సుభాషిణి కథల్లో వస్తు వైవిధ్యం

0
9

[dropcap]ప్ర[/dropcap]జలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేయాల్సిన ప్రభుత్వాలు క్రమంగా బాధ్యత నుండి తప్పించుకుంటున్నాయి. 1986లో జాతీయ విద్యా విధానం ప్రకటించిన నాటి నుంచి ఉన్నత విద్యకు ప్రాధాన్యత తగ్గించడం మొదలయ్యింది. ఉన్నత విద్యాసంస్థల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని, ఉన్నత విద్యాసంస్థలు స్వంతంగా నిధులు సమకూర్చుకోవాలని విద్యా విధానం, కార్యాచరణ కార్యక్రమం రెండూ నొక్కి చెప్పాయి.

విద్యారంగంలో సంభవిస్తున్న మరొక పరిణామం విద్యకు మార్కెట్ ఓరియంటేషన్ ఇవ్వడం. కేంద్ర మానవ వనరుల మంత్రి నుండి మొదలుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఎవరు మాట్లాడినా, మార్కెట్ అవసరాలను తీర్చడానికి విద్యను సంస్కరించాలని చెబుతారు. దాంతో ఉన్నత విద్యలో ప్రత్యేకించి సాంకేతిక విద్యకు నిరంతరాయంగా డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్‌ను కొన్ని రాష్ట్రాలలో ప్రైవేటు కళాశాలల స్థాపనతో సరిపెట్టారు. విద్యార్థుల నుండి కాపిటేషన్ ఫీజును పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో కంటే 15 – 20 రెట్లు అధిక ఫీజులు ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి.

విద్యారంగం పూర్తిగా వ్యాపారమయం అయిపోయింది. విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు నివ్వాలని తపనతో, ఎన్నో ఆశలతో అప్పులు చేసి, స్థిరాస్తులను తెగనమ్మి, పరువు ప్రతిష్ఠల కోసం తమ పిల్లలను కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివిస్తున్నారు. మరికొంతమంది బంధువులతో పోల్చుకొని గొప్పల కోసం తమ పిల్లలని కార్పొరేట్ విద్యాసంస్థలలో చదివిస్తున్నారు. ప్రైవేటు విద్య సంస్థలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారా అంటే అది లేదు. బట్టీ చదువులతో, విద్యార్థులలో యాంత్రికీకరణ జరుగుతున్నది.

చట్ట విరుద్ధంగా వందల సంఖ్యలో విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా వెలుస్తున్న కాలేజీ బ్రాంచీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు – విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించుకుంటూ మాయ చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న మాయను, వాటి వ్యాపార సంస్కృతిని, దోపిడీ – అరాచకాలను ప్రతిభావంతంగా బయట  పెట్టిన వారిలో కె.సుభాషిణి ముఖ్యులు.

రిజల్ట్స్ రాగానే తెలివైన కుర్రాళ్లను ఏరి, మాయమాటలు చెప్పి తమ కాలేజీల్లో చేర్పించడానికి పి‌ఆర్‌వో‌లను నియమించుకుని ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో  నీవు నేర్పినదే’ కథలో చూపించారు. ఎవరైనా సౌకర్యాలు లేవని, వేరే కాలేజీలో చేర్పిస్తామనీ అంటే వాళ్లతో రాయించుకున్న బాండ్ గురించి జ్ఞాపకం తెచ్చి, వారి నోరు మూయించి వెళ్లగొడతారు. అలాంటి మోసాలు ఇంటర్ నుండే మొదలవుతాయి.

పిల్లల్ని కాలేజీలో చేర్పించడం ఒక ఎత్తయితే వాళ్లకు కావలసిన వస్తువులు, దుస్తులు, సెల్ ఫోన్, విలాసవంతమైన కోర్కెలు అన్ని తీర్చాలి. డబ్బున్న పిల్లలను చూసి తాము అలాగే ఉండాలని తల్లిదండ్రులను పీడిస్తుంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించిన తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోని అమూల్య’ తన స్నేహితుల లాగానే తనకు అన్ని కావాలనీ; వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు, దుస్తులు తనకు ఉండాలని పట్టుబట్టడం, తల్లిదండ్రులు నిదానంగా ఆమెను తమ మాటల ద్వారా నచ్చచెప్పి ఆమెను మార్చుకుంటారు.

రమాదేవి కొడుకు’ కూడా అంతే. కంప్యూటర్ చదివిన ‘రమాదేవి కొడుకు’ వ్యాపారం పేరిట తల్లి దగ్గర లక్షలు లక్షలు గుంజి నష్టపోయి, మళ్లీ కొత్త వ్యాపారానికి డబ్బులు అడగడం మామూలైపోయింది. భర్త చనిపోయి అటెండర్ ఉద్యోగంతో పొదుపుగా గడుపుతున్న తల్లిని అప్పులపాలు చేసింది చాలక లగ్జరీల కోసం వెంపర్లాడుతూ తల్లికి దిన దిన నరకం చూపిస్తాడు ఆ కొడుకు.

పిహెచ్‌డిలు చదువుకున్న వాళ్లు కూడా మతాన్ని, భక్తిని అడ్డం పెట్టుకుని, తమ మూర్ఖత్వాన్ని ఎదుటి వాళ్లకు కూడా బదలాయిస్తూ, ప్రజల్ని మోసం చేసే వ్యాపారాలు ఎలా చేస్తుంటారో డా. నీలకంఠం, పి.హెచ్.డి’ చూపిస్తాడు.

ప్రభుత్వ కళాశాలలకు కనీస అవసరాలు తీర్చడానికి ఫండ్స్ ఉండవు. యూజీసీ వర్క్‌షాపుల పేరిట లక్షలకు లక్షలు ఇట్టే ఖర్చు పెట్టేస్తారు. ఆ ఖర్చులు… ఆ వైభవాలు… ఆ కెరీరిజం… ఎవరికోసం… ఎందుకోసం అని గుహ’ కథలో రచయిత్రి నిలదీస్తారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు సిబ్బందిని పిండుకుని పని చేయించుకుంటాయి. అదో రకమైన వెట్టిచాకిరి. ఉద్యోగులకు పనితో కుటుంబ జీవితం లేకుండా పోతుంది. టెన్షన్‌తో, వర్క్ ప్రెషర్‌తో ఆరోగ్యం చెడిపోతుంది. ఇదంతా అవసరమా అనే ఆలోచనలో పడతాడు ప్రసాద్. ఈ కథకు ఒకటి x రెండు – మూడు’ అనే ఈక్వేషన్‌తో శీర్షిక నివ్వడం చాలా బాగా వచ్చింది. ఉద్యోగం వల్ల పొందే ప్రయోజనం రెండు అయితే నష్టం మూడు అని సాంకేతికంగా తెలియజేసిన తీరు ఆకట్టుకుంటుంది.

వస్తువ్యామోహం, వినిమయ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. కేబుల్ టీవీ, సెల్ ఫోన్‌లతో వ్యాపార ప్రకటనలు నట్టింట్లోకి చొచ్చుకు వస్తున్నాయి. అవసరమున్నా, లేకపోయినా ఆ వస్తువులను కొనేటట్లుగా ప్రలోభపరుస్తున్నారు. అరువు, వాయిదాల పద్ధతులు ప్రవేశపెట్టి వాళ్లను కొనుగోలు మాయాజాలంలో పడవేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో యువతను టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని ‘అమూల్య’, ‘రమాదేవి కొడుకు’ కథలలో గమనించవచ్చు. ఈ కాలం పిల్లలకి సామాన్లు, వస్తువుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదేమో అనిపిస్తుంది. తాము ఏది అడిగితే అది కొనిస్తే అప్పుడు తల్లిదండ్రులకు తమ మీద ప్రేమ ఉన్నట్లు అనుకుంటున్నారు ఈ జనరేషన్ పిల్లలు. అలా తల్లిదండ్రుల ప్రేమను ఎన్‌క్యాష్ చేసుకుంటున్నారని ‘అమూల్య’ కథలో తెలియచేస్తారు. ‘రమాదేవి కొడుకు’ కూడా అంతే. ఉన్న డబ్బుని మల్టిఫ్లయ్ చేయాలి. కంఫర్ట్‌గా లైఫ్ లీడ్ చేయాలి అని భావించి డబ్బు కోసం తల్లిని పీడిస్తుంటాడు.

సిమెంట్ ఫ్యాక్టరీలకు భూములిచ్చిన రైతులు, వచ్చిన డబ్బులను విలాస వస్తువులకు ఖర్చుచేసి, బికారుల్లాగా మిగలడం గద్ద రెక్కల చప్పుడు’లో కనిపిస్తుంది. ఇందులో రైతుల దగ్గర డబ్బులు వున్నాయని తెలియగానే పట్నం నుండి వ్యాపారులు వచ్చి షోరూములు తెరిచి ఆ విలాస వస్తువులను అంటగట్టిపోతారు. ఇంకోవైపు బ్యాంకులు, ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బు కోసం ఊదరగొడతారు. కరెంటు సరిగా వుండని ఆ వూళ్లో ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ అనవసరం అన్న స్పృహ చివరికి గానీ కలుగదు.

మనకు పనికిరాని దాన్ని ఎవరికో ఒకరికి దానం పేరిట అంటగట్టి సంతృప్తి పడడం మనకు అలవాటు. కార్పొరేట్ సంస్థలు తమ దగ్గర పనిచేసే మేధావి వర్గానికి, తమ దగ్గర అమ్ముడుపోని వస్తువులను గిఫ్టు’ల రూపంలో వాళ్లకు అంటగడితే, ఆ వర్గం ఆ పనిని ఒకవంక విమర్శిస్తూనే, మళ్లీ తాము తమ దగ్గర పనిచేసే వాళ్లకు వాటిని బదలాయించడం, వాళ్లు కూడా వాటిని ఎలా వదిలించుకోవాలా అని చూడటం – ఇదంతా చక్రభ్రమణంలా కొనసాగుతూనే ఉంటుంది.

ధర్మము, రాజ్యము పేరిట ఇతిహాసాలలో, పురాణాలలో, ప్రబంధాలలో స్త్రీలపై కొనసాగిన వివక్ష – అన్యాయాలను బట్టబయలు చేయడానికి స్త్రీవాదులు పూనుకున్నారు. కొన్ని సందర్భాలలో ఆ అన్యాయాలను సరిదిద్దడానికి ప్రయత్నించారు కూడా. ఈ దిశగా సుభాషిణి రాసిన రెండు కథలు వైవిధ్యభరితంగా రూపొందాయి. ఇందులో ఆడవాళ్లు తాము ఆడించినట్టు ఆడటం లేదనీ, తమ ఆటలు సాగడం లేదనీ, వాళ్లకు జ్ఞానం లేకుండా చేయమని అర్థించిన భూలోకవాసులను – దానిని సమర్థించిన బ్రహ్మదేవుని నిరసిస్తూ సరస్వతీదేవి భూలోకానికి వచ్చి స్త్రీలను మరింత జ్ఞానవంతులుగా, ధైర్యవంతులుగా చేయడానికి నిశ్చయించుకోవడం బ్రహ్మ సూత్రాలు’లో కనిపిస్తుంది.

లక్షణ’ను శ్రీకృష్ణుడి భార్య కావడం కంటే వేరే అదృష్టం ఏముంటుంది అంటారు. కానీ తన వయసు కంటే రెట్టింపు వయసు సవతులతో సహవాసం, ఈర్ష్యా అసూయలతో వారితో పోటీ… ఇదా అదృష్టం! పక్షం రోజులకు ఒకసారైనా దర్శనమీయని భర్తతో ఎలాంటి ముచ్చటకు నోచుకోని లక్షణ. కథ మొదలైనప్పుడు భర్తను ఆకర్షించాలనే ఆరాటం, ఆమె భావ సంఘర్షణ పూర్తయి – చివరకు భర్త వచ్చేటప్పటికీ ఆమెకి అతనిపై కలిగిన విముఖత, ఒకే సంఘటనలో భావ పరిణామ క్రమంగా చూపించిన విధానం అద్భుతం. పెళ్లయిన తర్వాత భర్త, అత్తింటివాళ్లు కొత్త పెళ్ళికూతురును మెల్లగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆమె ఇష్టాఇష్టాలను పక్కనబెట్టి ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబుతూ ఆదర్శ గృహిణి అని ముద్రవేసి ఆమెను నోరెత్తకుండా చేస్తారు. అలా భర్తకు, కుటుంబానికి అంకితమైన భార్య క్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోయిన సంగతిని జారవిడిచిన రంగులు’ కథలో సింబాలిక్‌గా చెప్పిన విధానం చాలా బాగుంది. అమ్మాయిలకు పెళ్లి అయితే చదువు, ఉద్యోగాలకు దూరం ఉంచుతారు. ఒకవేళ ఉద్యోగినిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పెద్దయ్యేవరకు లీవు పెట్టమంటారు. అదే శ్రామిక మహిళలు తాము పనిచేసే స్థలానికే పిల్లల్ని తీసుకుపోయి, వాళ్లను చూసుకుంటూనే పని చేసుకోవాలి. మగవాడికి ఎలాంటి ఆంక్షలు లేవు. మగవాడు తనకు అనుకూలంగా మాత్రమే సుఖంగా ఉండడానికి తయారు చేసుకున్న ఈ లోకాన్ని స్త్రీలే సరిదిద్దాలని కథానాయిక నిర్ణయించుకోవడం అన్వేషణ’లో చూడవచ్చు.

రేప్‌కు గురైన బాధితురాలని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిస్తే ఎవరూ పట్టించుకోరు. కేసును నీరు కార్చమని పైనుండి ప్రయత్నాలు. దాంతో మహిళా సంఘాలు కలిసి అరుణ కోసం’ ఆందోళన జరిపి, ఆమెకు న్యాయం జరిగేట్టు పోరాడుతాయి.

వివక్ష రకరకాల రూపాల్లో కొనసాగుతుంది. అలాంటి వాటిలో ప్రాంతీయ వివక్షత ఒకటి. కోస్తా వారి వివక్షతకు గురైన రాయలసీమ స్త్రీల ఆవేదనను – ఆవేశాన్ని గాయాలు’ కథ చిత్రీకరించింది. ఇందులో విజయవాడలో చదువుకుంటున్న కూతురు రాయలసీమలో ఉండే తల్లికి తనకు తగిలిన మానసిక గాయం గురించి చెబుతుంది. కథ కూతురు గాయాలనుంచి, తల్లికి గతంలో తగిలిన గాయాల తలపుల లోకి ప్రవహించి ఆఫీసుకు చేరి, ఆఫీసులో కోస్తా కొలీగ్‌తో జరిగిన వాదనలో రాయలసీమ ఆత్మగౌరవాన్ని చూపించే విధంగా సంభాషణ మలచబడి, దానికి విడిపోవడమే పరిష్కారంగా చూపిస్తూ కథ ముగించారు.

మద్యం వ్యాపారంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆదాయం కోసం నానా రకాలుగా ప్రయత్నించి ప్రజలను తాగుబోతులుగా చేస్తున్నారు. సంపాదించినదంతా తాగుడికి పోసి, కుటుంబాలకు తిండి లేకుండా చేస్తున్న మగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు లిక్కర్ వ్యాపారంలో తలమునకలుగా ఉంటే, ఇక ప్రజల గోడు పట్టించుకునేదెవరని బ్లాక్ హోల్’లో ప్రశ్నిస్తారు.

సుభాషిణి ఏ కథను రాసిన, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, దాన్ని వైవిధ్యభరితంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారని వీరి కథలను చదివితే తెలిసిపోతుంది. ఉన్నత విద్యకు సంబంధించి ముఖ్యంగా సాంకేతిక విద్యలో చోటు చేసుకున్న అపసవ్య ధోరణులను – వ్యాపార సంస్కృతిని నిరసిస్తూ రామా చంద్రమౌళి, కె.సుభాషిణి ఇద్దరే కథలను రాస్తున్నారు. వీరిద్దరూ సాంకేతిక విద్యారంగంలో పని చేయడం కారణం కావచ్చు. సుభాషిణి స్త్రీవాద కథలను రాయడంలో కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజల్లో పెరుగుతున్న వస్తు వ్యామోహ సంస్కృతిని, అస్తవ్యస్త ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కూడా వీరు కథలను రాయగలిగారు. వీరి కథలను చదవడమే గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. వైవిధ్యభరితంగా ఉన్న ఈ కథలు ఆసక్తికరంగా చదివింప చేయటమే కాదు, ఆలోచింపజేస్తాయి కూడా.

***

అమూల్య
కె. సుభాషిణి కథలు
స్ఫూర్తి ప్రచురణలు, కర్నూలు.
పేజీలు: 191, వెల: ₹ 150.
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here