అనార్టిస్ట్ బయోగ్రఫీ

0
10

[dropcap]ని[/dropcap]ద్ర ఎందుకు పట్టదు?. అసలు కళ్ళు సోలిపోయి ఉన్నా మనసు ఎక్కడికో పరుగులు పెడుతుంది ఏంటి? పరుగు… ఎందుకు?

నిద్రకు,

నిద్రెందుకు?

పరిగెట్టేందుకు,

పరుగెందుకు?

ఎందుకా? పొద్దున తొమ్మిది కల్లా ఆఫీసులో ఉండాలి, పదింటికల్లా బుర్ర క్రియేటివ్ ఐడియా ఇవ్వాలి, పదకొండుకల్లా పోస్టర్ రెడీ అవ్వాలి. అది చూసి జనం చొంగ కార్చాలి. అప్పుడు నేను హిట్ అయినట్టు. లేదంటే కంపెనీకి వైట్ ఎలిఫెంట్‌ని.

బైక్ మీద మాదాపూర్ పరిగెడుతున్నాయి నా ఆలోచనలు.

నిన్న నేను డిజైన్ చేసిన పోస్టర్ బాలేదని క్లైయింట్ నుంచి ఫీడ్బ్యాక్, అదీ అర్ధరాత్రి మూడు గంటలకు. అమెరికాలో వాడు ఎప్పుడు లేస్తే, ప్రపంచమంతా అప్పుడే లేస్తుంది అనుకుంటాడు కాబోలు. అమెరికాలోని హ్యూస్టన్, న్యూ జెర్సీలో తెలుగింటి వంట అందించే “తెలుగుదనం” రెస్టారెంట్‌కి సోషల్ మీడియా పోస్టర్లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ చెయాలి. ఈ మద్య ఇది రిజెక్ట్ అయిన నాలుగో పోస్టర్. తరచు ఫెయిల్ అవుతూ ఉండడంతో ప్రాజెక్టు తీసుకెళ్లి వేరేవాళ్ళ చేతుల్లో పెట్టేస్తా అన్నాడట క్లైంట్. లక్షల రూపాయల ప్రాజెక్టు, ఈ రకంగా చూస్తే, దీన్ని నా పనితనం మీదే కంపెనీ నెట్టుకొస్తోంది. నిన్నటిదాకా నేనే బలం, ఇప్పుడు నేనే బలహీనతా!!

గచ్చిబౌలిలోని ఆరంతస్తుల బిల్డింగులో ఉన్న పది కంపెనీలలో మాది ఒకటి.

సూపర్ మూన్ ప్రైవేట్ లిమిటెడ్.

40 మంది ఎంప్లాయిస్, అందులో ఏడుగురు సోషల్ మీడియా టీం. వాళ్ళకి లీడ్ శృతి, ప్రాజెక్టులు తేవడానికి ఇద్దరు మేనేజర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, ఒక హెచ్.ఆర్, ఒక అసిస్టెంటు. ఒక యానిమేటర్, ఒక డిజైనర్, అంటే నేను. ఒక వస్తువుని అమ్మాలంటే దానికి ఒక ఉపయోగం ఉండాలి, వస్తువును ఎక్కువ రేటుకు అమ్మాలంటే దానికి ఒక ఇమేజ్ వుండాలి. వస్తువుకి ఇమేజ్ క్రియేట్ చేయడం, అంటే బ్రాండ్ వాల్యూ పెంచడం మా పని. వస్తువులు బ్రాండ్స్‌గా మారాక, దాన్ని పొందడం మీ అదృష్టం అని నమ్మించేవి. అవి నీ చెంత లేకపోతే నీకు అవమానం అని భావించేలా చేసేది బ్రాండ్ ఇమేజ్. తక్షణం అద్భుతంగా ఉండే పోస్ట్ చేయాలి, నాకు తెలిసి ఇదే చివరి అవకాశం.

***

ట్రాక్.. క్.. క్., క్, టక్. పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర బండి మొరాయించడం ఏంటో? సడెన్గా అగిన నన్ను తప్పించబోయి ఆటోకి కొట్టాడు వెనకాలోడు. గొడవ షురూ అయింది. ఆ పాపం నాదేనా? మన ట్రాఫిక్‌లో ఈ మోరల్ డైలమా అక్కర్లేదేమో!

రహదారులు దేశానికి జీవనాడులు అన్న నెహ్రూ గారికి ఏం తెలుసు, అవి రక్తపుటేరులు అని. బండి నెట్టుకుంటూ వెళ్ళి షాప్ లో చూపిస్తే ఐదువేలు బిల్లు పడింది. మంత్ఎండ్‌లో జేబు ఖాళీ.

ఈ ఎదురుగా వచ్చే టీషర్ట్ అమ్మాయి. మా ఆఫీస్ లో జాయిన్ అయితదా! అయితే బాగుండు.

నాలుగు నిమిషాల్లో ఆఫీస్ లో పడ్డాను. ఆ.. ఫీ.. స్… అలెక్స్ హేలీ రూట్స్ కథానాయకుడు నాలాగే చూసి ఉంటాడు అమెరికాని. అసలు ఇండియాని కనిపెట్టబోయి అమెరికాని కనుక్కున్నారు అని తలుచుకున్నప్పుడల్లా ఎంతో గొప్పగా ఉంటది. గొప్పదనం… సుపీరియర్ కాంప్లెక్స్‌ను చాటుకునే అంశం. ప్రతిదీ గొప్పగా ఉంటే మరి తక్కువది ఏది? అన్నిటిలో ఎక్కువ, తక్కువలు కొలవడానికి దీన్ని పుట్టించారు.. బహుశా!

ఆనవాయితీగా అందరికీ హాయ్ చెప్పి నా డెస్క్‌లో కూర్చున్నా.

పనిలో దిగే ముందు “నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్‌వి” అన్న పొగడ్త విసిరి సీరియస్‌గా చూశాడు బాస్. ఆయన మాటకి, ముఖ కవళికలకీ సంబంధం ఉండదు, ఎందుకో.

నేను మురిసిపోతూ ఉంటే “నిన్నటి పోస్టర్‌లో కార్టూన్ ఈజిప్ట్ మమ్మీలా ఉందట” క్లైంట్ కంప్లైంట్ అది.

‘నా బొమ్మకి పేరు పెడతాడా’ నా మొబైల్ చేతిలో నలగబోయింది, దాని ఈఎంఐలు ఇంకా పూర్తి కాలేదు, కోపం ఆగింది.

“ట్రై టు యూజ్ యెల్లోస్, అండ్ ఆరెంజ్ బ్యాక్‌గ్రౌండ్. అవి ఉంటే ఫుడ్ డిలీషియస్‌గా అనిపిస్తుంది” బాస్ పాఠం.

తప్పు చేసినట్టు నిలబడ్డా. కాసేపు నిశ్శబ్ధం. ఐడియా! పోస్టర్లో పిరమిడ్ మీద బిర్యానీ బౌల్ పెడితే! అరేబియన్ మందీ యాడ్ అదిరిపోదూ. దెబ్బకి క్లయింట్ మా బాస్ కి సలాం కొట్టడూ!

“ఐ విల్ ట్రై మై బెస్ట్” అని నా క్యాబిన్‌కి వచ్చా. కొత్త పోస్టర్ యుద్ధం మొదలైంది.

కళ్ళ నిండా ఎల్లో ధూళి, ఆరెంజ్ రసం.

ఎల్లో..

ఆరేంజ్…

మంట..

కళ్ళల్లో మంట…

అవస్థ..

నిద్రావస్థ.

రెండుగంటల అవస్థ తర్వాత కాన్సెప్ట్ చూపిద్దామని బాస్‌ని పిలిచాను. నా డెస్క్ దగ్గరికి వచ్చి చూసి

అలా కళ్ళు మూసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు “సీ చెర్రీ, రెస్టారెంట్స్ పొగపొగ గొట్టంలో నుంచి వచ్చే బిర్యాని వాసన రోడ్డుమీద వెళ్ళేవాళ్ళనీ ఊరిస్తుంటుంది. అది పోస్టర్ లో నుంచి కూడా రావాలి? మన వర్క్ ‘Q బ్రాండ్’ వాళ్లలా ఉండాలి” అని లోనికెల్లాడు.

హు.. చేతిలో ఉన్న వేకొమ్ టాబ్లెట్ పెన్ (బొమ్మలు డిజిటల్ గా గీయడానికి వాడే టాబ్లెట్, దానిమీద రాసే సెన్సార్ పెన్) అక్కడ పడేసి వెళ్ళి, ఒక కాఫీ తాగి వచ్చి కూర్చున్నా.

అప్పుడే మీటింగ్ హాల్ నుంచి మెల్లిగా వచ్చి నా పక్కన కూర్చుంది శృతి. నా కోసం కాదులే, తన సీట్ అదే మరి.

తను కంటెంట్ రైటర్, కాన్సెప్ట్ డిజైనర్.

నేను చేసే పోస్టర్లకు తానే కాన్సెప్ట్ ఇస్తుంది. జీన్స్, టీ షర్ట్, హుషారు చూసి అంత జాలీగా ఉందనుకుంటారు. ఏమీ కాదు. సోషల్ మీడియా టీం లీడ్ కదా, నాలాగే అలక. ఒకే టేస్ట్ మాత్రమే కాదు, ఒకే స్ట్రగుల్ ఉన్నా కలిసిపోతుంది చెలిమి.

“ఎందుకంత ఇరిటేషన్?” శృతి.

“మార్కెట్‌లో ఈ నట్ షెల్, క్యూ బ్రాండ్, లాంటి కంపెనీలతో పోటీపడుతున్నాం అనుకుంటాడు కానీ, వాటిని కాపీ కొడుతున్నాం అనేది నిజం, ఈ కాపీ కొట్టే బదులు వాళ్ళని కిడ్నాప్ చేస్తే పోద్ది”

గట్టిగా నవ్వబోయి కంట్రోల్ చేసుకుని కిసుక్కుమంది.

“అక్కరలేదు, అదే నేను కాన్సెప్ట్ చేస్తే అల్టిమేట్‌గా ఉంటుంది” తల ఎగరేసింది. నిజమే, ఒక్కోసారి నా డిజైన్లో లోపాలు కూడా పట్టేస్తుంది.

సోషల్ మీడియా టీంలో కో-ఆర్డినేషన్ మా ఇద్దరి మధ్యే ఉండాలి. అందుకని నన్నెక్కువగా పట్టించుకుంటుందేమో, ఏమో!

తనకి నా కన్నా ఎక్కువ జీతం, మూడు నెలలకి ఓసారి ఫోన్ మార్చడం. బ్రాండెడ్ దుస్తులే వేయడం. బ్రాండింగ్ లో పండిపోయాను అని సింబాలిక్‌గా చెబుతోందా! ఏమైనా తను నాకు పూర్తిగా ఆపోజిట్.

ఒక్కో డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తోంది. అది చెప్పడం బాగోదని, చెప్పను.

హాట్.. కోరికకు కొనసాగింపా?

ఐతే కోరకు!

ఇడ్… మొట్టికాయలు వేసింది.

తనవంక చూసి “కాదు శృతీ, కాన్సెప్ట్, థీమ్స్, కలర్స్, బ్రాండింగ్ స్టైల్, ఒకటేమిటి, చాలా విషయాల్లో మనది అనుకరణే”

“అనుకరణ.. అంటే”

“ఓ మై బ్రౌన్, అనుకరణ అంటే కాపీ కొట్టడం”

“ఓహో, ఈసారి వర్క్ ఫ్లాప్ అయితే ప్రాజెక్టు Q లో ఉంటుంది” హింట్ ఇచ్చింది. ఓ పిచ్చి నవ్వు నవ్వి ఊరుకున్నాను. అప్పుడప్పుడు ఫెయిల్యూర్ చాలా కిందకి లాగేస్తుంది. విసుగ్గా ఉంది. హ్యాపీడెంట్ ఇచ్చి టెన్షన్ తగ్గుతుందని అంది. నిజానికి తనకే అసలు టెన్షన్, కాన్సెప్ట్ ఇవ్వాల్సింది తనేగా, ఎంత జాలీగా ఉందో. ఎలా సాధ్యం! తను ఇక్కడే పుట్టి పెరగడం వల్ల, చాలా త్వరగా జాబ్ రావడం వల్ల వచ్చిన అనుభవమా! కావచ్చు.

క్షణాల్లో “కాన్సెప్ట్ వచ్చింది” అంటూ ఏదో చెప్పింది.

కళ్ళు పెద్దవి చేసి చూశా “ఆలోచన మార్చుకోవడం కష్టం, నాకు గీసిన బొమ్మ మీద ప్రేమ పుట్టి మనసులో నుంచి ఎంతకీ పోదు. కానీ నువ్వు కాన్సెప్ట్, క్యాప్షన్ చెప్పి, అది బాలేదంటే వెంటనే మర్చిపోతావ్, కొత్త ఆలోచన చేస్తావ్, ఇదెలా సాధ్యం?”

పొద్దుటిలాగే నవ్వి “ఐడియా బాస్‌కి చెప్పివస్తా” సరసరా వెళ్లిపోయింది.

నాతో డిస్కస్ చేయొచ్చుగా.. హు.

కాసేపటికి వచ్చి “కాన్సెప్ట్ రిజెక్టెడ్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూ బ్రాండ్ కొత్త పోస్ట్ చూడాలంట” మళ్ళీ తనే.

“ఈమద్య సలహాలన్నీ నీకే ఇస్తున్నాడే”

“మీకు ఇచ్చినా తీసుకోరుగా, పైగా కళకి సంకెళ్లు, కంకణాలు అని తెలుగులో మాట్లాడుతారు” హర్ట్ అయినప్పుడే బహువచనం వాడుతుంది.

“యా, బ్రాండింగ్ అంటే అదే, మనదైన ఆలోచనకు పతనం. బాస్‌కి నచ్చాలి, ఆ తర్వాత క్లయింట్‌కి నచ్చాలి, ఆ తర్వాత కస్టమర్‌కి నచ్చాలి. కస్టమర్‌కి క్రియేటివిటీ కాదు, గొట్టంలో నుంచి మసాలా వాసన రావాలి, దానికోసం ట్రెండింగ్లో ఏం నడుస్తుందో చూడాలి, అసలు ట్రెండ్ క్రియేట్ చేసే కొట్టంగాన్ని తన్నాలి”

“ఇంకా నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వలేదు, వాట్ డిడ్ యు learnt హియర్?” శృతి.

“నథింగ్”

“కూల్, నీ థాట్ ప్రాసెస్ మార్చాలి, కమర్షియల్ వర్క్ మనది, ఇలాగే ఆలోచించాలి. నేను మారుస్తాలే వర్రీ అవకు”

“రేపటి నుంచి నువ్వు అవతల డెస్క్‌లో కూర్చో”

“ఎందుకు?”

“మనిద్దరి మధ్య ఇంకో తలకాయ అడ్డు ఉంటే బెటర్”

తను సన్నని నవ్వుతో తలను ఉయ్యాలలా ఊపుతూ కూర్చుంది. శబ్దం రాకుండా నవ్వుతూనే బుజం తట్టి, రెండు పెదాలు బిగించి వదిలింది. నేను తననే చూస్తూ ఉన్నా, ఏదో పని ఉన్నట్టు సిస్టంలో తల దూర్చింది.

***

రూమంతా నీరసంగా ఉంది. గది నన్ను చిందరవందరగా చూసింది. అవి మురికి బట్టలు, షాపులో సోగ్గా కనపడ్డ బ్రాండ్స్, మన సిగ్గుని కప్పే బ్రాండ్…

లోలోపలి నగ్నత్వానికి తొడుగు…

ఆకర్షణలోకి లాక్కెల్లే వలయం.

లయం.. విలయం.

టీషర్ట్ మీద Puma బదులు poma అని ఉంది. ఇమిటేషన్ డ్రెస్ కొన్నా! అందుకేనా ఇది వేసుకెళ్ళినపుడు ఆఫీస్ అంతా నవ్వింది.

ఆ మురికిమీద కాకిలా వాలా, పగటి నిద్ర పనికిరాదని ఎక్కడో చదివినా, ఇప్పుడదే కావాలి. రాత్రుళ్లు పగల్లు ఏకమై.. గ్రహణంలా ఉంది వెలుతురు.

ఎంత వద్దనుకుంటున్నా Q బ్రాండ్ నా మైండ్ లో దూరి డిస్టర్బ్ చేస్తుంది,

అవే రంగులు.

హంగులు.

ఫాంట్లు.

అక్షరాలు… జ్ఞానం నేర్పే అక్షరాలు సోకు నేర్చాయి. ఇక్కడవి డిజైన్లు మాత్రమే. నల్లగా గాజు పురుగులలాగా పాకుతున్నాయి. నాదైన ఆలోచన రానివ్వడం లేదు.

దొర్లి మీద పడుతున్నాయి.

పోస్టర్ అదిరిపోవాలి. కంపెనీ కి నా వల్ల లాస్ రాకూడదు.

రంగులకి భాష ఉంటుంది.

భావం ఉంటుంది, జీవం ఉండాలి, అదొక్కటే రానీవ్వడం లేదు.

ఆ బ్రాండింగ్ బిస్కెట్, సమోసా, ఇడ్లీ, దోస పోస్టర్లు చూస్తే సాల్వడార్ డాలీ కరిగిపోతున్న గడియారాలు కనిపిస్తాయి. వీటిని ప్రకృతి వనరులుగా మారిస్తే, దాని ముక్కలను ఫోర్క్‌తో తుంచుకుని తింటున్నది మానవులు అయితే. వావ్, వాట్ ఏ ఇమేజరీ, కాన్వాస్ ఎక్కడ? ఇప్పుడే గీయాలి. గట్టిగా మాట్లాడితే మనుషులు తినడంతోనే జ్ఞానం సంపాదించుకున్నారు. ఆడం, ఈవ్ సైతాన్ చెప్పిన జ్ఞానఫలం యాపిల్ తినకుంటే తెలివి వచ్చేదా, వంటికి బట్టలు చుట్టుకునే వాళ్ళా? వాటికి మనం బ్రాండ్ లోగోలు అంటించి వేల రూపాయలకు అమ్మేవాళ్ళమా. ఈ సైన్స్, అభివృద్ధి వచ్చేదా! మరి దేవుడెందుకు తినద్దు అన్నాడు! తెలివి ఎక్కువై కొత్త దేవుణ్ణి సృష్టించి బ్రాండింగ్ చేస్తారనేమో, హా..హా..హా!

***

“బాస్ పోస్టర్ కోసం ఎదురుస్తున్నాడు. నీకు పావుగంట టైం ఇస్తున్నా, మేక్ ఇట్ ఫాస్ట్” శృతి వార్నింగ్.

“నువ్వు టైం ఇస్తున్నావా! నువ్వు నాకు బాస్ ఎప్పుడయ్యావు?”

“బాగా చెయ్, లేదంటే నాకు చెడ్డ పేరు వస్తుంది” మెల్లగా అంది.

“అయితే నువ్వే చెయ్” లేచి కుర్చీని నెట్టి తన వైపు సూటిగా చూశాను, ఒకసారి ఆఫీస్ మొత్తం నా వైపు తల తిప్పింది. నెక్స్ట్ మినిట్ ఏమీ జరగనట్టే పనిలో పడ్డారు. తను ఇబ్బందిగా చుట్టూ చూసి “మీకు చేసే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పొచ్చుగా నామీద ఎందుకు అరుస్తారు” గట్టిగా అంది.

“మీరు..!!” బహువచనం ఎందుకో అన్నట్టు చూసా.

“యస్ సర్” తల తిప్పకుండానే అంది.

నేను గూగుల్లో గమ్యం లేని ఎడారి ఓడలా తిరుగుతున్నాను. ఇమేజ్ డాట్ కాంలో మంచి ఫోటో దొరికింది. వెబ్సైట్ వాడితో బేరమాడి, కొని ఇక్కడ అతికించా.

ఇడ్లీ డే అంట. ఈ డేస్ వ్యాపారానికి మాత్రమే పనికొచ్చే ట్రిక్కులు. ఇడ్లీ మీద ప్రపంచ పటాన్ని ముద్రించా. ప్రపంచం అంతా ఈ హోటల్ వాడి ఇడ్లీ తిని బతుకుతున్నటు బిల్డప్ ఇచ్చాను.

క్యాప్షన్ శృతి చెప్పింది “ఈట్, బర్ప్, స్లీప్, రిపీట్” భూమి చుట్టూ పరిభ్రమించే కొటేషన్ ఇదీ. తను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన చిట్టిపొట్టి ఇంగ్లీష్ కవితలు చూసి జాబ్ ఇచ్చారు. అంతటి మాటల మల్లెతీగ తను. ఇప్పుడవి పెట్టడమే లేదు. ఎందుకని అడిగితే మూడ్ లేదు అంది. ఏమైంది మూడ్‌కి! ఇక్కడ మూడ్ లేకున్నా రాయాలి, రాస్తోంది. కారణం మైండ్ ట్యూనింగ్. ఇది నాకు రాని విద్య, తను సాధించిన ఘనత.

నా పోస్టర్ దెబ్బకి క్యాబిన్ మొత్తం లంచ్‌కి జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశానంటే నేను సక్సెస్. క్లైంట్ ఆఫీస్ కి వస్తే తెలుస్తుంది నా ప్రతిభ. దీంతో పడిపోతాడు బాస్.

“చూసారా అది మన చెర్రీ డిజైన్ చేశాడు” టీంకి చూపించాడు మా బాస్.

“బ్రాండింగ్ టీమ్‌లో సగం పని తనే చేసేస్తున్నాడు, శృతీ దీనికి నీ పేరే చెబుతాలే” ఆయనే. ఎప్పుడూ లేని అత్యుత్సాహం. ప్రాజెక్ట్ జరిపోదన్న భరోసా వచ్చి ఉంటుంది.

శృతి అందరితోపాటు సరదాగా నవ్వలేదు.

“మన వంటకాలని విశ్వవ్యాప్తం చేస్తున్నారు దానిలో మనం భాగస్తులం, మన వల్లనే ఇది సాధ్యం” బాస్

“అద్భుతంగా చేశావ్” శృతి గర్వంగా చూసింది. నా విజయాన్ని పంచుకో గలిగే మనిషి తను.

తన దగ్గరికి జరిగి “అది అతుకుల బొంత. అక్కడో ముక్క, ఇక్కడో ముక్క తెచ్చి ఫొటోషాప్‌లో మ్యానిపులేట్ చేసి, అతికించి ఇవ్వడం పోస్టర్ డిజైన్, అంతే” తను చిత్రంగా చూసింది.

***

రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ఏ బ్రాండు లేని చొక్కాతో అడుక్కుంటున్నాడు ఓ పిల్లాడు. వాడేమి చెబుతున్నారు సమాజానికి? వాడి ప్రశ్న బొమ్మగా మారితే!

ఇంట్లో ఆలోచనలు రాక మద్యలో వదిలేసిన పెయింటింగ్ మూలన అలాగే ఉంది. ఇన్సోమ్నియా.. నిద్ర కోల్పోవడం ఓ శిక్ష. టెన్షన్ తగ్గినా కళ్ళు మూత పడట్లేదు. బొమ్మ పక్కన డాలీ కూర్చొని ఉన్నాడు “కాలం కరిగిపోతోంది రా” అన్నాడు. ఆయన కత్తిలాంటి మీసాలు చూసి నవ్వొచ్చింది. ఆపుకుంటూ బ్రష్ మళ్ళీ పట్టుకున్నా. అది కదల్లేదు.

జ్ఞాపకశక్తి కోల్పోవడం అల్జీమర్స్ అయితే, రోజు రోజుకీ సృజనాత్మక శక్తి కోల్పోవడానికి ఏ పేరు పెట్టాలి. ఇదెలా జరిగింది!

తిండి, బట్ట, వస్తువు, అన్నీ బ్రాండ్స్.. కళ్ళల్లో వలయంలా తిరుగుతున్నాయి.

డాలీ వికటాట్టహాసం… విలయం.

ఆర్ట్.. డిజైన్, పేరు ఏదైనా అసలు ఉద్దేశం ఆస్వాదన, వేల రూపాయల తో గీసిన పెయింటింగ్ కొన్ని వందల కోట్లు పలుకుతోంది, ఆ విలువ ఆస్వాదన వల్ల కాదా, అది లేనప్పుడు ఎందుకు రాయడం, గీయడం, నేనేం నేర్చుకోలేదు అంది, శృతిని అడగాలి. తనకి ఫోన్ చేశా.

“డబ్బు సృష్టించేదే ఆర్ట్.

సృష్టించేందుకే ఆర్ట్” చెప్పి పెట్టేసింది.

రాత్రి 2 గంటలకి చేస్తే అంతే మరి.

మళ్ళీ చేసా “దాని కోసమే అయితే మన మెదడుని కండిషన్ చేసుకుంటున్నాం, ఇవే చెయాలి అంటూ క్రియేటివిటీని పోగొట్టుకున్నాం”

“ఇప్పుడు నువ్వు బొమ్మ గీసి అమ్మాలా? ఎవరూ కొనరు, స్కిల్స్ ని మనీ సంపాదించడానికి వాడతాం, అదే సక్సెస్” చిరాగ్గా అని పెట్టేసింది.

తను తప్పని నిరూపించాలి. ఈ ఆర్టిస్ట్ బ్లాక్‌ను జయించాలి. అడ్డంగా వచ్చే ఆలోచనలు నరికేస్తూ రాత్రంతా బొమ్మ గీసి ఆఫీసుకి పట్టుకెల్లా. ఆఫీసులో సాయంత్రం మ్యాచ్‌కి బెట్టింగ్ కబుర్లు సాగుతున్నాయి. దానికీ డబ్బు కావాలి. అంటే జాబ్ చేయాలి.

బాస్ క్యాబిన్లోకి వెళ్ళా,

ఏం మాట్లాడలేదు. నేనే కదిలించాను.

“పోస్టర్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్?”

 ఒక రెజ్యూమె నా ముందు పడేసి

“అతని పేరు అనీష్, డిజైనర్, ఇంటర్వ్యూకు వస్తాడు” అన్నాడు.

‘పోస్టర్ మళ్ళీ ఫెయిల్ అయిందా?’

“Q బ్రాండ్ నుంచి వస్తున్నాడు” బాస్.

‘ఆ! వీడు నాకు ఎర్త్ పెట్టబోతున్నాడా’

“నువ్వే ఇంటర్వ్యూ చేయాలి” బాస్.

ఆ!! నా గొయ్యి నేనే తవ్వుకోవాలా?

“ఎప్పుడు మీరేగా చేస్తారు?” అన్నా.

“ఈసారి నువ్వు చెయ్, మన గ్రాఫిక్ డిజైన్‌కి లీడ్ నువ్వే కదా”

“నేనా!”

“నేను స్కిల్స్ విషయంలో మరీ కాన్షస్‌గా ఉన్నానేమో, ఒక్కడు కూడా నచ్చట్లేదు. ఈసారి నువ్వు చెయ్” “నీలాంటి ఆర్టిస్ట్ దొరకడం కష్టం అనుకో, నీలాంటి మైండ్సెట్ ఉంటే చాలు”

‘మైండ్ సెట్, హు, నో అంటే నాకు ఇంటర్వూ చేసే కెపాసిటీ లేదు, అని ఒప్పుకున్నట్టు అవుతుంది, సరే అని బొమ్మ చేతిలో పెట్టాను. ఇంతకీ పోస్టర్ ఫీడ్ బ్యాక్ ఏంటో?

***

మధ్యాహ్నం రెజ్యుమే తాలూకు మనిషి వచ్చాడు. నా కన్నా రెండేళ్ల పెద్దోడేమో. ఇద్దరు సీట్లో నన్ను చూసి బచ్చాలా ఉన్నానని షాక్ అయ్యాడు. తక్కువ కదలికలతో మా బాస్‌లా కూర్చుని ప్రశ్నలు మొదలుపెట్టాను. నా మాట చూపు అన్ని వేరే అయ్యాయి. నేను నేను కాదు, తెచ్చిపెట్టుకున్న దేదో. ఇప్పటిదాకా లోపలే రెండు ధృవాలు, ఇప్పుడు బయట కూడా రెండు ముఖాలు.

పెద్ద కంపెనీ సరుకు, వాడికి తెలిసినంత నాకు తెలుసో లేదో. తప్పు దొర్లకూడదు. ఎలాగయినా వీడిని ఇంటికి పంపించాలి.

“నీకు బొమ్మలు గీయడం వచ్చా?”

“రాదు సార్” చేతులు నలుపుకుంటూ అన్నాడు.

“డాలీ ఎవరో తెలుసా?”

“తెలీదు”

“బ్రాండింగ్ అంటే ఏమిటి?”

“వస్తువుకి ఇమేజ్ క్రియేట్ చేయడం”

“నీకు తెలిసిన మంచి బ్రాండ్స్ చెప్పు?”

“యాపిల్, అడిడాస్, రేంజ్ రోవర్, లీ”

“మా కంపెనీ మంచి బ్రాండ్ కాదా, బ్రాండింగ్ కంపెనీకి కూడా బ్రాండ్ ఉంటుంది”

“అదీ.. అదీ” నీళ్ళు నమిలాడు

“హా..హా…హా.. ఒకే, నీ వర్క్ లో నీకు ఇష్టమైనది?”

“అన్ని, అవన్నీ నా బేబీస్, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో నీకు ఎవరిష్టం అంటే ఏం చె…”

“సరే, సరే, లాస్ట్ క్వస్ట్చన్, దీనికి సరిగా ఆన్సర్ చెబితే నువ్ సెలెక్ట్ అయినట్టే, ఈ ఫీల్డ్‌లో నీ అల్టిమేట్ గోల్ ఏంటి?”

“ఏమి లేదు సర్”

“గుడ్, సీఈఓ సీట్ అంటవనుకున్నా”

“గుడ్ జోక్ సర్” అతను నవ్వు ఆపుకుంటూ.

“ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?”

అరు అంకెల నెంబర్ చెప్పాడు.

ఆ!!! మా బాస్ కన్నా ఎక్కువ. నాకన్నా మూడూ రెట్లు ఎక్కువ ఉన్న వాడిని నేను సెలెక్ట్ చేశానా!

“యూ ఆర్ సెలెక్టెడ్” అన్నా.

అతను పెద్ద ఎక్సైట్ అవ్వలేదు, వెళ్లి బాసుకి అతను పర్ఫెక్ట్ అని చెప్పాను.

“యా నాకు తెలుసు, పెద్ద బ్రాండ్ నుంచి వస్తున్నాడు కదా డిసప్పాయింట్ చేయడు అనుకున్నా”

 అతని “ఇప్పుడతని కోసం కొత్త మ్యాక్, డిజిటల్ టాబ్ అన్ని ఆర్డర్ ఇవ్వాలి” లీడ్‌గా రిక్వైర్మెంట్ చెప్పా.

“ఇప్పుడు అక్కర్లేదులే, వర్క్ ఉంటే అప్పుడు నీ సిస్టమ్ లోనే చేస్తాడు”

అతను నా సిస్టమ్ లో చేస్తే నేనేం చేయాలి! అంటే బాగోదు.

“ఈరోజు బాగా కష్టపడ్డావు, ఈ మధ్య నిద్రపోవడంలేదా, ఆఫ్టర్‌నూన్ నుంచి లీవ్ తీసుకో, వర్క్ కాపీ కొట్టడం కన్నా కిడ్నాప్ చేయడం బెటర్ కదా,”

బిత్తరపోయి చూశాను, అది సరిగ్గా నా మాట, ఎలా తెలిసింది?! బయటికి వచ్చాను, అందరూ బుద్ధిగా పని చేసుకుంటున్నారు, అయోమయంగా ఉంది. శృతి రిలాక్స్డ్ గా వాలి ఉంది.

ఆ తర్వాత నుంచి అతనిమీద టెస్ట్‌కో, మరో కారణం తెలీదు మాటిమాటికి వర్క్ అతనే చేస్తున్నాడు, నేను పక్కన కుర్చుని టీవీ చూస్తున్నట్టు ఉంది. అందరూ నన్ను ఎగాదిగా చూసి వెళ్తున్నారు. శృతి అతనికి కాన్సెప్ట్‌లు చెప్పడం మొదలుపెట్టింది. నన్ను చూసీ చూడనట్టు వెళ్తోంది.

వీక్లీ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కాలమ్ ఖాళీగా ఉంది, రాయడానికి ఏం లేదు. వన్ ఫైన్ డే, నా సిస్టం మీద అతను డిజైన్ చేసిన లోగో వాల్పేపర్ గా వెలసింది.

వన్ ఫైన్ డే బాస్ “పాత ప్రాజెక్ట్ కాపాడుకున్నాం, ఇంకా కొత్తవి వచ్చేవరకు గాప్ తీసుకో, వేరే పెద్ద కంపెనీలో చూసుకున్నా ఓకే, నేను పేమెంట్ స్లీప్ మీద హైక్ వేసి ఇస్తా”

కరుణ రసాత్మకంగా అన్నాడు.

నాకు చిత్రమైన నవ్వు.

“పల్లీలు అమ్మే వాడికి రాకెట్ సైన్స్ అంతా తెలియ అక్కర్లేదు. అజ్ఞానం ఉంటే అతనికి సమస్యలే” అన్నా.

ఆయన తికమక చూశాడు. నేను బయటికి నడిచాను.

నా సరంజామా సర్దుకొని వెళుతూ ఉంటే శృతి ఎదురుపడి

“పరిస్థితులు జ్ఞానానికి పరిమితులు విధిస్తాయి, ఇదీ అలాంటిదే, నీలో ఉన్నదేదీ ఇక్కడ పనికిరాదు,” అంది.

“నీ కోట్ బాగుంది, నీకు తెలుగు కూడా”

చిన్న హగ్ చేసుకొని బయటికి నడిచాను. తను నాకు మేలు చేసిందో కీడు చేసిందో తెలీట్లేదు.

నేను ఇచ్చిన పెయింటింగ్‌ను బాస్ ఓపెన్ చేసి చూశారు. అందులో తల లేని మనిషి, మీద ఎగిరే కాకి.

అదే మొండెం.

తలెక్కడ?

హద్దులు గీసుకోడానికి వెళ్ళింది.

అనివార్యతని మోస్తూ మెదడు.

ఆలోచనా సరళి?

కాకిలా ఎక్కడైనా వాలచ్చు.

రంగుల అడవి గజిబిజి.

లోకం బిజీ.. బిజీ.

దానికి మేల్కొలుపు..

కావ్..కావ్.

ఫ్రేమ్ గోడకు అలంకరించాడు.

కంపెనీ వెబ్సైట్‌లో నా బొమ్మ తీసి కొత్త డిజైనర్ బొమ్మ అందరి కన్నా పెద్దగా పెట్టినట్టు. అతను పెద్ద బ్రాండ్ నుంచి వచ్చాడు. నౌ హీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ సూపర్ మూన్ కంపెనీ.

నేను తలని వెదుక్కుంటూ,

నిద్రని వేడుకుంటూ..

డాలీనీ తలుచుకుంటూ,

బ్రాండ్లు విప్పుకుంటూ.

కావ్ కావ్ మంటూ.

The End

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here