అము : మానని గాయాల పరిచయం

0
14

[box type=’note’ fontsize=’16’] “1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మారణ కాండ బీభత్సం గురించి హృదయాన్ని మెలిపెట్టేలా తీసిన సినిమా” అంటున్నారు పరేష్. ఎన్. దోషిఅము‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]మ[/dropcap]న దేశం యెన్నో రకాలుగా వైవిద్యమున్న దేశం. భాషలు, మతాలు, సంస్కృతులు ఇలా యెన్నో. అప్పటికీ శతాబ్దాలుగా కలిసి వున్న కుటుంబం కూడా. అయితే దిష్టి చుక్కల్లా చరిత్రలో కొన్ని రక్తపు మరకలు కూడా వున్నాయి. 1947 అని, 1984 అని, 2002 అనీ. ఇవి యేకకాలంలో మనిషిని భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, మనిషిని తన నిజమైన ఉనికిని గుర్తు పట్టే అవకాశమూ ఇస్తుంది. వొకరకంగా మనిషికి ఇవి పరీక్షా కాలాలు.

1947 కాలంలో దేశ విభజన, తత్పరిణామంగా జరిగిన మారణ కాండ, మనుషుల మధ్య వైమనస్యం, అలాగే మానవత్వం మేల్కొని పరిస్థితులను చక్క బెట్టడం అన్నీ జరిగాయి. ఇస్మత్ చుగ్తై, మంటో, ఖుష్వంత్ సింఘ్ లాంటి చాలా మంది సాహిత్య కారులు ఆ మానవ వేదనను తమ రచనలల్లో అద్దం పట్టారు.

1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మారణ కాండ బీభత్సం. మిగతా వాటి గురించి తెలిసినంతగా దీని గురించి ప్రపంచానికి తెలీదు. ఆ కోణంలో వచ్చిన ఒక చిత్రం “అము”.

అప్పట్లో షబానా ఆజ్మి యెలాంటి నటో, దాదాపు అలాంటి ఈ కాలపు నటి కొంకణా సెన్ శర్మ. తాత చిదానంద దాస్‌గుప్తా సత్యజిత్ రాయ్ బృందంలో వొకడు, విమర్శకుడు, దర్శకుడు కూడానూ. తల్లి రాయ్‌కి వారసురాలనిపించుకున్న అపర్ణా సేన్. తండ్రి రచయిత. ఇక ఆ జీన్స్ వూరికే పోతాయా? మనకున్న గొప్ప నటులలలో కొంకణా వొకతె. నేను ఈ చిత్రం కూడా ముఖ్యంగా ఆమె గురించే చూశాను.

ఇప్పుడు 21 సంవత్సరాల అము ముద్దు పేరు కాజు (కొంకణా సెన్ శర్మ) అమెరికా నుంచి భారతదేశానికి- ఢిల్లీకి- వచ్చింది. మూడేళ్ళప్పుడు అమెరికా వెళ్ళిన అమ్మాయి, ఇప్పుడు తన మూలాలను వెతుక్కుంటూ వచ్చింది. వూరంతా చూడటం, తల్లి చదువుకున్న కాలేజి చూడడం, అక్కడి కేఫ్‌లో టీ తాగడం ఇవన్నీ ఉత్సాహంగా చేస్తుంది. అక్కడ కలిసిన కబీర్ (అంకుర్ ఖురానా) వెక్కిరిస్తాడు, ఈ కట్టడాలు కాదు నిజమైన భారతాన్ని నువ్వు చూడాలి. నువ్వు వొక సగటు ఎన్నారై లా వచ్చి వెళ్ళడం కుదరదు అంటాడు. ఆమె అలాగే slums కూడా చూస్తుంది. కాని కొన్ని కొన్ని చోట్ల తను ఇదివరకు చూసిన, తిరిగిన స్థలాల లాగే అనిపించడం మొదలు పెడుతుంది. యేమిటో బోధ పడదు. చెప్పే వారు లేరు. ఈ లోగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె తల్లి కేయా రాయ్ (బృందా కరాత్ — అవును కమ్యునిస్ట్ పార్టీ సభ్యురాలు, మాజీ ఎంపీ) వస్తుంది. తన కూతురు మురికి వాడలకు వెళ్ళొచ్చిందని తెలిసి చాలా వ్యాకుల పడుతుంది. కూతురిని వారిస్తుంది. దానితో కాజుకి ఆసక్తి మరింత గట్టి పడి, చాటుగా తిరుగుతుంది అవే వాడలు కబీర్ సాయంతో. అలా తిరిగిన ఆమెకు తన మూలాలు తెలుస్తాయా? అసలు ఆమె యెవరు? మరో పక్క కథ 1984 నాటి మారణకాండ గురించి కథ నడుస్తుంటుంది. కబీర్‌కి ఆ కథ తెలుసుకోవాలని ఆసక్తి. కాని యెక్కడా సరైన సమాచారం అందదు. వొక పక్క 1984 గురించిన కథ కోసం వెదుకులాట, మరో పక్క తన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని అన్వేషించే కాజు. ఇద్దరి అన్వేషణా వొకే చోట ముగుస్తాయి. అది కూడా ఇక్కడ వెల్లడి చేస్తే ఇక తెర మీద చూసిన అనుభూతిని హరించడం తప్పు కదూ. చూడండి 2006 నాటి ఈ చిత్రాన్ని. నెట్‌ఫ్లిక్స్‌లో వుంది.

దర్శకురాలు షోనాలి బోస్. ఇది ఆమె తొలి చిత్రం. తొలి చిత్రానికే జాతీయ అవార్డును గెలుచుకుంది. దర్శకురాలే వ్రాసుకున్న పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని తీసిన చిత్రమిది. మీకు గుర్తుంటే ఈ మధ్య “మార్గరిటా విత్ అ స్ట్రా” వచ్చింది. అది కూడా ఈమె తీసినదే. కొంకణా నటన గురించి కొత్తగా చెప్పేదేముంది! చాలా బాగా చేసింది. ఆశ్చర్యంగా బృందా కరాత్ కూడా. ఆంబ్రోస్ చాయాగ్రహణం బాగుంది. హృదయాన్ని మెలిపెట్టే ఈ చిత్రాన్ని మీరూ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here