అమ్మణ్ని కథలు!-25

0
13

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని సంస్కృత అధ్యయనం..😁 🤔

[dropcap]ఆ[/dropcap] సంవత్సరం వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో మూఢం వొచ్చింది. ఆ తరవాత వొచ్చే ఆషాఢంలో ఎటూ పెళ్లి ముహూర్తాలు, శుభకార్యాలూ వుండవు. దాంతో మూడు నెలలు పౌరోహితులకు పని లేకుండా పోతుంది.

మామూలుగా అయితే వైశాఖం, జ్యేష్ఠంలో పెళ్లిళ్లు ముమ్మరంగా జరుగుతాయి కదా..

ఆ సంవత్సరం ఆ రెండు నెలల్లో పెళ్లిళ్లూ, పేరంటాలూ, శుభకార్యాలూ ఆగిపోయినాయి.

అన్ని వృత్తుల వాళ్లూ ఆ మూడు నెలలూ ఇల్లు జరగడం ఎట్లానా.. అని దిగులు పడిపోతున్నారు. చాకలివారు, మంగలివారు, కుమ్మరివారు, వంటవాళ్లు, నేత పనివాళ్లు, డప్పులు కొట్టే వాళ్లు, బట్టలు అమ్మేవారు, మేదరిపని చేసేవాళ్లు అందరూ ఈ మూడు నెలలు ఎట్లా గడుస్తాయా అని చేతులు నులుముకుంటున్నారు. అయినా కాలం ఎవరి కోసం ఆగుతుంది గనుక?

ఇంతలో ఉగాది వచ్చి వెళ్లిపోయింది. శ్రీరామనవమి రానే వొచ్చింది. ఆ రోజు మా ఇంటి పౌరోహితులు శాస్త్రిగారు నాయన పిలువనంపగా మా ఇంటికి వొచ్చినారు.

ఆయనను కూర్చోబెట్టి గంధం పూసి, కుంకుమ పెట్టి, తాగడానికి పానకం, నీరు మజ్జిగా ఇచ్చి, తినడానికి పణ్యారం పెట్టి, పండూ తాంబూలం, దక్షిణ చేతికిచ్చి, కొత్త విసనకర్రతో ఆయనకు విసిరి, విసనకర్రను కూడా ఆయనకు ఇచ్చి సత్కరించినారు అమ్మా నాయనా.

శ్రీరామనవమి రోజు పండితులను, బంధుమిత్రులను, చుట్టుపక్కల వాళ్లను రాముడి పేరు మీద అట్లా సత్కరించడం మన తెలుగు వారిళ్లలో ఆనవాయితీగా వుండేది.

మాటల మధ్యలో మూడు నెలలు పనార్లుగా (పనిలేకుండా) వుండవలసి వొస్తుందని, ఇల్లు జరగడం ఎట్లాగనా అని భయం వేస్తున్నదని వాపోయినారు శాస్త్రి గారు.

అది విన్నాక నాయన చాలా బాధపడినారు. ఆయనకు ఏ విధంగా సహాయపడవొచ్చా అని యోచించినారు. ఆయన మనసులో ఒక ఆలోచన వొచ్చింది.

“నేను చాలా రోజులుగా మా పిల్లలకు ‘అమరకోశం’ నేర్పించాలని అనుకుంటున్నాను శాస్త్రీ! మీరు ఈ మూడు నెలలూ మా పిల్లలకు రోజూ పొద్దునపూట ఒక గంట సేపు అమరకోశం నేర్పిస్తే.. మీకు నెల నెలా నేను కొంత దక్షిణ ఇవ్వగలను. ఇది మీకు, మాకూ కూడా ఉపయుక్తమే కదా.. ఏమంటారు?” అన్నారు నాయన.

సరేనన్నారు శాస్త్రిగారు ఆనందంగా.

అట్లా అమరకోశ పాఠం నేర్పే అధ్యాయం మొదలైంది మా ఇంట్లో.

అమరకోశాన్ని అమరసింహుడనే బౌద్ధపండితుడు రాశాడట. ఆయన శంకరాచార్యులతో శాస్త్రవాదంలో ఓడిపోయినారు.. ఎందరో ఇతర బౌద్ధుల లాగా..

ఆ దుఃఖంతో తాను అంతవరకూ రాసిన గ్రంథాలన్నీ వ్యర్థ మయినాయనీ, తన మేధ వృథా అయిందనీ, తాను రాసిన వాటికేమీ విలువలేదనే బాధతో పుస్తకాలన్నింటినీ తగుల బెట్టుతున్నాడు. ఈ విషయం శంకరులకు తెలిసి, అతని వద్దకు పరుగున వొచ్చి, అతన్ని ఓదార్చి, ఆ తగలబెట్టే కార్యక్రమాన్ని ఆపించినారు.

‘అమరసింహుని పట్ల వైరం వాదం వరకేననీ, తరువాత అతనిపై గానీ, అతని పాండిత్యం పైన గానీ, అతని రచనల పైన గానీ తనకెలాంటి కినుక లేదనీ, అంత మంచి పుస్తకాలను అగ్నికి ఆహుతి ఇవ్వడం తగదనీ’ నచ్చజెప్పినారు శంకరులు.

చివరగా మిగిలిన ‘అమరకోశం’ అనే గ్రంథాన్ని అగ్నికి ఆహుతి కాకుండా కాపాడినారు. అది సశాస్త్రీయమైందనీ, సంస్కృతం చదివేవారంతా అమరకోశాన్ని అభ్యసించాలని నిర్దేశించినారు. అప్పటినించీ సంస్కృతాధ్యయనంలో అమరమూ ఒక భాగమైంది.

అమరకోశం సంస్కృత సాహిత్యంలోని పేర్లన్నిటికీ పర్యాయపదాలను శ్లోక రూపంలో చెబుతుంది. ఇది నేర్చుకుంటే సంస్కృతం నేర్చుకోవడం సులభం అవుతుంది. ఈ విషయాలు అన్నీ శాస్త్రిగారే చెప్పినారు.. మొదటి క్లాసులో.

అట్లా మా అన్నదమ్ములు ఐదుగురికీ ఎండాకాలం సెలవుల్లో ఆటల సమయంలో ఓ గంటసేపు కోత పడిందన్నమాట!

అప్పుడే పరీక్షలయిపోయాయి. ఎండలకాలం వొచ్చేసింది. రోజూ పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా వొచ్చేసేవారు శాస్త్రిగారు.

అప్పటికే అనుష్ఠానం, దేవతార్చన ముగించుకొని, అపరశివుడిలాగా విభూతి పట్టెలతో, నొసట కుంకుమతో, చంకలో అమరకోశం పుస్తకం పెట్టుకొని వొచ్చేవారు.

అరుగు మీద కూర్చొని, అమ్మ ఇచ్చిన కాఫీ తాగేసి, మేడ మీద పెద్దబయలులో అరుగు మీద చాప వేస్తే దానిపై కూర్చునేవారు.

మా అన్నదమ్ములందరూ ఆయన వొచ్చిన తర్వాత నిక్కీ నీలిగీ ఒక్కొక్కరూ పైకొచ్చేవాళ్లు.

ఆడపిల్లలు అమరం నేర్చుకోవాలనే నియమం యేదీ పెట్టలేదు మా నాయన. (ఆడపిల్లలకు సంస్కృతం అనవసరమనుకున్నారా? ఏమో? అయినా చాకలిపద్దులూ, భర్తకి జాబులూ సంస్కృతంలో రాయరు కదా అనుకున్నారేమో! అప్పుడు ఈ ప్రశ్నలేవీ రాలేదు మాకు. నేర్చుకోవడం తప్పిందిలే అని మాత్రమే సంతోషపడ్డాం!)

అయినా నలుగురూ కలిసిన చోట వుండి అక్కడ జరిగే విశేషాలు తెలుసుకోవడం నాకు ఇష్టం కదా! అందుకే నేను రోజూ పోయి అమరం క్లాసులో కూర్చునేదాన్ని.

వాళ్లు నేర్చుకుంటుండగా వినీ వినీ నాకూ కొంత వరకు అమరం వొచ్చేసింది.

మా అన్నదమ్ములు విపరీతమైన అల్లరి చేసేవారు. వాళ్లను ఎట్లా దారికి తెచ్చుకోవాలో శాస్త్రిగారికి అర్థమయ్యేది కాదు.

తన ఇతర శిష్యులలాగా బెదిరించి, రెండు దెబ్బలు వేసేందుకు వాళ్లంతా ఆ తాలూకాలోనే పెద్ద వకీలు గారి మనవలు! మా నాయనగారేమన్నా అనుకుంటారేమోనని ఆయనకు చాలా మొహమాటం! కరువు కాలంలో ఆయన తనకేదో ఆర్థికంగా ఉపశమనం కలిగే అవకాశమిస్తే.. వాళ్ల పిల్లల మీద తప్పులు చెప్పడం ఉచితం కాదనుకున్నారేమో!

అందుకే మధ్యేమార్గంగా వాళ్లకు సరదా సంఘటనలు చెప్పి నవ్వించి, తద్వారా తన దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు శాస్త్రిగారు.

అమరంలో మొదటి శ్లోకం..

‘యస్యజ్ఞాన దయాసింధో

రగాధస్యానఘాగుణా..’ అని మొదలవుతుంది. దానిని వివరిస్తూ,

దానికి తన చిన్నప్పుడు తన తోటి పిల్లలు..

“యస్యజ్ఞాన దయాసింధో

గోడ దాటితే అదే సందో..” అని అనుకరణ (పేరడీ) చేసేవాళ్లని చెప్పినారు ఒక రోజు.

అందరం ఘొల్లుమని నవ్వినాము.

ఇంక మా వాళ్లు అదే పట్టుకొని అన్నింటికీ తోచినట్టుగా పేరడీలు చెయ్యడం మొదలు పెట్టేవారు. ఈ అల్లరితో అభ్యాసం సరిగ్గా నడిచేది కాదు. దాంతో తలపట్టుకుని కూర్చునేవారు శాస్త్రిగారు!

అప్పుడప్పుడే మా అన్నదమ్ములందరికీ ఉపనయనాలు చేసి వున్నారు మా అమ్మా నాయనా.

భోజనం తర్వాత ఉత్తరాపోసన పట్టేటప్పుడు చెప్పే మంత్రం, దాని అర్థం, పవిత్రతను వివరిస్తున్నారు ఒక రోజు శాస్త్రిగారు.

“అమృతాభిధానమసి

రౌరవే అపుణ్యనిలయే

పద్మార్బుదనివాసినాం

అర్థినాం ఉదకం దత్తం

అక్షయ్యముపతిష్ఠతు”

అన్నది ఆ మంత్రం.

అంటే రౌరవాది నరకాలలో.. అనేక వేల లక్షల ఏండ్లుగా పడి వున్న తమ పూర్వీకులకు తాము సమర్పిస్తున్న ఈ జలం అక్షయమై, అమృతమై దాహం తీర్చి వారందరినీ రక్షించాలన్నది స్థూలంగా ఆ మంత్రం భావం.

దానికి తన స్నేహితులు ఇట్లా కల్పన చేసి ఎగతాళిగా చెప్పేవారని చెప్పినారు శాస్త్రిగారు.

అదెట్లా అంటే..

‘అమృతాభిధానమసి

ఎగరవే కిందపడవే

పద్మార్బుదనివాసినాం

అరిచినా ఉదకం పుట్టదు

అచ్చమ్మా ఇంకెట్లనే!’

అని చెప్పేవారట.

ఇంక మా వాళ్ల నవ్వులకు హద్దు లేదు!

ఇష్టమొచ్చినట్టు పేరడీలు కట్టడం మొదలుపెట్టినారు.

అమరం నేర్చుకునే దాని కంటే అల్లరి చెయ్యడం ఎక్కువైంది.

ఎట్లాగో రెండు నెలలు పైగా భరించినారు శాస్త్రిగారు. రెండో మూడో సర్గలు నేర్చుకున్నట్టున్నారు మావాళ్లు. ఇంతలో మాకు సెలవులు కూడా అయి పోయినాయి.

అసలే పరమసాత్వికుడైన శాస్త్రిగారు వీళ్ల దెబ్బకు దడుసుకొని వున్నారేమో.. బడులు తెరిచినారనే వంకతో అమరపాఠానికి ఓ శుభముహూర్తాన స్వస్తి పలికినారు.

ఆ రోజు పాఠాన్ని ముగిస్తూ ఆయన ఒక తమాషా కథ చెప్పినారు. అదేంటంటే..

రావణ వధ అయిపోయినాక రాముడితో పాటు వానర వీరులందరూ పుష్పకవిమానం ఎక్కి అయోధ్యకు వొచ్చినారు. వాళ్లకు ఉండడానికి గుడారాలూ, భోజనాదికాలకు పందిర్లూ వేయించి, సకల సౌఖ్యాలనూ ఏర్పాటు చేసినారు రాములవారు.

ఆ రోజు రామపట్టాభిషేకం అయింది. వానరులంతా పెద్ద పెద్ద పందిళ్ల కింద భోంచేస్తున్నారు. ఆ రోజు చేమగడ్డల కూర చేసినారట వంటవాళ్లు.

కూర లోని ఒక దుంపకు పొరబాటున పొట్టు తీయడం మరిచిపోయినాడు వంటాయన.

ఆ దుంప ఒక వానరుడి విస్తట్లో పడింది.

ఆ వానరుడు ఆ దుంపను కిందిభాగంలో పట్టుకొని ఒక నొక్కు నొక్కినాడు. ఆ తొక్కలో నించి బయటపడిన చేమదుంప అంతెత్తున ఎగిరి తిరిగి అదృష్టం కొద్దీ ఆయన విస్తట్లోనే పడింది.

కానీ, ఆ చేమదుంప ‘నా అంత పైకి నువ్వు ఎగరగలవా?’ అని ఆ వానరుడిని సవాలు చేసినట్టనిపించింది..

“నేను మాత్రం నీపాటి ఎగరలేనా? చూడు ఎంత పైకి ఎగురుతానో..” అని లేచి పందిరి తగిలేదాకా ఎగిరి దూకినాడు.

అతన్ని చూసి తనను ఏదో ఎగతాళి చేస్తున్నాడనుకొని, ‘నేనేం తక్కువా..’ అనుకొని తానూ ఎగిరినాడు పక్కనున్న వానరుడు.

ఇట్లా ఒకరిని చూసుకుని మరొకరు వానరులంతా ఎగుర్లూ దూకులూ మొదలు పెట్టినారు.

ఇట్లా అందరూ ఎగురుతూంటే.. విషయం అర్థం చేసుకోకుండా హనుమంతుడు కూడా ఎగరడం మొదలు పెట్టినాడు. మొత్తం మీద పందిరంతా కూలిపోయి, ఆకులన్నీ చెల్లాచెదురయిపోయినాయి. అన్నమంతా నేలపాలైంది.

ఈ విషయం రాములవారికి తెలిసి హుటాహుటిన వొచ్చి, విషయం యేమని ఆరా తీస్తే.. చేమగడ్డ ఉదంతం బయటికొచ్చింది.

హనుమంతుడు సిగ్గుపడి తమవారి తప్పిదానికి రాములవారిని క్షమార్పణ కోరుకున్నాడు.

మళ్లీ అన్నాలు వొండించి, పందిళ్లు వేయించి, వాళ్లందరికీ భోజనాలు పెట్టించినాడు రామయ్య.

“హనుమా! నీవెంత జ్ఞానివైనా నీ జాతి లక్షణం, నీ కోతి లక్షణం పోగొట్టుకోలేకపోయినావు కదా!” అని సున్నితంగా మందలించినాడట ఆంజనేయుణ్ని.

“అట్లా అంతటి ఆంజనేయుడే తన సహజ వానర లక్షణాన్ని పోగొట్టుకోలేక పోయినాడు. ‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు కదా.. మరి మీరు ఒక్కొక్కరూ నూరు మర్కటాలకు సమానం! పాపం.. మీరు మాత్రం ఆ మర్కట లక్షణాలు ఎట్లా పోగొట్టుకుంటారు చెప్పండి! హేం అల్లరి! హెంత హల్లరి! హెంత దుడుకుతనం! రాములవారు కాబట్టి అంతమంది కోతుల గోలను తట్టుకోగలిగినారు.. నా తరమా మీలాంటి వానరులను భరించడం!

అమ్మో.. నా పుణ్యం పుచ్చింది కాబట్టి.. మీ బడులు తెరిచినారు. మరికొన్ని రోజులు మీతో వేగితే నాకొచ్చిందంతా మరిచేపోదును!

శివ శివా! రక్షించినావు కదయ్యా ఎట్టకేలకు! అయినా ఆ బడిటీచర్లు ఇంతమంది కోతుల అల్లరిని ఎట్లా భరిస్తారో యేమో! వాళ్లకు ఎంత జీతమిచ్చినా తక్కువే!.. అయినా ‘దండం దశ గుణం భవేత్..’ అని ఊరికేనే అన్నారా పెద్దలు! దండంతోనే ఈ వేషాలన్నీ దారికొస్తాయి. కానీ, నా ప్రారబ్ధం వల్ల నాకు ఆ దారి మూసుకు పోయింది. లేకుంటేనా? వాయించి పారేద్దును! వోయమ్మో.. వోయబ్బో.. హెంత గొడవ.. హేం వేషాలు! హెంత తెంపరితనం! మా అమ్మ పెట్టిన ఉగ్గుపాలను కూడా కక్కించేసినారు కదయ్యా!” అని కథ ముగించాక, మా వాళ్ల అల్లరికి రకరకాలుగా వాపోయినారు శాస్త్రిగారు.

అంత సూటిగా చురక అంటించినానని శాస్త్రిగారు తృప్తిపడినారేమో గానీ, మావాళ్లకు అటువంటి చురకలు పెద్ద లెక్కలోనివేం కాదు. కొంచెం చిన్నబుచ్చుకున్నారు కానీ, కాస్త మౌనం తర్వాత మళ్లీ మామూలే!

శాస్త్రిగారు మాత్రం ‘బతుకుజీవుడా!’ అని నాయన దగ్గర సెలవుతోపాటు సంభావన కూడా తీసుకొని బయటపడినారు. అట్లా అమరకోశ అధ్యయనం ముగిసింది.

అందరం ‘హమ్మయ్య ఇంక రేపటినించీ అమరం క్లాసు లేదు’ అని ఊపిరిపీల్చుకున్నాం.

ఇంకొన్నాళ్లకు గాలికాలం ఒచ్చింది. పిల్లలంతా గాలిపటాల వెంట పడినారు.

మా వెనకాల వీధిలో కృష్ణారెడ్డి అని ఒక పాతకాలపు పెద్దాయన వుండేవాడు. ఆయన తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఆరడుగుల ఎత్తుతో వుండేవాడు. తెల్లబారిన జుట్టుతో పిలక ముడి వేసుకొని, చెవులకు బరువైన పెద్ద పెద్ద తెల్లరాళ్లతో చేసిన కమ్మలు పెట్టుకునేవాడు. దాంతో చెవులు సాగిపోయి, కమ్మలు ఊగుతూ వుండేవి. చూడ్డానికి తమాషాగా వుండేది.

ఖాదీ గుడ్డతో కుట్టిన చేతుల బనీను వేసుకోని, ధోవతి కట్టుకొని నిండుగా వుండేవాడాయన! నొసట కుంకుమబొట్టు పెట్టుకొని, మంచి ఠీవితో, దృఢంగా వుండేవాడు ఆ వృద్ధుడు.

ఆయన ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన గాలిపటాలు తయారు చెయ్యడం, ఎగరెయ్యడంలో దిట్ట!

అప్పట్లో గాలిపటాలకు ఇన్ని రంగులు, హంగులు, పేర్లు, హంగామా వుండేవి కావు.

పాత న్యూస్ పేపర్తో గానీ, గోధుమరంగు కాగితంతో గానీ గాలిపటాలు తయారుచేసేవారు.

గాలిపటాలు సంక్రాంతి సమయంలో ఎగరెయ్యాలనే ఆచారం కూడా మా వైపు వుండేది కాదు.

గాలికాలం.. అని ఒక కాలాన్ని పిలిచేవారు. బహుశః జ్యేష్ఠ ఆషాఢమాసాల్లోననుకుంటా..

అంటే జూలై ఆగస్టు నెలలలో గాలిపటాలు ఎగరేసేవారు. అంతకుముందే మేదరివాళ్ల దగ్గర వెదురుపుల్లలు తెచ్చుకునేవాడు కృష్ణారెడ్డి. వాటిని సమంగా, తనకు కావాల్సిన సైజులో చీల్చి పెట్టుకునేవాడు.

ఆయన తమ అరుగు మీద పెట్టుకునే సామాన్లలో పాతపేపర్లు, వెదురు పుల్లలు, దారాలూ, ఓ కత్తీ, వీటితోపాటు ఉడికించిన మైదాపిండి గిన్నెలో సదా సిద్ధంగా వుండేది.

మా వూళ్లలో హైదరాబాదులో మాదిరి మాంజాలూ అవీ వుండేవి కావు. ఏవో గట్టి దారాలు సిద్ధం చేసుకునేవాడు కృష్ణారెడ్డి గారు. ఆయన దగ్గర గాలిపటాలు ఎగరేయాలనుకునే పిల్లలంతా చేరేవారు. పిల్లలందరూ చుట్టూ చేరగా పిల్లలకోడి వలె వుండేవాడు కృష్ణారెడ్డి.

వాళ్లకు తగిన సలహాలు ఇస్తూ, వాళ్లకు గాలిపటాలను తయారుచేయడంలో సహాయం చేస్తూ, మెళకువలు నేర్పేవాడు ఆయన. అట్లా మా అన్నదమ్ములు ఆయన ఆధ్వర్యంలో గాలిపటాలు ఎగరేస్తుండేవారు.

మామూలు గాలిపటాలు మాత్రమే కాకుండా పెద్ద సైజులో.. దాదాపు మూడు నాలుగడుగుల ఎత్తులో పటం ఒకటి తయారుచేసేవాడు. దాన్ని ‘బుర్రు’ అనేవారు.

దాన్ని చిన్నపిల్లలు ఎగరవేయగలిగే వారు కాదు. చాలా బరువు వుంటుంది. చిన్నపిల్లలను అయితే అమాంతంగా ఈడ్చుకొనిపోతుందట! దానికి వేరే రకం దారం కావాల. అది ఎగిరేటప్పుడు ‘బుర్రు.. బుర్రు..’ మనే శబ్దం చేస్తుంది.

చిన్న చిన్న గాలిపటాలను సులభంగా కోసిపడేస్తుంది. నాకు తెలిసి కృష్ణారెడ్డి గారొక్కరే బుర్రును ఎగరవేయగలిగేవారు. బుర్రు గాలిపటం ఎగురుతున్నదంటే అందరూ వీధుల్లోకొచ్చి చూస్తుండేవారు.

అప్పట్లో గాలిపటాలకు పెద్ద పెద్ద తోకలుండేవి. పటం ఆకారానికి తగినంత పెద్ద తోక వుండేది. ఎంత గాలిపటానికి ఏ మాత్రం తోక వుండాలన్నది ఏదో లెక్క వుండేది. తోకలు ఊపుతూ పాముల్లాగా ఆకాశంలో ఎగురుతూ వుండే పటాల దగ్గరికి దారంచెండు గుండా మధ్యలో గుండ్రంగా కత్తిరించిన కాగితాలను పంపేవారు. వాటిని ‘జాబులు’ అనేవారు. అవి గుండ్రంగా తిరుగుతూ గాలిపటం దాకా చేరుకునేవి. గాలిపటాలలో చిన్న దీపం కూడా పెట్టి పంపేవారు కృష్ణారెడ్డిగారు.

మా అన్నలు ఆ పెద్దాయన దగ్గర నేర్చుకొని, పటాలు ఎగరేస్తుండేవారు.

పిల్లలెందరో గాలిపటాలు ఎగరేసే మోజులో మిద్దెల పైనుంచి కిందపడి, ప్రమాదాల పాలయ్యేవారు. అందుకే అమ్మకు గాలిపటాల కాలమంటే మహా భయం!

గాలిపటాలు ఎగరెయ్యడం, బొంగరాలు తిప్పడం, బావుల్లో ఈతలు కొట్టడం వంటివన్నీ మొగపిల్లల ఆటలు! ఆడపిల్లలకు అందులో ప్రవేశం లేదు. మేము వాళ్లకు అవీ ఇవీ అందించడం, మైదా వుడికించి తెచ్చియ్యడం వంటి సేవకావృత్తులు చేసేవాళ్లం!

మేము ఎంతో అడిగితే కాసేపు దారంచెండు పట్టుకోనిచ్చేవారు అన్నావాళ్లు. అంతే!

మాలాంటి బాగా చిన్నపిల్లలమంతా పాత నోటుబుక్కులలోని కాగితాలు చించుకోని, దానికి ఒక మూలన చిల్లు పెట్టి, ఓ గజం పొడుగు దారం దానికి కట్టుకొని, వీధుల్లో పరిగెత్తేవాళ్లం! అది ఎగురుతుందా.. లేదా అని వెనక్కి వెనిక్కి తిరిగి చూసుకుంటూ ఉరుకులు పెట్టేవాళ్లం.

అట్లా పరిగెత్తుతూ పాలమ్మడానికి పోయేవాళ్లు, నీళ్ల కడవలను ఎత్తుకోని పొయేవాళ్లను ఢీ కొడుతూ వాళ్ల చేత తిట్లు తినేవాళ్లం.

నేల మీద ఏదైనా అడ్డువుంటే తట్టుకొని కిందపడడం, దెబ్బలు తగిలించుకోవడం, అమ్మతో తిట్లు తినడం షరా మామూలే!

అట్లా గాలిపటాలను పట్టుకొని వీధుల వెంట పరిగెత్తుతూ.. పరిగెత్తుతూ.. పరిగెత్తుతూ.. వెనక్కి వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ.. ఎప్పుడు పెద్దవాళ్లమయ్యామో తెలియనే లేదు.

కాలం గిర్రున తిరిగింది. రోజులు వారాలుగా.. నెలలు.. సంవత్సరాలుగా గడిచిపోయినాయి.

ఇప్పుడు తిరిగి చూసుకుంటే మళ్లీ మరలిరాని బంగరువన్నె బాల్యానుభూతులు మాత్రమే మిగిలినాయి!

నడచివొచ్చిన సుదీర్ఘమార్గంలో ఎన్నో అపురూప అనుభవాలు మాణిక్యాల్లా.. ఎన్నటికీ వాడని దేవలోకపు పారిజాత పుష్పాల్లా.. జ్ఞాపకాల వీధుల్లో మిలమిల మెరుస్తున్నాయి.

వాటిలో కొన్ని బాల్యానుభూతులను ఏర్చి కూర్చి ‘అమ్మణ్ని కథలు’ అనే ఓ మాల అల్లినాను. ఆ పూల పరిమళాలు కొందరినైనా అలరింపజేసి వుంటాయి. వారిని వాళ్ల బాల్యమనే వసంతంలో ఓసారి విహరింపజేసి వుంటాయి. ఓపికతో చదివిన వారికి ధన్యవాదాలు! బాగున్నాయని ప్రోత్సహించిన వారికి నమస్సుమాంజలులు!

ఇంతటితో అమ్మణ్ని అల్లరికి సెలవు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here