అమ్మను బ్రతికించుకుందాం రండి!

0
11

[శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు రాసిన ‘అమ్మను బ్రతికించుకుందాం రండి!’ అనే పర్యావరణ పరిరక్షణ కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]ద్యుమ్నరావు తను ఎంతటి కోటీశ్వరుడో అతను ఎప్పుడూ లెక్కలు చూసుకోలేకపోయాడు. ఆ లెక్కలు చూసుకునే ఆ సమయంలోనే అతను మరొక కోటి సంపాదించగల దిట్ట!

ఆ మహానగరంలో అతడు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో అప్పుడే నిద్ర లేచిన ప్రద్యుమ్నరావు. కుళాయిల నుండి నీరు రాకపోవడంతో బజర్ నొక్కాడు.

కాసేపటికి ఒకతను డోర్ జరిపి లోపలికి వచ్చాడు.

“సార్.. మొత్తం సిటీలో ఈ రోజునుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. నా సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితి నీటి విషయంలో చూడలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకునే వాళ్ళం.. కానీ ఆ పరిస్థితి ఇంత తొందరలో వస్తుందని మాత్రం అనుకోలేదు సార్. సరే.. అన్ని రోజులు, అన్ని కాలాలు మనవి కాదు కదా సృష్టితో పోరాటం చెయ్య లేము సార్.. రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడే వరకు కుళాయిల నుండి నీళ్లు రావు. మాకు వచ్చిన కోటా ప్రకారం ఉన్న వాడైనా, లేని వాడైనా ఒక మనిషికి ఉదయం ఒక్క వాటర్ టిన్ మాత్రమే. మంచి చెడులన్ని ఆ ఒక్క టిన్ తోనే సరి పెట్టుకోవాలి సార్. అలాగే సాయంత్రం ఒక టిన్ను. ఈ విషయం ప్రతి రూమ్‌కి వెళ్లి ఇలాగే చెప్తున్నాను సార్” అంటూ రన్నింగ్ ట్రే తో తెచ్చిన వాటర్ టిన్ను లోపల పెడుతూ అన్నాడు ఆ హోటల్ వాటర్ సప్లై అండ్ మెయింటనెన్స్ ఆఫీసర్ శరభేశ్వరo.

ప్రద్యుమ్నరావుకు ఎక్కడో కాలినట్లు అయింది..

తన ఎదురుగా ఇంతసేపు ఏమాత్రం జంకు లేకుండా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఇతనొక్కడే అనుకున్నాడు ప్రద్యుమ్నరావు.

భ్రుకుటి ముడిచి శరభేశ్వరo వైపు ఏగాదిగా చూస్తూ అతనిని వెళ్ళిపోకుండా ఆగమని, తన సెల్ ఆన్ చేశాడు..

“హలో.. ఎమ్మెల్యే సుబ్బరాజు.. ఏం చేస్తున్నావ్. నేను ఈ సిటీలోనే ఉన్నాను. హోటల్ త్రినేత్రలో ఉన్నాను. వివరాలు అడగొద్దు. నాకు అర్జంటుగా ఈ హోటల్ కావాలి. అర్జెంటు. డీల్ ఎంతైనా పర్వాలేదు. పది నిమిషాల్లో పని పూర్తవ్వాలి.” అంటూ ఆర్డరేశాడు.

ప్రద్యుమ్నరావు శరభేశ్వరo వైపు ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు.. అతని 10 వేళ్లకు ఉన్న పది ఉంగరాలను మెడలో ఉన్న లావుపాటి గోల్డ్ చైన్ లను నిమురుకుంటూ.

పది నిమిషాలు పూర్తయింది. అవతల నుండి ఎమ్మెల్యే సుబ్బరాజు ఫోన్ చేసి డీల్ ఓకే అయినట్లు చెప్పాడు.

ఇప్పుడు ప్రద్యుమ్నరావు.. శరభేశ్వరo వైపు మహా కోపంగా చూస్తూ “ఈ క్షణం నుంచి ఈ హోటల్ మేనేజర్ నేనే. నా స్నానానికి వంద వాటర్ టిన్స్ కావాలి అర్జంటుగా తీసుకురా. పో.. అంతేకాదు ఒక్కొక్క.. టిన్ నువ్వే కింద నుండి పైకి మోసుకొని పట్రా” అన్నాడు.

ఆ మాటలకు శరభేశ్వరo నొచ్చుకుంటూ..

“క్షమించండి సార్.. ఈ హోటల్ వరకే కాదు. ఈ సిటీలో మొత్తం హోటల్స్ అన్నింటి మీద వాటర్ సప్లై విషయంలో.. నన్నే ఆలోచన అడుగుతుంటారు. ప్రస్తుతం ఈ విధానమే అమలు. మీరు మేనేజర్ అయినా సరే.. ఈ సర్దుబాటు వెంటనే మార్చలేం సార్.. నా విధానం మీకు నచ్చనప్పుడు ఇక్కడ పని చేయలేను సార్. క్రింద రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాను.” అంటూ శరభేశ్వరo వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు.

***

వారం రోజులు పోయాక.. ప్రద్యుమ్నరావు విజయవాడలో విమానం దిగి తన ఊరు వెంకటాద్రిపురం చేరుకున్నాడు.. ఐదు ఎకరాల సువిశాల స్థలంలో ఎప్పుడో తన పెద్దలు అమోఘంగా ఏర్పాటు చేసిన భవంతి అది. కారు దిగేసరికి ఆ ఇంటి వ్యవహారాలు చూసే వెంకట కృష్ణారావు.. మరి ఇద్దరు ముగ్గురు పనివాళ్లు దగ్గరికి వచ్చారు.

చుట్టూ చూసిన ప్రద్యుమ్నరావు.. వెంకట కృష్ణారావు మీద ఉగ్రుడైపోయాడు.

“మీ తాతల కాలం నుండి కొలువు చేస్తున్నారు కదా అని నీకు నా ప్రాపర్టీ బాధ్యత అప్పచెప్పి వెళితే ఇంటి చుట్టూ.. ఈ మురికి గోతులు ఏమిటి.. నీకేమైనా పిచ్చి పట్టిందా?”.. అంటూ అరిచాడు.

వెంకటకృష్ణారావు ఏమాత్రం బాధపడకుండా..

“పెద్దయ్యా.. అవి మురికి గోతులు కాదయ్యా.. వర్షపు ఇంకుడునీటిగుంటలు.. అందులో నిల్వ ఉన్న నీరు ఈ నేలతల్లి పీల్చుకుంటుంది.. దానితో ఎప్పుడైనా మనకు నీరు కరువు వస్తే మన దొడ్లో ఉన్న చేతిపంపులు పని చేస్తాయి. అట్లా ఈ భూమాతను మనం గౌరవిస్తే.. ఆ నేలతల్లి మన ప్రాణం నిలుపుతుందయ్యా. ఈ మంచి పని మీకు ఫోన్‌లో చెప్పడం ఎందుకని నేనే చేయించాను క్షమించండి” అంటూ సవివరంగా వివరించాడు వెంకట కృష్ణారావు.

“క్షమించడం కుదరదు.. ఏమీ తెలియని అమాయకుడితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావ్. నీది పిచ్చి ఆలోచన.. వంద సంవత్సరాలలో ఎప్పుడు జరగని చిత్రాలు ఇప్పుడు జరుగుతాయా? 24 గంటలలో నువ్వు ఈ పిచ్చిగోతులన్నీ పూడ్చిపెట్టు. అంతే కాదు.. నా కారు ఇంటి చుట్టూ సుఖంగా తిరిగేలా సిమెంటు రోడ్డు వేయించు.” అంటూ భీకరంగా అరిచి లోపలకు వెళ్ళిపోయాడు ప్రద్యుమ్నరావు.

వెంటనే ఇంట్లో అన్ని గదుల్లో తిరిగి ఎక్కువగా పేరుకుపోయిన పనికిరాని చెత్తను చూసి లారీ నిండా పోగు పెట్టి తీసుకెళ్లి బయట పొయ్యవలిసిందిగా ఆజ్ఞాపించాడు వచ్చిన లారీ డ్రైవర్ మరియు క్లీనర్‌తో.

సాయంత్రానికి తమ లారీ నిండా పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు పోగుచేశారు వాళ్ళిద్దరూ. వాటన్నింటినీ సందు మలుపు ఖాళీలో గుమ్మరించి రమ్మన్నాడు.. ప్రద్యుమ్నరావు.

వెంకటకృష్ణారావు మళ్లీ కలగజేసుకుని ముందుకు వచ్చి ఇలా అన్నాడు.. “అయ్యా.. అది ఊరికి మంచిది కాదయ్య. మునిసిపాలిటీ వాళ్లు కూడా ఒప్పుకోరు.. ఈ నేల తల్లిని.. అలా కరగని వ్యర్థాలు పోసి అగౌరవపరచటం మన భవిష్యత్తుకు మన పిల్లల ఆరోగ్యాలకి కూడా ఎంత మాత్రం మంచిది కాదయ్యా..”

“ఏఁ.. కొంపలు మునిగిపోతాయా..? ” అరిచాడు ప్రద్యుమ్నరావు.

“నన్ను క్షమించండి సార్. మా తాత కాలం చేసిన తర్వాత, మీతో నేను కొనసాగించటం ఈ సంవత్సరమే మొదలు.. మీకు చెప్పేంత శక్తిమంతుడను కాదు సార్.. కానీ వాతావరణ స్థితిగతులను బట్టి చెప్పక తప్పటం లేదు.. ఇదంతా మీకు తెలిసిన విషయమే.

ఈ వారంలో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు మేత అనుకుని పశువులు తిని చాలా చోట్ల చచ్చిపోయాయట. మనకు కూడా చాలా పశువులు ఉన్నాయి కదా. ఇలాంటి చెత్త ఉన్నచోట మొక్క కూడా మొలవదు. మీకు తెలియంది ఏముందయ్యా.. ఈ చెత్త మన ఇంటికి దూరంగా ఉన్న మన ఖాళీ గొడౌన్లోనే ఉంచుదాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆలోచనతో అప్పుడు నిర్ణయం తీసుకుందాం”.. అన్నాడు కొంచెం ముందుకు వచ్చి.. వెంకట కృష్ణారావు .. వినయంగా చేతులు కట్టుకుని తల వంచుకుని.

ప్రద్యుమ్నరావుకు చేతులు కట్టుకు నిలబడిన వెంకట కృష్ణారావుని చూడగానే అతని శరీరం మీద తేళ్ళు జెర్రులు పాకుతున్న అనుభూతి కలిగి కళ్ళతో ఎర్రగా చూస్తూ.. ఇలా అన్నాడు.. “ప్రతి నిమిషం భయపడుతూ చచ్చిపోతూ బ్రతకమంటావు. అది నీ లాంటి అర్భక ప్రాణులకు.. మాలాంటి వాళ్లకు కాదు.. నీ వల్ల నా పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. ఉదయం నీళ్ల గురించి పాఠాలు చెప్పావు. ఇప్పుడు నేల తల్లి అంటూ లెక్చర్లు ఇస్తున్నావు. ఆ రెండింటి మీద నువ్వేమైనా హక్కులు రాయించుకున్నావా?.. అక్కడికి ఈ ప్రపంచం ఏదో సర్వనాశనమై పోతున్నట్టు బాధపడిపోతావ్ ఏమిటి? ఒక్క రోజులోనే నీ పద్ధతి నాకు నచ్చలేదు. నచ్చని చోట ఉండటం నీకే మంచిది కాదు.. నీ తలలో జేజెమ్మ లాంటి వాడిని పెట్టుకొంటాను.. నువ్వు ఒక అసమర్థ సామాన్య మనిషివి బయటకు పో.. ” అంటూ వెంకటకృష్ణారావుని నానా చీవాట్లు పెట్టి తీవ్రంగా అవమానించి అసభ్యంగా మాట్లాడి జీవితంలో ముఖం చూపించకుండా వెళ్లిపొమ్మన్నాడు ప్రద్యుమ్న రావు. చేసేది లేక వెంకటకృష్ణారావు దిగాలుపడిన ముఖంతో ఆ కొలువు విరమించుకుని వెళ్లిపోయాడు.

ఆ వెంటనే మేడ మీదకు వెళ్లి ఎన్నో సంవత్సరాలుగా పైకి లేవలేని స్థితిలో దీర్ఘరోగంతో బాధపడుతున్న తన భార్యను చూసి ఆమెకు సేవ చేస్తున్న ఇద్దరు ఆయాలతో విషయాలన్నీ మాట్లాడి మళ్లీ క్రిందకు వచ్చి.. ఇల్లంతా తిరిగి చూశాడు.

***

లారీనిండా నిండిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, కవర్లను తీసుకెళ్లి ఊరికి బాగా చివర్న స్మశానానికి వెళ్ళే దారిలో దారి పొడుగునా ఉన్న గోతులను, గుంటలను ఈ వ్యర్థాలతో మూసి పైన మట్టి పోయమని.. అలా ఆ దారి కవర్ చేయమని సలహా ఇచ్చాడు.. ప్రద్యుమ్న రావు..

డబ్బులకోసం.. ఆ లారీ డ్రైవర్.. క్లీనర్ మారు చెప్పకుండా ఆ స్మశానపు దారి రెండు కిలోమీటర్లు పొడుగునా ఆయన చెప్పినట్లే చేసి పైన అవి కనపడకుండా మట్టికప్పి వెళ్లిపోయారు మాట్లాడకుండా.

***

ఇక్కడ.. వెంకటకృష్ణారావు నివాసముండే ఊరిచివర మట్టి దిబ్బలు దాటాక చిట్టిపాకలు..

సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద మనిషిగా మంచిమనిషిగా చలామణి అవుతున్న వెంకటకృష్ణారావుకి జరిగిన అవమానం దృష్ట్యా.. అతనిమీద ఉన్న గౌరవంతో చుట్టు పక్కల ఏ ఒక్కరు కూడా ప్రద్యుమ్నరావు కొలువులో చేరలేదు. ఆ నిర్ణయం ఎవరికివారే తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కొలువులో పనిచేస్తున్న వాళ్ళలో కూడా కొందరు మానేశారు.

సిటీ నుండి కాంట్రాక్టు పద్ధతిలో నలుగురు మనుషుల్ని తెప్పించాడు ప్రద్యుమ్నరావు.

***

నెలలు గడిచాయి వాతావరణ ప్రభావం మారింది.

భార్య ఆరోగ్యం మెరుగుపడటం లేదు. ఈలోగా ప్రద్యుమ్నరావు వ్యాపార రీత్యా తను వెళ్ళవలసిన రాష్ట్రాలు, దేశాలు వెళ్లివస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం వెంకటాద్రిపురంలో తన ఇంటి దగ్గరే ఉన్నాడు.

వర్షాకాలం అయినా ఒక్క చినుకు పడలేదు. పైగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండతాపానికి కొన్ని ప్రాణాలు హరించుకుపోయాయి. చెరువుల్లో బావుల్లో ఒక నీళ్ల చుక్క లేదు. ప్రద్యుమ్నరావు చేతి పంపు కొట్టి నీళ్లు తెమ్మన్నాడు.. అది నీళ్లు రాకుండా మొరాయించిoది. దాంతో.. అది తను చేసిన పాపం వల్లే అన్నట్టు అతనికి ఏదో సంఘటన గుర్తు వచ్చినట్టు అనిపిoచింది.

తల విదిలించుకున్నాడు.

చుట్టుపక్కల వాళ్ళను అడిగినా చుక్కనీరు అప్పుగా కూడా ఇవ్వలేదు. మూర్ఖులు, దుష్టుల,, దుర్మార్గులు.. పాతతరం మారిపోయి కొత్తతరంలో కొత్తగా తయారైన వెధవలు.. దమ్మిడీముఖం గాళ్లు.. వీళ్ళకి ఏం తెలుసు నా హోదా అనుకున్నాడు మనసులో.

కాంట్రాక్టు పద్ధతిలో వచ్చిన నలుగురు పనివాళ్లు ఇక్కడ విధానాలు తాము తట్టుకునేలా లేవని.. జీతం నాలుగు రెట్లు ఇచ్చినా ఉండలేమని వెళ్లిపోయారు.

***

ఇక మేడపైన రెండవ అంతస్తులో వినబడిన శబ్దంతో పైకి వెళ్ళాడు ప్రద్యుమ్నరావు. తన భార్య మంచం మీద నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయి ఉంది!

అదే గదిలో ఉన్న బంగారు ఉయ్యాలలో కూర్చుని ఊగుతున్నాడు ప్రద్యుమ్నరావు, ఏం చేయాలో తోచక.

తన సంతానం ఎప్పుడో తనను కాదని దూరంగా వెళ్ళిపోయారు. బంధువర్గం తన పద్ధతులు నచ్చక ఇంకా దూరంగా ఉన్నారు.. ‘లేదు లేదు.. నేనే ఆ వెధవలను అందరిని దూరం పెట్టాను’ అని సమర్థించుకున్నాడు మనసుతో.

ప్రస్తుత సమస్య.. ఇప్పుడు ఏం చేయాలి? ఈ శవాన్ని ఎలా తీసుకెళ్లాలి..?

ప్రద్యుమ్నరావు ఊగుతున్న బంగారపు ఉయ్యాల గొలుసులు తెగిపోయి ఒక పక్కకు వాలిపోయింది. దాంతోపాటు అతను కూడా జారి కిందపడ్డాడు.

***

ఏది ఆగినా.. ఈ కాల చక్రంలో మార్పులు ఆగవు కదా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.

ఉన్నట్టుండి.. ఎండ పూర్తిగా తగ్గిపోయి వాతావరణం మారిపోయింది. పెద్ద గాలి దుమారం మొదలయింది. ఆకాశం నల్లగా నిగనిగలాడుతోంది. మేఘాలతో.. వర్షం భయంకరంగా ప్రారంభమయిపోయింది.

ఆ చుట్టుపక్కల భూ మార్గాలన్ని బురద మయం అయిపోయాయి. ఆ భయంకర రాకాసి వర్షానికి గంటల వ్యవధిలో వీధులలో అడుగు లోతు నీరు నిలిచి పోయింది.. ఎంత చిత్రం?

గంట ముందు ఈ భూ తల్లికి.. ఇప్పటి భూతల్లికి ఎంత మార్పు?

గంట క్రితం నీటి కటకటకు ఇప్పటి నీటి ప్రవాహానికి ఎంత తేడా?

ప్రద్యుమ్నరావు సెల్‌ఫో న్ అందుకని ఒక నెంబర్ నొక్కాడు.. అది దగ్గరలోని మునిసిపల్ ఆఫీస్.

“హలో.. మునిసిపల్ మహేశ్వరరావుగారా.. నమస్తే నేను ప్రద్యుమ్నరావుని. ఏం లేదు.. మా ఇంటి నుండి ఒక డెడ్ బాడీ స్మశానానికి తీసుకెళ్లాలి. అర్జెంటుగా వాహనాన్ని ఇద్దరి మనుషులను పంపండి. ఏమిటి వారం నుండి అందరూ స్ట్రైక్‌లో ఉన్నారా.. మీకేమో కడుపులో నొప్పి వస్తుందా, సరే ఫోన్ పెట్టేయండి” అంటూ గట్టిగా అరిచాడు.

మళ్లీ మరో నెంబర్‌కు ఫోన్ చేశాడు.

“హలో నాయుడు.. నేను రా.. వాయిదాల పద్ధతిలో నీకు కారు కొనిపెట్టిన ప్రద్యుమ్నరావుని. నీ కారు అప్పు మొత్తం నేను తీర్చేస్తాను కానీ నువ్వు కారుతో ఒకసారి మా ఇంటికి రా.. ఏమిటి.. కారుకు యాక్సిడెంట్ అయిందా.. నువ్వు కాళ్ళు విరిగి హాస్పిటల్‌లో ఉన్నావా.. సరే ఫోన్ పెట్టేయ్”.

ప్రద్యుమ్నరావు చిరాకుతో చిర్రెత్తి పోయాడు. సెల్ ఆఫ్ చేసి వీధిలోకి వచ్చాడు

గతంలో ఎప్పుడు చూడని ఓ వ్యక్తి ఒంటెద్దు బండి తోలుకుంటూ వెళ్తున్నాడు. అతడిని ఆపి లోపలకు పిలిచి విషయం చెప్పాడు ప్రద్యుమ్న రావు.

దానికతను చేతులు కట్టుకుని ఇలా అన్నాడు ..

“అయ్యా నా పేరు పరోపకారం. పేరుకు తగ్గట్టు నాకు అందరికీ ఉపకారం చేయాలనిపిస్తుంది.. అమ్మగారిని స్మశానం వరకు తీసుకెళ్తాను బాబు నా గూడు బండిలో.. మీరు లక్ష రూపాయలు చూపిస్తున్నారు. నాకొద్దు. మీ దగ్గరే ఉంచుకోండి బాబయ్య.” అన్నాడు.

“ఇలాంటి మహా బాధ శత్రువుకి కూడా రాకూడదు బాబయ్య..” అనుకుంటూ నెత్తి మీద పడుతున్న ధారాపాత వర్షపు నీటితో పాటు తన కళ్ళలో నీళ్ళు కూడా తుడుచుకున్నాడు బండి పరోపకారం.

అప్పటికే చెడువాసన కొడుతున్న శవాన్ని గూడుబండిలో నెమ్మదిగా పడుకోబెట్టి స్మశానం వైపు వెళుతున్నారు.. ఆ ఇద్దరూ.

గాలి ఉధృతి పెరిగింది. ఒంటెద్దు బండి తిరగబడి పోతుందన్నoత నీటి ప్రవాహంలో నుంచి వెళ్తుంది ఆ బండి. ఇంచుమించు మోకాలి లోతు నీరు.

చాలా సేపటికి ఒంటెద్దు బండి నెమ్మది నెమ్మదిగా స్మశానం దారిలోకి వచ్చింది. అయినా అలా మరో రెండు కిలోమీటర్లు వెళ్తేనేగాని.. స్మశాన స్థలం రాదు.

అంతే ఆ దారిలో ఒకచోట పెద్ద గొయ్యి ఏర్పడి అందులో బండి చక్రం దిగబడిపోయింది. క్రిందకు దిగి చూశాడు పరోపకారం. ప్రద్యుమ్నరావు సహాయంతో బండిని ముందుకు లాగాలని చూశాడు. ఇద్దరు ఎంత ప్రయత్నించినా పని జరగలేదు.

బండి పరోపకారానికి గుండెల్లో మండిపోయినట్లు అయిపోయింది.. ఆ పరిస్థితికి. దాంతో బాధపడుతూ ఇలా అన్నాడు.. “అయ్యా ఏ వెధవన్నర వెధవ చేశాడో చూడండి ఈ పని.. నేల తల్లిని చంపేసేరయ్యా. పనికిరాని ప్లాస్టిక్ చెత్త ఈ దారి పొడుగు అంతా పోసి పైన మట్టి కప్పి పెట్టాడయ్యా. వాడు తల్లికి తండ్రికి పుట్టిన సన్నాసి అయి ఉండడు.. అందరికీ పనికొచ్చే దారి కదా.. ఈ నేల తల్లిని ఇలా పాడుచేయొచ్చా. ఆ వెధవ అశుద్ధం తినే మనిషి. ఓ పక్క అమ్మ గారు మొఖం చూడండి.. వానకు తడిసి భరించరాని కంపుతో.. ‘నన్ను త్వరగా స్మశానానికి తీసు కెళ్లి కప్పెట్టండిరా..’ అన్న ట్టుoది కదూ.

నేను ఆ తల్లి ముఖం చూడలేనయ్యా.. ఈ కష్టమంతా పడేసరికి నాకు కూడా నీరసంతో ఆయాసంగా ఉంది. నేను వెళ్ళిపోతానయ్యా. మాట ఇచ్చి పని పూర్తిగా చేయలేకపోతున్నందుకు క్షమించండి. మిగతా కార్యక్రమం ఎలా పూర్తి చేస్తారో మీరే చేసుకోండి.. ఇక నా వల్ల కాదు. ముందు నా ప్రాణం పోయేలా ఉంది. నా పెళ్ళాం పిల్లల విషయం చూసుకోవాలి కదా” అంటూ వెళ్లిపోయాడు.. ఒంటెద్దు బండి పరోపకారం.. బండిని అక్కడే వదిలేసి.

ఒక పెద్ద ఉరుము పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు మీద పడి ఆ చెట్టు భస్మం అయిపోయింది.

ప్రద్యుమ్నరావులో.. మానవుడు మొదటగా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తన భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి ఎవరు?

ఆ కార్య సాధన కోసం తను ఎవరిని అభ్యర్థించాలి..?

ఆలోచించడం ప్రారంభించాడు ప్రద్యుమ్నరావు.

***

ఇప్పుడు అతని అడుగులు అతనికి తెలియకుండానే.. బండిని, భార్యశవాన్ని అక్కడే వదిలేసి వెనక్కు తిరిగి వెళుతున్నాయి. ఆ యొక్క ఉన్నతమైన కార్య సాధన కోసం ఓ మహానుభావుడి సహాయం అర్థించా లనేది అతని ఆశయంగా అతని ప్రతి అడుగు పడు తుంది.

బురద.. గోతులు.. గుంటలు.. ఆ దారి మార్గమంతా.. అయోమయంగా ఉంది.

“అమ్మా.. నేలతల్లి.. నిన్ను తొక్కుకుంటూ వెళ్తున్నాను. నీకు తీరని ద్రోహం చేసిన.. నన్ను క్షమించమ్మా.. నాకు సరైన మార్గం చూపించు నేలతల్లి”

ఇన్ని సంవత్సరాల జీవితంలో మొట్టమొదటి సారిగా మనసులో స్మరించుకున్నాడు. కోటానుకోట్ల రూపాయల పడగలు కింద కాపురం ఉంటున్న ప్రద్యుమ్నరావు.

అంతేకాదు.. సృష్టిలో కనపడని ఒక నిరుపయోగమైన కన్నీటి బొట్టు కార్చాడు మొట్టమొదటగా.

తనను ముందుకు వెళ్లనివ్వకుండా పక్కకు తోసి పాడేస్తున్న మోకాలిలోతు నీటి ప్రవాహాన్ని కూడా చేతులెత్తి వేనోళ్ల నమస్కరించాడు.. నీటి విలువ తెలుసుకోకుండా అహంకారంతో లెక్కలేని తనంగా బ్రతికిన తనను క్షమించమని ఈ పరిస్థితి నుండి రక్షించమని.. ఎంత అరిచినా సృష్టిలో ఎవరికీ వినపడనంత గట్టిగా అరుస్తూ ఏడుస్తూ.. పడుతూ లేస్తూ నడుస్తున్నాడు.

ప్రద్యుమ్నరావు.. ఒక కార్య సాధన దీక్ష కంకణబద్ధుడై.

అలా అలా.. అతి కష్టం మీద ఆ ఊరి చివర మట్టి దిబ్బలు. చాలా ప్రయాసతో అవన్నీ దాటాక చిట్టిపాకలు ప్రాంతం.. అప్పుడు కూడా పడుతూ లేస్తూ ఆ ప్రాంతం దాటాక.. ఆ సన్నపాటి సందు మార్గంలాంటి దారి చివర ఒక క్రుంగిపోతున్న రెల్లుగడ్డి గుడిసె. దాని తాలుక వీధి తాటాకు తలుపు మీద వాలిపోయి పడ్డాడు నీరసంగా.. ప్రద్యుమ్నరావు.

వెంటనే కళ్ళు తెరచి చూసేసరికి.. లోపల ఎర్రమట్టి పిట్టగోడ మీద కూర్చున్న ఒక అసమర్థ సామాన్య మనిషి వెంకటకృష్ణారావు పాదాలపై తన శిరస్సు ఉన్నట్టు గ్రహించగలిగేడు. ద గ్రేట్ ప్రద్యుమ్నరావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here