అమ్మణ్ని కథలు!-21

0
16

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని ఆపద్ధర్మ భక్తి!

[dropcap]నా[/dropcap]కు పరీక్షలు దగ్గరికొస్తున్నా యంటే చాలు, ఎక్కడ లేని దైవభక్తీ ముంచుకొచ్చేస్తుంది! అప్పుడే దేవతలందరూ గుర్తుకొస్తుంటారు. దేవుడి మందిరం దగ్గరికెళ్లి పదేపదే మొక్కుకుంటుంటాను. తులసెమ్మ అరుగు మీద ముగ్గు వేస్తూ వరాలు కోరుకుంటూ వుంటాను.

“అమ్మణ్నికి భక్తి ఎక్కువైందంటే దానికి పరీక్షలు దగ్గరి కొస్తున్నా యన్నమాట!” అని వెక్కిరించేవాళ్లు మా అక్కావాళ్లు.

“నా దేవుడూ, నా భక్తీ, నా పరీక్షలూ, నా ఇష్టం! మీకేం కష్టం?” అనేదాన్ని.

అప్పుడే శివాలయమూ, ఆంజనేయుల గుడీ గుర్తొస్తాయి నాకు.

దేవుళ్లకు ప్రదక్షిణాలు చేసి, పరీక్ష పాసైతే టెంకాయ కొడతానని దేవుడికి ఆశపెట్టేదాన్ని.

‘నా మొక్కులకు ఆశపడైనా దేవుడు నా చేత పరీక్ష బాగా రాయించకపోతాడా..’ అని నా ధైర్యం అన్నమాట!

అక్కడికి దేవుడు నా మొక్కుబడుల కోసం వెంపర్లాడుతున్నట్టు!

లేదంటే ‘పోనీలే.. ఈ అమ్మణ్ని నాకెన్నో ప్రదక్షిణాలు చేసింది కదా.. మొన్నొక రోజు ఓ టెంకాయ కొట్టింది కదా.. నిన్న భజనలో నా పాట పాడింది కదా.. తల ఊపివూపి చిడతలు కొడుతూ భజన చేసింది కదా.. పోనీ, పరీక్షల ముందరైనా సరే.. రోజూ బడికి పోయేటప్పుడు గుడి బయటి నించైనా మొక్కుకుంటుంది కదా..’ అని నా భక్తికి మెచ్చి, నేను పరీక్ష బాగా రాసేలా యేదైనా మాయ చేయకపోతాడా అని ఒక చిన్ని చిన్ని ఆశ!

‘కొన్ని భక్తి కథలలో చెప్పినట్టు నా భక్తికి మెచ్చి, ఆయనే వొచ్చి నా పెన్నును ఆవహించి, పరీక్షలు రాసేసినా రాసెయ్యొచ్చేమో!’ అని అంతరాంతరాల్లో ఒక ధీమాతో వుండేదాన్ని.

మరి పెద్దమ్మ చెప్పిన సక్కుబాయి కథలో.. చూసిన సినిమాలో, ఆమె తన అత్త గారి ఆజ్ఞ ప్రకారం బస్తాల కొద్దీ గోధుమలు విసరలేక, ‘శ్రమపడజాల దయా హృదయా..!’ అని పాట పాడి స్పృహ తప్పి పడిపోతే పాండురంగడు వొచ్చి గోధుమలు విసిరిపెట్టలేదా? యేమి?

మీరాబాయి కృష్ణుడిపై పాటలు పాడుకుంటూ, పూజ చేసుకుంటూ వుంటే, ఆమె భర్త విషపాత్రను పంపి, ఆమెను విషాన్ని తాగమని ఆజ్ఞాపిస్తే.. అది పాయసంగా మారలేదా?

‘ఆ భక్తుడెవరి కోసమో.. చోఖామేళా అనుకుంటా.. కృష్ణుడు చెప్పులు కుట్టి పెట్టాడు కదా..’

ఇంకా ఎంతమంది భక్తుల గురించో ‘భక్త లీలామృతం’ పుస్తకంలో రాసినది పెద్దమ్మ చదివి వినిపించింది కదా.

‘నేను మాత్రం అంతకు తక్కువ దాన్నా? యేమన్నా..’

‘నేను ఆ మాత్రం విలువ చెయ్యనా? నా భక్తి మాత్రం అంతకు తక్కువైనదా?’ అన్న ఆత్మవిశ్వాసం నాకు ఎక్కువగా వుండేది!

ఎందుకంటే దేవుడు ఆ మాత్రం సహాయం చెయ్యకపోతే కాళ్లు పీకేటట్టు అన్నేసి ప్రదక్షిణాలు ఎవరైనా ఊరికే చేస్తారా యేమి?

అయినా మనం ఎవ్వరం పోలేదనుకో.. దేవుడు ఒక్కడే రోజల్లా గుడిలో యేం చేస్తాడు? బోర్ కొట్టదా?

భక్తులెవరూ రాకుంటే ఆయనకు మాత్రం ఎట్లా తోస్తుంది పాపం! భక్తుల కోసం కాకుంటే భగవంతుడు ఎందుకు?

అయినా నాలాంటి పిల్లల కోరికలు తీర్చకపోతే దేవుడికి ఇంతింత పెద్ద గుళ్లూ గోపురాలూ కట్టడమూ, పూజలూ, పునస్కారాలూ చేయడమూ, పాటలు పాడటమూ, భజనలు చేయడమూ ఎందుకట?

మరి నాలాంటి పిల్లలకు పరీక్షల్లో సాయం చెయ్యకపోతే.. దేవుడికి టెంకాయలు ఉట్టి పుణ్యానికే కొడతారా ఎవరైనా? టెంకాయే మైనా ఊరికే వొస్తుందా? పది పైసలు పెట్టాల!

దేవుడు మనకేం సహాయం చెయ్యకపోతే మనకీ అనవసరపు ఖర్చు ఎందుకట? ఇదీ నా ఆలోచనలలో సాగే ‘దైవభక్తి’ ప్రవాహం!

నిజానికి పరీక్షలు దగ్గరికొచ్చేదాకా నేనేం చదివినానో నాకే గుర్తుండదు. టీచరేం చెప్పారో గుర్తుండదు. ఎప్పుడూ లైబ్రరీ పుస్తకాలే గానీ, బడి పుస్తకాలు ఎప్పుడైనా తెరిచి వుంటే కదా?

పుస్తకాలన్నీ తిరగేస్తుంటే యేదో అయోమయంగా వుండేది. అప్పటికప్పుడు అక్కావాళ్లతో చెప్పించుకోని, యేదో ముక్కున పట్టుకోని పోయి రాసేయడమే!

లెక్కలైతే నాకొక్క ముక్క కూడా అర్థమయ్యేవి కావు. ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు నెత్తికెక్కేవే కాదు! అందుకే పెద్దమ్మ అనేది..

“ఎల్లుండి లెక్కల పరీక్షనా? ఓయమ్మో! అది గాండీవం ఎత్తడం వంటిది కదే! ఎట్లా చేస్తావే అమ్మణ్నీ అంత పెద్ద లెక్కలు! అయినా బుద్ధి లేకుండా ఇంతోటి చిన్న చిన్న పిల్లల కు అంతంత పెద్ద లెక్కలెందుకిస్తారో యేమో.. ఈ అయ్యవార్లు? వయసుకు తగినట్టు చిన్న చిన్న కథలు, లెక్కలు చెప్పాలగానీ! సర్లే.. నేను ఎల్లుండి బెండకాయకూర చేస్తాలే! తిని పరీక్షకు పోదువులే!” ఇట్లా సాగేది పెద్దమ్మ ధోరణి.

బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వొస్తాయన్నది పెద్దమ్మ నమ్మకం! పాపం!

మనం సరిగ్గా చదువుకోకుంటే బెండకాయ కూరేం చెయ్యలేదని పెద్దమ్మకు తెలియంది కాదు!

ఏదో నాకు యేదో విధంగా సహకరించి, నాకు ధైర్యం, విశ్వాసం కలిగించి, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించాలన్న తాపత్రయం ఆ పిచ్చితల్లిది!

ఇంట్లో అమ్మా నాయనా మా చదువు గురించి పట్టించుకునేవారే కాదు.

అసలు పిల్లలకు చదువుకొమ్మని చెప్పాలన్న ధ్యాస ఆ కాలం తల్లిదండ్రులకు చాలామందికి వుండేదే కాదు.

‘ప్రాప్తమున్నంత చదువు అదే వొస్తుందిలే..’ అని మా అమ్మకు ఒక చిత్రమైన నమ్మకం!

మరి ఆ నమ్మకం అన్ని విషయాల్లోనూ వుండదు. ఆమెకు బద్ధకమయిన విషయాల్లో మాత్రమే వుంటుందన్నమాట!

అయినా ఆడపిల్లలకు మొగుడికి జాబు రాసుకోవడానికీ, చాకలిపద్దు రాయడానికీ తగినంత చదువొస్తే చాలు..! ఆడది చదివి ఉద్యోగం చెయ్యాలా? ఊళ్లేలాలా? అనే రోజులవి!

ఆ రెండింటినీ మించిన ప్రయోజనాలు ఆడవాళ్ల చదువుల్లో వాళ్లకు కనబడలేదు పాపం!

మిడిల్ స్కూల్ స్థాయిలో అయితే “స్త్రీకి విద్య అవసరమా? అనవసరమా? – కలం గొప్పదా? కత్తి గొప్పదా?” అనే పిచ్చి డిబేట్లు నడుస్తుండేవి అసయ్యంగా!

‘పోనీలే.. ఎప్పుడైనా కొంచెం లేటయినా కూర్చుని చదువు కుందాంలే..’ అని పుస్తకం పట్టుకుని కూర్చుంటే..

“రాత్రి తొమ్మిది తర్వాత చదవకూడదే అమ్మణ్నీ! కావాలంటే తెల్లవారుఝామున లేచి చదువుకో” అనేవారు మా నాయన.

నేను తెల్లవారుఝామున లేచి చదవడమా? కలలో చదవాల్సిందే! అసలు తెల్లవారుఝామున లేవడం శుద్ధ అనవసరమైన పని అని నా అభిప్రాయం!

అమ్మకు మమ్మల్ని చదివించే సమయమే వుండదు. అన్నాలు వండటం, పెట్టడంతోనే సరిపోతుంది.

పైగా ‘మనింటి పిల్లలకు చదువు రాకపోతే ఇంకెవరి కొస్తుంది?’ అన్న నిరాధారమైన ఆత్మవిశ్వాసం ఒకటి!

మా నాయనకైతే మేము యే క్లాసో కూడా గుర్తుండదు. ఎందుకంటే ఆయన పెద్ద వేదాంతి కదా? ఎవరైనా ఇంటికి వొచ్చినప్పుడు మమ్మల్ని పరిచయం చేయాలంటే,

“నువ్వు యే క్లాసే అమ్మణ్నీ?” అని వాళ్ల ముందే అడుగుతారు. ఆయనకు నా పేరైనా గుర్తున్నందుకు సంతోషించాలి!

నాకైతే హైస్కూలులోకి వచ్చే దాకా చదువు ఆవశ్యకత గూర్చి తెలిసేదే కాదు.

కానీ, నేను సరిగ్గా చదవడం లేదని నాకే తెలుసు. కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే పరీక్షలు బాగా రాయగలననీ తెలుసు! ఏదో అర్థం లేని బద్ధకం.. అశ్రద్ధ.. అంతే! ఎవరూ సరిగ్గా గైడ్ చేసేవాళ్లు లేని పరిస్థితి! చదువు ఆవశ్యకతను గుర్తెరగలేని నిస్సహాయత! అంతే!

ఒక్కోసారి పరీక్షల భయం నా మనసులో గూడు కట్టుకుని, దిగులుతో అన్నం సయించేది కాదు. పరీక్ష ఫెయిలయినట్లు కలలు కూడా వొచ్చేవి!

అందుకే ఎట్లా పాసవుతానో, యేమోననే భయంతో, ఎందుకైనా మంచిదని.. మూణ్నెల్ల, ఆర్నెల్ల పరీక్షల ముందొక్కొక్కసారి, సంవత్సరం పరీక్షల ముందొకసారీ సరస్వతీ పూజ చేసేదాన్ని.

పరీక్షల ముందు ఓ సాయంత్రం వేళ మిద్దె పైన వరండాలో ఒక పీట వేసి, సరస్వతీదేవి ఫోటో పెట్టి, ముగ్గువేసి, దీపం పెట్టి, చాపలు పరిచేదాన్ని. పూజకు నా స్నేహితురాళ్లు కూడా వొచ్చేవారు. ప్రసాదంగా పప్పులు (పుట్నాలు), బొరుగులు, బెల్లం కలిపి ఇచ్చేది అమ్మ.

లేదంటే పుట్నాల పప్పు పిండిగా విసిరి, అందులో బెల్లం, ఎండు కొబ్బరి కలిపి ‘తియ్య పప్పులపొడి’ చేసి నైవేద్యానికి ఇచ్చేది అమ్మ.

పిల్లలందరం కలిసి వొచ్చిన శ్లోకాలు, పద్యాలు, పాటలు అన్నీ గట్టిగా టాపు లేచిపోయేటట్టుగా చెప్పేవాళ్లం.

ఎంత గట్టిగా చెబితే మా విన్నపం అమ్మవారికి అంత బాగా వినబడుతుందన్న భావమేమో!

మా గోల భరించలేక అమ్మవారు చెవులు మూసుకుని వుంటుందేమో మరి!

ఈసారి పరీక్ష ఎట్లాగయినా ప్యాసు కావాలని సరస్వతీదేవికి మొక్కులు మొక్కేవాళ్లం.

తర్వాత నైవేద్యం పెట్టిన పప్పులు, బొరుగులూ, అరిటిపళ్లూ, లేదంటే తియ్య పప్పులపొడి తినేసి, చాపలన్నీ చుట్టేసి, అమ్మవారి ఫోటోను వంటింట్లో దేవుడి అరుగు మీద మేకుకు తగిలించి ఆటలకు పరుగో పరుగు!

నేను పూజ చేసేటప్పుడు అటుగా వొచ్చిన మా నాయన నన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారు.

“అమ్మణ్నికి పరీక్షల భక్తి వొచ్చిందే!” అనేవారు.

‘తప్పేముంది పూజ చేస్తే? నన్ను చూస్తే అన్నింటికీ, అందరికీ ఎగతాళేనా? పరీక్షలప్పుడైనా భక్తి రావడం మంచిదే కదా? అప్పుడు కూడా భక్తి రానివాళ్లు చాలామంది వున్నారు. వాళ్లను చూస్తే యేమంటారో?’ అనుకునే దాన్ని. కానీ, పైకి అనే ధైర్యం లేదు.

కానీ ‘ఆటల మీద, బొమ్మల పెళ్లిళ్ల మీద వుండే శ్రద్ధ, చదువు మీద ఎందుకుండదో కదా..’ అని నాలో నేనే తెగ ఆశ్చర్యపడేదాన్ని.

‘సినిమా కథలు, కథల పుస్తకాల్లోని కథలు గుర్తున్నట్టు, బడి పుస్తకాల్లోని విషయాలు ఎందుకు మనసులో నిలవవో కదా..’ అని మనసులోనే ఔరా.. అని ముక్కు మీద వేలేసుకునేదాన్ని.

పరీక్షల ముందు, పరీక్షల రోజులలో తప్పక రోజూ సాయంత్రం శివాలయానికి నేను, నా స్నేహితురాళ్లు కలిసి వెళ్లేవాళ్లం.

అక్కడ గుడి ముందు కొన్ని గదులుండేవి. ఓ గదిలో కనకమ్మ అనే ఓ పెద్దావిడ వుండేది.

ఆమె గదిలో ఒకవైపు జడలమ్మ గారు అనే ఓ పెద్దావిడ ఫోటో వుండేది. ఆవిడ అవధూత అట. మా వూళ్లో వుండేవారట. ఆవిడ శిష్యురాళ్లలో ఒకావిడ ఈ కనకమ్మగారు.

సాయంత్రం వేళల్లో మరి కొందరు ఆడవాళ్లు వొచ్చేవారు. వాళ్లు ఓ గంట సేపు భజన చేసేవారు. మేము పోయి కూర్చుంటే, మాకూ తాళం చిడతలు ఇచ్చేవారు.

పాట పాడటం కంటే చిడతలు వాయించడం అంటే మహా ఇష్టం నాకు. అలా చిడతలు వాయిస్తూ ఆ జడలమ్మ గారికి కూడా నా పరీక్షల సంగతి చూడమని మొక్కుకునే దాన్ని.

మా వూరి మధ్యలో కోమట్ల బజారులో వున్న కన్యకాపరమేశ్వరీ గుడికి వెళ్లేదాన్ని స్నేహితురాళ్లతో కలిసి. అప్పటికింకా గుడి తెరిచి వుండకపోతే ..ఎత్తైన గుడి మెట్ల మీది నుంచి, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి పాముల్లా పాకేవాళ్లం! ఎవరైనా ఏమైనా అనుకుంటారనే యెదారు కూడా వుండేది కాదు మాకు! అయితే మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారూ కాదు.

తర్వాత ఆ అమ్మవారికి కూడా పరీక్షల్లో చదివినవీ, చదవనివీ కూడా అన్నీ సమయానికి గుర్తొచ్చేలాగా చెయ్యమని విన్నపాలు చేసేదాన్ని.

మేము ఆడిన ఆటలు, ఎగిరిన ఎగుర్లు, గెంతిన గెంతులు చూసి అవే తనకు మేము చేసిన పూజలని భావించేదో.. యేమో అమ్మవారు.. మమ్మల్ని ఎట్లాగో పరీక్షల్లో గట్టెక్కించేసేది.

ఇంకా పాండురంగస్వామి మిగిలిపోయేవాడు కానీ, చాలా దూరమని పోయేవాళ్లం కాదు. అంతంత దూరాలు పోవడానికి అమ్మ అనుమతి లేదు.

నాకు నిజంగా ఇష్టమై, మనస్పూర్తిగా చేసే పూజ మాత్రం కార్తీకమాసంలో మా పిల్లలందరం శివుడికి చేసే తుమ్మిపూల పూజ!

రోజూ బడి అయింతర్వాత నేను, నా తోటి విద్యార్థినులు సుబ్బరత్నమ్మ, లక్ష్మిదేవి, పద్మావతి మరి కొందరం కలిసి కళ్లాలు, తోటలు, ఖాళీస్థలాల్లో తుమ్మిచెట్ల కోసం వెదికేవాళ్లం.

తుమ్మిపూలు కోయడంలో వాళ్ల వేగాన్ని నేను అందుకోలేక పోయేదాన్ని!

ఎందుకంటే వాళ్లందరికీ ఇళ్లలో పనులు చెయ్యడం, వంట చెయ్యడం, అవసరమైతే పొలాల్లో చిన్నాచితకా పనులు చేయడం అలవాటు!

అక్కడ ఎక్కడైనా తంగేడు చెట్టు కనిపిస్తే వెంటనే పూలు కోసుకొని తలలో పెట్టుకునేవాళ్లం. ఎందుకంటే తంగేడుపూలంటే పార్వతీదేవికి ఇష్టమట. ఆ పూలు కనిపించినప్పుడు కోసి పెట్టుకోకపోతే ఆమెకు కోపం వొస్తుందంట!

నా స్నేహితురాళ్లే నా చేతకానితనం మీద జాలిపడి, తలో కొన్ని పూలు కోసి, నా సంచీలో పోసేవారు. తుమ్మిపూలను కోసుకొని, మా పుస్తకాల సంచులలో పోసుకోని, ఇంటికి తెచ్చుకునేవాళ్లం.

ఇంటికొచ్చి కాళ్లూచేతులూ కడుక్కొని, బట్టలు మార్చుకుని, ఇత్తడిపళ్లెంలో నిండుగా, రాశిగా తుమ్మిపూలు పేర్చుకొని, మధ్యలో ఒక ఎర్రటి గన్నేరుపువ్వో, లేదంటే పచ్చని తంగేడు గుత్తో పెట్టుకుని, చేతిపైన పళ్లాన్ని అందంగా అమర్చుకుని శివాలయానికి బయల్దేరేవాళ్లం!

తుమ్మిపూలు అప్పుడే పుట్టిన పాపాయి చెయ్యిలాగా మృదువుగా, స్వచ్ఛంగా, లేతగా, తెల్లగా, ముగ్దమోహనంగా వుంటాయి. “ఇదుగో.. స్వామీ.. తీసుకో.. నన్నునేనే ఆత్మార్పణ చేసుకోవడానికై వొచ్చాను.. నేను పుట్టిందే నీ పూజ కోసం!” అని చెబుతున్నట్టుగా వుంటుంది తుమ్మిపువ్వు.

తానే సమర్పణ చిహ్నంగా మారి, శివుడికి తనను తాను అర్పించుకుంటున్నానని చెబుతున్నట్టుగా భావన కలుగుతుంది నాకు!

శివాలయం మెట్లమీద కూచుని, తుమ్మిపూలను ఒకదాని మధ్యలో మరి ఒకటి గుచ్చుకుంటూ పోతే, గుండ్రంగా, చిన్ని పూలచక్రం లాగా తయారవుతుంది. అలాంటి చక్రాలను కొన్నింటిని తుమ్మిపూల రాశి పైన అమర్చేవాళ్లం.

శివలింగం దగ్గరికి పోయి, “ఇదుగో శివయ్యా! తుమ్మిపూలు నీకిష్టమని తోటలలో, కళ్లాలలో తిరిగి తిరిగి కోసుకొచ్చినాము. తీసుకో!’ అని చెప్పుకుంటూ, నల్లటి శివలింగం పైన తెల్లటి తుమ్మిపూలు పోసి, చక్రాలను ఆ రాశి పైన అమర్చేవాళ్లం!

శివాలయంలో శివుణ్ని ముట్టుకొని పూలు సమర్పించడం చాలా తృప్తినిచ్చేది.

ఎంతమంది ఆడపిల్లలు తుమ్మిపూలు తెచ్చేవారంటే దాదాపు రెండడుగుల ఎత్తున్న శివుడు తెల్లని పూలతో నిండిపోయేవాడు.

నల్లటి శివుడి పైనుంచి తెల్లటి తుమ్మిపూలు జలజలా జలపాతంలా జాలువారి పానవట్టం పైన పడుతుండేవి. పానవట్టం మొత్తం పూలతో నిండిపోయేది. అక్కడి నించి పకపకా నవ్వుతున్నట్టు జారి కింద పడుతూండేవి.

ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది నాకు!

శివుడు కూడా ఈ చిన్నారి భక్తురాళ్ల నిష్కల్మష భక్తికి కరిగిపోయే వుంటాడు!

అభం శుభం తెలియని చిన్ని చిన్ని కన్నెపిల్లలు నిర్మలంగా, నిష్కామంగా చేసిన ఈ పూల సేవకు, సమర్పణకు స్వామి ఎంత పొంగిపోయి వుంటాడో!

ఆ లేతపిల్లల స్వచ్ఛమైన భక్తికి మెచ్చి మాకు తెలీకుండానే శివుడెన్ని వరాలు అనుగ్రహించి వుంటాడో!

ఆటలో భాగంగా భక్తిని చిన్నపిల్లలకు మప్పిన ఆ సంస్కృతి నేడు ఆ పల్లెటూళ్లలో వుందో.. లేదో మరి..!

చిన్ననాటి తుమ్మిపూలను నేనైతే ఇప్పటికీ మరిచిపోలేదు. మా బాల్కనీలోని కుండీలో తుమ్మి మొక్కను పెంచుతూ, తుమ్మి పూలను కార్తీకమాసంలోనూ, మొక్క పూలు పూసినన్ని రోజులూ శివుడికి సమర్పిస్తూనే వుంటాను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here