అనుపమాన త్యాగశీలి ఝల్కారీబాయి

0
9

[box type=’note’ fontsize=’16’] ది నవంబరు 22, 2020 న ఝల్కారీబాయి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box] 

[dropcap]బ్రి[/dropcap]టీష్ తూర్పు ఇండియా కంపెనీని ఎదిరిరించి పోరాడిన యోధులలో రాజులు, రాణులే కాదు, సేనానాయకులు, సైనికాధికారిణులు కూడా ఉన్నారు. అటువంటి పోరాటయోధులలో పేరెన్నిక గన్న మహిళామూర్తి ఝల్కారీబాయి.

ఈమె 1830 నవంబరు 22వ తేదీన ఝాన్సీ సమీపంలోని ‘భోజ్‌లా’ గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు జమునాదేవి, సదోవర్‍సింగ్‍లు. వీరిది పేద వ్యవసాయ కుటుంబం. నాలుగేళ్ళ బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. ఈమె కత్తిసాము, గుర్రపు స్వారి వంటి యుద్ధవిద్యలను నేర్చుకొన్నారు. తన పల్లె లోని ప్రజలందరి మన్ననలను సంపాదించారు. ఒక రకంగా వారికి రక్షకురాలిగా సహాయ సహకారాలు అందించేవారు.

ఒక రోజు అడవిలోని పశువులను, పశు కాపర్లను కాపాడడం కోసం చేతికర్రతోనే చిరుతపులిని చంపారు. ఈ సంఘటనతో ఈమె సాహసం గొప్పతనం వారికి తెలిసింది. ఆమెని మరింతగా అభిమానించసాగారు వారు.

ఈమె సాహసగరిమ గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారికి కూడా తెలిసింది. ఝాన్సీ రాజ్య సైన్యంలో వీరి జాతికి చెందిన పూరణ్‍సింగ్ పని చేస్తున్నారు. ఆయన ఈమె సాహసాలను గురించి విని మక్కువ పెంచుకున్నారు. వీరిరువురి వివాహం 1843వ సంవత్సరంలో  జరిగింది. ఈ విధంగా ఝల్కారీబాయి ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి చేరువ కాగలిగారు.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటీష్ కంపెనీ ప్రభుత్వంతో పోరాడడానికి, తన రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి, రాజ్యరక్షణకు మహిళా సైన్యం అవసరమని ఆకాంక్షించారు. ఈ కోరికే మహిళా దళ ఏర్పాటుకు జీవం పోసింది. ‘దుర్గావాహిని’ అనే స్త్రీ పటాలాన్ని తయారు చేశారు. దీనికి నాయకురాలిగా ఝల్కారీబాయిని నియమించి బాధ్యతలు అప్పగించారు.

భార్యాభర్తలిద్దరూ ఝాన్సీ కోటని ప్రాణప్రదంగా చూసుకుంటూ రక్షణ భారం నిర్వహిస్తున్నారు. 1857లో ప్రథమ స్వాతంత్ర్య పోరాటం మొదలయింది. ఝాన్సీ రాజ్యం కూడా యుద్ధంలో పాల్గొంది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయికి కుడిభుజంగా నిలిచారు ఝల్కారీబాయి.

1858 ఏప్రిల్ 3వ తేదీన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సైన్యాధిపతి సర్ హ్యూరోజ్ ఆధ్వర్యంలో ఝాన్సీకోటని ముట్టడించారు. ఝాన్సీ సైన్యం వీరోచితంగా ఎదుర్కుంది. కోటలోని ముఖ్యమైన గేట్లు ఝల్కారీ రక్షణలో ఉన్నాయి. దంతియా, ఉన్నావ్, భండారీ గేట్లకు రక్షణ కవచంగా సైన్యం పని చేసింది.

ఝల్కారీబాయి, ఇతరర సేనా నాయకుల ప్రణాళిక ప్రకారం రాణి లక్ష్మీబాయి కోట నుంచి కుమారునితో సహా తప్పించుకున్నారు.

‘దుల్హాజో’ ఒక దేశద్రోహి. అతని ఆధ్వర్యంలోని గేటు తెరవడంతో ఈ విధంగా రాణిని తప్పించి బయటకు పంపించక తప్పలేదు.

రాణి లక్ష్మీబాయి స్థానంలో తనే ఉండి యుద్ధాన్ని కొనసాగించారు ఝల్కారీ. ఈమే ఝాన్సీ లక్ష్మీబాయి అని భ్రమించారు బ్రిటీష్ సైనికులు. ఆమె హ్యూరోజ్‌ను కలవవలసి వచ్చింది. ఎటువంటి జంకు లేకుండా వారికి సమాధానాలిచ్చింది. బందీ అయింది. అయితే ఆమె ఏప్రిల్ 4వ తేదీనే ఝాన్సీలో మరణించారని మనకి అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.

మరో కథనం ప్రకారం ఆమె 1890 వరకూ బ్రతికే ఉంది.

ఈ విధంగా చిన్న పల్లెలో తక్కువ కులంలో పుట్టి, యుద్ధవిద్యలను నేర్చి/స్వయం ప్రతిభ, ధైర్య సాహసాలతో ఎదిగి, మహిళా దళానికి నాయకురాలైన ఝల్కారీబాయి గొప్ప దేశభక్తురాలు. తనను నమ్మిన రాణి కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై, ఆమెను బ్రతికించిన త్యాగమయి. దేశద్రోహులకి రాజ్యం బలైనా, క్షణాలలోనే ఆ దేశద్రోహిని హతమార్చిన ధైర్య సాహసాలు, తెలివితేటలు ఆమెవి.

2001 జూలై 22వ తేదీన భారత తపాలాశాఖ 4 రూపాయల విలువలో ఒక స్టాంపును విడుదల చేసింది.

నవంబరు 22వ తేదీ ఝల్కారీబాయి జయంతి సందర్భంగా ఆమె ధీరత్వాన్ని, దేశభక్తిని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here