ఆ వూరి రైతులు మొదట పండించారు. ఏవో రెండు మూడు రకాల మామిడిపండ్ల చెట్లను అంటుకట్టి ఆ కొత్త వంగడాన్ని సృష్టించారట అక్కడి రైతులు.

ఆ ఊరి పేరు మీదే ఆ పండ్లకు ‘బనగానపల్లి మామిడిపండ్లు’ అని పేరు వొచ్చింది. అదే వ్యవహారంలో ‘బంగినపల్లి’గా మారింది.

కానీ, అక్కడ మాత్రం వాటిని బేనీషాన్ మామిడిపండ్లు అనే అంటారు. అది బే-నిషాన్.. అంటే సాటిలేనివని అర్థం అనుకుంటా. బనగానపల్లి అంతా నవాబు పాలనలో వుండేది. అందుకే ఉర్దూ పేరు పెట్టినారు.

అసలే బేనీషాలు తియ్యగా, మంచి సువాసనతో వుంటాయి. అక్కడి నవాబు వాటిని తేనెలో ఊరబెట్టుకుని తినేవాడట! వెగటు పుట్టలేదేమో ఆయనకు! నాకైతే తలుచుకుంటేనే విసుగ్గా వుంది.

అమ్మ బనగానపల్లెలో దండిగా బేనీషాన్ పండ్లు కొనేది. మేము పెద్ద లగేజీతో గుత్తికి పోయేవాళ్లం.

అమ్మ తన బట్టలు, ఇంకా తమ్ముళ్లవి పెద్ద ట్రంకుపెట్టెలో పెట్టేది.

మేం ఎంతమంది వెళ్తే అన్ని చిన్న ట్రంకుపెట్టెలు తీసుకెళ్లేవాళ్లం. ఒక్కోదానికీ చిన్న బీగం (తాళం) వేసుకోవాలి. ఆ బీగం చెవి ఒక పిన్నీసుకు పెట్టుకోని మెళ్లో దండకు తగిలించుకొని, ఎప్పుడూ చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోవడం ఒక పెద్ద బాధ్యత!

అందరి దుప్పట్లు, బెడ్ షీట్లు కలిపి, ఓ పెద్ద బెడ్డింగ్ చుట్టేవారు. ఇట్లా పెద్ద హంగామాతో బయల్దేరేది అమ్మ.

జీతగాళ్లు వొచ్చి సామాను బస్సు మీదికి ఎక్కించేవారు. మా నాయన ఒక్కోసారి మాతోటి వొచ్చేవారు. లేదంటే అమ్మా, మేమూ వెళ్లేవాళ్లం. మా అమ్మ ప్రయాణం అంటే తెగ టెన్షను పడిపోయేది.

ఏమంటే ఒంటి నిండా నగలు, చెవులకు రవ్వల కమ్మలు, ముక్కుకు పెద్ద పెద్ద రవ్వల ముక్కు పుడకలూ వున్నాయని భయం!

ఆ కాలంలో వూరి ప్రయాణానికి కూడా పెళ్లికి పోయినట్టు తయారయ్యే వాళ్లు అమ్మావాళ్లు.

ప్రయాణమంటే మంచి చీర.. వీలైతే కొత్త చీర కట్టుకోని, కొప్పునిండా పూలు పెట్టుకోని, ఒంటినిండా నగలు పెట్టుకోవాల. అది అప్పటి ఫాషన్ అనుకుంటా! అందునా పెద్దింటి కోడళ్లకు ఆర్భాటాలు ఎక్కువ!

ఆ కాలంలో బొగ్గు బస్సులు! డెబ్భయ్ ఎనభై మైళ్ల దూరానికి అయిదారు గంటలు తీసుకునేవి. ప్రతీ వూళ్లోను ఆగడమే! పెళ్లివారి బస్సులాగా ఆగుతూ ఆగుతూ సాగేవి ఆ బస్సులు!

మధ్యలో ప్యాపిలి అనే ఊళ్లో ఓ గంట సేపు ఆపేసేవారు బస్సును.. భోజనాల కోసం. అక్కడ బస్టాండులో ఓ చెట్టు కింద అరుగు వుండేది. అక్కడ అమ్మ కూచుని, తను కలిపి తెచ్చిన పెరుగన్నం ముద్దలుగా చేసి మా అందరి చేతుల్లో పెట్టేది.

అమ్మ యేమి తినేదో నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. నా కడుపు నిండితే నాకు చాలు.. అంతే! ఆటలు మొదలు! అయినా అమ్మ నన్ను చూసుకోవాలి గానీ, అమ్మను నేను చూసుకోవాల్సిన అవసరం లేదన్న భావమేమో మరి!

అక్కడే వుండే బోరింగుపంపులో నీళ్లు కొట్టుకుని తాగేవాళ్లం. అమ్మ ఆ నీళ్లతోటి మరచెంబు నింపి పెట్టుకునేది. ఆ కాలంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేవాళ్లం. ఏమీ తేడా చేసేది కాదు.

తిరిగి బస్సెక్కి ఎప్పటికో అమ్మమ్మా వాళ్ల ఊరు చేరేవాళ్లం.

మా తాతలిద్దరిలో ఎవరికైనా తెలిసిన బస్సువాళ్లయితే మా తాతా వాళ్ల ఇంటి దగ్గర దింపేవాళ్లు. (అప్పట్లో అన్నీ ప్రైవేటు బస్సులే.. ఏవో ఒక కేసుల్లో ఇరుక్కుని, లాయర్లతో పనిబడి వుంటారు వాళ్లు).

లేకపోతే బస్టాండు దగ్గర దిగేవాళ్లం. మళ్లీ జట్కాబండిలో ఇంటికి చేరేవాళ్లం.

ఆ వూళ్లో జట్కాబండిని ‘జెట్’ అనేవారు. అదో స్టయిలనుకుంటా! పోనీలెండి.. జట్కా బండిని జెట్‌గా భావించి వాళ్లు సంతృప్తి పడితే.. మనకు పోయేదేముంది?

ప్రయాణంలో అలసి సొలసి వొచ్చిన మమ్మల్ని మా అవ్వా తాతా, మామలూ, అత్తలూ, వాళ్ల పిల్లలూ ఎంతో ఆదరంగా చూసేవారు. కాఫీలూ, టిఫిన్లూ అయ్యాక అంతమంది కజిన్సుతో కబుర్లే కబుర్లు! ఆటలే ఆటలు! పాటలే పాటలు! తిరుగుళ్లే.. తిరుగుళ్లు! పైకీ కిందికీ పరుగులే పరుగులు! లంకంత ఇల్లు కాబట్టి అంతమంది వున్నా సరిపోయేది!

మా అమ్మ, సున్నం గూడు దగ్గర కూర్చోని, వాళ్ల అమ్మ దగ్గర కష్టం సుఖం చెప్పుకుంటుండేది.

ఏవో గుసగుసలు చెప్పుకునేవాళ్లు ఆ తల్లీకూతుళ్లు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినాలనిపించేది నాకు. కానీ, వినబడనిచ్చేవారు కాదు ఆ అమ్మాబిడ్డలు!

అమ్మ అంత తీరికగా వుండటం నేను అక్కడే చూశాను. మా ఊళ్లో అయితే అమ్మ కంటే బొంగరమే కాస్త నయం!

పాపం.. పుట్టింట్లోనే అమ్మకు కాస్త విశ్రాంతి.

మేము అమ్మ దగ్గరికొచ్చి ఒళ్లో పడుకోబోతే మా అమ్మమ్మకు ఛర్రున కోపం వొచ్చేది.

“దాన్ని ఇక్కడైనా సుఖంగా బతకనీయండే! దాన్ని చంపుకొని తింటున్నారు..” అనేది.. భూతద్దాల వంటి కళ్లద్దాలలో నుంచి కోపంగా చూస్తూ.

అక్కడికి కష్టాలన్నీ మా వల్లే మా అమ్మకు వొచ్చినట్టు ఆమె మాట్లాడితే నాకు కూడా చాలా కోపం వొచ్చేది.

‘మా అమ్మా.. మా ఇష్టం.. అమ్మ ఒళ్లో పడుకోకపోతే ఎవరి ఒళ్లో పడుకుంటామట?’ అని విసుక్కునేదాన్ని.. అయితే మనసులోనే సుమండీ! పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడితే ఇంకేమైనా వుందా? వీపు విమానం మోత మోగిపోదూ?

అమ్మ మూడు రోజులుండి వెళ్లిపోయింది మా ఊరికి. అమ్మకు అన్ని రోజులకే నాయన అనుమతి వుండేది. పాడీపంటా, పిల్లాపీచూ, పూజా పునస్కారాలూ, పెద్దవారైన మా తాతగారూ ఇందరి బాధ్యత మోయాలి ఆవిడ!

నేను, మా చిన్నన్న మాత్రం అక్కడ వుండిపోయాము.

అక్కడ ఇంటి వెనుక వైపు వుండే బావిలో నీళ్లు తెచ్చుకోవడం, స్నానాలగదిలో తొట్లలో పోయడం చాలా సరదాగా వుండేది. స్నానాలగది బయటే ఒక తూము వుండేది. అందులో బిందె గుమ్మరిస్తే లోపల తొట్టిలో పడేవి. అట్లా పోయడం భలే తమాషాగా వుండేది.

ఎన్ని పోసినా నిముషాల మీద ఖర్చయిపోయేవి.

మధ్యాహ్నం ఒక నీళ్లు పోసే అతను వొచ్చి పాపం.. ఒక్కడే తొట్టి, గంగాళాలూ నింపి పోయేవాడు.

మళ్లీ సాయంత్రం బిందెలతో మేము తయారయ్యేవాళ్లం!

మా మేనమామల కొడుకులు, కూతుళ్లు కొందరు నా కంటే చాలా పెద్దవాళ్లు, నా వయసువాళ్లు, నాకంటే చిన్నవాళ్లు రకరకాల వయసుల వాళ్లతో తమాషాగా మాట్లాడుతూ, నీళ్లు తోడడం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం!

మా తాతగారిల్లు కోర్టు కాంపౌండును ఆనుకొని వుండేది.

మా ఈ తాతగారు కూడా లాయరు కావడం వల్ల అలా కోర్టు దగ్గరగా ఇల్లు కట్టుకున్నారు.

కోర్టు ఆవరణలో ఒక క్యాంటీన్ వుండేది. అక్కడ పొద్దున్నే టిఫిన్ దొరికేది. అందరం గ్రూపులు గ్రూపులుగా ఒకరికి తెలీకుండా ఒకరం పోయి అక్కడ టిఫిన్లు కొనుక్కొని, అక్కడ చెట్ల కిందా, ఇళ్ల చాటునా తినేవాళ్లం!

కొందరు పెద్దపిల్లలు “అవ్వకు చెప్తాంలే! ఇంట్లో చెప్పకుండా హోటల్ టిఫిన్లు తింటున్నావా?” అని మా లాంటి చిన్నపిల్లలను బ్లాక్‌మెయిల్ చేసి, మా చేత “చెప్పొద్దూ.. చెప్పొద్దూ.. ప్లీజ్” అని బతిమిలాడించుకునేవారు. అప్పటినించీ వాళ్లు చెప్పిన పనులన్నీ చెయ్యాల. లేకపోతే “చెప్పమంటావా.. అవ్వకు?” అని బెదిరింపులు!

పెద్ద పూరీలు రెండూ, సమృద్ధిగా కూరా రెండణాలకు, అంటే పన్నెండు పైసలకు, ఇడ్లీ, చట్నీ పది పైసలకు ఇచ్చేవాళ్లు.

మా అవ్వాతాతలకు ఈ విషయం తెలీకుండా జాగ్రత్త పడేవాళ్లం. అంతవరకూ మాకు హోటల్ టిఫిన్లు తెలీవు.

అక్కడే హోటల్ టిఫిన్లు తినడం!

అక్కడ ఆటలూ, పాటలూ, టిఫిన్లూ, భోజనాలూ అన్నీ బాగుండేవి గానీ, నీళ్లపాలు.. నీళ్ల మజ్జిగతో నాకు కళ్లనీళ్ల పర్యంతం అయ్యేది. పాలు ఇచ్చేవాళ్లు కాదు.. కాఫీ కూడా నీళ్లగా.. యేమీ బాగుండేది కాదు.

దానికితోడు నెయ్యిలో యెట్లా కలిసిందో ఏమో గానీ కిరసనాయిలు కలిసినట్టుంది. పెద్ద డబ్బాడు నెయ్యిని పారేసుకోలేక అట్లాగే వాడుకునేవారు.

ఆ వాసనకు నాకు ఆ నెయ్యి వేసుకోవాలంటే యేడుపొచ్చేది.

ఇంక తట్టుకోలేక త్వరగా మా వూరికెళ్లి పోవాలని నిశ్చయించుకుని ఓ రోజు మా అమ్మమ్మ దగ్గర కూచుని,

“మేము ఊరికెళ్తామవ్వా.. మమ్మల్ని త్వరగా పంపించండి.. మేము వొచ్చి కూడా చాలా రోజులైంది కదా..” అని పెద్దపేరక్క మాదిరి చెప్పినాను.

“పోదువులేవే.. ఏమంత తొందర? ఇక్కడేమన్నా ముళ్లు దా గుచ్చుకుంటున్నాయా? బోడిగుర్రాలు దా యేమన్నా తరుముతున్నాయా? లేదా పాతగోడలేమన్నా పడగొట్ట మన్నారా నిన్నూ? హాయిగా అందరితో ఆడుకో. తొందరేముందీ.. పోదువులే.. అప్పుడే మీ నాయన మీదా.. తాత మీదా గాలి మళ్లిందా?” అని నా మాట కొట్టిపడేసింది అమ్మమ్మ కొంత అరవయాసలో రుసరుసలాడుతూ. మాట్లాడేటప్పుడు చిత్రంగా కదులుతున్న రవ్వల ముక్కుపొడకలను ఆసక్తిగా చూస్తున్న నేను అవ్వ మాటలకు హతాశురాలిని అయ్యాను.

ఇంక ఇట్లా కాదని, అటునుంచి నరుక్కొద్దామని వెంటనే ఒక పోస్టుకార్డు తీసుకుని, మా అమ్మకు జాబు రాశాను. (అమ్మ మేము వొచ్చేటప్పుడే రెండు పోస్టుకార్డులు అడ్రసు రాసి మా పెట్టెలో పెట్టి వుంచుతుంది.)

“చి. సౌ. అమ్మకు, అమ్మణ్ని చేయు ఆశీర్వచనములు!

నాకిక్కడ బాగానే వుంది. అందరితో బాగా ఆడుకుంటున్నాను. కానీ, ఇక్కడ నీళ్ల కాఫీ తాగబుద్ధి కావడం లేదు. నీళ్ల మజ్జిగతో అన్నం తినలేక పోతూ వున్నాను. నెయ్యి కూడా కిరసనాయిలు వాసనొస్తుంది. నేనిక్కడ వుండలేను. నన్ను త్వరగా ఊరికి పంపమని తాత గారికి జాబు రాయి. ప్లీజ్.. నేను అక్కడికి వొచ్చేస్తాను. తాతను, నాయనను, పెద్దమ్మను, అందరినీ చూడాలని వుంది.

ఇట్లు

అమ్మణ్ని

అని రాసినాను.

రాసిందాన్ని పోస్టులో వేసినా బాగుండేది. లేదా నా పెట్టెలో పెట్టుకున్నా సరిపోయేది.

ఎవరో ఆటకు పిలిస్తే మేడ మీద చెక్కమంచం మీద పెట్టిన పరుపు చుట్టల మధ్యలో పెట్టి, ‘తర్వాత వొచ్చి తీసుకుందాంలే’ అని దాని సంగతే మరిచిపోయినాను.

ఆ రోజు రాత్రి పరుపులు నేల మీద పరుచుకుంటున్న మా మామ ఒకాయన చేతిలో పడింది ఆ జాబు.

ఆయన దాన్ని కింద హాల్లోకి తెచ్చి పకపకా నవ్వుతూ అందరికీ చదివి వినిపించినారు ఆ ఉత్తరాన్ని. అందరూ అందులోని విషయాలను తలుచుకొని తలుచుకొని నవ్వడమే! ఆ పెద్ద హాలు నవ్వులతో మారుమోగిపోయింది. నవ్వకుండా బిక్కమొహం వేసుక్కూర్చున్న దాన్ని నేనొక్కదాన్నే!

‘అమ్మకు ఆశీర్వచనములు..’ అని రాయకూడదట. నమస్కారాలు చెప్పాలట!

‘చిరంజీవి’ అని పెద్దవాళ్లను అనకూడదట! నాకేం తెలుసూ? నేనెప్పుడైనా జాబు రాసి వుంటే కదా?

అవ్వ మా అమ్మకు జాబు రాస్తే అట్లనే రాస్తుంది కదా..  ‘చి. సౌ. శాంతకు.. ఆశీర్వచనములు!’ అని.

నేను కూడా అట్లాగే రాయాలేమో నుకున్నాను. అదొక పేద్ద జోకుగా మారింది.

అందరూ వొచ్చి నా బుగ్గలు పుణికి.. “అయ్యో! ఇంత కష్టపడు తున్నావేమే అమ్మణ్నీ మా ఇంట్లో.. నీళ్ల కాఫీ తాగలేక, నీళ్ల మజ్జిగ వేసుకోలేకా.. పాపం ఎన్ని బాధలు పడుతుందర్రా పిచ్చిపిల్ల? అవునే.. మీ తాతను అడిగి ఒక బర్రెను కూడా తెచ్చుకోక పోయినావా నీ తోటి? దానికి కూడా టికెట్ కొంటే బస్సు డ్రైవర్ దాన్ని కూడా ఎట్లో బస్సులో ఎక్కించుకునే వాడు కదా? పాపం ఎన్ని కష్టాలే నీకు? పెరుగు లేదు.. పాలు లేవు.. నెయ్యి లేదు.. ఇప్పట్నించీ అమ్మణ్నికి కొంచెం మంచి కాఫీ ఇవ్వండప్పా! లేకపోతే ఈసారి వాళ్ల తాతకు జాబు రాస్తుందేమో! దానికి కొంచెం పెరుగు కూడా పక్కన పెట్టండి!” అని ఒక్కొక్క మామ ఒక్కో రకంగా ఏడిపించినారు.

మా మేనమామల పిల్లలు, పిన్నమ్మ పిల్లలూ అందరూ నన్ను ఆటపట్టించేవాళ్లే!

“పాపం! బిడ్డ! అక్కడ చిక్కటిపాలు, పెరుగు, నెయ్యికి అలవాటు పడిందీ.. ఇక్కడ నీళ్లమజ్జిగ వేసుకోవాలంటే కష్టమే కదా దానికి? నాకర్థమైంది లేవే నీ బాధ!” అని నన్ను దగ్గరికి తీసుకుంది ఒక అత్త.

అప్పుడు చూడాలీ ..నా మొహం.. ఆముదం తాగినట్టయి పోయింది. నవ్వలేకా.. యేడవలేకా.. అవుననలేకా.. కాదన లేకా.. మొహం ఎక్కడ దాచుకోవాలో తెలీక అవస్థపడ్డాను. లవకుశ సినిమాలో చివరి సీనులో సీతమ్మవారు భూమిలోకి వెళ్లిపోయినట్టు.. నేను కూడా వెళ్లిపోతే బాగుండు ననిపించింది. ఆ జాబును పోస్టు చెయ్యకుండా ఎక్కడో వొదిలేసినందుకు నన్ను నేను ఎన్ని వందల సార్లు తిట్టుకున్నానో! నా బుద్ధితక్కువకు ఎన్నిసార్లు తలకొట్టుకున్నానో!

మావూరికొచ్చిన తర్వాత మా చిన్నన్న అక్కడ జరిగిన విషయాన్ని చిలవలు పలవలూ చేసి అందరికీ చెప్పడమే!

దాంతో అందరూ నా మీద జోకులు వేసి నవ్వడమే!

“జాబు రాస్తే రాసినావు గానీ, పోస్టులో పడేయకుండా పరుపు చుట్టల్లో ఎందుకు పెట్టినావే అమ్మణ్నీ? నీ తెలివి దొంగలు తోలా!” అని మా పెద్దమ్మ పకపకా ఒకటే నవ్వు!

అపరాధిలాగా మొహం పెట్టి కక్కలేకా మింగలేకా, నా తెలివితక్కువ తనాన్ని అందరూ ఎత్తిచూపుతుంటే అందరి హాస్యాలూ భరించినాను మరి! అంతకంటే ఏం చెయ్యగలను గనుక!

పైగా అమ్మ విసుర్లు ఒకటి! ఆమెకు తన పుట్టింట్లో నా వల్ల యేదో అవమానం జరిగిపోయినట్టు బాధపడింది.

అమ్మకు కోపం వొస్తే పని వేగం మరింత ఎక్కువ అవుతుంది. విసవిసా అటూ ఇటూ తిరుగుతూ.. అప్పుడే కళ్లం నుంచి వొచ్చిన నాయనను ఉద్దేశిస్తూ..

“నాకు అందుకే ఈ అమ్మణ్నిని ఎక్కడికైనా పంపాలంటే భయం! పొయ్యిలో పెడితే పొంతకుండలో నించి బయటికి వొస్తుంది! మహా మాంతమైనది! శుద్ధ అధికప్రసంగి! అనవసరమైన పెత్తనాలు చేస్తుంది. పదిరోజులు పాలు, పెరుగూ లేకపోతే.. ఓర్చుకోలేక జాబులు రాయడమొకటి! జాబులలో యేమి రాయొచ్చో, ఏమి రాయకూడదో తెలీదు.. పైగా పదేళ్లొస్తున్నాయి నెత్తిమీదికి! వాళ్లు యేమనుకున్నారో? యేమో?..” ఇలా సాగుతున్న అమ్మ గొణుగుడు వినలేక ఆడుకునేందుకు పరుగో.. పరుగు!

పరిగెత్తి వెళ్లిపోయి అమ్మ చీవాట్లు తప్పించుకుందామనుకున్న నా వైపు  సానుభూతిగా చూసినారు మా నాయన! ఇప్పుడు తప్పించుకున్నా అమ్మ అంత త్వరగా వదలదులే.. అన్న భావమేమో అది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here