తల్లీ కూతుళ్ళ జీవన పోరాటం

1
14

[dropcap]ప్ర[/dropcap]తికూల పరిస్థితుల నధిగమించి ఒక మహిళ తన జీవితాన్ని తాను చక్కదిద్దుకున్న విధానమే ఝాన్సీ కొప్పిశెట్టి చేతిలో “అనాచ్ఛాదిత కథ” పేరిట నవలగా రూపుదిద్దుకుంది.

నళిని పురిటిబిడ్డగా వుండగానే తల్లి చనిపోతుంది. ఆమె తండ్రి కోడిపందాలు, జూదం, తాగుడులో పడి ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరగదీసి, పిల్లల్ని పట్టించుకోడు. తండ్రి అశ్రద్ధ వలన అక్క తొందరపడి ఆమెను ఒక అయోగ్యుడు, తాగుబోతు కిచ్చి కట్టబెడుతుంది. కష్టనష్టాల కోర్చి భర్తతో ఐదేళ్ళు నరకం అనుభవిస్తుంది. పిల్లల తలరాతలైనా మార్చాలని గుండె దిటవు చేసుకుని, డబ్బు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేస్తుంది. అక్కడ తన కాళ్ళపై తాను నిలబడ్డాక ఆరోగ్యం చెడి భర్త సూర్యారావు వెతుక్కుంటూ వస్తాడు. ఆమెతో బోలెడంత ఖర్చు పెట్టించి వాడు చనిపోతాడు.

పిల్లలతో హైదరాబాద్ బస్టాండులో దిగి దిక్కు తోచని నళినికి, నిత్యానందం పరిచయమవుతాడు. నిత్యానందం లాంటి మంచివాడు దొరకడం ఆమె అదృష్టం. ఆమె దగ్గర ఉన్న డబ్బుతో ముందుగా రెండు ఆటోలు కొని అద్దెకు తిప్పుతాడు. ఆ ప్రాంతంలో ఉన్న డిమాండుని బట్టి చికెన్ షాపు పెడుతుంది. ఆటోలు తీసివేసి అంబాసిడర్ కారు కొనుక్కొని టూర్స్ అండ్ ట్రావెల్స్ మొదలుపెడుతుంది. సూర్యారావు అల్లుడు మురళీని చేరదీసి అందులో వుంచుతుంది. తర్వాత తాకట్టు, వడ్డీ వ్యాపారం చేపడుతుంది. పెద్ద ప్లాటు కొని ఇల్లు కట్టుకుంటుంది.

ఏ లోటు కలగని ఇవ్వకుండా పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతుంది. బాగా చదివిస్తుంది. కొడుకును ఇంజనీర్‌గా, కూతురును డాక్టర్‌గా చూడాలనుకుంటుంది. కానీ పిల్లల విషయంలో తీసుకున్న అతి జాగ్రత్తలు బెడిసి కొడతాయి. కూతురు ఎప్పుడు తన కళ్ళ ముందే వుండాలన్న కోరికతో మంచి సంబంధాలను కాలదన్నుకుని, దూరపు బంధువైన చంద్రతో పెళ్ళి చేసి ఇల్లరికం తెచ్చుకుంటుంది. అల్లుడు చంద్రకు డబ్బుతో పాటు సకల దుర్గుణాలు అలవడుతాయి. తాగుడు, వ్యభిచారంతో భార్య జానకిని హింసించేవాడు. చివరకు సంధ్య పన్నిన కుట్ర వల్ల కొస ప్రాణంతో బతుకుతాడు. అన్ని అవయవాలు దెబ్బతిని కృశించి చనిపోతాడు.

కొడుకు కృష్ణ తెలివైనవాడు. చిన్నప్పటినుండి బాగా చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరతాడు. కృష్ణ వారించినా వినకుండా, కొడుకు భవిష్యత్తు బాగా వుండాలనే కోరికతో కలెక్టర్ కూతుర్ని కోడలుగా చేసుకుంటుంది. వాళ్ళిద్దరికీ మనసులు కుదరక విడిపోతారు. డిగ్రీ చదివిన పేదింటి అమ్మాయి రాధనిచ్చి పెళ్ళి చేస్తారు. కృష్ణకు తరచూ వచ్చే తలనొప్పి వల్ల అతనికి బ్రెయిన్ క్యాన్సర్ అని తేలుతుంది. చివరకు క్యాన్సర్‌తో చనిపోతాడు.

ఎవరి కోసం శ్రమించి నళిని తన జీవితాన్నంతా కొవ్వొత్తిలా అరగదీసుకుందో వారి జీవితాలు విషాదంగా ముగియడం, అవన్నీ ఆమె కళ్ళముందే జరగడం తట్టుకోలేక ఆమె పిచ్చిదైపోతుంది.

సినిమాటిక్‌గా అయినప్పటికీ నిత్యానందంతో పరిచయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందని మనం గుర్తించవచ్చు. నిత్యానందం లాంటి మనిషి పరిచయం కావటం ఆమె అదృష్టం. నళిని మాటల్లోనే చెప్పాలంటే నిత్యానందం నిరంతర కర్మచారి. ఫలాపేక్ష లేని నిస్వార్థజీవి. అసూయా ద్వేషాల కతీతుడు. నళిని బంధువులు చేసే అవమానాలు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామం వెళ్ళిపోతాడు.

నళిని వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడంలో రచయిత్రి ఆమెను సగటు భారతీయ స్త్రీగా, ఒక ఆదర్శ మహిళగా చిత్రించడానికి ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు. అందుకే “నళిని వైధవ్యం తనకు ఇచ్చిన స్వేచ్ఛను ఎన్నడు దుర్వినియోగపరచుకొని లేదు. అసలు నళినికి తాను ఒక పాతికేళ్ల స్త్రీనన్న ధ్యాస ఎప్పుడూ వుండేది కాదు. తన శరీరానికి మనసును కాపలా పెట్టవలసిన పరిస్థితి ఎప్పుడూ కలగలేదు ఆమెకు. ఉపయోగించనవసరం లేకపోతే గంధం చెక్కా కర్రపీట లాంటిదే. నళిని అందాల గంధపు భరిణే కానీ తనను తాను కొయ్యబొమ్మలా మార్చుకుంది” అని తెలియజేస్తారు. “అక్క నిత్యానందంని దృష్టిలో వుంచుకుని చేసిన తన పునర్వివాహ ప్రస్తావన తననెంతో కలత పరిచింది. నిజానికి అతని ప్రతి మాట, ప్రతి చర్య ఎంతో అనురాగాన్ని అభిమానాన్ని వ్యక్తపరుస్తూ వుంటాయి. అలాగని ఈ అనురాగపు తాడు కొసను వెతుక్కుంటూ వెళితే ఆ చివర ఏం దక్కుతుంది తనకు. యుక్తవయసుకు వస్తున్న కూతురి కళ్ళల్లో కలవరం, నిర్దుష్టంగా ఏర్పడుతున్న కొడుకు వ్యక్తిత్వంలో భంగం, సమాజం దృష్టిలో తన ప్రవర్తన పై అసహ్యం, బంధువుల మధ్య అపవాదు. లేదు, తను ఎప్పటికీ అటువంటి ఆలోచనే చేయలేదు.” – ఇలా స్వసుఖం కంటే కుటుంబ శ్రేయస్సుకై నళిని ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అందుకే అన్నింటినీ పక్కనపెట్టి డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోతుంది.

తండ్రి లేని పిల్లలకు, సింగిల్ పేరెంట్ పర్యవేక్షణలో అతి జాగరూకతతో పెరిగే పిల్లలకు సోషల్ మింగ్లింగ్, లౌకిక విస్తరణ తక్కువేమో. ఇది నళిని పిల్లలైన జానకి, కృష్ణల విషయంలో నిజం అవుతుంది. నళిని పట్నం వచ్చిన కొత్తలో జానకిని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేసింది. జానకి ఏడో క్లాసు నుండే లైబ్రరీ నుండి నవలలు తెప్పించుకుని చదువుతూ వుండేది. జానకి ఎప్పుడు ఎవరితోనూ కలవక మౌనంగా తన పుస్తకాల ప్రపంచంలో మునిగి వుండేది. నలుగురి మధ్యనున్న ఒంటరిగానే మిగిలేది. ఏకాంతంలో తనదైన స్వప్నిక జగత్తులో విహరిస్తూ వుండేది. కానీ ప్రతీది  కళాత్మకంగా ఆలోచించేది. కవితాత్మకంగా స్పందించేది. యద్దనపూడి సులోచనారాణి నవలలు అంటే జానకికి మహా పిచ్చి. ఆవిడ నవలలో నాయికగా తనను తాను ఊహించుకుంటూ రాజశేఖరుని కోసం కలలు కంటూ వుండేది. సాహిత్యాభిలాష తో ఎన్నో పుస్తకాలు చదివినా, పాఠ్యపుస్తకాలలో క్లాసులో ఎప్పుడూ ముందుండేది. మెడిసిన్ చదవనివ్వకుండా తల్లి, జానకికి సంబంధాలు చూస్తుంది. పెళ్ళి చేసి అల్లుని ఇల్లరికం తెచ్చుకోవాలనుకుంటుంది. మిలిటరీ ఉద్యోగం అని ఒకరిని, బీదవాడని ఒక లెక్చరర్‌నీ తిరస్కరిస్తారు. ఊహల్లో తేలిపోయే జానకి ఈ ఇద్దరి మీద మనసు పెంచుకుంటుంది. వాళ్ళిద్దర్నీ కాదని దూరపు బంధువైన చంద్రాన్ని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ప్రేమిస్తాడనుకున్న చంద్ర కాముకుడుగా, తాగుబోతుగా దర్శనమిస్తాడు. మెడిసిన్ చేయలేక డిగ్రీ పూర్తి చేసి తెలుగులో పిజి చేస్తుంది. సాహిత్య పఠనం ఆమె పరిధిని విస్తృతం చేస్తుంది. ఏ విషయాన్ని అయినా చూసే కోణం మారుతుంది. కవిత్వం రాస్తుంది. దాంతో ఆమెకు అభిమానులు పెరుగుతారు. ఇదంతా నచ్చని చంద్ర ఆమెను కవిత్వం రాయొద్దని శాసిస్తాడు. చంద్ర లోపల ఉన్న లోపాలను కూడా క్షమించగలుగుతుంది. కానీ అతను వ్యభిచారి అని తెలియగానే అతనికి దూరమవుతుంది. దాంతో చంద్ర వైజాగ్‌లో ఉన్న తన ఇల్లు అమ్మేసి నగర శివార్లలో గెస్ట్ హౌస్ కట్టుకుంటాడు. తన అభిరుచులకు అనుగుణంగా మార్చుకుంటాడు. చంద్ర బ్యాంకాక్ టూర్ కు సంధ్యను కాదని, రమ్యను తీసుకొని పోవడం సంధ్య భరించలేకపోతోంది. నిలదీసి బ్లాక్‌మెయిల్ చేయబోతే చంద్ర అవమానిస్తాడు. దాంతో పగబూనిన సంధ్య, అతడిని చంపించడానికి పూనుకుంటుంది. లారీ చేసిన యాక్సిడెంట్‌తో మల్టిపుల్ కాంప్లికేషన్స్, యావత్ శరీర వైకల్యంతో చంద్ర అతి కష్టంగా బతుకుతాడు. జానకి సేవలతో రియలైజ్ అవుతాడు. చివరకు చనిపోతాడు.

చిన్నప్పటినుండి తెలివైన వాడైన నళిని కొడుకు కృష్ణ చివరకు ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎం.ఎన్.సి.లో సెలెక్ట్ అవుతాడు. కలెక్టర్ కూతురు కావ్య పెళ్ళి సంబంధం వస్తుంది. ఆర్థికపరంగా, విద్యాపరంగా తమ కంటే ఎంతో ఎత్తులో ఉన్న ఆ సంబంధం పట్ల కృష్ణ ఆసక్తి చూపలేకపోయాడు. కానీ అంతా బలవంతం చేసి పెళ్ళి చేస్తారు. కావ్య సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. తమిద్దరి మధ్య అంతరాలు పూడ్చలేనివని గుర్తించిన కావ్య, ఇద్దరూ విడిపోవడమే మేలని తేలుస్తుంది. పరస్పర అంగీకారంతో విడాకులు అవుతాయి. కొడుకు ఒంటరితనాన్ని చూడలేక నళిని డిగ్రీ చేసిన పేదింటి అమ్మాయి రాధనిచ్చి పెళ్ళి చేస్తుంది. తరచుగా తలనొప్పి వచ్చే కృష్ణ పరీక్ష చేసుకుంటే బ్రెయిన్ క్యాన్సర్ అని తెలుస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దనుకుంటే, భార్య రాధ గర్భవతి అని తెలుస్తుంది. ఆమెకు అబార్షన్ చేయించి, మళ్లీ పెళ్ళి చేద్దాం అనుకుంటారు కృష్ణ. ఈలోగా రాధకు తాను చేసుకున్నది రెండో పెళ్ళివాడని తెలిసి మండిపడుతుంది. తన కళ్ళ ముందే తన కూతురు జానకి విధవ కావడం, జీవితానికి ఆసరా కావలసిన చెట్టంత కొడుకు కళ్ళముందే కాటికి చేరడం, కొండంత అండ నిత్యానందం చెప్పకుండా మాయం కావడం, ఆశలన్ని అడియాసలై బంధాలన్నీ ఎండమావులై నళిని మనసును చెదరగొడతాయి. దాంతో ఆమె చిత్తవైకల్యానికి గురి అవుతుంది. తన తల్లి నళిని జీవన పోరాటాన్ని అక్షరబద్ధం చేయాలని జానకి సంకల్పించుకుని ఈ నవల రాయడం మొదలుపెడుతుంది. తన కలానికి వేసిన సంకెళ్ళను తెంచుకుని రచయిత్రిగా మారుతుంది.

ముసుగు లేని మనసు లోతుల నుండి ఏ ఆచ్ఛాదన లేని హృదయాంతరంగం నుండి పెల్లుబికిన ఈ జ్ఞాపకాల వెల్లువకు ‘అనాచ్ఛాదిత కథ’ అని నామకరణం చేశారు. బాగానే వుంది. ‘మనసు లోతుల నుండి ఏ ఆచ్ఛాదన లేని హృదయాంతరంగం’లో నుండి ఆలోచనలు కాని, జ్ఞాపకాలు కానీ సభ్యలోకం భరించడం కష్టం. మనసులో కలిగే ఆలోచనలన్నీ సెన్సారై బయటకు వస్తాయి. అన్‌సెన్సార్డ్‌గా వచ్చే ఆలోచనలు భూత, భవిష్యత్ వర్తమానాలతో కలిసి చైతన్యస్రవంతిగా రూపుదిద్దుకుంటుంది. ఆ పద్ధతి ఇందులో లేదు. ‘అనాచ్ఛాదితం’ అన్నప్పటికీ అంత గోప్యతా ఎక్కడా లేదు. ఇందులో నళిని జీవితం కానీ, ఆమె కుమార్తె జీవితం కానీ తెరిచిన పుస్తకమే. వాళ్ళు దాచింది లేదు. రచయిత్రి బహిరంగపరిచింది లేదు. అలాగని ఇది మొత్తం నళిని జీవితం కూడా కాదు. ఇందులో నళిని జీవితం మూడవవంతు మాత్రమే వుంది.  మిగతా రెండు భాగాలలో జానకి, కృష్ణల జీవిత చిత్రణ వుంది. తెలుగు టివి సీరియల్స్‌లో కనిపించే అందమైన ఆడవిలన్ కూడా ఇందులో వున్నారు. ప్రధాన పాత్రలు, ఉప పాత్రలు, సన్నివేశాల కల్పనతో కథనాన్ని బిగి సడలకుండా నడపడంలో రచయిత్రి మంచి ప్రతిభ కనబరిచారు.

విచిత్రమేమిటంటే నళిని జీవితానికి, జానకి జీవితానికి చాలా పోలికలున్నాయి. వాళ్ళిద్దరు మొగుళ్ళు తాగుబోతులు. వాళ్ళతో హింసించబడతారు. ఇద్దరూ మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో చనిపోతారు. భర్తలు చనిపోయిన తర్వాత నళిని డబ్బు సంపాదించే యంత్రంగా మారిపోగా, జానకి రచయిత్రిగా మారిపోతుంది.

దుర్మార్గులైన భర్తల హింసకు గురయినప్పుడు ఎంతో వేదనను అనుభవించిన నళిని కాని, జానకి కాని భర్తలను వదిలేసి తమకు నచ్చిన రీతిగా తాము వుండలేకపోతారు. తిరుగుబాటు చేయలేకపోతారు. కుటుంబ సంబంధాలలోనే వుండి తమ నిరసనను తెలియజేస్తారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో అవసానదశలో వున్న భర్తలకు సేవలు చేస్తూ తమ ప్రాతివత్య ధర్మాల్ని చక్కగా పాటిస్తారు. విషాదాంతమైన ఈ నవలను – పకడ్బందీ కథాకథనాలతో, మంచి రీడబిలిటీతో ఆద్యంతం ఆసక్తిగా చదివింపజేయడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.

***

‘అనాచ్ఛాదిత కథ’ (నవల)

ఝాన్సీ కొప్పిశెట్టి

పాలపిట్ట బుక్స్, హైదరాబాద్

పేజీలు: 198, వెల: ₹ 150/-

ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here