అమూల్య నిజంగా అమూల్యమే

0
10

[శ్రీ అంబల్ల జనార్దన్ రచించిన ‘అమూల్య నిజంగా అమూల్యమే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]మూల్య గిరిధర్‌ని చూసి నవ్వింది! ఆ నవ్వుకు గిరిధర్ ఐసయ్యాడు. కాడూ మరి! ఆ నవ్వు, దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకు వచ్చినపుడు, కౌరవాదులు నవ్విన ఎగతాళి నవ్వు కాదు. రాముడు శివ ధనుస్సు విరచగానే సీతాదేవి, గోముగా, కైపుగా, సిగ్గుగా, మత్తెక్కించే నవ్వు. సోడా బాటిల్ కళ్లద్దాలతో, తలపై ఐదంటే ఐదు వెంట్రుక పోసలతో, చామన ఛాయతో, వయసుకంటే పదేళ్లు ఎక్కువగా కనిపించే గిరిధర్‌ని చూసి, కళ్ళు చెదిరే అందగత్తె అమూల్య నవ్వడం, వింతల్లో కెల్లా వింత. ఐతే దానికీ కారణం ఉంది. ఆగండి తొందరపడకండి. మున్ముందు మీరే తెలుసుకుంటారు.

అమూల్య, గిరిధర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. గిరిధర్ ఆ కంపెనీలో పాత కాపు ఐతే అమూల్య, కొత్తగా చేరిన కూన. టీం లీడర్ గిరిధర్ టీంలో కొత్తగా చేరిన జాణ. అమూల్య, తాను చేరిన అనతి కాలంలోనే గిరిధర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది. అంతవరకు ఏ చిన్న తప్పు చేసినా టీం సభ్యులను చీల్చి చెండాడే గిరిధర్, అమూల్య విషయంలో మాత్రం, మెతక వైఖరి కనబరిచే వాడు. కార్యాలయం పని గంటలు దాటిన తర్వాత కూడా పనికి సంబంధించిన సూక్ష్మ విషయాలు బోధించేవాడు. ఆ తర్వాత తన కార్లో అమూల్య ఉండే వర్కింగ్ వుమన్ హాస్టల్లో దింపేవాడు. అలా ఇద్దరి మధ్య చనువు పెరిగే సరికి, అమూల్య గిరిధర్‌ని చూసి నవ్వింది. అంత వరకు ఏ అమ్మాయి కూడా గిరిధర్ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు మరి. అలాంటప్పుడు అమూల్య నవ్వు అతనికి అయస్కాంత మవడంలో వింతేముంది? అతను ఆమెకు అతుక్కు పోయాడు.. మనసులో! అమూల్యను ఆకర్షించడానికి ఏవో చేష్టలు చేయసాగాడు. అమూల్య మొదట కాస్త బెట్టు చేసి అతనితో ఆడుకుంది. తనకు అలాంటి చేష్టలు నచ్చవని బెట్టు చేసింది. అలా అతన్ని కాస్త ఏడిపించి, ఆ తర్వాత అనుకూలంగా స్పందించింది. ఇక ఆ లైలా మజ్నూల, రోమియో జూలియెట్‌ల ప్రేమ యాత్ర మొదలయింది.

అప్పటి వరకు పబ్బులనీ, పేకాటనీ, మిత్రులతో మందు పార్టీలనీ పైలా పచ్చీసుగా తిరిగిన గిరిధర్, అమూల్య వెంట చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. వారు పార్కుల వెంటా, ముల్టిప్లెక్స్‌ల వెంటా షికార్లు చేయసాగారు. ప్రేమ గుడ్డిదే కాదు, మూగది, చెవిటిది అని కూడా అతని విషయంలో నిరూపణ అయింది. వారిద్దరి సాన్నిహిత్యం, వారి సహోద్యోగులకు అర్థం కాని పజిల్‌లా మారింది. గిరిధర్ స్నేహితులు, ఒక పాడి ఆవు తమ నుండి దూరం జరగడం తట్టుకోలేక పోయారు. అతని ఖర్చుతో జల్సా చేసిన వారు, తమ పబ్బానికే ఎసరు పడే సరికి, ఎలాగైనా అమూల్య పట్ల అతనికి విముఖత కల్గించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే, అమూల్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమన్న అతని సహోద్యోగుల మాటలు అతని చెవికెక్క లేదు. అందులో అతని సహోద్యోగుల స్వార్థం కూడా ఉంది. ఆ విషయం అమూల్య సోదాహరణంగా ఎత్తి చూపింది. ఇక అమూల్య చెప్పిందే అతనికి వేదమైంది. పరిణామంగా, ఆ చక్కర్లు, మిత్రులతో మజా చేస్తూ ఖర్చు చేసిన డబ్బు కంటే ఎన్నో రెట్లు ఖరీదుగా పరిణమించాయి. ఓ అందమైన అమ్మాయి ప్రేమతో పోలిస్తే, ఆ ఖర్చు ఏ పాటి? అందుకే బాగా అర్జిస్తున్న అతనికి అది భారమనిపించ లేదు. పనిలో చురుకైన అమూల్య, గిరిధర్‌ను తన వెంట తిప్పుకొని అతని నుండి బాగా దండుకుంది. షికార్లకు సుంకం గాక అదనంగా డబ్బు, నగలు బాగా పోగు చేసుకుంది. ఆమె మైకంలో ఉన్న గిరిధర్, ఆమెపై ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడలేదు. రెండు సంవత్సరాల్లో కొన్ని లక్షలు స్వాహా అయ్యాయి. జాణ ఐన అమూల్య, అతన్ని తన చుట్టూ తిప్పుకుంటూనే, హద్దుల్లో ఉంచింది. అతను ఎంత చొరవ తీసుకోవాలని ప్రయత్నించినా, ‘ఆ’ విషయంలో మాత్రం తన జాగ్రత్తలో తనుంది. అంతా పెళ్ళైన తర్వాతేనని ఊరించింది. ఐతే భోజనానికి కళ్లెం వేసినా, టిఫిన్ మాత్రం కడుపారా, ‘తనువు’తీరా పెట్టింది. అల్ప సంతోషి ఐన గిరిధర్, ఆ స్పర్శా సుఖంతో తృప్తి పడ్డాడు. అదే అదనుగా అమూల్య, ఏవో తన కుటుంబావసరాల పేర చాలా డబ్బు దండుకుంది. ఆ విషయం ఎత్తిచూపి, అమూల్యపై నుండి ఎలాగైనా గిరిధర్ మనసును మళ్లించాలని చూశారు ఇతర సహోద్యోగులు. ‘మనం ఎలాగూ పెళ్లి చేసుకుంటాం గదా? ఈ మాత్రం నగలు సమకూర్చుకొంటే తప్పేంటి?’ అలా ఆ అభియోగాలన్నింటినీ అమూల్య చాకచక్యంగా తిప్పికొట్టింది. గిరిధర్ మీద తన పట్టు ఇంకా బిగించింది. తన సహోద్యోగులతో సింహంలా ఉన్న గిరిధర్, అమూల్య ఎదుట గంగి గోవుగా మారాడు. అంతే కాదు, గిరిధర్ బాహ్య రూపాన్ని కూడా సంస్కరించే పనిలో పడింది అమూల్య.

మొదట అతన్ని ఒక పేరుపొందిన కళ్ల చికిత్స సంస్థకు తీసుకు వెళ్లింది. అక్కడ తనే మాట్లాడి, లేజర్ చికిత్సతో గిరిధర్ సోడాబుడ్డి కళ్ళద్దాలకు మంగళం పాడించింది. కాంటాక్ట్ లెన్స్ పెట్టించింది. ఆ ఒక్క మార్పుతో గిరిధర్ బాహ్యారూపం గుర్తు పట్తలేనంతగా మారింది. అతని ఆత్మవిశ్వాసం నాలుగింతలు పెరిగింది. అమూల్య, తన పాలిట దేవత అని ఫిక్సై పోయాడతను. ఆ తర్వాత అతని బట్టతలపై దాడి చేసింది అమూల్య. ఒక జుట్టు మొలిపించే సంస్థకు తీసుకెళ్లి, భారీ ఫీజు కట్టించి, చికిత్స మొదలు పెట్టించింది. దాదాపు మూడు నెలలు చికిత్స కాగానే నిజంగానే గిరిధర్ తలపై మొక్కలు, సారీ వెంట్రుకల మొలకలు మొలిచాయి. అవి కాస్త పెద్దయేదాకా మంచి మహేశ్ బాబు కట్తో ఉన్న విగ్గు తొడిగింది. ఇక చూడండి! గిరిధర్ రూపురేఖలు పూర్తిగా ఎలా మారిపోయాయో? అతన్ని చూసి సంస్థలోని, ఆడవారే కాదు, మగవారు కూడా గిరిధర్ పట్ల ఆకర్షితులయ్యారు. కొందరైతే అమూల్య పట్ల అసూయ పెంచుకొని, సూటి పోటి మాటలతో హింసించ సాగారు. వాటన్నిటికీ అతీతంగా అమూల్య, తన కొంగుకు ఉన్న గిరిధర్‌పై మరింత పట్టు బిగించింది. గిరిధర్‌కి మంచి మంచి బ్రాండెడ్ బట్టలు ఎంపిక చేసి అతన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది అమూల్య. గిరిధర్ ఆనందానికి అంతు లేదు. తనకు తట్టని ఎన్నో విషయాలు అమూల్య సునాయసంగా చేసే సరికి అతను ఆమె పట్ల మరింత అనురాగం పెంచుకున్నాడు. ఆమెను క్షణం కూడా వదిలి ఉండలేని స్థితికి వచ్చాడు.

అటు గిరిధర్ బాహ్య, అంతర మార్పు, ఇటు ఉద్యోగంలో స్థిరపడగానే అమూల్య, తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చేరవేసింది. ఎలాగూ బంధుత్వం ఉందికదా అని అక్కడి నుండి పచ్చ జెండా ఊగింది. ఇక గిరిధర్ అప్పటికే అమూల్య దాసుడయ్యాడాయె. ఇంకేముంది? వారి తలలపై అక్షింతలు పడడమే తరువాయి. ఐతే కానీ కట్నం లేకుండా అమూల్య, గిరిధర్‌ని కొట్టేసిందని మీరనుకుంటే, మీరు దాల్ కడాయిలో కాలేసినట్టే.

గిరిధర్ నుంచి రాబట్టిన డబ్బేకాక, తల్లిదండ్రులు, తన పెళ్ళికై అట్టే పెట్టిన కట్నం మొత్తం కూడా, ఆణా పైసలతో సహా, గిరిధర్ తల్లిదండ్రుల పరం చేసింది అమూల్య. వారు, తాము కోల్పోయిన పొలాలను తిరిగి కొనుక్కున్నారు. అది తెలుసుకున్న గిరిధర్, అవాక్కయ్యాడు. అతను వెంటనే తన ఊరికి ప్రయాణ మయ్యాడు. ఉద్యోగ కొత్తలో తాను పైలా పచ్చీసుగా తిరిగి, వారిని పట్టించుకోనందుకు, తన తల్లిదండ్రులకు మొదట క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత అమూల్య సాంగత్యంలో తాను ఎంతగా మారాడో చిలువలు పలువలు చేసి చెప్పాడు. అమూల్యతోనే తన జీవితం ముడిపడి ఉన్నందున తొందరలో తమ పెళ్లి చేయమని కోరాడు. అటు అమూల్య అప్పటికే తన తల్లిదండ్రులను ఒప్పించింది కదా! ఇక ఆటంకమేముంది? ‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్టుగా అమూల్య, గిరిధర్, పెళ్లి పీటలపై కూర్చున్నారు. ఆ తర్వాత తేనెచంద్ర దిశగా, అదేనండీ హనీమూన్ వైపు మళ్లారు. దార్జీలింగ్, సిక్కిం చుట్టూ తిరిగి కొన్ని వేల రూపాయలు వదిలించుకున్నారు. ఆ కొన్ని రోజులు ఆఫీసు విషయాలను పక్కన పెట్టి, ప్రణయాంబుధిలో ఓలలాడారు.

తమ హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన ఆ ప్రేమ జంటకు, కంపెనీ ఓ తీపి కబురు అందించింది. ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పనిపై మూడు సంవత్సరాల కొరకు అమెరికా పంపాలని నిర్ణయించింది. ఆ భార్యాభర్తల రొట్టె విరిగి నేతిలో పడింది. వారి ఆనందానికి అంతు లేదు. వారు తమ విదేశీ ప్రయాణ సన్నహాల్లో మునిగి పోయారు.

పై సంఘటనలకు ముందు చాలా తతంగం నడిచింది. గతం లోకి తొంగి చూస్తే..

అమూల్యకు ఉద్యోగ ఎన్నిక పత్రం అందగానే, మన వాళ్లకు అలవాటైన పైరవీల ప్రయత్నంలో, అమూల్య తండ్రి దుర్బినీ పెట్టి చూడగా, గిరిధర్ చిక్కాడు. అతని కుటుంబానికీ అమూల్య కుటుంబానికీ ఏదో బీరకాయ పీచు బంధుత్వం బయటపడింది. ఆయన అమూల్యను తీసుకుని గిరిధర్ ఊరికి బయలుదేరాడు. అక్కడ గిరిధర్ గురించి కదపగా, అతని తల్లిదండ్రులు గిరిధర్ నిర్వాకాల గురించి ఏకరువు పెట్టారు. తమ కొడుకు, ఉద్యోగం వచ్చేదాకా ’రాముడు మంచి బాలుడు’ లాగే ఉండేవాడు కాని, ఉద్యోగరీత్యా పట్నం గాలి సోకగానే, తమ చేతి నుంచి జారిపోయాడని వాపోయారు. గిరిధర్ చదువుకని ఊళ్లోని తమ పొలాలు అమ్ముకున్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి అతను పట్నంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వారి పోషణకై ఒక్క పైసా పంపని వైనాన్ని ఏకరువు పెట్టారు. ఎలాగైనా అతన్ని దారిలోకి తీసుకు రమ్మని అమూల్యని కోరారు.

విషయం తెలుసుకున్న అమూల్య, తను ఉద్యోగంలో చేరిన తర్వాత, జాగ్రత్తగా, ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా, పావులు కదపడం మొదలు పెట్టింది. అమూల్య తల్లిదండ్రులకు, గిరిధర్ కుటుంబానికి దూరపు బంధుత్వం ఉన్న సంగతి, అతనికి తెలియదు, అమూల్యకు తెలుసు. అందుకే ఆమె, స్వతహాగా మంచి బాలుడైనా, పెడదారి పట్టిన గిరిధర్‌ని తన దారికి తెచ్చుకోవడానికి చర్యలు తీసుకుంది. తను అతని నుండి రాబట్టిన మొత్తం సొమ్ము ఎప్పటికప్పుడు, అతని తల్లిదండ్రులకు చేరవేసి, వారు అమ్ముకున్న పొలాలను తిరిగి కొనిపించింది. అదంతా గిరిధర్‌కు తెలియకుండా చేసింది. తమ పెళ్ళి కాకముందే ఆమె, తన కాబోయే అత్తింటి వారి కుటుంబ శ్రేయస్సుకు పాటు పడింది. దాంతో తమ భావి జీవితానికి బాటలు వేసుకుంది. సాఫ్ట్‌వేర్ లోనే కాదు మానవ సంబంధాల హార్డ్‌వేర్‌లో కూడా అమూల్య ఆరితేరింది. అందుకే ఆమె గిరిధర్‌ను తన దారికి తెచ్చుకుంది. అలా ఒక తెలివైన వనిత, తనకు కాబోయే భర్త, బాహ్య రూపాన్ని చీదరించుకోకుండా, తన నైపుణ్యంతో అతన్ని సంస్కరించి, ఆ తర్వాత, అతని ఇల్లాలుగా మారింది.

వర్తమానంలో అదంతా తెలుసుకున్న గిరిధర్‌కి, తన భార్యపై ప్రేమ ఇంకా పొంగింది. ఆమె తన జీవితంలోకి వచ్చిన వేళా విశేషంతో తనకు, అమెరికా వెళ్లే యోగం పట్టిందని గట్టిగా నమ్మాడతను. ఆ తర్వాత అతను, ఆమెను గట్టిగా హత్తుకుని, ఆ తర్వాత ఏం చేశాడో వేరే చెప్పాలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here